ఎందరో మహానుభావులు... కొందరు మహామహానుభావులు. వైదిక మత వాస్తవ స్వరూపాన్ని, హైందవ సంస్కృతి ఔన్నత్యాన్ని, భారతీయాత్మను యావత్ర్పపంచానికి ఎరుక పరచిన యుగపురుషుడు వివేకానందుడు. సంగీతం, సాహిత్యం, నృత్యం, నాటకం, శిల్పం, చిత్రలేఖనం... అన్నింటిలో అపూర్వ శైలితో ఒక ప్రత్యేక కళాప్రపంచాన్నే సృష్టించి, భారతీయ సంస్కృతికి నైవేద్యమిచ్చినవాడు గురుదేవుడు రవీంద్రుడు. చలన చిత్ర ప్రపంచ పటంలో భారతదేశాని కొక ఉన్నత గౌరవ స్థానం కల్పించి, తన వినూతన కళా ప్రతిభతో అగ్రశ్రేణి దర్శకుల ఆరాధన లందుకున్న శకపురుషుడు సత్యజిత్ రాయ్. సంగీత మంటే తమదేననే సంకుచితాభిమానంతో అన్యుల సంగీతాన్ని అవహేళన చేసే పాశ్చాత్యులకు భారతీయ సంగీత సౌందర్య సాక్షాత్కారంతో కనువిప్పు కలిగించి, భారతీయ సంగీతం సాటి లేనిదని అంగీకరింపజేసిన సంగీత ప్రబోధకుడు పండిత్ రవిశంకర్. వీరందరూ చరిత్రను సృష్టించిన వారు-కారణజన్ములు.

పాశ్చాత్య దేశాలలో భారతీయ సంగీత ప్రచారగాథ ఇంచుమించు రవిశంకర్ ఆత్మకథగా కనుపిస్తుంది. ఆయన పుట్టిన సంవత్సరం (1920)లోనే ఆయన అన్న గారు జగద్విఖ్యాత నాట్యకారుడు ఉదయశంకర్ భారతీయ నృత్య సంగీతాలను ప్రప్రథమంగా పాశ్చాత్య ప్రపంచంలో ప్రవేశపెట్టారు. అన్నగారు ప్రారంభించిన దిగ్విజయ యాత్రను తమ్ముడు పూర్తి చేశాడు.

రవిశంకర్ 1920 ఏప్రిల్ 7వ తేదీని కాశీ క్షేత్రంలో ఒక బెంగాలీ బ్రాహ్మణ పండిత కుటుంబంలో నలుగురు మగ పిల్లల తరవాత కడసారి బిడ్డడుగా జన్మించారు.

రవిశంకర్ జీవితమే ఒక మహోద్యమం. అందరాని ఆకాశవీథులలో అమరవాహినిగా సాగిపోయే శాస్త్రీయ సంగీతాన్ని భూమికి దించి, సామాన్య ప్రజా హృదయ క్షేత్రాలపై ప్రవహింపజేయడం, ప్రాక్పశ్చిమ సంగీత స్నేహ వారధిని నిర్మించడం ఆయన ఉద్యమ లక్ష్యాలు. షష్టి పూర్తి నాటికి ఈ రెండు లక్ష్యాలూ నెరవేరాయి.

మన దేశంలో, మన తరంలో అంతటి సంగీత విద్వాంసుడు లేడని ప్రశంసించడం చరిత్రలో ఆయన స్థానాన్ని తక్కువగా అంచనా వేయడమే అవుతుంది. దేశ కాలావధులకు అతీతంగా ప్రస్తుతించజదిన అరుదైన అద్భుతవ్యక్తి ఆయన. హిందూస్థానీ వాద్య సంగీత పరిణామ చరిత్రలో రవిశంకర్ ఆవిర్భావంతో ఒక నూతనాధ్యాయం ఆరంభమయింది. అమీర్ ఖుస్రూ, స్వామి హరిదాస్, తాన్ సేన్, సదారంగ్, అదారంగ్, కరీంఖాన్, భాత్ఖండే, విష్ణు దిగంబర్, అల్లా ఉద్దీన్ ఖాన్, బడే గులాం అలీఖాన్ లతో సమానమైన స్థానం చరిత్రలో ఆయనకు లభిస్తుంది.

త్యాగరాజు, తాన్ సేన్ వంటి మహా గాయకుల గొప్పతనం గురించి ఎన్నో కథలు వింటూ ఉంటాము, చదువుతూ ఉంటాము. వాటిలో కొన్ని కేవలం కట్టుకథలై ఉంటాయి. వారి సంగీతం గురించిన వర్ణనలలో తప్పకుండా కొన్ని అబద్ధాలూ, అతిశయోక్తులూ ఉండి ఉంటాయి. వెనకటి వారి గొప్పతనాన్ని కచ్చితంగా అంచనా కట్టడానికి తగిన ఆధారాలు దొరకనప్పుడు అతిశయోక్తులు చెలామణి అవుతూ ఉంటాయి. త్యాగరాజ కీర్తనల వల్ల ఆయన వాగ్గేయకారుడుగా ఎంత గొప్పవాడో తెలుస్తుంది కాని, గాయకుడుగా ఎంత గొప్పవాడో తెలియదు. కారణం చెప్పనక్కరలేదు.

