Title Picture

అనగనగా పూర్వం మగధ దేశాన్ని సిద్ధోదనుడనే ఒక రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు లేక లేక ఒక కొడుకు పుట్టాడు. కొడుక్కి శుద్ధార్థుడని రాజు పేరు పెట్టాడు. శుద్ధార్ధుడు పుట్టిన సమయంలో జ్యోతిష్యులు జాతకం చూసి "రాజా! నీ కొడుకు నీకు దక్కాలంటే బయటి ప్రపంచాన్ని చూడనివ్వకు" అని చెప్పారు.

రాజు తనకు లేకలేక పుట్టిన కొడుకు ఎక్కడ తనకు దక్కకుండా పోతాడో అని అతి జాగ్రత్తగా, గారాబంగా పెంచాడు. చంద్రభవనమనే మేడ కట్టించి అందులోనే శుద్ధార్థుడిని ఉంచాడు. అతనికి సమస్త విద్యలూ, శాస్త్రాలూ నేర్పించాడు. బయటికి మాత్రం వెళ్లనీకుండా ఎప్పుడూ మేడ బయట భటులను కాపలా వుంచాడు.

చంద్రభవనం చాల అందమైన మేడ. సూర్యుడు నడి ఆకాశాన వున్నప్పుడు తళతళలాడుతూ కళ్లు మిరిమిట్లు గొలిపేది. వెన్నెల వేళ పాలరాతి గోడలు నిగనిగలాడుతూ, వెన్నెల అనే సముద్రంలో తేలుతూ ఊగుతూ పోయే వెండి పడవలాగా ఉండేది. ఆ మేడలో రాజకుమారుడికి అనేక భోగాలూ, భాగ్యాలూ ఉన్నాయి. మేడచుట్టూ విశాలమైన తోటలు, వాటిల్లో హంసలు యీదే సరస్సులు, పాటలుపాడే కోయిలలు, అందమైన చెట్లూ, పువ్వులు ఉండేవి. రాజకుమారుడికి ఎటుచూసినా ఎంతో అందం కనిపించేది.

ఇంత సుఖమైన ప్రదేశంలో శుద్ధార్థుడు ఇరవై ఏళ్లపాటు పెరిగాడు. ఇన్నేళ్లలోనూ అతడు తన నివాస భవనమూ, దానినానుకుని ఉన్న తన తల్లిదండ్రులు ఉండే రాజభవనమూ తప్ప మరొక చోటికి పోలేదు. ఎప్పుడైనా నౌకర్లను పిలిచి "దీనికవతల ఏముంది?" అని అడిగితే "ఇదే ప్రపంచమంతా, ఇంతకంటే మరేమీ లేదు" అని చెప్పేవారు.

కాని శుద్ధార్ధుడికి అనుమానం బలపడింది. "నిజంగా ఈ అందమైన తోటలకవతల ఏదో మరోరకమైన ప్రపంచం ఉండితీరాలి. నేను చదివిన పుస్తకాలన్నీ మరో ప్రపంచాన్ని గూర్చి చెపుతున్నాయి. అదేదో కనుక్కోవాలి" అనుకున్నాడు.

అడవుల్లో హాయిగా, స్వేచ్ఛగా ఎగిరే చిలకను పట్టుకొని పంజరంలో పెడతారనుకోండి. ఆ పంజరం బంగారంతో చేసిందికావచ్చు. దానిలో అది చాలా సుఖంగానే ఉండవచ్చు. అయినా ఆ చిలకకెల్లా ఉంటుంది? పంజరం నుండి పారిపోయి, విశాలమైన నీలి ఆకాశంలో పచ్చని రెక్కలు విప్పి పల్టీలుకొడుతూ ఎగరాలనీ, తనంతట తాను జామపళ్లు వెతుక్కుని తినాలని ఉండదూ? అల్లాగే అయింది రాజకుమారిడికి. ఎప్పుడూ సుఖంగా ఇంట్లోనే వుంటే విసుగుపుట్టదూ? అతనికి బయటకు వెళ్లాలనిపించింది. కాని ఎల్లాగ? తండ్రి ఆజ్ఞలవల్ల సేవకులెవ్వరూ అతన్ని బయటికి పోనివ్వరు. అందుకని ఒకరోజు అర్థరాత్రి అతడేం చేశాడంటే, మాసిన బట్టలు కట్టుకుని, నౌకరులాగా వేషం వేసుకుని, ఎవ్వరూ చూడకుండా ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్లిపోయాడు.

