Title Picture

(4)

తెల్లవారకముందే వారు శ్రీరంగపట్టణం చేరారు. సుబ్బణ్ణ లలితమ్మను ఒక సత్రానికి తీసుకువెళ్ళి కాసేపు నిద్రపొమ్మన్నాడు. తనూ నడుం వాల్చాడు. కాసేపు కునుకు తీశాక లేచి భార్యని నిద్రలేపి మూట తీసుకుని తన వెంట నడవమన్నాడు.

లలితమ్మకు భయం వేసింది. రాత్రి మైసూరులో బయలుదేరినప్పుడు ఎక్కడికి వెడుతున్నామో చెప్పమని భర్తని గట్టిగా అడగలేకపోయిఁది. అప్పుడు అతను మాట్లాడే స్థితిలో లేడని ఆమెకు తెలుసు. చామరాజనగర్ లోని తన పుట్టింటికి తీసుకువెడుతున్నాడేమోనని కాసేపు అనుకున్నది. కాని తాను నడిచిన దారి చామరాజనగర్ వైపు వెళ్ళేది కాదనీ, శ్రీరంగపట్టణంవైపు వెళ్ళేదనీ గ్రహించింది. నడిచి నడిచి శ్రీరంగపట్నం చేరారు. కాని భర్తమళ్ళీ ఇంకెక్కడికో పోదాం పద అంటున్నాడు. అందుకని ఇంక ఉండబట్టలేక ధైర్యం తెచ్చుకుని అన్నది: “ఏమండీ నా మీద కోపం తెచ్చుకోకండి. వాళ్ళు ఏమన్నా, ఏం చేసినా తల్లీతండ్రీ కదా. వెనక్కి పోదాం పదండి”.

“ఎదురు సలహా చెప్పే అధికారం ఆడదానికి లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా నా వెంట నడవడమే నీ పని” అన్నాడు సుబ్బణ్ణ.

“నేను రాననడం లేదు. మీ వెంటనే వస్తాను. కాని మనం పెద్దలతో చెప్పకుండా వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ఎంత విచారిస్తారో ఆలోచించడం లేదు”.

“నువ్వు వెళ్ళిపోయావని విచారించే వాళ్ళు, నీ కోసం కన్నీళ్ళు పెట్టుకునే వాళ్ళు అక్కడెవరూ లేరు. ఊరికే కాలయాపన చెయ్యకు. పద”.

“నేను మిమ్మల్ని ప్రేరేపించి ఇంట్లోంచి బైటకు తీసుకు వచ్చానని అత్తగారు అనుకుంటుంది. మనం వాళ్ళని కష్టపెట్టకూడదు”.

“ఇప్పటి నుంచి వాళ్ళకీ మనకీ సంబంధం లేదు. వాళ్ళని వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా అనుకోమను. పద”

“అది కాదండీ. అసలే అత్తగారికి కోపం ఎక్కువ. మనం వెళ్ళిపోతే మామగారి సంగతి చూసేందుకు ఎవరూ ఉండరు. కోప్పడకండి. వెనక్కి పోదాం పదండి”.

“ఓహో అలాగా. నాకు సలహా ఇవ్వగలిగినంతటి దానివైనావన్నమాట”.

“మీ తల్లిదండ్రులు దగ్గరుంటే వాళ్ళు మీకు సలహా ఇచ్చేవారు. వాళ్ళు లేనప్పుడు మీకు ఇలా చెప్పగలిగినవాళ్ళు నేను కాక ఇంకెవరు?”

“సరే అయితే. నాతో రావడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెనక్కి వెళ్ళిపోవచ్చు. శేషుని తీసుకుని నేను వెడతాను” అంటూ సుబ్బణ్ణ కొడుకుని బుజానవేసుకున్నాడు. అతడితో ఇంకా వాదించడం అనవసరమని మూట తీసుకుని అతడి వెంట వెళ్ళడానికి బయలుదేరింది.

ఇక్కడ శాస్త్రిగారింట్లో సుబ్బణ్ణ తల్లి మామూలుగా పొద్దున్నేలేచింది. కోడలు ఇంకా నిద్రలేవలేదని గ్రహించి సాదించడానికి ఇవాళ గొప్ప అవకాశం దొరికింది కదా అని సంతోషించింది. ఇంటి ముందు ఊడ్చి, నీళ్ళు చల్లి, ముగ్గు వేసి ఇంక దండకం ప్రారంభించింది. “ఈ కాలపు కోడళ్ళు కూతుళ్ళ కంటే ఎక్కువైపోయారు. ఇదివరకెప్పుడైనా ఎరుగుదుమా ఈ వరస. ఇలాంటి చాకిరీ అంతా ముసలిదాన్ని నేను చేసుకోవాలి” అని గొణుగుతూ ఇల్లంతా కదంతొక్కింది. శాస్త్రిగారు లేచి భార్య గొణుగుడు విని “పాపం ఒంట్లో బాగాలేదేమోనే. సుబ్బణ్ణ లేచాడా?” అని అడిగాడు.