రేడియోలు, టేప్ రికార్డర్లు, స్టీరియో లాంగ్ ప్లే రికార్డుల పుణ్యమా అని ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సంగీతమైనా వినడానికి అవకాశం ఉన్న ఈ కాలంలో అటువంటి అతిశయోక్తులకూ, కట్టుకథలకూ ఆస్కారం లేదు. ఫలాని రికార్డులోని సంగీతం మహాద్భుతమని ఎవరైనా వర్ణిస్తే ఆ వర్ణనలోని నిజానిజాలను రికార్డు విని తేల్చుకోవచ్చు. రవిశంకర్ విలువను-కట్టుకథ లేమీ అవసరం లేకుండానే - ఆయన రికార్డుల ద్వారా భావితరాల వారు తెలుసుకోగలరు.

బహుముఖ ప్రజ్ఞ

హిందూస్థానీ వాద్య సంగీతంలో రవిశంకర్ ను అద్వితీయుడనడానికి వీలులేదు. ప్రతిభలో, విద్యత్తుల్లో, ప్రావీణ్యంలో ఆయనతో సమానమైన వారు ఇప్పుడు కనీసం ముగ్గురు ఉన్నారు - ఉస్తాద్ విలాయత్ ఖాన్ (సితార్), ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ (షెహనాయి), ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ (సరోద్). సితార్ కు సంబంధించినంతవరకు విలాయత్ ఖాన్ ను ఆయన కంటే పై మెట్టు మీద నిలబెట్టే వారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. అయినా, వారెవరికీ లేని కొన్ని ప్రత్యేకతలు రవి శంకర్ కు ఉన్నాయి. ఇప్పటి సంగీత విద్వాంసులలో ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి మరొకరు లేరు. ఆయన గొప్ప సంగీత దర్శకుడు, బోధకుడు, ప్రచారకుడు, నిత్య నూతన ప్రయోగశీలి. ఆయన పెక్కు నృత్య రూపకాలకు, సినిమాలకు సంగీతం సమకూర్చారు. ఆకాశవాణి జాతీయ వాద్యబృందం తొలి దర్శకుడుగా ఆయన ఆర్కెస్ట్రేషన్ లో ఎన్నో అపూర్వ ప్రయోగాలు చేశారు. ఉత్తమ సంగీత దర్శకుడుగా అంతర్జాతీయ బహుమతులందుకున్నారు. తన సంగీతంతో పాశ్చాత్య సంగీత విద్వాంసులను ఆకర్షించి, భారతీయ సంగీత వైశిష్ట్యాన్ని వారికి బోధపరిచి, వారితో కలిసి కచేరీలు చేశారు. హిందూస్థానీ సంగీతాన్ని గురించి బొత్తిగా ఏమీ తెలియని వారికి అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లుగా తేలిక మాటలతో తెలియజెప్పడంలో ఆయనను మించిన వారు లేరు. వ్యాసాలూ, పుస్తకాలూ కూడా అంతే తేలిక మాటలతో సునాయాసంగా రాస్తారు ఆయన. స్వదేశంలోనూ, విదేశాలలోనూ కూడా ప్రజా బహుళ్యాన్ని ఆయన ఆకట్టుకున్నంతగా మరెవ్వరూ ఆకట్టుకోలేకపోయారు. సామాన్యులను ఆకర్షించడానికి అవసరమైన చమక్కులు ఆయనకు బాగా తెలుసు.

రవిశంకర్ సుందర రూపంకూడా శ్రోతల కొక ఆకర్షణ. ఆయన కచేరీ వినముచ్చటగానే కాక, చూడ ముచ్చటగా కూడా ఉంటుంది. షష్టిపూర్తి చేసుకున్నా ఇప్పటికీ ఆయనకున్న గ్లామర్ సంగీత ప్రపంచంలో మరెవ్వరికీ లేదు. ఆయనకు వచ్చినన్ని అవకాశాలూ, పబ్లిసిటీ కూడా మరెవ్వరికీ రాలేదు. కలుపుగోలుతనం, చొరవ, నిరాడంబర స్వభావం, అచంచల ఆత్మ విశ్వాసం, సంస్కారం, మాటలో మెత్తదనం, స్నేహశీలం, సహనం, దీక్ష, వైవిద్యపూర్ణమైన జీవితానుభవం, నిత్యనూతనోత్సాహం, సుదూర, సువిశాల దృష్టి-ఇవన్నీ ఆయన విజయ రహస్యాలు.

