Title Picture

ఇది ఇద్దరబ్బాయిలూ, ఒక అమ్మాయి కథ. అబ్బాయిలిద్దరూ బాల్య స్నేహితులు. పొరపాటున ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. ఆ అమ్మాయి మాత్రం వారిలో ఒకరి (హీరో)నే ప్రేమిస్తుంది. కాని అతను పేదవాడు కావడం చేత వాళ్ళ నాన్నగారు ఆమెను రెండో అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. హీరో బి.ఎ. ఫస్ట్ క్లాస్ లో ప్యాసవుతాడు. ఎన్.సి.సి.లో రాంక్ సంపాదించుతాడు. అయినా ఉద్యోగం దొరకదు. తండ్రి చనిపోతాడు. తర్వాత అతను సైన్యంలో సిపాయిగా చేరుతాడు. అతని స్నేహుతుడు మెడిసన్ చదవడానికి విదేశాలకు వెళ్తాడు. కొన్నాళ్ళకి చదువు ముగించుకుని అతను, సెలవు పెట్టి ఇతను వాళ్ల ఊరికి చేరుకుంటారు. పెళ్ళి ప్రస్తావన వస్తుంది. ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించినట్టు తెలుసుకుని చాలా బాధపడతారు. విరక్తితో హీరో సైన్యానికి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి ఇల్లు విడిచి నర్సుగా చేరుతుంది. క్లైమాక్సులో పెద్ద యుద్ధం జరుగుతుంది. హీరో అనేక సాహస కృత్యాలు చేసి గాయపడతాడు. ఆపరేషన్ రూములో అతను, ప్రేయసి (నర్సు), స్నేహితుడు (డాక్టరు), కలుసుకుంటారు. ఆపరేషన్ సవ్యంగా జరుగుతుంది. స్నేహితుడు తన ప్రేమను త్యాగం చేస్తాడు. హీరో, హీరోయిన్ కులాసాగా ఉంటారు.

కథలో కొత్తదనం లేకపోయినా, శంకర్ జైకిషన్ సంగీతం మామూలుగానే ఉన్నా, పదహారువేల అడుగుల పొడుగున్న ఈ చిత్రంలో అంగుళం మేర అయినా విసుగు పుట్టదు. చూస్తున్నంతసేపు హాయిగా, ఉత్సాహంగా ఉంటుంది.

ఆశుకవిత్వం చెప్పినంత సునాయాసంగా, కులాసాగా శంకర్ జైకిషన్ సంగీతం సమకూర్చారు. ప్రేక్షకులచేత ఈలలు కొట్టించగల పాటలు రెండు మూడు ఉన్నాయి. ఛాయాగ్రహణం నేత్రపర్వంగా, శబ్దగ్రహణం నిర్దుష్టంగా ఉన్నాయి. ఇంతకాలం మోహన్ సెగాల్ వద్ద శిష్యరికం చేసిన మోహన్ కుమార్ ఈ చిత్రానికి ప్రప్రథమంగా దర్శకత్వం వహించాడు. ఇది దర్శకుడి తొలి ప్రయత్నమంటే నమ్మబుద్ధి కాదు. కాకలు తీరిన పనివాడితనం చిత్రమంతటా కనుపిస్తుంది. ''బ్రిడ్జి ఆన్ ది రివర్ క్వాయ్'' చిత్రంలో బ్రిడ్జిని ధ్వంసం చేసే సన్నివేశాన్ని మక్కికి మక్కి సంగ్రహించడంలో కూడా దర్శకుడి ప్రతిభ కనుపిస్తుంది. వైజయంతిమాల, రాజేంద్రకుమార్ హుషారుగా నటించారు.

నిర్మాత: జె.ఓంప్రకాశ్; కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ కుమార్; సంభాషణలు: రాజేంద్రసింగ్; సంగీతం: శంకర్ జైకిషన్; పాటలు: శైలేంద్ర, హస్రత్ జైపురి; ఛాయాగ్రహణం: బాబాసాహెబ్; తారాగణం: వైజయంతి మాల, రాజేంద్రకుమార్, షమిందర్, లీలాచిట్నిస్, నజీర్ హుస్సేన్, రాజ్ మెహ్రా, సుందర్ వగైరా.

నండూరి పార్థసారథి
(1961 జూన్ 25వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post Next Post