'అళగర్ కురవంజి'

నృత్య రంగంలోనూ, సినిమా రంగంలోనూ కూడా శిఖరాగ్రాన్ని అందుకున్న అభినేత్రి వైజయంతిమాల. నర్తకిగా దేశ విదేశాలలో ఆమెకు ఉన్న ఖ్యాతి ఈ తరంవారిలో మరెవ్వరికీ లేదనే చెప్పవచ్చు. సినీతారగా ఆమెకు ఉన్న 'స్టార్ వాల్యూ' ఈనాడు యవద్భారతంలో మరెవ్వరికీ లేదు.

పెక్కు దేశాలలో పర్యటించి, భారతీయ నాట్యకళను ప్రపంచానికి విశేషంగా పరిచయం చేశారు ఆమె. మన నాట్యకళకు ప్రపంచ ప్రజాభిమానాన్ని విరివిగా చేకూర్చిపెట్టారు. నృత్య ప్రదర్శనల ద్వారానే కాక, సినిమాల ద్వారా కూడా ఆమె అనేక దేశాల ప్రజలకు చిరపరిచిత. వైజయంతిమాల జీవితంలో నృత్యం, సినిమా-రెండూ కూడా ప్రధానమైన, పరస్పర భిన్నమైన అంశాలు. ఆమె అభ్యసించినది, ప్రదర్శించేది శాస్త్రీయమైన, శుద్ధమైన భారతీయ నృత్యం. సినిమాలలో ఆమె అభినయం ఈ శాస్త్రీయ నృత్యంతో ఆట్టే నిమిత్తంలేనిది. నర్తకిగా రంగస్థలంమీద మనకు కనిపించే వైజయంతిమాల వేరు, సినిమాలలో వైజయంతిమాల వేరు. నృత్య వాతావరణం వేరు. సినిమా వాతావరణం వేరు. ఒకదాని ప్రభావం ఇంకొక దానిపై ప్రసరించకుండా ఆమె తన నాట్య జీవితాన్ని, సినిమా జీవితాన్ని వేరువేరుగా పోషించుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే-సినిమా నటనలో శాస్త్రీయ నృత్యభంగిమలు ప్రదర్శిస్తే అది చాదస్తంగా కనిపిస్తుంది. భరతనాట్యంలో సినిమా పోకడలు పోతే అది జగుప్సగా, రసాభాసగా ఉంటుంది.

సినీతారగా ఎంత తీరిక లేకుండా ఉన్నా, ఆమె తన నిత్యనృత్యాభ్యాసాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. నృత్య ప్రదర్శనలు ఇవ్వటం మానలేదు; నాట్య ప్రయోగాలలో నూతనావకాశాలను పరిశోధించటం విరమించలేదు. 'కళ'ను చంపగల శక్తి నేటి సినిమా పరిశ్రమకు ఉన్నది. అయినా వైజయంతిమాల సినిమా వృత్తి ఆమె నాట్యకళను కలుషితం చేయకపోవటం విశేషం. కేవలం నృత్య ప్రదర్శనలు ఇవ్వటమే కాకుండా, తనవంటివారిని ఎందరినో సృష్టించడానికి ఆమె ఒక నాట్యాలయాన్ని కూడా స్థాపించారు. భారతీయ నాట్యకళకు ఆమె చేసిన సేవకు అది ఒక తార్కాణం. కడచిన రెండు మూడు సంవత్సరాలలో ఆమె 'తిరుప్పావై', 'చండాలిక' అనే రెండు గొప్ప నృత్య నాటకాలను ప్రదర్శించారు. నృత్యంలో ఆమె ఖ్యాతిని మరొక మెట్టు పైకి తీసుకుపోగల సరికొత్త నృత్యనాటకం 'అళగర్ కురవంజి'.

కవి కుంజర భారతి (1810-1896) రచించిన ఈ తమిళ నృత్య నాటకాన్ని వైజయంతిమాల ఏప్రిల్ 16, 17 తేదీలలో మద్రాసు మ్యూజిక్ అకాడమీ హాలులో ప్రదర్శించారు. పెరంబూరు సంగీత సభవారు ఈ ప్రదర్శనను నిర్వహించారు. వైజయంతిమాల దీనికి స్వయంగా నృత్య దర్శకత్వం వహించారు. మదురై ఎన్. కృష్ణన్ సంగీతం సమకూర్చారు. గీతాలను మదురై సేతురామన్, రాధ, రాజలక్ష్మి పాడారు.