రవిశంకరాభరణం

సితార్ అనగానే అందరికీ ముందుగా మదిలో మెదిలేది - నిమీలిత నేత్రాలతో సీరియస్ గా సితార్ వాయించే రవిశంకర్ రూపమే. గాంధీ టోపీ లేని నెహ్రూను ఊహించుకోలేనట్లే సితార్ లేని రవిశంకర్ ను కూడా ఊహించుకోలేము. సితార్ రవిశంకర్ జీవితంలోనే కాదు-శరీరంలో కూడా భాగమైపోయినట్లుగా కనుపిస్తుంది. సితార్, రవిశంకర్-రెండూ పర్యాయ పదాలైపోయాయి. శ్రీకృష్ణుడు మురళీకృష్ణుడైనట్లు రవిశంకర్ సితార్ శంకర్ అయినారు. మురళి కృష్ణాభరణం అయితే, సితార్ రవి శంకరాభరణం.

రవిశంకర్ కృషిలో మరొక ప్రముఖాంశం కొత్త రాగాలను సృష్టించడం. ఈ శతాబ్దంలో కొత్త రాగాలను సృష్టించిన ప్రముఖులు నలుగురు - అల్లా ఉద్దీన్ ఖాన్, పన్నాలాల్ ఘోష్, రవిశంకర్, అలీ అక్బర్ ఖాన్. వీరికి శిష్యులు, ఏకలవ్య శిష్యులు, అభిమానులు లెక్కకు మిక్కిలిగా ఉండడం వల్ల వీరి రాగాలకు సంగీత సభలలో విశేష ప్రచారం లభించింది. వీరి రాగాలలో కొన్ని ప్రాచీన రాగాలతో సమానంగా ప్రసిద్ధమైనాయి. వీరందరిలో ఎక్కువ రాగాలు సృష్టించిన వారు అల్లా ఉద్దీన్ ఖాన్. తరువాత రవిశంకర్.

రసియా, అహీర్ లలిత్, తిలక్ శ్యామ్, నటభైరవ్, బైరాగి, కామేశ్వరి, పరమేశ్వరి, గంగేశ్వరి, రంగేశ్వరి, జోగేశ్వరి, వసంత పంచమ్-ఇవి రవిశంకర్ సృష్టించిన రాగాలలో ప్రముఖమైనవి. హంసధ్వని, వాచస్పతి, చారుకేశి, కీరవాణి, సింహేంద్రమధ్యమ్, మలయ మారుతం వంటి ప్రసిద్ధ కర్ణాటక రాగాలను హిందూస్థానీ సంగీతంలో ప్రవేశపెట్టి ప్రచారం చేసిన ఘనత కూడా ఆయనదే. ఆయన చూపిన మార్గంలో ఇంకా అనేకులు కర్ణాటక సంప్రదాయంలోని అనేక ఇతర రాగాలను హిందూస్థానీ సంగీత సామ్రాజ్యంలో ప్రవేశపెట్టారు. అలాగే రవి శంకర్ ప్రభావంతో అనేక హిందూస్థానీ రాగాలు కర్ణాటక సంగీతంలో లీనమైపోయాయి. ఈ విధంగా ఆయన హిందూస్థానీ, కర్ణాటక సంగీతాల మధ్య వారధి నిర్మించారు.

