Title Picture

వి.జి. ఫిలింస్ వారి 'ఒపేరా హౌస్' చిత్రం కులాసాగా పొద్దుపుచ్చడానికి షికారుగా వెళ్లి ఒకసారి చూడతగిన చిత్రం. ఈ చిత్రం నిడివి 12 వేల అడుగుల చిల్లర మాత్రమే కావడం ఒక ఆకర్షణ. దీనిని భారీ ఎత్తున నిర్మించలేదు. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరూ అగ్రశ్రేణికి చెందినవారు కారు. ఉన్న ఆర్థిక స్తోమతును బట్టి కాస్త ప్రేమ, మరికాస్త అపరాధ పరిశోధన, సస్పెన్సు, హాస్యం ఏర్పాటు చేశారు. సరోజాదేవి హీరోయిన్ గనుక, కథ కూడా ఆట్టే లేదు గనుక, డాన్సులనూ, వాటితో పాటు పాటలనూ కొంచెం ఎక్కువగానే చొప్పించారు.

హంగులన్నీ చిన్న ఎత్తులోనే సాగినప్పటికీ మొత్తం మీద చిత్రం ఎక్కడా విసుగు పుట్టించకుండా, వినోదభరితంగా, సునాయాసంగా సాగిపోయింది. ఇది దర్శకుని ప్రతిభే ననడంలో సందేహం లేదు. అసలు ఇటువంటి చిన్న రకం చిత్రాలను నిర్మించడంలో పి.ఎల్. సంతోషి సిద్ధ హస్తుడు.

సరోజ అనే అమ్మాయి ఉద్యోగం కోసం బొంబాయి వస్తుంది. అక్కడ ఒకాయన థియేటర్ లో ఉద్యోగం సంపాదిస్తుంది. ఆయన తమ్ముడు అజిత్, సరోజ ప్రేమించుకుంటారు. కాని వారి ప్రేమను అజిత్ అన్నగారు అంగీకరించరు. ఆమె ఉద్యోగం కూడా పోతుంది. తర్వాత ఆమె నాగపూర్ వెళ్లి అక్కడ మరొక థియేటరులో నర్తకిగా చేరుతుంది. ఆ థియేటరు యాజమానిని ఒక వ్యక్తి హత్య చేస్తాడు. హత్య జరుగుతున్నప్పుడు సరోజ కళ్లారా చూస్తుంది. సరోజ బ్రతికి ఉంటే తన నేరం బైటపడుతుందని గ్రహించి, హంతకుడు ఆమెను హత్య చేయడానికి వెంటాడుతూ ఉంటాడు. ఇతని నుంచి తప్పించుకొనడానికి ఆమె ఆవూరు వదిలిపెట్టి కలకత్తా వెళ్తుంది. హంతకుడు అక్కడ కూడా ఆమెను వెంబడిస్తాడు. చివరికి అజిత్ ఆమెను కాపాడి విలన్ ను పోలీసులకు అప్పగిస్తాడు.

ఇందులో నాయికగా సరోజాదేవి కన్నులపండువుగా నటించింది. ఆమె చేసిన నృత్యాలు కూడా ముచ్చటగా ఉన్నాయి. మూడు పాటలు చాలా హాయిగా, తీయగా ఉన్నాయి. కె.ఎన్. సింగ్, మారుతి, నిరంజన్ శర్మ ప్రభృతులు చక్కగా నటించారు.

నిర్మాత: ఎ.ఎ.నాడియాడ్వాలా; దర్శకుడు: పి.ఎల్.సంతోషి; సంగీతం: చిత్రగుప్త; రచన, స్క్రీన్ ప్లే: అఖ్తార్-ఉల్-ఇమాని; పాటలు: మజ్రూహ్ సుల్తాన్ పురి; ఛాయాగ్రహణం: పి.ఇసాక్; తారాగణం: బి.సరోజా దేవి, అజిత్, కె.ఎన్.సింగ్, మారుతి, నిరంజన్ శర్మ, లలితా పవార్ వగైరా.

నండూరి పార్థసారథి
(1961 నవంబర్ 26వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post