'కురవంజి' అంటే తమిళంలో 'నృత్య నాటకం' అని అర్థం. అయితే నృత్య నాటకాలన్నింటినీ కురవంజిలని అనరు. వీటిలో సంగీతానికి కూడా నృత్యంతో సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. సాధారణంగా కురవంజిలలో నాయిక రాజునో, మంత్రినో, లేక గొప్ప స్థానంలో ఉన్న మరొక వ్యక్తినో ప్రథమ వీక్షణంలోనే ప్రేమించటం, తన విరహాన్ని సఖీ బృందం ఎదుట వ్యక్తం చేయటం, వారు శీతలోపచారాలు చేసి సముదాయించటం, ఆమె ప్రియునికి వర్తమానం అందచేయటం, చివరికి ప్రియా ప్రియులు కలుసుకోవటం జరుగుతుంది. కొన్ని కురవంజిలలో నాయిక భగవంతుని ప్రేమించటం కూడా ఉంది. 'అళగర్ కురవంజి'లో నాయిక మోహనవల్లి 'అళగర్'ను ప్రేమిస్తుంది. తిరుమాలిరుంశోలైలో వెలసిన దేవుడు అళగర్ (విష్ణువు).

మోహనవల్లి ఒక రోజు తన సఖులతో బంతి ఆట ఆడుకుంటూ ఉండగా ఆ దారి వెంట అళగర్ ఊరేగింపు వెళ్తుంది. ఆమె అళగర్ ను ప్రేమిస్తుంది. విరహవేదన అనుభవిస్తుంది. చెలులు ఊరడిస్తారు. ఒక ఎరుకలసాని ఆమె చేయి చూసి మనోరథం ఈడేరుతుందని చెబుతుంది. ఒక సఖి రాయబారం వెళ్ళి మోహనవల్లి ప్రేమను అళగర్ కు నివేదిస్తుంది. అళగర్ మోహనవల్లి ప్రేమను పరిగ్రహిస్తాడు. ఆమె అళగర్ కు దేవేరిగా వెలుస్తుంది.

ఇది సుమారు రెండున్నర గంటల నృత్య నాటకం. నాటకం అంతా గీతాలతో, నృత్యాలతో సాగుతుంది. కొన్ని చోట్ల సాహిత్యం లేకుండా కేవలం నృత్యాభినయంతోనూ, వాద్య సంగీతంతోనూ నడుస్తుంది. సంగీతం శుద్ధ కర్నాటక శైలిలోనూ, నృత్యం భరత నాట్య శైలిలోనూ ఉన్నాయి. ఎరుకలసాని పాటలో మాత్రం జానపద సంగీతాన్ని తీసుకున్నారు.

Dance Picture

నాటకం దాదాపు కొన్ని జావళీలతో, పదాలతో కూర్చిన మాలవలె ఉంది. ఇందులోని నృత్యాలు, ఆయా గీతాలకు కూర్చిన వరసలు ఎంతో మనోజ్ఞంగా ఉన్నాయి. నృత్యాలలో పాండిత్య ప్రకర్షకంటే అభినయానికి, లాలిత్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. నాయిక, ఆమె సఖులు బంతి ఆట ఆడుతున్నట్లు చేసిన అభినయం గొప్పగా ఉంది. ఊరేగింపు వచ్చినప్పుడు పల్లకిలోని అళగర్ ను చూసి, ఆ స్వామి సౌందర్యానికి విస్మితురాలు కావటం, తన హృదయాన్ని ఆయనకు అంకితం చేసుకోవటం, పల్లకి ముందుకు సాగిపోతూంటే స్వామి దూరమైపోతున్నాడని వేదన పడటం-ఈ భావాలన్నింటినీ ఒక్క నిమిషం వ్యవధిలో వైజయంతిమాల తన ముఖంలో అద్భుతంగా, చిరస్మరణీయంగా ప్రదర్శించారు. ఆ సమయంలో గీతం లేదు; నృత్యం లేదు; ఆంగికమైన చలనం కూడా లేదు. కేవలం ముఖంలో-విస్మయం, ఆరాధన, వేదన ప్రదర్శితమవుతాయి.

