డ్యూక్ ఎలింగ్టన్ ఆర్కెస్ట్రా
గజిబిజిలో జిగిబిగి

ఆకర్షకమైన రంగు రంగుల స్వరాల గజిబిజి, గందరగోళంగా జాజ్ బాహ్యరూపాన్ని వర్ణించవచ్చు. కెలైడోస్కోప్ (చిత్రదర్శిని)లోని గాజు ముక్కలు అనంతంగా చిత్ర విచిత్రమైన ఆకృతులను సృష్టించినట్లుగా, జాజ్ అనిర్వచనీయ మధురధ్వనులను ఉత్పత్తి చేస్తుంది. కెలైడోస్కోప్ తిప్పుతుంటే ఒకసారి కనిపించిన ఆకృతి మరొక సారి కనిపించనట్లే జాజ్ లో ఒకసారి వినిపించిన స్వరాల కూర్పు మరొక సారి వినిపించదు. అందుకే జాజ్ ను 'కెలైడో స్కోపిక్' సంగీతంగా వర్ణించవచ్చు.

అమెరికావారు టి.ఎస్. ఇలియట్ కవిత్వాన్ని, ముఖ్యంగా 'వేస్ట్ లాండ్'లో ఆయన ప్రయోగించిన కవితా శైలిని జాజ్ తో పోల్చుతారు. ఆయన పొయెట్రీని 'జాజ్ పొయెట్రీ' అంటారు కొందరు. అసలు అస్పష్టంగా, గందరగోళంగా ఉన్న దేనినైనా 'జాజీ'గా ఉందని అంటూ ఉంటారు. ఇలియట్ కవిత్వానికి ప్రేరణ జాజ్ సంగీతమేనని చెబుతారు. అబ్ స్క్యూరిటీ (అస్పష్టత) ఎక్కువగా ఉండే 'ఇలియాటిక్' పొయెట్రీకి, ఆబ్ స్ట్రాక్ట్ ఆర్ట్ (అరూపవాద చిత్రకళ)కీ మ్యూజికల్ వెర్షన్ జాజ్ అని చెప్పవచ్చు. 'వేస్ట్ లాండ్'ను ఎవరైనా సినిమాగా తీస్తే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గా జాజ్ నే ఉపయోగించాలి.

జాజ్ కు ఒక తీరు తెన్నూ లేనట్లు పైకి కనిపించినా, దానిపై పొరలను ఛేదించుకుని లోపలకు ప్రవేశించి, జాగ్రత్తగా పరిశీలిస్తే దాని నిర్మాణంలో ఒక క్రమం, పద్ధతి కనిపిస్తాయి. పైకి కనిపించే గజిబిజిలో ఒక జిగిబిగి కనిపిస్తాయి. గందరగోళంలో సుందరశిల్పం కనిపిస్తుంది. మెలోడీ (ఏక స్వనం), హార్మొనీ (బహుస్వన సమ్మేళనం), రిదిమ్ (లయ) జాజ్ ముఖ్యాంగాలు. 'మెలోడీ' అంటే స్వరాల ప్రస్తారం ఒకే రేఖగా, లేక ఒకే స్రవంతిగా సాగడం. ఇది భారతీయ సంగీతానికి ప్రాణం. 'హార్మొనీ' అంటే ఏకకాలంలో జనించే అనేక స్వరరేఖల, లేక స్వర స్రవంతుల సుందర సమ్మేళనం. ఇది పాశ్చాత్య శాస్త్రీయ సంగీత లక్షణం. జాజ్ లో మెలోడీ, హార్మొనీలు రెండూ ఉంటాయి కాని, దానికి అతి ప్రధానమైనది 'రిదిమ్' (లయ).

రిదిమ్ అంటే-దెబ్బ, దరువు, ఊపు-జాజ్ కు ఊపిరి. ఎన్ని విన్యాసాలైనా ఆ 'ఊపు'లోనే సాగుతాయి. ఆ ఊపు లేకుండా జాజ్ లేదు. అసలు జాజ్ కు 'స్వింగ్' (ఊపు) మ్యూజిక్ అనే నామాంతరం కూడా ఉంది. జాజ్ కళాకారులు పాడుతున్నంత సేపు, వాయిస్తున్నంత సేపు ఊగుతూనే ఉంటారు. అలా ఊగకుండా ఒక్కక్షణం కూడా పాడలేరు, వాయించలేరు. తమ హృదయంలోని ఏదో ఆర్తిని, అశాంతిని తమ సంగీతం ద్వారా వ్యక్తం చేయడానికి వారు ప్రయత్నిస్తారు. తమ ఆర్తిని పూర్తిగా వ్యక్తం చేయలేక పోతున్నామనే వేదన, అసంతృప్తి వారి సంగీతంలో ధ్వనిస్తాయి. ఈ 'ఆర్తి' జాజ్ కు హృదయం వంటిది.

