Title Picture

జీవిత సంధ్యా సంగీతం

మధుర స్మృతుల మంజూషలో అతి పదిలంగా దాచుకోవలసిన అపురూప చలన చిత్రం 'ఆన్ గోల్డెన్ పాండ్'. మలయ వీచికలా మెల్లగా తాకి మనసును ఝల్లుమనిపించే చిత్రం ఇది. సుతారంగా హృదయ తంత్రులను మీటి జీవన సంధ్యా రాగాన్ని మధురంగా వినిపించే చిత్రం ఇది. అవును-ఇది యౌవన వసంతరాగం కాదు. శృంగార రస ప్రధాన కవితా ప్రబంధం కాదు. పొద్దువాలిపోతున్న జీవితంలో సైతం సౌందర్యాన్ని చూపించి, సంగీతం వినిపించే అసాధారణ చిత్రం.

కథానాయకుడు 80యేళ్ల వృద్ధుడు. నాయిక 70 యేళ్లు పైబడిన ముసలావిడ. ఆదంపతులకు ఒక్కగాను ఒక్క కూతురు. వయస్సు సుమారు ముప్పయి ఐదేళ్లు. ఈ ముగ్గురి మధ్య సంబంధం ఈ చిత్ర కథా వస్తువు. రాగంలో వాది, సంవాది, అనువాది, వివాది స్వరాల మధ్య సంబంధం లాంటిది వారికథ. వృద్ధుడుగా హెన్రీఫాండా, అతడి భార్యగా కేథరీన్ హెబ్బర్న్, వారి కుమార్తెగా జేన్ ఫాండా అతి సహజంగా నటించారు. నటించడం కాదు - ఆ పాత్రలలో జీవించారు. హెన్రీ ఫాండా, జేన్ ఫాండా వాస్తవ జీవితంలో కూడా తండ్రీ కూతుళ్లు. ఈ సినిమా చాలా వరకు వారి జీవితకథే. నిజంగా ఈ సినిమా హెన్రీ ఫాండా జీవిత చరమగీతమే. ఇదే ఆయన చివరి చిత్రం.

ఈ చిత్రం విడుదలైన కాలానికే ఆయన అస్తమించాడు. ఆయన నట జీవితానికి ఈ చిత్రమే పరాకాష్ఠ. ఈ చిత్రంలో నటనకు గాను ఆయనకి, కేథరీన్ హెబ్బర్న్ కు ఆస్కార్ అవార్డులు లభించాయి. వీరిద్దరి నటన, మార్క్ రైడెల్ దర్శకత్వం, బిలీ విలియమ్స్ ఛాయాగ్రహణం ఈ చిత్రంలో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అంశాలు. డేవ్ గ్రూసిన్ సంగీతం వాటితో చక్కగా మేళవించింది- గానానికి తంబుర శ్రుతిలాగా.

రిటైరైన యూనివర్సిటీ ప్రొఫెసర్ నార్మన్. అతడిది అతి విచిత్ర వ్యక్తిత్వం. ఎప్పుడూ సీరియస్ గా ఉంటాడు. సీరియస్ గా మాట్లాడతాడు. నవ్వడు. కాని అతని ప్రవర్తన చూస్తే, అతని మాటలు వింటుంటే మనకి నవ్వొస్తుంది. అతను ఉద్దేశపూర్వకంగా జోకులు వెయ్యడు గాని, అతని మాటల్లో అదోరకం హాస్యం సహజంగా తొంగి చూస్తూ ఉంటుంది. అతనికి భార్యే సర్వస్వం. ఆవిడకి అతనే సర్వస్వం. కాని ఆమె స్వభావం పూర్తిగా విరుద్ధమైనది. 70 యేళ్లు దాటినా ఆమె చలాకీగా, సరదాగా, మొగుణ్ణి వేళాకోళం చేస్తూ చిన్న పిల్లలా ప్రవర్తిస్తుంది. అతను మాత్రం సీరియస్ గా ఉంటాడు. ప్రేమ, ఆప్యాయత ఇవేవీ అతడి చేష్టల్లో, మాటల్లో వ్యక్తం కావు. అతడి స్వభావమే అంత. ఆ సంగతి ఆవిడకి ఒక్కదానికే అర్థమవుతుంది. మిగతావాళ్లకి అతని ప్రవర్తన చిరాకు కలిగిస్తుంది.