“నేను లేచేటప్పటికే తలుపు తీసి ఉంది. ఎక్కడికో వెళ్ళి ఉంటాడు” అంది ఇల్లాలు. పాపం లలితమ్మ వట్టి పుణ్యానికి అత్తగారిచేత చివాట్లు తింటోంది కదా అని శాస్త్రి గారు జాలిపడ్డాడు. కొడుకు గది తలుపు దగ్గరకు వెళ్ళి “లలితమ్మా లలితమ్మా” అని పిలిచాడు. లోపలి నుంచి సమాధానం రాలేదు. అంత నిద్రలో ఉందా అనుకుంటూ ఆయన నెమ్మదిగా తలుపు తోసి లోపలికి చూశాడు. లోపల ఎవరూ లేకపోవడం చూసి ఆయన “అమ్మాయి లోపల లేదే... ముందే లేచి ఉంటుంది. అనారోగ్యం ఏమీలేదు” అన్నాడు. తరువాత ఆయన మామూలుగా కాలకృత్యాలకై చెరువు వైపు వెళ్ళాడు.

ఆయన ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లాలు గొంతుచించుకుని అరుస్తోంది. శాస్త్రిగారిని చూడగానే “ఏమీ తెలియని వట్టి అమాయకురాల్లాగా కనిపించేదా... చూడండి ఏం చేసిందో కోడలు. మొగుణ్ణి తీసుకుని పుట్టింటికి పోయింది” అంది. “కిందటిసారి దానికి పురుడుపోసింది నేను కదూ. ఏం తక్కువ చేశాను దానికి... ఇప్పుడు పురిటికి పుట్టింటికి పోయింది. నేను చెడ్డదాన్నని ప్రపంచానికి చెప్పడానికి కావలసినదంతా చేస్తోంది” అని సాగదీసింది.

తన కొడుకు, కోడలు, మనవడు ఇంట్లోంచి వెళ్ళిపోయారని తెలిసి శాస్త్రిగారు ఒక్క క్షణం మ్రాన్పడిపోయాడు. మళ్ళీ తేరుకుని “సరే పోనీలేవే. ఇక్కడ సౌకర్యంగా లేదని పుట్టింటికి తీసుకు వెళ్ళమన్నదేమో అమ్మాయి” అన్నాడు. ఏదో తనకు తాను సర్దిచెప్పుకోవడమే తప్ప ఆయనకు సరైన సమాధానం దొరకలేదు. “నాతో చెప్పకుండా ఎందుకు వెళ్ళారు? సుబ్బణ్ణ కోపంలో చెప్పకపోయినా లలితమ్మ అయినా చెప్పి ఉండాలే! ఆ పిల్ల నా ఆశీస్సులు తీసుకోకుండా వెళ్ళేది కాదే” అని ఆశ్చర్యపోయాడు. “అయినా వాడు వట్టి మొండిఘటం. కోడలు సలహా చెప్పినా వినేరకం కాదు. అదీకాక వెడతామని చెబితే ఇంట్లో పెద్ద రాద్ధాంతం అవుతుంది దేనికిలే అనుకుని ఉంటారు” అని ఆయన సమాధాన పడ్డాడు.

లలితమ్మని పుట్టింటిలో దిగబెట్టిన తరువాత సుబ్బణ్ణ ఇంటికి తిరిగి వస్తాడని శాస్త్రిగారు అనుకున్నాడు. ఆరు రోజులైనా సుబ్బణ్ణ తిరిగిరాలేదు. శాస్త్రిగారికి అన్నం నోటికెక్కడం లేదు. ఆయనకి సుబ్బణ్ణ ఒక్కగాను ఒక్క కొడుకు. అతడిని పాతికేళ్ళు పెంచారు. కడసారి వాడు కావడం వల్ల మొన్న మొన్నటి వరకు అతడిని గారాబంగా చూసుకున్నారు. సుబ్బణ్ణకు కొడుకు పుట్టాక ఆ గారాబం అంతా చిన్న పిల్లాడికి దక్కింది. మనవడంటే శాస్త్రిగారికి ప్రాణం. సుబ్బణ్ణను పక్కన కూర్చోబెట్టుకుని భోజనం చేయడం శాస్త్రిగారికి అలవాటు. ఇప్పుడు కొడుకు పక్కన లేకపోతే ఆయనకి అన్నం నోటికి పోవడం లేదు. రోజులు గడుస్తుంటే ఆయన మాటిమాటికి “వీడు ఇంకా రాలేదేమిటి? ఈపాటికి వచ్చి ఉండాలే” అని తనలోతనే అనుకుంటున్నట్టుగా అనేవాడు.