పశ్చిమ జైత్రయాత్ర

యెహూదీ మెనూహిన్, రవిశంకర్
రవిశంకర్ పశ్చిమ జైత్రయాత్ర 1956లో ప్రారంభమయింది. విశ్వవిఖ్యాత వయొలిన్ విద్వాంసుడు యెహూదీ మెనూహిన్ ప్రప్రథమంగా రవిశంకర్ ను పాశ్చాత్య శ్రోతలకు పరిచయం చేశారు. అప్పటినుంచి ఈ పాతికేళ్ళ కాలంలో ప్రపంచంలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ రవిశంకర్ కచేరీలు చేశారు. 1963లో అమెరికన్ జాజ్ కళాకారులతో కలిసి ఒక రికార్డు ఇచ్చారు. 1966లో బాత్ అంతర్జాతీయ సంగీతోత్సవంలోనూ, 1967లో ఐక్యరాజ్య సమితిలోనూ మెనూహిన్ తో కలిసి కచేరీలు చేశారు. ఆ కచేరీలు 'వెస్ట్ మీట్స్ ఈస్ట్' శీర్షికతో రెండు రికార్డులుగా విడుదలైనాయి. 'వెస్ట్ మీట్స్ ఈస్ట్' మూడవ రికార్డు రెండు సంవత్సరాల క్రిందట విడుదల అయింది. అందులో మోనూహిన్ తోనేకాక, ఒక ఫ్రెంచి ప్లూట్ విద్వాంసునితోనూ, ఒక హార్ప్ వాద్య ప్రవీణురాలితోనూ కూడా కలిసి ఆయన జుగల్ బందీలు వాయించారు. 1971లో లండన్ సింఫనీ ఆర్కెస్ట్రాతో కలిసి కచేరీ చేశారు. అదీ ఒక ఎల్.పి.గా విడుదలయింది. జపాన్ కళాకారులతో కలిసి ఆయన ఇచ్చిన 'ఈస్ట్ గ్రీట్స్ ఈస్ట్' రికార్డు క్రిందటి సంవత్సరం వెలువడింది. ఆర్కెస్ట్రేషన్ లో ఆయన ప్రతిభకు పరాకాష్ట అనదగిన 'జాజ్ మైన్' రికార్డు తాజాగా క్రిందటి నెలలోనే విడుదల అయింది. ఈ రికార్డులన్నీ రవిశంకర్ దిగ్విజయ యాత్రలోనూ, ప్రాక్పశ్చిమ సంగీత మైత్రీ చరిత్రలోనూ కూడా ప్రధాన ఘట్టాలవంటివి. షష్టిపూర్తి సంవత్సరంలో ఆయన అందుకున్న 'పద్మ విభూషణ్' అవార్డు ఆయన కీర్తి కిరీటంలో కలికితురాయి. దేశం మొత్తం మీద ఇంతకు ముందు ఈ అవార్డు ఇద్దరు సంగీత విద్వాంసులకు మాత్రమే లభించింది. వారు-స్వర్గీయులు ఉస్తాద్ అల్లా ఉద్దీన్ ఖాన్, శ్రీమతి ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మి.

పండిత్ జీతో పావుగంట

షష్టిపూర్తి సందర్భంలో గత సంవత్సర కాలంలో రవిశంకర్ కు పెక్కు సన్మానాలు జరిగాయి. హైదరాబాద్ నగరంలో డిసెంబర్ 30వ తేదీని 'సుర్ మండల్' సంస్థ ఆధ్వర్యాన ఆయనకు ఘన సన్మానం జరిగింది. ఆ మరునాడు సాయంత్రం నాలుగు గంటల వేళ పండిత్ జీ బెంగుళూరుకు బయలుదేరి వెడుతూంటే విమానాశ్రమంలో హడావిడిగా ఒక పావుగంట సేపు సంభాషించే అవకాశం ఈ రచయితకు లభించింది. ఇంగ్లీషులో ముందుగా సిద్దం చేసుకున్న ప్రశ్నలు ఒక్కొక్కటేచదివి వినిపిస్తూంటే పండిత్ జీ క్లుప్తంగానే అయినా-అరమరికలు లేకుండా సమాధానాలిచ్చారు. చిరపరిచితుడైన స్నేహితునితో మాట్లాడినంత చనువుగా ఆయన మాట్లాడారు.

ప్రశ్న: మీరింక వారణాసిలో స్థిరపడినట్లేనా? అక్కడ మీరు నెలకొల్పుతున్న సంగీత సంస్థ గురించి, దాని కార్యకలాపాల గురించి, అక్కడ మీరు సాగించే పరిశోధనల గురించి తెలియజేస్తారా? మీరు విద్యార్థులకు ఇచ్చే శిక్షణ ఏవిధంగా ఉంటుంది?

జవాబు: వారణాసిలో భూమి సేకరించాను. చాలా విశాలమైన స్థలం. అక్కడే ఇల్లు కట్టుకున్నాను. మిగతా ఆవరణలో చిన్న చిన్న కుటీరాలు నిర్మించాలనుకుంటున్నాను. దానిని సంగీత పాఠశాల అని కాని, కళాశాల అని కాని, ఇన్ స్టిట్యూట్ అని కాని అనడం సరికాదు. అదొక ఆశ్రమంలాగా ఉంటుంది. ప్రాచీన భారతీయ సంప్రదాయ పద్ధతిలో దాని నొక గురుకులం లాగా తీర్చి దిద్దాలని నా సంకల్పం. మామూలు సంగీత పాఠశాలల్లో మాదిరిగా డజన్ల కొలది విద్యార్థులను చేర్చుకొనే ఉద్దేశం లేదు. ప్రతిభావంతులైన నలుగురైదుగురిని మాత్రమే ఎంచుకుంటాను. వారు గురుకులంలో నాతోనే ఉంటారు. వారికి సంగీతం తప్ప వేరే ప్రపంచం ఉండదు. మన శాస్త్రీయ సంగీతాన్ని శ్రద్ధగా అభ్యసించాలంటే ఆశ్రమ వాతావరణం అవసరం. అటువంటి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుతున్నాను. నేను వారణాసిలో ఏడాదికి ఆరు నెలల కంటే ఎక్కువ కాలం ఉండడం సాధ్యం కాకపోవచ్చు. కచేరీల కోసం దేశ విదేశాలలో పర్యటిస్తూ ఉంటాను. వీలైనంతమట్టుకు శిష్యులు కూడా నా వెంటనే ఉంటారు. ఈ విద్యార్థులే కాక కొందరు కళాకారులు, పరిశోధకులు కూడా వారణాసిలో నాతో కలిసి పనిచేస్తూ ఉంటారు. సంగీత రూపకాలను సృష్టించడంలో, వాద్య సమ్మేళన ప్రయోగాలలో వారు నాతో సహకరిస్తూ ఉంటారు. ఈ ప్రయోగాలన్నింటినీ శిష్యులు శ్రద్ధగా గమనిస్తూ ఉంటారు. వారి కోసం గొప్ప విద్వాంసులను ఆహ్వానించి సోదాహరణ ప్రసంగాలు ఇప్పిస్తూ ఉంటాను. చర్చలు, గోష్టులు నిర్వహిస్తూ ఉంటాను.