తన 80వ పుట్టినరోజు పండుగకు మూడు వేల మైళ్ల దూరం నుంచి ఒక్కగాను ఒక్క కూతురు రాకరాక వస్తే అతడి మొహం విప్పారదు. అసలు చలనమే ఉండదు. తల్లి ఆనందం పట్టలేక కూతుర్ని కౌగలించుకుంటుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. తండ్రి తనని గోడని చూసినట్లు చూస్తే కూతురు చాలా నొచ్చుకుంటుంది. ఆమె వస్తూ వస్తూ తన ప్రియుణ్ణి వెంటబెట్టుకు వస్తుంది.

Picture
కేథరిన్ హెబ్బర్న్, హెన్రీఫాండా, జేన్ ఫాండా

అతగాడికి ఒక పధ్నాలుగేళ్ల కొడుకు. భార్యకు విడాకులిచ్చాడు. అతను తన కొడుకును కూడా వెంట తీసుకొచ్చాడు. కూతురు తన ప్రియుణ్ణి పరిచయం చేసినా ముసలాయనలో చలనం లేదు. 'మీ అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాను అని కాబోయే అల్లుడు చెబుతున్నా చలనం లేదు. చేసుకుంటే చేసుకో. నాకు దేనికి చెప్పడం-అన్నట్లుగా మాట్లాడుతాడు. ఒకటి రెండు రోజులుండి కూతురు, అల్లుడు వెళ్లిపోతారు- పిల్లాణ్ణి వదిలేసి. ఆ పిల్లాడికీ మొదట్లో ముసలాయన ప్రవర్తన చిరాకు కలిగిస్తుంది. కాని క్రమంగా ఇద్దరూ దగ్గరవుతారు. కొన్నాళ్ళకి మళ్ళీ కూతురు వస్తుంది. తండ్రి ధోరణి చూసి మళ్ళీ కోపగించుకుంటుంది. కాని క్రమంగా అర్థం చేసుకుంటుంది. ముసలాయన కూడా తన ధోరణి తప్పు అని తెలుసుకుంటాడు. ఆప్యాయంగా కూతుర్ని దగ్గరకు తీసుకుంటాడు.

వృద్ధ దంపతులుగా హెన్రీఫాండా, కేథరిన్ హెబ్బర్న్ ఎంత గొప్పగా నటించారంటే - సినిమా చూస్తే ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు వారితో తాదాత్మ్యం చెంది, తాము కూడా వృద్ధులై పోయినట్లుగా అనుభూతి పొందుతారు. చివరికి ముసలాయనకి గుండెపోటు వచ్చినప్పుడు ఆ గుండె పోటు మనకే వచ్చినట్లు అనిపిస్తుంది. భర్త కోసం ముసలావిడ ఆందోళన పడుతూ, వణికిపోతుంటే ఆమె ఆందోళన అంతా మనం అనుభవిస్తాము.

ఇందులో ఫొటోగ్రఫీ-సెల్యూలాయిడ్ పై కెమెరాతో రచించిన గొప్ప కవిత్వంలా అనిపిస్తుంది. మొత్తం కథ అంతా ఒక సుందర సరోవర ప్రాంతంలో జరుగుతుంది. ఛాయాగ్రాహకుడు, నటీనటుల హావభావాలను-ప్రేక్షకులకు తాదాత్మ్యత కలిగేటట్లు-ఎంత గొప్పగా చిత్రీకరించాడో ఆ సరోవర దృశ్యాలనూ అంత గొప్పగా చిత్రీకరించాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, చీకటిలో, వెన్నెలలో సరోవరానికి ఎన్ని మూడ్స్ ఉంటాయో, ఏమూడ్ లో అది ఎలా ఉంటుందో అద్భుతంగా చిత్రీకరించాడు.

కళా హృదయం గల ప్రతి వ్యక్తీ తప్పక చూడవలసిన చిత్రం 'ఆన్ గోల్డెన్ పాండ్'.

నండూరి పార్థసారథి
(1985 అక్టోబరు 21వ తేదీన ఆంధ్రప్రభ బెంగళూరు ఎడిషన్ లో ప్రచురితమయింది.)

Previous Post Next Post