సుబ్బణ్ణ తల్లి మాత్రం మొదట్లో ఆందోళన చెందలేదు. కొడుకు మీద కోడలి మీద ఆవిడకి బాగా కోపం వచ్చింది. కాని కొడుకు తిరిగి వచ్చే సూచనలు కనిపించకపోయే సరికి ఆవిడకీ భయం పట్టుకుంది. ఒకవేళ కొడుకు, కోడలు వేరే ఏదైనా ఊళ్ళో కాపరం పెడితే తన పరువు ఏం కావాలి? కొడుకు కోడలు అన్యోన్యంగా ఉంటే చూడలేక కళ్ళలో నిప్పులు పోసుకున్నదని అనుకుంటారు. ఈ అప్రతిష్ఠ సంగతి తలుచుకోగానే ఆవిడకి వణుకు పట్టుకుంది. “ఈ ఒక్క గండం గడిచి కొడుకు, కోడలూ తిరిగి వస్తే ఇంకెప్పుడూ వాళ్ళని ఏమీ అనను. నా పరువు దక్కించు దేవుడా” అని దణ్ణం పెట్టుకుంది.

తరువాత శాస్త్రిగారు “ఏమిటీ వీడు ఇంకా తిరిగి రాలేదు” అన్నప్పుడు ఆవిడ “ఊరికే అన్నిసార్లు దేనికి అనుకుంటారు? మామగారింటికి వెళ్ళి చాలా కాలమయింది కదా. రాకరాక వచ్చాడని ఇంకా కొన్నాళ్ళు ఉండమన్నారేమో. మీకు అంత ఆందోళనగా ఉంటే వాడిని రమ్మని కబురు పంపరాదూ” అంది. కబురు పంపించాలని ఆవిడకే ఆందోళనగా ఉంది. కాని తన ఆందోళన వ్యక్తం చేయడానికి అహం అడ్డు వచ్చింది. భార్య సలహా ప్రకారం శాస్త్రిగారు వియ్యంకుడి ఇంటికి ఒక మనిషి చేత కబురు పంపారు. కొద్ది రోజుల తరువాత ఆ మనిషి తిరిగి వచ్చాడు. అతడి వెంట లలితమ్మ పిన తండ్రి కొడుకు కూడా వచ్చాడు. “లలితమ్మ, సుబ్బణ్ణ మా ఊరికి బయలుదేరారా?” అని అడిగాడు అతడు. శాస్త్రిగారు, ఆయన భార్య అవునని చెప్పారు. బయలుదేరి వెళ్ళి చాలా రోజులయిందని కూడా చెప్పారు. “వాళ్ళు మావూరు చేరలేదు. దారిలో దొంగల చేతుల్లో పడ్డారో ఏమో” అని దిగాలుపడి కూర్చున్నాడు అతడు.

శాస్త్రిగారు గతుక్కుమన్నాడు. అత్తగారి పోరు భరించలేక లలితమ్మే భర్తను తీసుకుని వెళ్ళిపోయిందని ఆయనకి అనిపించింది. సుబ్బణ్ణ తనంతట తను అలా చేస్తాడని ఆయన అనుకోలేకపోయాడు. ఎంత చెప్పినా సుబ్బణ్ణ తన కొడుకు. తండ్రిగా ఆయన తన కొడుకు గురించి చెడ్డగా అనుకోలేకపోయాడు. కాసేపు ఆలోచించి ఆయన “ఇంట్లో ఆడవాళ్ళు ఏదో మాటామాటా అనుకున్నారు. భార్యా భర్తలిద్దరూ ఎక్కడికో వెళ్ళిపోయారు. మీ ఊరికి వచ్చారేమోననుకున్నాం. మీ ఊరికి రాలేదంటే ఇంకెక్కడికో వెళ్ళి ఉంటారు. వెతికించాలి” అన్నాడు లలితమ్మ అన్నగారితో. శాస్త్రిగారి భార్య ఇప్పటికీ తప్పంతా లలితమ్మ మీదకే నెట్టాలనే తాపత్రయంతో “మా అమ్మాయి ఇంటికి వచ్చినప్పటి నుంచి లలితమ్మ ధోరణి మారిపోయింది. ఇప్పుడు ఇల్లే విడిచిపెట్టి పోయింది. ఆడబడుచు ఇంటికి రావడం తనకి ఇష్టం లేకపోతే ఒక్క మాట చెప్పితే మా అమ్మాయిని పంపించేసే దాన్ని కదా? తను, తన మొగుడూ ఇద్దరే సుఖంగా ఉండాలని లలితమ్మ అనుకుంటే నేను అభ్యంతర పెట్టేదాన్ని కాదు కదా” అంది.

