భారత వీరజవాన్ తుపాకి దెబ్బకు హాహాకారాలు చేస్తూ నేలకొరిగిన పాకిస్తాన్ కిరాతకుని రక్తంలా పశ్చిమాకాశం అరుణిమ దాల్చింది. రక్తం క్రమంగా పేరుకుని, నల్లబడి, గడ్డ కట్టినట్లు ఆకాశం క్రమంగా నలుపెక్కుతోంది... అక్కడక్కడ నలుపు ఎరుపు కలిపిన మబ్బులు కరుళ్ళు కడుతున్నాయి.
మునిమాపు సమయం. నగరం ఆగ్రహావేశాలతో లోలోన దహించుకుపోతున్నది. వాతావరణం ఉద్రేకపూరితమయింది. వీధులు జనసమ్మర్దంతో కిటకిటలాడుతున్నాయి. అందరూ హడావిడిగా ముందుకు సాగిపోతున్నారు. హోటళ్ళవద్ద, పార్కులవద్ద జనం రేడియోల చుట్టూ చేరి అతిశ్రద్ధగా వార్తలు వింటున్నారు. వేడివేడి వార్తలతో తాజాగా వెలువడిన వార్తా పత్రికల చుట్టూ జనం మూగుతున్నారు. ఒకరు చదువుతుంటే మిగిలినవారు వింటున్నారు.
''పఠాన్ కోట్, అమృతసర్, శ్రీనగర్ లపై పాకిస్తాన్ విమానదాడులు''-
''అగర్తలపై పాక్ శాబర్ జెట్లచే రాకెట్ ప్రయోగాలు''-
''దేశమంతటా ఆత్యయిక పరిస్థితి ప్రకటన''-
''దురాక్రమణను క్రమశిక్షణతో సమైక్యంగా ఎదుర్కోవాలని ప్రధాని ఉద్బోధ-
''పశ్చిమసరిహద్దు పొడవునా ఉద్రిక్తపరిస్థితి''-
''ఎట్టి సవాలునైనా ఎదుర్కోవడానికి మన సాయుధబలాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని రక్షణమంత్రి అభయం...''
వీధుల్లో పోలీసు శకటాలు హడావిడిగా పరుగిడుతున్నాయి... పౌరరక్షణ ఏర్పాట్ల విషయం అధికారులు చర్చిస్తున్నారు... పాకిస్తాన్ గూఢచారుల పట్టివేతకై నిఘా చర్యలను తీవ్రతరం చేస్తున్నారు... విధ్వంసక చర్యలు జరగకుండా నగరంలోని ప్రధాన కర్మాగారాల వద్ద, రైలు స్టేషన్, రేడియో స్టేషన్, టెలిఫోన్ ఎక్స్ ఛేంజి మున్నగు వాటి వద్ద, వంతెనల వద్ద కాపలా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు...
స్వచ్ఛంద సేవా సంస్ధలు జాతీయ రక్షణనిధి విరాళాల సేకరణకు పని ప్రారంభించాయి.
శాంతి భద్రతలకు ఎట్టి ప్రమాదం లేదనీ, ప్రజలు భయభ్రాంతులకు లోనుకాకుండా నిబ్బరంగా ఉండాలనీ, యధాప్రకారంగా తమతమ దైనందిన కార్యకలాపాలను నిర్వర్తించుకోవచ్చుననీ ప్రభుత్వం అభయమిచ్చింది.
నగరంలో వీరావేశం ఉరకలు వేస్తున్నప్పటికీ ప్రజాజీవితం అస్తవ్యస్తంకాలేదు యథాప్రకారంగా దుకాణాలు, హోటళ్ళు, సినిమాథియేటర్లు, కార్యాలయాలు పనిచేస్తూనే ఉన్నాయి. హోటళ్ళలో బల్లలు చాలక, జనం 'క్యూ'లో నించుంటూనే ఉన్నారు. థియేటర్లు క్రిక్కిరిసిన ప్రేక్షకులతో చలన చిత్రాలను ప్రదర్శిస్తూనే ఉన్నాయి. రైళ్ళలో ప్రయాణీకులు కడ్డీలు పుచ్చుకుని వేళ్ళాడుతూనే ఉన్నారు.
''నాదీ స్వతంత్ర దేశం... నాదీ స్వతంత్ర జాతీ''-
రేడియో దేశభక్తిగీతాలను, సైనిక సంగీతాన్ని వినిపిస్తున్నది...
''యాహ్యాఖాన్ ను చంపండి, నరకండి. పాకిస్తాన్ నాశనం కావాలి...'' యువకులు నినాదాలు చేస్తూ ఊరేగింపు జరుపుతున్నారు.