ప్రశ్న: మరి, విద్యార్థుల సాధారణ విద్యసంగతి ఏమిటి? ఈ రోజుల్లో ఎంత గొప్పగా సంగీతం నేర్చుకున్నా కొంత వరకు సాధారణ విద్య కూడా అవసరం కదా?

జవాబు: నిజమే. సాధారణ విద్య సంగతి ఇంకా ఆలోచించ వలసి ఉంది. సాధారణ విద్యకు భంగం కలగకుండా చూడడం అవసరం. వాళ్ళను ప్రైవేటుగా పరీక్షలకు పంపే ఏర్పాట్లు ఏమైనా చేయాలి. గురుకులానికి పూర్తి స్వరూపం ఇంకా ఏర్పడలేదు. మీరు అడిగారు కనుక నా మనస్సులో ఆలోచనలుగా ఉన్న కొన్ని సంగతులు చెప్పాను అంతే.

ప్రశ్న: బొంబాయిలోనూ, లాస్ ఏంజెలెస్ లోనూ మీ 'కిన్నెర' సంగీత పాఠశాలలు ఇంకా నడుస్తున్నాయా?

జవాబు: లేదు. ఇన్నింటినీ నిర్వహించడం సాధ్యం కాదని వాటిని మూసివేశాను. నేను ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాను కదా.. స్వయంగా అన్నీ చూసుకోవడం కష్టం.

ప్రశ్న: యాభై, అరవై సంవత్సరాల క్రితం పండిత్ విష్ణు దిగంబర్ ఫలూస్కర్ గంధర్వ మహా విద్యాలయాలు నెలకొల్పినట్లుగా మీరు కూడా దేశమంతటా పెక్కు సంగీత విద్యాలయాలు నెలకొల్ప వచ్చుకదా? దేశమంతటా మీకు ఎంతో మంది శిష్యులు పేరు ప్రఖ్యాతులు గడించిన వారు ఉన్నారు కదా? ఆ విద్యాలయాల నిర్వహణ బాధ్యత వారికి అప్పగించవచ్చుకదా? అటువంటి విద్యాలయాలను నెలకొల్పడం ద్వారా మీరు సితార్ శిక్షణలో ఒక ప్రామాణిక పద్ధతిని అమలులోకి తీసుకు రావచ్చు. ఇప్పుడు ఒక ప్రామాణిక పద్ధతి లేకపోవడం వల్ల ఒక్కొక్క గురువు ఒక్కొక్క విధంగా నేర్పుతున్నారు. సితార్ శిక్షణకు ఒక సిలబస్ రూపొందించడం అవసరం. ఇందుకోసం సితార్ అధ్యాపకుల అఖిల భారత సమావేశాన్ని ఏర్పాటు చేయడం మంచిదనుకుంటాను. అటువంటి సమావేశంలో అందరూ ఒక సిలబస్ ను రూపొందిస్తే ప్రభుత్వ కళాశాల లన్నింటిలోనూ దానినే అనుసరించవచ్చు.

జవాబు: విష్ణుదిగంబర్ పలూస్కర్ గారి కాలంలో హిందూస్థానీ సంగీత బోధనకు సరి అయిన సౌకర్యాలు లేకపోవడం వల్ల, ప్రామాణికమైన బోధన పద్ధతి లేకపోవడం వల్ల, గంధర్వ మహావిద్యాలయాల వంటివి అవసరమైనాయి. ఇప్పుడు అటువంటి అవసరం లేదనుకుంటాను. నా శిష్యులందరూ నా పద్ధతిలోనే బోధిస్తున్నారు కదా?