లలితమ్మ అన్న అంతా విని “వాళ్ళ కోసం వెతికించాల్సిందే. మీరు ఎక్కడికీ వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను వెతికిస్తాను. కనిపిస్తే వాళ్ళని వెనక్కి తీసుకొస్తాను” అన్నాడు. శాస్త్రిగారు రాజకుటుంబానికి ఈ సంగతి తెలియబరచి కొడుకును వెతికించడానికి కొంత డబ్బు, ఒక మనిషిని సమకూర్చుకున్నాడు. ఆ మనిషిని లలితమ్మ అన్న వెంట పంపించాడు. లలితమ్మ అన్న పదిహేను రోజులు తిరిగి తిరిగి సుబ్బణ్ణ జాడ తెలుసుకోలేక రాజకుటుంబం వారు పంపిన నౌకరుతో పాటు తిరిగి వచ్చాడు. అందరూ హతాశులైనారు. కొడుకు, కోడలు దేశాంతరం పోయారేమోనని శాస్త్రి గారు క్రుంగిపోయారు. ఆయన భార్య “నేనుపాపిని. అటువంటి కోడలిని ఇంట్లో పెట్టుకునే భాగ్యం నాకు లేదు” అంది. కొడుకు కోడలు తిరిగి వస్తే త్రినేశ్వరస్వామికి వంద కొబ్బరి కాయలు కొడతానని ఆవిడ మొక్కుకుంది. ఇల్లంతా దుఃఖంలో మునిగిపోయింది.

ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు భార్యని, కొడుకుని ఎక్కడకు తీసుకు వెళ్ళాలో సుబ్బణ్ణ నిర్ణయించుకోలేదు. “ముందు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికైనా సరే” అనుకున్నాడు. ఎంత దూరం వెడితే అంత మంచిదనుకున్నాడు. ఏదైనా ఊళ్ళో చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని కాపరం పెట్టి, ఏదో జీవనోపాధి చూసుకోవాలనుకున్నాడు. సంగీత పాఠాలు చెప్పుకొని సంపాదించుకో వచ్చు. వేశ్యలకైనా సరే పాఠాలు చెప్పడానికి అతను సంకోచించడం లేదు. తన పిల్లాడికి రోజూ పెరుగువేసి అన్నం పెట్టాలి. తన భార్యకి ఇక అత్తగారిపోరు ఉండదు. ఆవిడ ఏదో సాదించడం, ఈవిడ కన్నీరు పెట్టుకోవడం-ఇదంతా ఉండదు. ఇలా ఆలోచిస్తూ అతను ముందుకు సాగాడు. నాలుగు నెలలు ప్రయాణం చేసి అతడు కాశి చేరాడు. తన ఊరు నుంచి వీలైనంత ఎక్కువ దూరం పోవాలన్న పట్టుదలతో అతడు తన భార్య గర్భిణి అనే సంగతి కూడా మరచిపోయాడు. రోజులు తరబడి ప్రయాణంతో ఆమెకు రాయచూరు వద్దనే గర్భస్రావం అయింది. కాశి చేరేసరికి లలితమ్మ చాలా బలహీనంగా ఉంది. శేషు చిక్కి శల్యమైపోయాడు. సుబ్బణ్ణ కూడా బాగా అలసిపోయాడు. వాళ్ళు కాశిలో ఒక నెల రోజులున్నారు. తర్వాత సుబ్బణ్ణ వాళ్ళని కలకత్తా తీసుకు వెళ్ళాడు. కలకత్తాలో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. కొన్ని సంగీత పాఠాలు కుదుర్చుకొని అక్కడ స్థిరపడ్డాడు. సంగీత పాఠాల వల్ల సంపాదన బాగానే ఉండేది. ఏలోటూ లేకుండా ఇల్లుగడిచేది. కాస్త సొమ్ము నిలవేశాడుకూడా. ఐదారు నెలలు అలా నిల్వచేసిన డబ్బుని ఒక షావుకారు దగ్గరకు తీసుకు వెళ్ళి, ఆ డబ్బుని మైసూరులో ఉన్న నీలసానికి పంపించే ఏర్పాటు చేశాడు. ఆ డబ్బు ఎవరు పంపించారో తెలియకుండా ఆమెకు అందేలా చూడాలని ఆ షావుకారును కోరాడు. సుబ్బణ్ణ మైసూరు నుంచి బయలుదేరేటప్పుడు నీలసాని నుంచి ఆ డబ్బు తీసుకున్నాడు. ఆరు నెలల తర్వాత ఇప్పుడు ఆ బాకీ తీర్చేశాడు. దీనితో ఇక అతడికి మైసూరుతో అన్ని సంబంధాలూ తెగిపోయాయి. మైసూరులో తన వాళ్ళని గురించి ఆలోచించడం మానేశాడు. తను బెంగాల్ లోనే పుట్టి పెరిగినవాడిలా కలకత్తా తన స్వస్థలమైనట్లుగా భావించుకోవడానికి ప్రయత్నించేవాడు.

