కళారంగంలో ఒక పక్క కులాల గోడలు కుప్పకూలి పోతుండగా ఇప్పటికీ అడపాతడపా కులాలకు సంబంధించిన వివాదాలు తలెత్తుతూ ఉండడం ఆశ్చర్యకరం. కళావంతుల కులానికి చెందిన వారిని అగ్రకులాల వారు చిన్న చూపు చూడడం కొన్ని శతాబ్దాలుగా జరుగుతున్నదే. కళావంతుల కళను బ్రాహ్మణులు దోచుకుంటున్నారన్న ఎదురు దాడి మాత్రం కొత్తవిషయం. నృత్యకళ అంతరించిపోకుండా కాపాడుకొంటూ వస్తున్న వారు కళావంతులేననీ, కాగా ఈ రంగంలోకి బ్రాహ్మణవర్గం జబర్దస్తీగా చొరబడి, పెద్దరికం చెలాయిస్తున్నారనీ ఆమధ్య ఒక వివాదం బయలు దేరింది. అది బహుశా బాలసరస్వతితో మొదలైనట్లుంది. సుమారు పదేళ్ల కిందట మద్రాసులో కృష్ణగాన సభ వారి వార్షిక నృత్యోత్సవంలో ప్రముఖ కన్నడ నాటక రచయిత, చలన చిత్ర నటుడు, దర్శకుడు గిరీశ్ కర్నాడ్ ఆ వివాదాన్ని మళ్లీ కెలికి పైకిలాగారు. తంజావూరు 'సదిర్' నృత్యాన్ని, ఒడిస్సీ, ఛౌ వంటి నృత్యరీతులను బ్రాహ్మణ వర్గం వారు బ్రాహ్మణీకరిస్తున్నారనీ, సంస్కృతీకరిస్తున్నారనీ ఆయన ఆక్షేపించారు. ఆనాటి సభలోనే ఆయన వ్యాఖ్యలకు కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాద నేపథ్యాన్ని సంక్షిప్తంగా పరామర్శిద్దాం: పవిత్రమైన నాట్యవేదం ఆనేక రాజకీయ, సామాజిక కారణాల వల్ల ఈ శతాబ్దారంభం నాటికి ఒక చౌకబారు వినోద ప్రక్రియ స్థాయికి దిగజారిపోయింది. అంతటి క్షీణదశలో కూడా కళను దైవంగా భావించిన నర్తకీమణులు కొందరు తప్పకుండా ఉండే ఉంటారు. కాని, మొత్తం మీద నృత్య కళ సభ్య సమాజానికి దూరమైన మాట వాస్తవం. అగ్రకులాల వారు నేర్చుకోవడానికి కాదు కదా చూడడానికి కూడా సిగ్గుపడే విధంగా దాదాపు ఇప్పటి తెలుగు సినిమాల స్థాయికి దిగజారింది నృత్యకళ. దేవాలయాల నుంచి సంపన్నుల విలాసమందిరాలకు తరలి వెళ్ళాయి నాట్య ప్రదర్శనలు. ఆ అధ్వాన్నస్థితి నుంచి నృత్య కళను ఉద్ధరించి, దానికి సభాయోగ్యత కల్పించిన వారు కృష్ణయ్యర్, రుక్మిణీదేవి. వారి కృషి ఫలితంగానే సదిర్ నృత్యం భరతనాట్యమనే పేరుతో విశ్వ విఖ్యాతమయింది. భారతీయ శాస్త్రీయ నృత్యరీతులలో ప్రథమ గణ్యత పొందింది. దక్షిణ భారతంలో నృత్యం నేర్చుకొని, సభామందిరాలలో ప్రదర్శనలిచ్చిన తొలి బ్రాహ్మణ వనిత రుక్మిణీదేవి. ఆమె తన నృత్యంలో శృంగార రసానికి ప్రాధాన్యం తగ్గించి, భక్తిరసానికి అగ్రస్థానమిచ్చింది. 'కళాక్షేత్ర'ను నెలకొల్పి అన్ని కులాలకు చెందిన వందలాది బాలికలకు నృత్య విద్య బోధించింది. ఇవాళ బ్రాహ్మణ కుటుంబాలవారు సగర్వంగా తమ కుమార్తెలకు నృత్యం నేర్పిస్తున్నారంటే అది రుక్మిణీదేవి పుణ్యమే. కడచిన యాభై, అరవయ్యేళ్ళలో ఒక్క భరత నాట్యమే కాదు-కూచిపూడి, ఒడిస్సీ, మణిపురి, కథక్, కథాకళి, మోహినీ అట్టం వంటి నృత్యరీతులు కూడా పునరుజ్జీవం పొందాయి. ఆయా రీతులలో ఎన్నో కొత్త