'జాజ్' అంకురం సుమారు రెండు శతాబ్దాల క్రితం పశ్చిమ ఆఫ్రికా నుంచి అమెరికాకు దిగుమతి అయింది. పశ్చిమాఫ్రికా నుంచి బానిసలుగా అమెరికాకు రవాణా చేయబడిన నీగ్రోలు ఆ అంకురాన్ని తమ వెంట తెచ్చారు. దుస్సహమైన తమ బానిస జీవితంలో కాసేపు ఆనందాన్ని సృష్టించుకోవడం కోసం వారు రేకు బాల్చీలని బోర్లించి, వాటి మీద దరువు వేస్తూ, మొరటుగా అరుస్తూ పాడుకునేవారు. నీగ్రోలు 'వోడున్' అనే తమ మతాన్ని కూడా ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నారు. కొత్త ఖండంలో, కొత్త పరిసరాలలో బానిస జీవితం గడుపుతున్నా, వారు తమ తమ సంప్రదాయాలకు స్వస్తి చెప్పలేదు. డోళ్ళు, డప్పులు మ్రోగిస్తూ, వెర్రిగా అరుస్తున్నట్లు పాటలు పాడుతూ, చిందులు తొక్కుతూ ఉత్సవాలు, వేడుకలు జరుపుకునేవారు. 1803 నుంచి 1885 వరకు ఇటువంటి నీగ్రో ఉత్సవాలకు న్యూ ఆర్లియన్స్ (లుయిసియానా)లోని 'ప్లేస్ కాంగో' అనే ఒక స్థలం కేంద్రంగా ఉండేది.

అమెరికాలో స్థిరపడిన వారందరూ యూరప్ దేశాలవారే కనుక, అక్కడ అనేక యూరోపియన్ జానపద సంగీతాలు బాగా ప్రచారంలో ఉన్నాయి. నీగ్రోలు దిగుమతి చేయబడినప్పటికి లుయిసియానా శ్పానిష్ పరిపాలన క్రింద ఉన్నది. ఆ కాలంలో నీగ్రో సంగీతం శ్పానిష్ జానపద సంగీత ప్రభావానికి లోనయింది. తర్వాత లుయిసియానా ఫ్రెంచి పరిపాలన క్రిందకు వచ్చిన తర్వాత-ఫ్రెంచి జానపద సంగీత ప్రభావానికి లోనయింది. ఆ తర్వాత అమెరికా సంయుక్త రాష్ట్రాలు లుయిసియానాను కొనుక్కున్నాయి. క్రమంగా నీగ్రోల మొరటు సంగీతంలోని విచిత్రమైన అందాన్ని శ్వేతజాతివారు గుర్తించారు. శ్వేతజాతి సంపర్కంతో ఆ సంగీతం క్రమంగా నునుపుదేరి, నాజూకు తనం సంతరించుకున్నది. మొదట్లో దానిని 'సంగీతం' అనడానికి కూడా ఎవరూ ఇష్టపడేవారు కారు. అప్పట్లో అది అంత మొరటుగా ఉండేది. తర్వాత 'జానపద సంగీతం' అనిపించుకోగల స్థాయికి వచ్చింది. ఇప్పుడు విశేషంగా అభివృద్ధి చెంది, ప్రపంచమంతా పర్యటిస్తూ వేదిక లెక్కి కచేరీలు చేస్తూ, ఒక ప్రత్యేకమైన 'ఆర్ట్ మ్యూజిక్'గా గుర్తించబడుతున్నది.

దానికి 'జాజ్' అనే నామకరణం జరిగింది 20వ శతాబ్దం ఆరంభంలోనే. ఆ పేరు ఎవరు పెట్టారో, దాని అర్థం ఏమిటో ఖచ్చితంగా ఎవరికీ తెలీదు. కడచిన యాభై, అరవై సంవత్సరాలలో 'బ్లూస్' (అమెరికన్ జానపద గీతాలు) మొదలుకొని 'ఆపెరా' వరకు అన్ని రకాల సంగీత రీతుల ప్రభావాలను జాజ్ జీర్ణించుకున్నది.