కలకత్తా

సుబ్బణ్ణ కలకత్తాలో 35 సంవత్సరాలు నివసించాడు. ఆ ముప్ఫయి ఐదేళ్ళలో అతడు మైసూరుతో ఎటువంటి సంబంధం పెట్టుకోలేదు. అతడి కలకత్తా జీవితాన్ని గురించి నేను ఎక్కువగా వర్ణించలేను. ఆ జీవితం గురించి నాకు అంతగా తెలియదు. సుబ్బణ్ణ మితభాషి. ముఖ్యంగా తన కలకత్తా జీవితం గురించి ఆయన ఎప్పుడూ మాట్లాడేవాడు కాడు. ఆయనతో మాట్లాడేటప్పుడు నేను ఎప్పుడైనా కలకత్తా ప్రస్తావన తీసుకువస్తే “అప్పటి సంగతులు వద్దు” అనేవాడు. ఆయనే ఎప్పుడైనా ప్రసంగవశాత్తూ అప్పటి జీవితం గురించి ఒకటి రెండు మాటలు చెప్పేవాడు. ఆయన అప్పుడప్పుడూ చెప్పిన ఆ కాసిని సంగతులను ఒక వరసలో పేర్చుకుని ఈ కథ రాస్తున్నాను.

కలకత్తా చేరిన తరువాత రెండు సంవత్సరాల వరకు సుబ్బణ్ణ తన తల్లిదండ్రులను గురించి విచారపడలేదు. నీలసానికి డబ్బు పంపించాడు కనుక తను ఎక్కడో అక్కడ జీవించే ఉన్నట్లు మైసూరులో కనీసం ఒక్క వ్యక్తికైనా తెలుస్తుందనుకున్నాడు.

నిజంగా అదే జరిగింది. కలకత్తా షావుకారు సుబ్బణ్ణ ఇచ్చిన డబ్బును ఒక బొంబాయి షావుకారు ద్వారా మైసూరులోని వర్థమానయ్య అనే షావుకారుకు డ్రాఫ్టుగా పంపాడు. వర్థమానయ్య నీలసానిని పిలిపించి “నీకు ఎక్కడ నుంచైనా డబ్బు రావలసి ఉందా?” అని అడిగాడు. ఆమె లేదని జవాబిచ్చింది. ఉత్తరదేశంలో ఎవరో ఒకాయన బొంబాయి షావుకారు ద్వారా నీకు డబ్బు పంపారు” అని వర్థమానయ్య చెప్పాడు. “ఎంత పంపారు?” అని ఆమె అడిగింది. “నూటయాభై రూపాయలు” అని చెప్పాడు అతను. నూటయాభై అనగానే నీలసానికి స్ఫురించింది-ఆ డబ్బు పంపింది సుబ్బణ్ణ అని. తన దగ్గర సుబ్బణ్ణ తీసుకున్న డబ్బు సరిగ్గా నూటయాభయ్యే. ఆ డబ్బు ఇచ్చినప్పుడే తను అతడిని చివరిసారిగా చూసింది. ఆ తరువాత కొద్ది రోజులకే ఆమెకు తెలిసింది అతను ఊరు విడిచి వెళ్ళిపోయినట్లు. సుబ్బణ్ణ డబ్బు కోసం అర్థరాత్రి వేళ తన వద్దకు వచ్చాడు. అది వరకెప్పుడూ అతడు అంతరాత్రివేళ రాలేదు. ఎందుకు వచ్చాడా అని ఆమె ఆశ్చర్యపోయింది. “నీలసానీ నాకు నీ సహాయం కావాలి” అన్నాడు అతను. “సెలవివ్వండి” అంది ఆమె.

“నాకు కొంత డబ్బుకావాలి. దయచేసి ఒక వందరూపాయలు ఇవ్వు. మళ్ళీ తీర్చేస్తాను” అన్నాడు.