ప్రయోగాలు జరిగాయి. పురుషులు మాత్రమే, బ్రాహ్మణులు మాత్రమే ప్రదర్శించే కూచిపూడి, కథాకళి నృత్యాలను ఇప్పుడు స్త్రీలు, అన్ని కులాల వారు నేర్చుకుంటున్నారు. నేర్పుతున్న బ్రాహ్మణ ఆచార్యులు తమ విద్యా సంపద ఇతర కులాల వారికి పోతున్నదే అని విచారించడం లేదు. యక్షగానాలకే పరిమితమైన కూచిపూడి సంప్రదాయంలో ఏకపాత్ర నర్తనకు వీలుగా ఎన్నో కొత్త రచనలు చేసి, ఒక సిలబస్ను తయారు చేసి కూచిపూడి నృత్య శైలిని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేశారు వెంపటి చినసత్యం. అలాగే ఒడిస్సీ నృత్యశైలి దాదాపుగా అంతరించిపోతున్న దశలో దానికి తిరిగి జీవం పోసిన వారు కేలూచరణ్ మహాపాత్ర. కోణార్క్ ఆలయ కుడ్యాల మీది శిల్పాల భంగిమలు ఆధారంగా ఆయన ఒడిస్సీని పునర్నిర్మించి, వందలాది మందికి నేర్పి, ప్రచారం చేశారు. జాయపసేనాని రచించిన 'నృత్తరత్నావళి'ని, రామప్ప దేవాలయ శిల్ప భంగిమలను ఆధ్యయనం చేసి నటరాజ రామకృష్ణ 'పేరిణి'కి పునర్జన్మ ప్రసాదించారు. గోదావరి జిల్లాల్లో ఒకప్పుడు ప్రచారంలో ఉండిన 'నవజనార్దన పారిజాత' సంప్రదాయాన్ని పునరుద్ధరించారు. సంస్కర్తలు ఏ కులం వారైనా సంస్కరణలను హర్షించవలసిందే. గొప్ప కళాకారుల మధ్య స్పర్థలుండడం సహజమే. కాని, కులదృష్టితో ప్రత్యర్థిని విమర్శించడం అనుచితం. ఒక నృత్య ప్రదర్శనం వెనుక వివిధ కులాలకు చెందిన ఎందరో కళాకారుల కృషి ఉంటుంది. లక్షణాన్ని నిర్దేశించే శాస్త్రకారుడు, గీతాన్ని రచించే కవి, ఆ గీతాన్ని స్వరపరచే సంగీత కర్త, గీతానికి నృత్య రచన చేసే నాట్యాచార్యుడు, దాన్ని ప్రదర్శించే నర్తకి, నట్టువాంగం నిర్వహించే నట్టువనారు, వాద్య కళాకారులు-వీరు వేర్వేరు కులాల వారు కావచ్చు. అందుచేత నృత్యకళ ఏ ఒక్క కులం వారి సొత్తు కాదు. 'సన్నాయి, డోలు నాయీ బ్రాహ్మణులే వాయించాలి, ఆడవాళ్ళు మృదంగం వాయించరాదు. బ్యాండు మేళంలో బ్రాహ్మణులుండరాదు'-అనడం హాస్యాస్పదంగా ఉంటుంది. కళారంగాన్ని రిజర్వేషన్ల నుంచి దూరంగా ఉంచాలి. నిజమైన కళారాధకులు కళా ప్రతిభను మాత్రమే గుర్తిస్తారు. మద్రాసు మ్యూజిక్ అకాడమీ హాలులో ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ కచేరీ విని ముగ్ధుడైన 'సంగీత కళానిధి' జి.ఎన్. బాలసుబ్రహ్మణ్యం తన బ్రాహ్మణ్యాన్ని విస్మరించి ఖాన్ సాహెబ్ కు సాష్టాంగ దండప్రమాణం చేసి, ఆయన పాద ధూళిని తలదాల్చాడు. ఆయన చర్యకు ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యర్, సెమ్మంగుడి వంటి మహా విద్వాంసులతో పాటు ఖాన్ సాహెబ్ కూడా నిశ్చేష్టులయ్యారు. కళారాధన అంటే అలా ఉండాలి. కళాకారుల మధ్య సంబంధాలు అలా ఉండాలి.

నండూరి పార్థసారథి
(1998 జూన్ 14వ తేదీన వార్త దినపత్రికలో ప్రచురితమయింది)

Previous Post Next Post