Title Picture

చాలా అరుదైన అందమైన ప్రకృతిదృశ్యాలు, బ్రహ్మాండమైన సెట్టింగులు, ఆడంబరమైన కలర్ డ్యాన్సులు, అట్టహాసభరితమైన పాటలు, యుద్ధాలు, సస్పెన్సు, ఏనుగులు, గుర్రాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి.

ఇంకా ఈ చిత్రంలోని విశేషాలు; ఇందులో కొన్ని దృశ్యాలను హెలికాప్టర్ మీద నుంచి చిత్రీకరించారు. ఇండియాలో ఇది వరకు ఎవరూ ఈ పనికి పూనుకోలేదు. అడవులు, కొండలు, జలపాతాలు, అగాధాలు, మొదలయిన దృశ్యాలు మనం ఇదివరకు భారతీయ చిత్రాలలో ఎన్నడూ చూడనంత గొప్పగా చూపించారు. ఇందుకే కాబోలు ఈ చిత్రానికి మొదటివారమే కలకత్తాలో 1,67,000, బొంబాయిలో 1,43,000 రూపాయలు వసూలయినాయట.

కథాసంగ్రహం : అమర్ అనే ఒకబ్బాయి చిన్నప్పుడు వాళ్ళ నాన్న కొడితే కోపం వచ్చి అడవుల్లోకి పారిపోయి అక్కడి వాళ్ళందరికీ నాయకుడవుతాడు. పరమదుష్టుడుగా, కిరాతకుడుగా తయారవుతాడు. అతను పాతికేళ్ళ యువకుడయేసరికి వాళ్ళ నాన్నగారికి అతని ఆచూకీ తెలిసి అతన్ని తీసుకుపోయేందుకై అడవికి వస్తాడు. తను పెంచుకుంటున్న మాలా అనే పడుచును కూడా వెంట తీసుకువస్తాడు. కొడుకు చేష్టలకు హడలిపోతాడు-ఇంటికి. అతన్ని సంస్కరించాలనే పట్టుదలతో మాలామాత్రం అడవిలో ఉండిపోతుంది. క్రమంగా అతన్ని మానవుడిగా చేస్తుంది. ఇంతలో గులాబి అనే వాంప్ ఇద్దరినీ విడదీస్తుంది. జగ్గు అనే విలన్ ఆమెకు తోడ్పడతాడు. చివరికి వీరిద్దరూ చనిపోతారు. నాయికా నాయికులు కలుసుకుంటారు. అమర్ గా దేవానంద్, మాలాగా సుచిత్రా సేన్, గులాబిగా రాగిణి, జగ్గుగా అన్వర్ కథోచితంగా నటించారు. సి. రామచంద్ర సంగీతం వైఖరి చూస్తే, హాలీవుడ్ చిత్రాల సంగీతాన్ని ఆమూలాగ్రం వంటపట్టించుకున్నట్లు తోస్తుంది. చివరి చివరి పాటలు మామూలుతనానికి దిగజారిపోయినా, మొదటి రెండు మూడు పాటలూ 'ఓహో' అనిపించుకోతగ్గ విధంగా ఉన్నాయి. ఉత్కంఠను రేకెత్తించే సన్నివేశాలలో ఆయన కూర్చిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉన్నది. డప్పులు, డోళ్ళు, మాండొలిన్, గిటార్ వాద్యాలను ఆయన చక్కగా ఉపయోగించుకున్నాడు.

Picture
దేవానంద్, సుచిత్రా సేన్

ఛాయాగ్రహణం మరీ హాయిగా ఉంది. లేకుంటే ఇంత పొడుగు (16 వేల అడుగుల పైచిల్లర) చిత్రాన్ని చూడటం ఇంకా బాధాకరమయేది.

ప్రతి దృశ్యంలోనూ దర్శకుని సాహసం, సామర్ధ్యం కనుపిస్తుంది. నిడివి ఇప్పుడున్న దాంట్లో సగమే ఉండివున్నట్లయితే నాణ్యతలో కూడా ఈ చిత్రం హాలీవుడ్ చిత్రాలకు దీటు వచ్చేది. కలర్ నృత్యాలు లేకుండా ఉంటే ఇంకా కాస్త హాయిగా ఉండేది. ప్రతివారు ఒకసారి చూడతగిన చిత్రం 'సర్హద్'.

దర్శకత్వం : శంకర్ ముఖర్జీ; నిర్మాత : కపాడియా; సంగీతం : సి. రామచంద్ర ; మాటలు : వ్రజేంద్రగౌర్; పాటలు : మజ్రూహ్; నటీనటులు : దేవానంద్, సుచిత్రాసేన్, రాగిణి, సజ్జన్, ధుమాల్, అన్వర్, లలితా పవార్, మోనీచటర్జీ - వగైరా.

నండూరి పార్థసారథి
(1960 జులై 3వ తేదీన ఆంధ్రప్రభ సంచికలో ప్రచురితమైనది)

Previous Post Next Post