మొన్న శనివారం రాత్రి నగరంలో 'షెహనాయ్ నవాజ్ బిస్మిల్లాఖాన్ కచేరీ జరిగింది. ఖాన్ సాహెబ్ సుమారు గంటసేపు మధుర స్వరార్ణవంలో రసహృదయాలను ముంచి ఎత్తిన తరవాత విరామ సమయంలో ముఖ్యమంత్రి వేదిక ఎక్కి ఉస్తాద్ గళసీమను పూలమాలతో అలంకరించి, ఆయన కళాప్రతిభకు నీరాజనాలర్పించారు. ముఖ్యమంత్రి ప్రసంగించిన తరవాత సంగీత సభా నిర్వాహకులు ఖాన్ సాహెబ్ తో "మీరు కూడా ఏమైనా చెప్పదలచుకొంటే చెప్పవచ్చు" అని అన్నారు. షెహనాయ్ కా షెహన్ షా చిరు నవ్వుతో "మై జోకుఛ్ కెహనా చాహతాహు, వో షెహనాయీసే కెహతాహుఁ" ('నేను చెప్పదలచుకున్న దానిని షెహనాయ్ తోనే చెబుతున్నాను') అన్నారు. రసికులు కరతాళధ్వనులతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

ఆయన మాటలకు ఎంత లోతైన అర్థం ఉన్నది! ఆకాశమంతటి విస్తృతము, సముద్రమంతటి గంభీరము అయిన తన కళా హృదయంలోని అనంతకోటి భావ తరంగాలను మధుస్వనాలుగా షెహనాయి ద్వారా ఒలికించగల సంగీత సమ్రాట్టుకు మాటలతో పని ఏమిటి? ఆయన భావాలు మాటలకు ఒదుగుతాయా? ఆయన ఊహల అందాలను అందుకోగల తాహతు మాటలకు ఉన్నాదా? ఆయన భాషకు అక్షరాలు ఏడే-సరిగమపదని. ఈ ఏడక్షరాలతోనే ఆయన కవితలల్లుతారు, మహాకావ్యాలు రచిస్తారు. ఆయన లేఖిని షెహనాయి. ఆయన తన సప్తాక్షరీ సారస్వతోద్యానంలో, చిత్ర విచిత్ర రాగ ప్రసూనాల పరిమళాలతో అసంఖ్యాక రసపిపాసువులను రంజింపజేశారు.

ఉస్తాద్ బిస్మిల్లా 'పూర్వీ' రాగంలో కచేరీ ప్రారంభించారు. హిందూస్థానీ సంగీత సంప్రదాయంలోని పది జనక రాగాలలో ఒకటైన ఈ సంపూర్ణ రాగం వసంత ఋతువుకు-అందునా వసంత రాత్రికి-తగిన రాగం. ఖాన్ సాహెబ్ ఈ రాగంతో హేమంత శీత రాత్రిలో వసంత ఋతు శోభను ఆవిష్కరించారు. చాలామంది విద్వాంసుల వలె బిస్మిల్లా రాగంతో తాదాత్మ్యం పొందడానికి ఎక్కువ వ్యవధి తీసుకోరు. తన హృదయం నుంచి తొలి స్వరాన్ని షెహనాయి హృదయంలోకి పూరిస్తూనే ఆయన రాగ భావమగ్నులవుతారు. 'పూర్వీ' రాగంలో 'గత్'ను ఆయన దాదాపు గంటసేపు అద్భుతంగా వాయించారు. షెహనాయిపై ఆయనను అనుసరించిన ఇద్దరు యువకులూ రాగ సౌందర్యానికి మరింత దోహదం చేశారు. తమ గురువు పట్ల ఎంతో గౌరవంతో, భక్తితో ఆయన అతి సున్నితంగా, శ్రోతృ హృదయంతో రహస్యాలు చెబుతున్నంత లలితంగా వాయిస్తున్నప్పుడు తాము వెనుకకు తగ్గుతూ, ఆయన ఉల్లాసంగా, విలాసంగా వాయిస్తున్నప్పుడు ఆయనతో పాటు వాయిస్తూ, ఆయన అవకాశమిచ్చినప్పుడు తమ రాగరంజిత భావాలను నివేదనచేస్తూ రసికులకు అపురూపమైన అనుభవాన్ని ప్రసాదించారు. బిస్మిల్లా కుమారుడు తబ్లాపై గొప్ప ప్రావీణ్యం ప్రదర్శించి శ్రోతల ప్రశంసలందుకున్నాడు.

'పూర్వీ' గత్ తరవాత ఖాన్ సాహెబ్ పూర్వీధున్ పది నిముషాల సేపు వాయించారు. ఇది అంతకు ముందు వాయించిన రాగం వలె గంభీరమైనది కాదు. 'పూర్వీ' (పూరబీ) ధున్ అంటే తూర్పు ప్రాంతపు గీతం అని అర్థం. 'పూర్వీ' రాగానికీ దీనికీ సంబంధం లేదు. మిశ్ర తిలక్ కామోద్ రాగాన్ని ఆధారంగా చేసుకొని, మరికొన్ని ఇతర రాగాల ఛాయలను మిళితం చేయిస్తూ శృంగార రస ప్రతిపాదకంగా ఈ ధున్ ను వినిపించారు.

విరామానంతరం ఖాన్ సాహెబ్ 'దుర్గా' రాగంలో 'గత్' ను, 'మారు బేహాగ్' గత్ ను ఒక 'కజరీ'ని వాయించి, మిశ్ర శివరంజని ఠుమ్రీతో కచేరీని ముగించారు. వీటి నన్నింటిని ఆయన అయిదేసి, పదేసి నిమిషాలసేపు మాత్రమే వాయించారు. మామూలుగా ఒక్కొక్క రాగాన్ని గంట సేపు వాయించే బిస్మిల్లా ఇన్ని రాగాలను క్లుప్తంగా ముగించడం సంగీత ప్రియులకు కొంత ఆశాభంగం కలిగించింది. విరామకాలాన్ని తీసివేస్తే మొత్తం కచేరీ రెండు గంటల్లో ముగిసింది. అయినా ఆయన సంగీత మాధుర్యం శ్రోతలను పరవశింప చేసింది. చివరకు వాయించిన 'కజరీ' (జానపద శైలిలో ఉండే తేలిక రకం రచన), ఠుమ్రీ మరీ మధురంగా ఉన్నాయి. కజరీలో ఆయన 'పహాడీ', 'హంస ధ్వని', 'కౌశీధాని' వంటి పెక్కు రాగాలను మనోహరంగా పొదిగారు. చివరి 'మిశ్ర శివరంజని' వియోగంలోని విషాదాన్ని, మధురిమను మళ్లీమళ్లీ జ్ఞాపకం చేసేదిగా రసికుల మనస్సుల్లో మిగిలిపోతుంది.

నండూరి పార్థసారథి
(1978 డిసెంబర్ 23వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post Next Post