ప్రశ్న: ఇంక కొత్త రాగాల సంగతి. ఈ మధ్య ఈ విషయంలో చాలా దుమారం రేగింది. ఎవరైనా ఒక విద్వాంసుడు కొత్త రాగాన్ని కనిపెట్టినట్లు ప్రకటిస్తే చాలు, సంప్రదాయ భక్తులైన విద్వాంసులు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఎవ్వరైనా సరే, ఇప్పుడు కొత్తగా ఒక రాగాన్ని కనిపెట్టడం సాధ్యం కాదనీ, అన్నీ ఇదివరకే ఉన్నాయనీ వారు వాదిస్తున్నారు. ఒక ప్రసిద్ధ రాగంలో 'వాది', 'సంవాది' మార్చి కొత్త రాగాన్ని సృష్టించామని చెప్పుకోవడం హాస్యాస్పదమని వారు అంటున్నారు. ఆ మధ్య మద్రాసు మ్యూజిక్ అకాడెమీ మహాసభలలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ తాను కొత్త రాగాలను కనిపెట్టానని ప్రకటించే సరికి పెద్ద వివాదం చెలరేగింది. 'రేవతి', 'హంస వినోధి', 'రోహిణి', 'ప్రతిమధ్యమావతి', 'జనసమ్మోదిని', 'మనోరమ', 'వల్లభి' రాగాలు తన సొంతమని బాలమురళీకృష్ణ ప్రకటించుకున్నారు. అవన్నీ ప్రాచీన సంగీత గ్రంథాలలో ఉన్నవేనని వీణ విద్వాంసుడు బాలచందర్ వాదించారు. అందు మీదట మ్యూజిక్ అకాడెమీ విద్వత్ పరిషత్ ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసింది. పాత పుస్తకాలలో ఉన్న ఆరోహణ అవరోహణ తీసుకుని దానికొక స్వరూపాన్ని ఇచ్చినంత మాత్రాన దాన్ని సొంతం అనడానికి వీలు లేదనీ, ఆ రాగాన్ని ఆ గాయకుడు ప్రచారంలోకి తీసుకు వచ్చాడని మాత్రమే చెప్పవచ్చుననీ ఆ తీర్మానంలో స్పష్టం చేశారు. మరి, మీరూ చాలా కొత్త రాగాలు సృష్టించారు కదా? ఇటువంటి విమర్శలు మీ మీద కూడా ఉన్నట్లున్నాయి. దీనికి మీ సమాధానం ఏమిటి?

జవాబు: చాలా పెద్ద ప్రశ్న వేశారు. దీనికి సమాధానం చెప్పాలంటే ఒక సుదీర్ఘ వ్యాసం వ్రాయవలసి ఉంటుంది. ఈ కాస్త వ్యవధిలో వివరంగా చెప్పడం సాధ్యం కాదు. అయినా, వీలైనంత క్లుప్తంగా చెబుతాను. ఈ వివాదంలో ఇద్దరి వాదాలలోనూ నిజం ఉంది. ఉన్నవి 72 మేళకర్తలు. 12 స్వరస్థానాలు. ఆరోహణలోనూ, అవరోహణలోనూ కూడా కనీసం అయిదు స్వరాలు ఉంటే కాని రాగం ఏర్పడదన్నారు. ఈ లెక్కను మొత్తం రాగాల సంఖ్య 64,848కి మించడానికి వీలులేదు. అందుచేత ఇంకొక కొత్త రాగం సృష్టించడానికి ఆస్కారం లేని మాట నిజమే. అయితే, 64,848 రాగాలు ఏర్పడడానికి ఆస్కారం ఉందన్నమాట నిజమే. కాని, సంగీత శాస్త్ర గ్రంథాలో వాటి అన్నింటి పేర్లు, లక్షణాలు ఇవ్వలేదు. అదీ కాక రాగం అంటే కేవలం ఆరోహణ, అవరోహణ మాత్రమే కాదు. ప్రతిరాగానికీ ఒక ప్రత్యేకమైన సంచారం ఉంటుంది. మూడ్ ఉంటుంది. ఆ విషయం అలా ఉంచండి. ఒకానొక మూడ్ లో నా కొక 'కొత్త' రాగం స్ఫురిస్తుంది. నా మనోధర్మాన్ని అనుసరించి నేను దాని కొక రూపం ఇస్తాను. ఆ రాగాన్ని నేను ఇదివరకెప్పుడూ వినలేదు. అటువంటిది ఒకటి ఉందని ఎక్కడా చదవలేదు కూడా. అందుకని ఆ రాగం నా సొంతమనే అనుకుంటాను. పాత గ్రంథాలన్నీ పెల్లగించి తీసి గాలిస్తే ఇదే ఆరోహణ, అవరోహణ గల రాగం దొరుకుతుందేమో? అంత మాత్రాన నా మనస్సులో పుట్టిన రాగం నాది కాకుండా పోదు. అయితే నాది అనుకుంటున్న రాగం- నాకు తెలియక పోయినప్పటికీ-కర్ణాటక సంగీతంలో ప్రసిద్ధమైనది కావచ్చు. అప్పుడు అది నా సొంతమని చెప్పుకోలేను. ఉదాహరణకు-ఇలాగే నేనొక రాగాన్ని కనిపెట్టాను. దాన్ని ఒకరికి వినిపించగా అది కర్ణాటక సంగీతంలో బాగా ప్రచారంలో ఉన్న రాగమనీ, దాని పేరు 'జన సన్మోహిని' అనీ చెప్పారు. అందుచేత 'రవికిరణ్' అనో, 'రవి కల్యాణ్' అనో నా పేరు తగిలించకుండా దాన్ని 'జన సన్మోహిని' అనే అంటున్నాను. ఈ కొత్త రాగాల వ్యవహారం చాలా జటిలమైనది. విద్వాంసులంతా సమావేశమై క్షుణ్ణంగా చర్చించి నిర్ణయించవలసిన విషయం ఇది.