'అదెంత భాగ్యం' అంటూ ఆమె లోపలికి వెళ్ళి ఒక వంద రూపాయలనోటు, ఒక యాభై రూపాయల నోటు తెచ్చింది. వందనోటు అతడి చేతిలో పెట్టి “నిజంగా ఇది సరిపోతుందా? కావాలంటే ఈ యాభై కూడా తీసుకోండి” అన్నది. సుబ్బన్న ఒక్కక్షణం సంకోచించి “సరే ఇవ్వు. మళ్ళీ తిరిగి పంపిస్తాను” అంటూ తీసుకున్నాడు.

“వద్దు. పంపనవసరం లేదు. మీవంటి మంచి వారికి ఇవ్వడం వల్లనే మా జన్మ సార్థకమవుతుంది” అన్నది ఆమె. 'డబ్బు తిరిగి పంపిస్తాను' అని సుబ్బన్న అన్న మాటలను ఆ సమయంలో ఆమె సరిగా పట్టించుకోలేదు. అతను ఊరు విడిచి వెళ్ళినట్లు తెలిసినప్పుడు ఆమెకి జ్ఞాపకం వచ్చింది అతడు 'పంపిస్తాను' అనే మాట అన్నట్లు. తాను ఆరాధించిన వ్యక్తి తనను విడిచి దూరంగా వెళ్ళిపోవడం కోసం తాను డబ్బు ఇచ్చానని అప్పుడు ఆమె గ్రహించింది. తరువాత కొన్ని నెలలకి ఆ డబ్బు చేరేసరికి సుబ్బణ్ణే పంపాడని తెలుసుకున్నది. ఆమె దుఃఖం వర్ణనాతీతం. ఆ డబ్బును పూజామందిరంలో పెట్టి రోజూ సుబ్బణ్ణను తలుచుకొని దానికి నమస్కరించేది. ఒకటి రెండు సంవత్సరాల వరకు ఆమె ఆ డబ్బును ఖర్చు చేయలేదు. చివరికి తప్పని సరి అవసరమై ఆ డబ్బు తీసింది.

ఆ డబ్బు చేరిన రోజున ఆమె సుబ్బణ్ణ తల్లిదండ్రులకు ఆ సంగతి ఎవరి ద్వారానో తెలియబరచింది. అది విని సుబ్బన్న తల్లి “వాడు మనల్ని మరచిపోయినా కనీసం ఉంపుడుకత్తెనైనా జ్ఞాపకం ఉంచుకున్నాడు” అన్నది.

“నువ్వు ఇంకా నిష్టూరాలు మాత్రం మానలేదు. ఏం చేస్తాం” అన్నాడు శాస్త్రిగారు.

“వాడెప్పుడూ మొండి ఘటమే. వాడికి నాపోలికే వచ్చింది. ఏం చేస్తాం. నా కర్మ ఇలా ఉంది. అంత మంచి కోడలుతో సుఖంగా బతికే భాగ్యం నాకు లేదు. పాపం దాన్ని రోజూ అనరాని మాటలన్నాను. అయినా అది ఎన్నడూ తిరిగి ఒక్కమాట అనలేదు. ఎక్కడుందో నా చిట్టి తల్లి. ఎప్పుడు తిరిగి వస్తుందో” అని ఏడుస్తూ కూలబడిపోయింది ఆవిడ. మళ్ళీ ఒక్కసారైనా కోడలిని కళ్ళారా చూడాలని ఆవిడ విలవిలలాడిపోయింది. కాని ఆవిడ కోరిక నెరవేరలేదు. ఆవిడ మాట, ప్రవర్తన కఠినంగానే కనిపించినా నిజంగా ఆమె మనస్సు కఠినం కాదేమోననిపిస్తుంది. అత్త ఎప్పుడూ కోడలిని గట్టిగా అదుపులో పెట్టాలన్నదే ఆవిడకి తెలిసిన సంప్రదాయం. ఆ సంప్రదాయాన్నే ఆవిడ పాటించింది. కోడలు వేరే కాపరం పెట్టడం అత్తకి అప్రతిష్ఠ అనేది కూడా ఆ సంప్రదాయం చెప్పేమాటే. కోడలు దూరం కావడంతో ఆవిడకి పశ్చాత్తాపం కలిగింది. లలితమ్మపై ఎక్కడలేని ప్రేమ కలిగింది. ఒకవైపు కొడుకు, కోడలిపై బెంగ, ఇంకో వైపు తనకి అప్రతిష్ఠ వచ్చిందనే దిగులు ఆవిడని క్రుంగదీశాయి. కొడుకు, కోడలు తిరిగి వస్తారేమోనని శాస్త్రిగారు, ఆయన భార్య రెండు మూడు సంవత్సరాలు ఆశగా ఎదురుచూశారు. మూడేళ్ళు గడిచినా వాళ్ళు వచ్చే జాడ కనిపించకపోవడంతో ఆ ఆశ ఆరిపోయింది. “వాళ్ళు రాకపోతే పోయారు. కనీసం ఎక్కడో అక్కడ వాళ్ళు సుఖంగా ఉన్నారన్న కబురైనా తెలిస్తే తృప్తి పడతాను” అన్నది ఆవిడ. “వాళ్ళు మనదగ్గర లేనప్పుడు ఇంకెక్కడో సుఖంగా ఉంటేమట్టుకు నీకూ నాకూ ఒరిగిందేమిటి?” అన్నాడు శాస్త్రిగారు.