అలా పోగా, పోగా, కోటలు, నదులు, వాగులు, పొలాలు దాటి పోయేసరికి ఒక పల్లెటూరు చేరుకున్నాడు రాజకుమారుడు. అతనికి అంతా కొత్తగా కనిపించింది. తను మామూలుగా చూసే మనుషుల మాదిరిగా లేరు ఆ ఊరి వాళ్లు. వాళ్ల బట్టలు తను కట్టుకునే వాటి మాదిరిగా లేవు. వాళ్ల ఇళ్లు తన చంద్రభవనంలాగా లేవు.

ఆ వూళ్లో ఎక్కడ చూసినా కూలిపోతున్న పూరి గుడిసెలు, ముఖాన కళా, కాంతీ సంతోషమూ లేని మనుషులూ, మడ్డి ఓడుతూ చిరిగిన బట్టలు కట్టుకుని మట్టిలో పొర్లాడే పిల్లలు, ఊరంతా చెత్త, నానా అసహ్యం.

శుద్ధార్ధుడు ఒక గ్రామస్థుడిని పిలిచి అడిగాడు.

"ఏ ఊరిది?"

"ఆనందపురం"

"ఆనందపురమా? ఈవూళ్లో ఎక్కడా ఆనందమే కనిపించటం లేదేం?" అన్నాడు రాజకుమారుడు.

"కనిపించకేం. ఈ ఊళ్లోకల్లా బాగా ధనవంతుడైన ఆ వైశ్యుని యింట్లో అంతా ఆనందమే" అన్నాడు గ్రామస్థుడు.

శుద్ధార్ధుడు ఆ గ్రామస్థుడినడిగి ఇంకా బోలెడు విషయాలు తెలుసుకున్నాడు. ఆ గ్రామం తన తండ్రి పాలించే మగధ రాజ్యంలోనిదే. అల్లాంటి గ్రామాలు ఇంకా బోలెడున్నాయి. మగధరాజ్యం లాంటి రాజ్యాలు ప్రపంచంలో అనేకమున్నాయి. రాజులు, మంత్రులు, సేనాపతులు, సామంతులు, వైశ్యులు, పురోహితులు ఇల్లాంటి వారంతా ధనధాన్యాలతో తులతూగుతూ వుంటారు. ప్రజలు పొలాలు దున్ని పంట పండిస్తారు. బట్టలు నేస్తారు, మేడలు కడతారు. గనుల్లోంచి బంగారం, సముద్రాల్లో రత్నాలు ఏరి తెస్తారు. కాని అవన్నీ అనుభవించేది రాజులు, రాణులు, సామంతులు మొదలైన వాళ్లు. పాపం ఇంత కష్టపడి పనిచేసిన బీదవాళ్లకి తినటానికి తిండి, కట్టుకోడానికి బట్ట, ఉంటానికి యిల్లు ఉండవు. వాళ్ల పిల్లలికి మంచి మంచి బట్టలు కట్టుకోవాలని, మిఠాయి, లడ్డూలు తినాలనీ పెద్ద చదువు చదవుకోవాలని ఉంటుంది. కాని బీదవాళ్లకి ఇవన్నీ ఎక్కడినించి వస్తాయి? పైగా వేదాలు అవీ చదువుకున్న పండితులు ఏమంటారంటే "ఇదంతా వాళ్ల ఖర్మ. పూర్వ జన్మలో వాళ్లు ఏం పాపం చేసుకున్నారో ఈ జన్మలో బీదవాళ్లయ్యారు" అంటారు.