కవికుంజర భారతి వాగ్గేయకారుడు. త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితర్ లకు సమకాలికుడు. నాటి సంగీత వైభవమంతా ఈ కురవంజిలో కనిపిస్తుంది. ఈ గీతాలను ఎందరో ప్రముఖులు గానం చేయగా విని ముగ్ధురాలై, ఆ గీతాలకు నృత్యగతులను కూర్చి నాటకంగా ప్రదర్శించాలని రెండు సంవత్సరాల క్రిందటనే వైజయంతిమాల సంకల్పించారు. అప్పటి నుంచి ఈ నృత్య నాటకం ఆమె మనస్సులో ఆకృతిని సంతరించుకుంటూ వచ్చింది. ఈనాటికి అది రంగస్థలంపై ఆవిష్కృతమయింది. ఇందులో షణ్ముఖప్రియ, మోహన, ఖమాస్, తోడి, కాంభోజి, ఖరహరప్రియ, పూర్వీకళ్యాణి, తిలంగ్, కేదారగౌళ, సెంజిరుతి, బేగడ, మలయమారుతం, ఆనందభైరవి, వసంత, అఠాణా, హిందోళం, పంతువరాళి, భాగేశ్వరి, శహన, కళ్యాణి, మధ్యమావతి, సౌరాష్ట్రం, సురటి రాగాలు ఉపయుక్తమైనాయి. ఈ రాగాల వరుస క్రమాన్ని జాగ్రత్తగా గమనిస్తే నాటకంలోని సంగీత స్వరూపం స్థూలంగా బోధపడుతుంది. ఒక రాగం విసుగుపుట్టే దశ రాకుండానే అందుకు భిన్నమైన మరొక రాగం ప్రవేశించి-ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆహ్లాదపరుస్తుంది.

ఈ నాటకానికి రంగాలంకరణ అంటూ ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. నీలపు తెరలు తప్ప వేరే 'సెట్టింగ్' ఏమీ లేదు. నటీనటుల ముఖాలలోని హావభావాలు స్పష్టంగా కనిపించే విధంగా 'లైటింగ్' ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు. దుస్తులు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. రంగస్థలం మీద పదిమంది నిలుచున్నప్పుడు ఆ దృశ్యం ఆహ్లాదకరంగా ఉండేటట్లు వారి వారి దుస్తుల రంగులను జాగ్రత్తగా ఎన్నిక చేశారు.

నాటకంలో నేపథ్య సంగీత రచన పరిపుష్టంగా ఉంది; మొత్తం ప్రదర్శనకు అది ప్రాణం పోసిందని చెప్పవచ్చు. గాయకులు పాడిన తీరు కూడా బాగుంది కానీ, వారి గాత్రాలలో శ్రావ్యత కొంత తక్కువగానే ఉంది. అయితే అది పెద్ద లోపంగా కనిపించదు.

నృత్యం, సంగీతం, ఆహార్యం మొదలైన అంశాలన్నీ వేటికి అవి నిర్దుష్టంగానే ఉన్నా నాటకం మొత్తం మీద కనిపించే లోపం ఒకటి ఉంది. ప్రతి సన్నివేశం అవసరమైన దానికంటే దీర్ఘంగా ఉన్నట్లు కనిపిస్తుంది. సంగీత శాస్త్రంతో, భరత శాస్త్రంతో అంతగా పరిచయం లేని ప్రేక్షకులకు ప్రతి సన్నివేశం కొంత విసుగుగా అనిపించే అవకాశం ఉంది. నాయిక దేవిగా వెలసిన పతాక సన్నివేశం చాలా ఉదాత్తంగా, ప్రేక్షకులను హర్ష పులకితులను చేయగల విధంగా ఉన్నందువల్ల నాటకం ముగిసే సమయానికి అసంతృప్తి ఏమీ మిగలదు.

'అళగర్ కురవంజి' వైజయంతిమాలకు గర్వకారణమైనది; కళాభిలాషులందరూ తప్పక చూడవలసినది.

నండూరి పార్థసారథి
(1965 ఫిబ్రవరి 2వ తేదీన ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైనది)

Previous Post Next Post