ప్రశ్న: కర్ణాటక సంగీతంలోని 'రేవతి', మీ 'బైరాగి' ఒకటే. అందుకే హిందూస్థానీ విద్వాంసులు 'బైరాగి' మీ సొంతం కాదని అంటున్నారు. 'బైరాగి భైరవ్' పేరుతో అది చాలా పాతదని అంటున్నారు. 'మీ నటభైరవ్' కూడా బాగా పాతదేనంటున్నారు.

జవాబు: అనడమే కాదు. 'బైరాగి' పాతదేనని నిరూపించడానికి కొందరు రెండు శతాబ్దాల క్రిందటి వాగ్గేయకారుల పేరుతో ఇప్పుడు కొత్తగా కొన్ని రచనలు చేసి 'బైరాగి భైరవ్' పేరుతో ప్రచారం చేస్తున్నారు కూడా. ఈ రచనలను పాత పుస్తకాలలో నుంచి తీశామని చెప్పుకొంటున్నారు.

ప్రశ్న: ఉస్తాద్ బడే గులాం అలీఖాన్, పండిత్ ఓంకార్ నాథ్ ఠాగూర్, ఉస్తాద్ అమీర్ ఖాన్ వంటి మహామహులు గతించిన తరవాత ఇప్పుడు హిందూస్థానీ గాత్ర సంగీత రంగంలో పెద్ద లోటు ఏర్పడింది. భీమ్ సేన్ జోషి, కుమార్ గంధర్వ వంటి గొప్ప విద్వాంసులు కొద్ది మంది మాత్రం ఉన్నారు. అయితే హిందూస్థానీ వాద్య సంగీత రంగంలో మాత్రం ఈ లోటు లేదు. ఈ తరం లోనే కాదు, సంగీత చరిత్రలోనే మహా విద్వాంసులుగా గణన కెక్కగలిగిన వారు-మీరు, విలాయత్ ఖాన్, బిస్మిల్లాఖాన్, అలీఅక్బర్ ఖాన్, రామ్ నారాయణ్, శివకుమార్ శర్మ, అంజాద్ అలీఖాన్ వంటి వారు ఇప్పుడు ఉన్నారు. వాద్య సంగీతం ముందుకు దూసుకుపోతుంటే, గాత్ర సంగీతం ఎందుకు వెనకబడిపోతున్నది?

జవాబు: కారణం ఇది అని ఖచ్చితంగా చెప్పలేను. కాని మీరు చెప్పింది నిజం. ఆమధ్య ఇదే మాట నేను అంటే కొందరికి కొంచెం కోపం వచ్చింది కూడాను.

ప్రశ్న: విదేశాలలో భారతీయ సంగీత ప్రచారం పేరుతో ఈమధ్య 'సగటు' కళాకారులు కూడా విదేశ యాత్రలు చేసివస్తున్నారు. వారందరూ విశేష ప్రశంస లందుకున్నట్లుగా చెప్పుకుంటున్నారు. వారందరికీ మెట్టమొదటగా పాతికేళ్ళ క్రిందట దారి చూపింది మీరేకదా? పాశ్చాత్యులకు నిజంగా మన సంగీతం అర్థం అవుతుందా? మన సంగీతం పట్ల వారికి నిజంగా శ్రద్ధ ఉందా? వట్టి కొత్త మోజేనా?