రాజకుమారుడు చాలా తెలివైనవాడు, మంచివాడు. కనుక రాజులు చేసే అన్యాయాన్ని, ప్రజలు పడే బాధలని అర్థం చేసుకున్నాడు. "ఇదంతా ఖర్మ" అని పండితులు చెప్పే మాటలు పచ్చి మోసం అనుకున్నాడు. ఏమో పూర్వజన్మలో ఎవరేం చేశారో ఎవరికి తెలుస్తుంది? అసలు పూర్వజన్మ అనేది వుందని ఈ పండితులకెల్లా తెలుసు? వీళ్లంతా రాజుల సొమ్ము తిని, ప్రజలను మోసం చెయ్యటానికి ఈ స్వర్గం, నరకం, దేవుడు, ఖర్మ యిల్లాంటివన్నీ కల్పించారు. ప్రజలని బీదవాళ్లుగాను, రాజుల్ని ధనవంతులుగాను ఉంచటానికి పండితులు కల్పించారివన్నీ అనుకున్నాడు శుద్ధార్ధుడు.

అప్పుడు శుద్ధార్థుడికెంతో దుఃఖం కలిగింది. "అయ్యో, ప్రపంచంలో ఎంతోమంది కష్టాలు, అన్యాయాలూ పడుతున్నారే, వీళ్లని ఎట్లా ఉద్ధరించటం"? అని విచారించాడు. ఇక అప్పటినించీ పదేళ్లపాటు ప్రపంచమంతా తిరిగాడు. ఎన్నోదేశాలు, రాజ్యాలు చూశాడు. ఎక్కడ చూసినా తన తండ్రి రాజ్యంలోలాగే దుఃఖం, బీదతనం, అన్యాయం కనిపించింది.

చివరికి శుద్ధార్థుడు మళ్లీ మగధ దేశం వచ్చాడు. ఊరూరూ తిరిగి ప్రజలందరికీ ధైర్యం చెప్పాడు.

"మీరు భయపడకండి. మీరు పడే కష్టాలకు, దరిద్రానికి కారణం మీ పాపాలుకాదు, రాజులు చేసే పాపాలు. మీరు కష్టపడి పంటలు పండిస్తుంటే రాజులు అనుభవిస్తున్నారు. ఈ అన్యాయాన్ని ఎదిరించండి. దేవుడి పేరు చెప్పి రాజులు మిమ్మల్ని బీదవాళ్లని చేశారు. మీ కష్టాలన్నిటికీ కారణం మీ బీదతనమే. ఆ బీదతనాన్ని పొగొట్టాలంటే మీరు రాజులమీద ఎదురుతిరగండి" అని ఉపన్యాసాలిచ్చాడు.

ప్రజలందరూ ఈ ఉపన్యాసాలు విన్నారు. అంతకు ముందు వాళ్లేమనుకున్నారంటే తమ దుఃఖాలకి కారణం తమ పాపాలని. శుద్ధార్ధుడు చెప్పిన మాటలతో వాళ్లు ధైర్యం తెచ్చుకున్నారు. వాళ్లకి ఆ మాటలు నచ్చాయి. దుఃఖానికి కారణం బీదతనమని అంతకు ముందెవ్వరూ చెప్పలేదు. మొదటిసారిగా శుద్ధార్ధుడే ఈ సత్యం కనిపెట్టాడు. అందుచేత దేశంలోని ప్రజలంతా అతన్ని 'బుద్ధుడు' అని పిలవసాగారు.

శుద్ధార్ధుడు, కాదు, ఇక నుండి ఆయన్ని బుద్ధుడని పిలుద్దాం. బుద్ధుడు మగధ దేశంలో ఊరూరూ తిరిగి ప్రజలకి తాను కనుక్కున్న సత్యం తెలియజేశాడు. ప్రజలు బుద్ధుని శిష్యులయ్యారు. ఆయన ఉపదేశాలని ఆచరణలో పెట్టటానికి సిద్ధపడ్డారు.