జాజ్ మొదట ప్రధానంగా గాత్ర సంగీతం. ఇప్పుడది వాద్య ప్రధాన సంగీతంగా మారింది. ట్రంపెట్, శాక్జోఫోన్, క్లారినెట్, ట్రామ్ బోన్, పియానో, ఫ్రెంచ్ హారన్, వైబ్రాఫోన్, బాస్, ఫ్లూట్, డ్రమ్స్ మొదలైన వాద్యాలు జాజ్ లో ఉపయోగించబడుతున్నాయి.

లూయీ ఆర్మ్ స్ట్రాంగ్

జాజ్ న్యూఆర్లియన్స్ నుంచి అమెరికా అంతటికీ వ్యాపించడంతో మన హిందూస్థానీ సంగీతంలో 'ఘరానా'ల మాదిరిగా జాజ్ లో అనేక స్టైల్స్ బయలుదేరాయి. వీటిలో ప్రధానమైనవి 'న్యూ ఆర్లియన్స్ స్టైల్', 'మోడరన్ స్టైల్'. మిగిలినవన్నీ ఈ రెండింటికీ మధ్యస్థంగా ఉండే ఛాయా భేదాలు. న్యూ ఆర్లియన్స్ స్టైల్ ఇప్పటికీ జాజ్ తాలూకు జానపద లక్షణాన్ని కాపాడుతున్నది. ఈ స్టైల్ కు చెందినవారు 'బ్లూస్'ను ఎక్కువగా వాయిస్తారు. జాజ్ ను కాగితం మీద పెట్టడానికి వారు అంగీకరించరు. స్వేచ్ఛగా, అప్పటికప్పుడు తోచినట్లుగా వాయించవలసిందే గానీ ముందుగా కాగితం మీద రాయకూడదని వీరు అంటారు. మోడరన్ స్టైల్ కు చెందిన వారు తమ సంగీతాన్ని పూర్తిగా కాక పోయినా చాల వరకు కాగితం మీద పెడుతున్నారు. అయితే కాగితం మీద చూసి వాయిస్తున్నా, వారు అప్పటికప్పుడు కల్పించి వాయిస్తున్నట్లే శ్రోతలకు అనిపిస్తుంది. వీరి జాజ్ లో జానపద ఛాయలు కనుపించవు. వీరి సంగీతం నిత్యనూతన ప్రయోగశీలమైనది. న్యూ ఆర్లియన్స్ స్టైల్ కు ముఖ్య ప్రతినిధి లూయీ ఆర్మ్ స్ట్రాంగ్. 'మోడరన్' లేక 'ప్రోగ్రెసివ్ స్టైల్'కు ముఖ్యప్రతినిధులు మోడరన్ జాజ్ క్వార్టెట్ బృందం వారు. వీరందరికంటే జగత్ర్పసిద్ధుడైన జాజ్ కళాకారుడు డ్యూక్ ఎలింగ్టన్. ఆయన వాద్య బృందం 1963లో భారతదేశానికి వచ్చి కచేరీలు చేసింది. జాజ్ లో కొన్నివందల రికార్డులున్నాయి. డ్యూక్ ఎలింగ్టన్, ఆర్మ్ స్ట్రాంగ్, మోడరన్ జాజ్ క్వార్టెట్ ల రికార్డులు ఏవి విన్నా జాజ్ సంగతి తెలుస్తుంది.

మోడరన్ జాజ్ క్వార్టెట్

వివిధ జాతుల, సంస్కృతుల సమ్మేళనమైన ఆమెరికన్ సమాజానికి ప్రతీక జాజ్. దానిని కన్నవారు నీగ్రోలైనా పెంచినవారు శ్వేత జాతివారు. అమెరికా వారు సంగీత ప్రపంచానికి యిచ్చిన అమూల్యమైన కానుక జాజ్. అది అచ్ఛమైన అమెరికన్ బ్లాక్ అండ్ వైట్ మ్యూజిక్.

నండూరి పార్థసారథి
(1974 ఏప్రిల్ 13వ తేదీన ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమయింది)

Previous Post Next Post