Title Picture

తెలుగులో డబ్బింగు చిత్రాల తయారీ లాభసాటి కుటీర పరిశ్రమగా, చిన్న మొత్తాల పొదుపు పథకంగా దినదిన ప్రవర్థమానమవుతున్నది. లక్షలకు లక్షలు వెచ్చించి నిర్మించే చిత్రాలు పట్టుమని పదివారాలైనా మార్కెట్టులో విహరించకమునుపే గూటికి చేరుకొంటున్నాయి. అందుకే మన నిర్మాతలు ఈ అడ్డదారిని ఆశ్రయించారు. ఈ సంవత్సరం ఇంతవరకు 45 చిత్రాలు విడుదలైనాయి. వీటిలో 17 డబ్బింగు చిత్రాలు; ఐదు చిత్రాలు మాత్రం ఇంతవరకు వందరోజులు నడిచాయి. డబ్బింగు చిత్రాలలో రెండు రకాలు ముఖ్యంగా కనుపిస్తున్నాయి. తమిళం నుంచి అనువదించినవి, హిందీ నుంచి అనువదించినవి. కన్నడ చిత్రాలను కూడా అనువదించడం జరుగుతున్నది కాని చాలా అరుదు. అరవ డబ్బింగు చిత్రాల థోరణికీ, హిందీ డబ్బింగు చిత్రాల ధోరణికీ చాలా వ్యత్యాసం ఉంటున్నది. భాషలో ఎంతో వ్యత్యాసం కనుపిస్తున్నది. అరవ చిత్రాల కంటె, హిందీ చిత్రాలనే మన ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్నట్లు తోస్తుంది.

బసంత్ పిక్చర్సువారు లోగడ 'రామభక్త హనుమాన్', 'వీరఘటోత్కచ', 'జింబో', 'హనుమాన్ పాతాళ విజయం' చిత్రాలను తెలుగులోనికి డబ్ చేశారు. అన్నీ కూడా విజయవంతంగా నడిచాయి. వారే ఇప్పుడు 'జింబో నగర ప్రవేశం' అనే పేరిట మరొక డబ్బింగు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం కూడా పై చిత్రాలకు నకలుగా ఉంది. ఆర్థికంగా విజయవంతంకాగల లక్షణాలన్నింటినీ సమపాళంగా ఇముడ్చుకొన్నది. ఇది జంగిల్ చిత్రమని పేరుచూస్తేనే తెలుస్తుంది.

ఒక సర్కస్ కంపెనీవారు వేటకు వెళ్ళి ఒక అడవి మనిషిని పట్టుకొని వస్తారు. సర్కస్ ట్రూపులోని ఒక అమ్మాయి అతని ప్రేమించి, ప్రేమించబడుతుంది. ఆమె సాహచర్యంతో అతను మామూలు మనిషి అవుతాడు. ఇంకో సర్కస్ గర్ల్ కూడా అతన్ని ప్రేమించి, తన వాణ్ణి చేసుకోవాలను కొంటుంది. కాని చివరకు ఓడిపోతుంది. ఈలోగా చాలా సాహస కృత్యాలు జరుగుతాయి. సర్కన్ ట్రూపులోని పెడ్రో అనే కోతి సాహసకృత్యాలలో ప్రధాన భూమిక వహిస్తుంది.

డబ్బింగు చిత్రాల ధోరణికి అలవాటుపడిన వారికి ఈ చిత్రం చాలా వినోదాన్నిస్తుంది. ఎక్కడా విసుగుపుట్టదు. కాలక్షేపానికి నిక్షేపం లాంటి చిత్రం. పాటలు చెప్పుకో తగినంత బాగా ఏమీ లేవు. శ్రీశ్రీ గారి డబ్బింగు కవిత్వం నల్లేరు మీద బండిలా సాగింది. భాష ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు.

జింబోగా ఆజాద్, నాయికగా చిత్ర, విదూషకుడుగా భగవాన్, అతని ప్రేయసిగా షమ్మీ నటించారు. పొద్దు పోవడానికి ఒకసారి తప్పక చూడవచ్చును.

నిర్మాత: హోమీవాడియా; దర్శకత్వం: నానాభాయ్ భట్; సంగీతం: చిత్రగుప్త; రచన: శ్రీ శ్రీ; స్పెషల్ ఎఫెక్ట్స్: బాబూ భాయ్ మిస్త్రీ; తారాగణం: ఆజాద్, చిత్ర, పెడ్రో (వానర తార), భగవాన్, షమ్మీ మొదలగువారు.

నండూరి పార్థసారథి
(1960 అక్టోబర్ 30వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post