మగధదేశపు రాజు సిద్ధోదనుడికి ఈ సంగతి తెలిసింది. ఎవరో బుద్ధుడట, ప్రజలనందరినీ రాజు మీద ఎదురు తిరగమని చెబుతున్నాడట, అని ఆయన విన్నాడు. అంతేగాని ఆ బుద్ధుడు తను ఎంతో గారాబంగా పెంచిన తన కొడుకేనని ఆయనకు తెలియలేదు. ఆ బుద్ధుడిని, అతనికి శిష్యులుగా తయారై తన మీద కత్తులు నూరుతున్న ప్రజలని చంపివెయ్యాలని సిద్ధోదనుడు అనుకున్నాడు.

చివరికి పెద్ద యుద్ధం జరిగింది. కష్టపడి పని చేసే ప్రజలు, మిగతా బీదవాళ్లు అంతా బుద్ధుడివైపు చేరారు. డబ్బు గలవాళ్లంతా సిద్ధోదనుడివైపు చేరారు. ఆ యుద్ధంలో అటు బుద్ధుడు, ఇటు సిద్ధోదనుడు స్వయంగా వచ్చి పోట్లాడారు. బుద్ధుడు మారువేషంలో ఉండటం వల్ల సిద్ధోదనుడు అతన్ని తన కొడుకేనని గ్రహించలేకపోయాడు. సిద్ధోదనుడు వేసిన బాణం ఒకటి బుద్ధుడి గుండెలో గుచ్చుకుంది. బుద్ధుడు పడిపోయాడు.

అప్పుడు రాజు సైనికులు బుద్ధుడిని సిద్ధోదనుడి వద్దకు తీసుకువచ్చారు. కొన ఊపిరితో ఉన్న బుద్ధుడు రాజుతో ఇట్లా చెప్పాడు.

"రాజా! నేనెవరో గుర్తుపట్టావా? పదేళ్లకిందట నీ ఇల్లు విడిచిపోయాను. నువ్వు ఎంతో గారాబంగా పెంచిన నీ కుమారుణ్ణి నేను. నీ యింటిని నాకు ఖైదులాగా చేశావు. అందుకనే నేను ఇల్లు వదిలివెళ్లి పోయాను. నేను ప్రపంచంలోకి వెళ్లిచూశాను. ఆ ప్రపంచాన్ని నువ్వు, నీలాంటి వాళ్లు అంతకంటే పెద్ద ఖైదుగా చేశారు. ఆ ఖైదులో బాధ పడుతున్న ప్రజలని ఉద్ధరించటానికి నేను కంకణం కట్టుకున్నాను. అందుకే తండ్రివైన నీతోకూడా నేను యుద్ధం చేశాను. యుద్ధంలో గెలవకుండానే చనిపోతున్నాననే నా బెంగ" అని చెప్పి బుద్ధుడు ప్రాణాలు విడిచాడు.

బుద్ధుడు తన కొడుకేనని తెలిసి రాజు వలవల ఏడ్చాడు. ప్రజలు తమ నాయకుడైన బుద్ధుడు రాజు కొడుకేనని తెలిసి ఎంతో ఆశ్చర్యపడి ఆయన చనిపోయినందుకు ఎంతో దుఃఖం పొందారు. అప్పుడు సిద్ధోదనుడికి జ్ఞానోదయమైంది. అతడు తన రాజరికాన్ని త్యజించివేశాడు. ప్రజలందరికీ తను కూడబెట్టిన డబ్బు పంచియిచ్చాడు. అందరికీ పొలాలు పంచిపెట్టాడు. తనుకూడా ప్రజల్లో ఒకడై, తను కష్టపడిపండించినదే అనుభవిస్తూ జీవించాడు.

ఇక ఆ రాజ్యంలో ఎవరూ కూడా చీకూచింతా లేకుండా కష్టపడి పనిచేస్తూ ఎక్కువ తక్కువలు లేకుండా సంపదను సమానంగా అనుభవిస్తూ ఒకరి కష్టసుఖాలను ఒకళ్లు పంచుకుంటూ జీవించారు.

నండూరి రామమోహనరావు
(May 9, 1951 ఆంధ్ర సచిత్ర వారప్రతికలో ప్రచురితమైనది)

Previous Post Next Post