శాస్త్రిగారికి వృద్ధాప్యం వల్ల సత్తువ సన్నగిలిపోవడంతో కూతుళ్ళలో ఎవరో ఒకరు ఎప్పుడూ ఇంట్లో తోడుగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. పుత్రవియోగబాధను మరచిపోవడం కోసం ఆయన మనవళ్ళతో, మనుమరాళ్ళతో ఆడుతూ కాలక్షేపం చేసేవాడు. ఆ ఆటల్లో తనకు దూరమైపోయిన మనవడు శేషు లేని లోటు కనిపించేది. ఆడడం మరచిపోయి ఆయన దిగులుగా గోడకేసి శూన్యంగా చూస్తూ ఉండిపోయేవాడు. ఆయన దిగులుకు కారణం ఇంట్లో అందరికీ తెలుసు. కాని ఆయనను ఓదార్చడం ఎలాగో ఎవరికీ తెలియదు. కూతురు వచ్చి “మిరియాల చారు పెట్టమంటావా నాన్నా” అనో, “పురాణం చెప్పడానికి ఎన్ని గంటలకి వెడతావు నాన్నా” అనో మాటల్లోకి దింపి ఆయన ఆలోచనలని మరల్చేది. అలా పది సంవత్సరాలు గడచాయి.

పదకొండో సంవత్సరం హరిద్వారంలో ఒక పెద్దమేళా జరిగింది. శాస్త్రిగారు రాజకుటుంబం వారిని అర్థించి కొంత డబ్బు తీసుకొని భార్యా సమేతంగా గంగాయాత్రకు వెళ్ళారు. మైసూరు నుంచి మరి రెండు మూడు కుటుంబాలు కూడా తీర్థయాత్రకు వెళ్ళాయి. హరిద్వారంలో మేళాకు వచ్చే జనం గుంపులలో ఎక్కడైనా తన కొడుకు కనిపిస్తాడేమోనని శాస్త్రిగారి ఆశ. అయితే ఆయన తన మనస్సులోని మాట భార్యకు చెప్పలేదు. ఆవిడకీ మనస్సులో అదే ఆశ. కాని ఆవిడా బైటకి చెప్పలేదు. అక్కడ కలకత్తాలో లలితమ్మ కూడా హరిద్వారానికి తీసుకు వెళ్ళమని సుబ్బణ్ణను కోరింది. “హరిద్వారానికి ఇంత దగ్గరగా ఉండి ఇప్పుడు చూడకపోతే ఇంకెప్పుడు చూడగలం” అన్నది ఆమె. భార్య కోరిక తీర్చడానికై సుబ్బణ్ణ ఆమెను, కొడుకును తీసుకుని హరిద్వార యాత్రకు బయలుదేరాడు. అది వరకు ఎన్నోసార్లు లలితమ్మ మైసూరు వెళ్ళిపోదామని అడిగింది. “అది తప్ప ఇంకేదైనా అడుగు. ఒప్పుకుంటాను” అని సమాధానమిచ్చేవాడు సుబ్బణ్ణ. హరిద్వారంలో జరిగే మేళాకి తప్పకుండా మైసూరు వాళ్ళెవరైనా వస్తారని లలితమ్మ ఆశ. వాళ్ళద్వారా తమ అత్తమామల సంగతులు తెలుసుకోవచ్చుననీ, తామిక్కడ క్షేమంగా ఉన్నసంగతి తమ అత్తమామలకి కబురు పంపవచ్చుననీ ఆమె అనుకున్నది. ఆ ఆశతోనే హరిద్వారం తీసుకు వెళ్ళమని అడిగింది. అయితే భర్తకి తెలియకుండా రహస్యంగా ఇదంతా చేద్దామని ఆమె అనుకోలేదు. హరిద్వారం వెళ్ళాక అటువంటి అవకాశం వస్తే అప్పుడు అతడి అనుమతితోనే కబురు పంపవచ్చునని అనుకుంది. తమ ఊరి వాళ్ళని చూడగానే సుబ్బణ్ణకు స్వస్థలంపై బెంగపుట్టుకొచ్చి తిరుగు ప్రయాణం కడతాడేమోనని కూడా ఆమె ఆశ. హరిద్వారానికి మైసూరు నుంచి తప్పకుండా కొందరు వస్తారన్న సంగతి సుబ్బణ్ణకూ తెలుసు. తనకు వాళ్ళు తటస్థపడే ప్రమాదం ఉందని కూడా తెలుసు. మైసూరులోని ఆ ఇంటిపై రోతపుట్టి అక్కడి నుంచి వచ్చేశాడు అతడు. మళ్ళీ వెనక్కిపోయే ఉద్దేశం అతడికి ఎంత మాత్రం లేదు.