జవాబు: మొదట మోజుతోనే ప్రారంభమయింది. కాని, ఆ దశ దాటి చాలా కాలమయింది. మోజు తీరిపోయిన వారు వెనక్కు జారుకున్నారు. ఇప్పుడు మిగిలిన వారంతా నిజంగా శ్రద్ధ కలవారే. వీరు మన సంగీత సౌందర్యాన్ని అర్థం చేసుకొని ఆరాధిస్తున్నారు.

ప్రశ్న: హిందూస్థానీ వాద్య సంగీతాన్ని-ముఖ్యంగా సితార్ ను-తలుచుకోగానే మీతో బాటు వెంటనే ఉస్తాద్ విలాయత్ ఖాన్ పేరు జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు దేశంలో సితార్ వాదనకు సంబంధించినంత వరకు రెండే బాణీలు ఉన్నాయి. ఒకటి మీది, రెండవది విలాయత్ ఖాన్ ది. సంగీతానికి సంబంధించిన వివిధ విషయాలపై మీ ఇద్దరి అభిప్రాయాలు భిన్నమైనవే అయినప్పటికీ, దేశంలో మీ ఇద్దరికీ సమాన గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి. ప్రపంచ ఖ్యాతి నార్జించిన మీరిద్దరూ ఒకే వేదిక మీద జుగల్ బందీ కచేరీ చేస్తే అది ఈ శతాబ్దం మొత్తం మీద గొప్ప చరిత్రాత్మకమైన కచేరీ అవుతుంది. ఎప్పటికైనా మాకు అంతటి భాగ్యం లభిస్తుందా?

జవాబు: అబ్బే! అది సాధ్యం కాదు. మా ఇద్దరి సంగీతాన్ని విడివిడిగా విని ఆనందించవచ్చు కదా? ఇద్దరూ కలిసి వాయించాలని కోరడం దేనికి? వినోదం కోసం పోటీ లాంటిది ఏర్పాటు చేయడం నాకు ఇష్టం లేదు. జుగల్ బందీ అంటే కళాకారుల లిద్దరి మధ్య పరస్పర అవగాహన, సహకారం అవసరం. వాదన శైలిలో, మనోధర్మంలో పూర్తి భిన్నత్వం గల ఇద్దరు కళాకారుల మధ్య సమన్వయం ఎలా కుదురుతుంది? బిస్మిల్లాఖాన్ తో కలిసి కచేరీ చేయమని ఒక సంగీత సభ వారు నన్ను కోరారు. లక్ష రూపాయలు ఇస్తామన్నారు. అయినా, నేను తిరస్కరించాను. షెహనాయికి, సితార్ కు ఎలా కలుస్తుంది? జుగల్ బందీ ఎలా సాధ్యం?

ప్రశ్న: బిస్మిల్లాఖాన్, విలాయత్ ఖాన్ కలిసి కచేరీలు ఇచ్చారు కదా? వారి జుగల్ బందీ రికార్డు కూడా చాలా బాగుంది కదా?

జవాబు: జనాన్ని ఆకర్షించడానికి, డబ్బు చేసుకోవడానికి ఇద్దరు గొప్ప కళాకారుల జుగల్ బందీ ఏర్పాటు చేయడం ఒక మంచి ఉపాయం కావచ్చు. కాని, అటువంటి వ్యాపార దోరణి నాకు గిట్టదు. నేను ఇప్పుడు ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ తో కూడా కలిసి వాయించడం మానేశాను. ఒకప్పుడు మా జుగల్ బందీలు జయప్రదమైన మాట నిజమే. కాని, ఇప్పుడు మా పద్ధతులు భిన్నమైనాయి.

రవిశంకర్, విలాయత్ ఖాన్

ప్రశ్న: అది సరే. విలాయత్ ఖాన్ తో వాయించడానికి అభ్యంతరం ఏమిటి? ఇద్దరూ సితార్ విద్వాంసులే కదా?

జవాబు: అయినా, మా ఇద్దరి మనోధర్మాలు భిన్నమైనవి. సితార్ ను శ్రుతి చేయడంలోనే మా ఇద్దరివీ పూర్తిగా భిన్నమైన పద్ధతులు. ఆయన సితార్ పై పలికే కొన్ని అందాలు నా సితార్ లో పలకవు. అలాగే నా సితార్ లో పలికే కొన్ని అందాలు ఆయన సితార్ లో పలకవు. రెండింటికీ పోలిక లేదు, పోటీ లేదు. అందుచేత ఇద్దరి సంగీతాలను విడివిడిగా వినడమే బాగుంటుంది.

విమానం బయలుదేరే నిమిషం దగ్గరపడింది. లౌడ్ స్పీకర్ లో చివరి పిలుపు వచ్చింది. సితార్ సమేతుడై పండిత్ జీ విమానం వైపు వెళ్ళారు.

నండూరి పార్థసారథి
(1981 ఏప్రిల్ 1వ తేదీన ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో ప్రచురితమయింది)

Previous Post Next Post