అనుకున్నట్లే మైసూరు నుంచి చాలా మంది జనం హరిద్వారం వచ్చారు. ఆ జనంలో ఒక వ్యక్తి సుబ్బణ్ణను దూరం నుంచి చూసి గుర్తుపట్టి పిలిచాడు కూడా. సుబ్బణ్ణ వెనక్కి తిరిగి చూశాడు. ఆ వ్యక్తిని గుర్తుపట్టాడు. కాని అతడికి కనిపించకుండా గుంపులో కలిసిపోయాడు. అయినా ఆ వ్యక్తి వదిలి పెట్టకుండా సుబ్బణ్ణ వైపు వస్తూ “మీ అమ్మా, నాన్నా వచ్చారు” అని అరిచాడు. సుబ్బణ్ణ మనస్సు ఒక్కక్షణం తల్లిదండ్రులను చూడాలా అని ఊగిసలాడింది. కాని అంతలోనే “ఛీ... ఛీ... ఇంకా ఇదేం భ్రాంతి నాకు? జీవితంలో ఆ అధ్యాయాన్ని పూర్తిగా చెరిపేసుకుని వచ్చిన వాణ్ణి ఇంకా నాకు తల్లి ఏమిటి, తండ్రి ఏమిటి?” అని మనస్సు రాయి చేసుకుని మొహం తిప్పేసుకుని, ఆ వ్యక్తికి కనిపించకుండా పారిపోయాడు. భార్యను, కొడుకును తీసుకుని హడావిడిగా హరిద్వారం నుంచి ప్రయాణమయ్యాడు. భార్యకు ఈ సంగతేమీ చెప్పలేదు.

సుబ్బణ్ణను చూసిన వ్యక్తి ఈ సంగతి శాస్త్రిగారికి, ఆయన భార్యకు చెప్పాడు. ఇది నిజమని తల్లి నమ్మలేకపోయింది. “ఎవరిని చూసి సుబ్బణ్ణ అనుకున్నావో” అంది ఆవిడ. శాస్త్రిగారు మాత్రం ఆ వ్యక్తి చెప్పినదంతా నిజమేనని నమ్మాడు. “జీవితంలో మళ్ళీ కొడుకుని చూసే భాగ్యం నాకు లేదు. దైవేచ్ఛ అలా ఉంది” అనుకున్నాడు. గంగాయాత్ర అనే వంకతో కొడుకుని చూసేందుకు వచ్చిన తన పాపాన్ని క్షమించమని ఆయన గంగామాతను ప్రార్థించాడు. మేళా ముగియగానే అందరూ మైసూరుకు తిరిగి వచ్చారు.

తిరిగి వచ్చిన ఏడాదిలోపునే శాస్త్రిగారు మరణించారు. ఆయన భార్య ఒక దౌహిత్రుని చేత ఉత్తరక్రియలు జరిపించింది. తరువాత ఆవిడ ఆ ఇంటిని తెలిసిన వాళ్ళెవరికో అప్పగించి, తను కొన్నాళ్ళు ఒక కూతురి దగ్గర, కొన్నాళ్ళు ఇంకో కూతురి దగ్గర ఉంటూ రోజులు వెళ్ళబుచ్చింది. ఆవిడ మరీ వృద్ధురాలేమీ కాదు. కాని దుఃఖ భారంతో క్రుంగికృశించి ఆ తరువాత మూడు సంవత్సరాలకే మరణించింది. అల్లుళ్ళు ఇద్దరూ శాస్త్రిగారి ఇంటిని ఎవరికో అమ్మి ఆ డబ్బు చెరిసగం పంచుకున్నారు. సుబ్బణ్ణ తల్లిదండ్రుల కథ అంతటితో ముగిసింది.

నండూరి పార్థసారథి
(1987లో అనువదించబడినది)

Previous Post Next Post