''మాతృదేశ రక్షణకై సైన్యంలో, నౌకాదళంలో విమానదళంలో చేరండి... వివరములకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ను సందర్శించండి...'' గోడలపై పోస్టర్లు అతికించబడినాయి.
దేశభక్తి ప్రేరితులైన యువకులు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి వివరాలు కనుకుంటున్నారు. సైన్యంలో చేరడానికి తమ పేర్లు నమోదు చేయించుకుంటున్నారు.
సైనికులందరికీ సెలవు రద్దు చేసి, తక్షణం విధులకు హాజరు కావలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది. సెలవుల్లో ఉన్న సైనికులు ఆదరాబాదరా సామాన్లు సర్దుకుని ప్రయాణమవుతున్నారు...
సమయం సాయంత్రం ఆరుంబావు... హనుమాన్ పేటలో... ఒక పూరింటిలో... కంట తడిబెట్టించే హృదయ విదారక దృశ్యం...
కొత్తగా కాపురానికొచ్చిన ఒక ముగ్ధవధువు సజలనయనాలతో తన భర్తకు వీడ్కోలు యిస్తున్నది. నిండా పద్ధెనిమిదేళ్ళు నిండని పసి వయస్సు... వివాహమై ఇంకా వారం తిరగలేదు... కాపురానికొచ్చి ఇంకా మూడు నాళ్ళైనా కాలేదు. మాంగల్యం పసుపుతడి ఆరనే లేదు. శిరోజాలకు తలంబ్రాల పసుపు రంగు ఇంకా అలానే ఉంది.
''.... వద్దు మావాఁ.... నన్నిడిసి ఎల్లొద్దు... ఇయాల పొద్దుటాల నుంచి కుడి కన్నదరతా ఉంది.... గుండె దడదడ లాడతా ఉంది... వద్దు మావాఁ... నన్నన్నాయం సేసి పోకు...''.
ఆమె ప్రియుని వక్షంలో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నది-ఆమె కన్నీటితో అతడి విశాలవక్షస్థలం తడిసిపోయింది.... కండలు తిరిగిన అతడి బాహువులు ఆమెను బంధించివేశాయి... కొద్దిక్షణాలు ఇద్దరి మధ్యా మౌనం రాజ్యం చేసింది... అతడి కరాంగుళులు ఆమె ముంగురులను సవరిస్తున్నాయి... ఆమె చుబుకాన్ని పట్టి ముఖాన్ని పైకెత్తి కన్నీటిని తుడిచివేశాడు.... ప్రేమగా ఆమె కన్నుల్లోకి చూశాడు. క్షణాలు అతి వేగంగా దొర్లిపోతున్నాయి.
నిశ్శబ్దాన్ని చీలుస్తూ అతడు ఇలా అన్నాడు : ''...ఎర్రిదానా... దేనికే అంతయిదయిపోతావ్... నాకిదేం కొత్తంటే? నీకంటే ఇది కొత్తగానీ... ఈ ఊళ్ళో నా తడాకా తెలీనోడులేడు. తలొంచని ఈరుడని మనకి పేరు. నువ్వోకే గాబరాపడమాకు''.
''ఏమో మావాఁ... నీకేం నువ్వల్లాగే సెప్తావు... ఆడకి బోయినోళ్ళు తిన్నగా తిరిగి రారంట... ఎదురింటి ఎంకమ్మత్త కోడా సెప్పింది... నీకేదేనా ఐతే నాగతేంకాను?''
''మరేం బయంలేదూరుకోవే... నాకడ్డంవొచ్చినోడు మళ్ళీ బతుకుతాడంటా! నాయాలగాణ్ణి సున్నంలోకి బొయిఁకలేకుండా సేత్తాను. నా పెతాపం సూత్తే నువ్విట్టా మాట్లాడవ్... టయంలేదింక.. బేగ పోవాలి....''
''మావాఁ...'' దుఃఖావేగంతో ఆమె భర్తృ చరణాలపై వ్రాలిపోయింది. తన ఆశ్రు కుసుమాలతో పతిదేవుని పాదారవిందాలను అభిషేకించింది... అతడు ఆమె భుజాలను పట్టి పైకిలేవనెత్తాడు. తన కరాంగుళులతో ఆమె మృదుల కపోలాలపై ప్రవహిస్తున్న అశ్రువులను తుడిచివేశాడు. మరేం భయం లేదన్నట్లు వీపు నిమిరాడు... శిరమును మూర్కొన్నాడు... పిమ్మట గబగబ వెళ్ళి దణ్ణెం మీది చొక్కా తీసివేసుకున్నాడు.
''జాగర్త మావాఁ...'' అంటూ ఆమె భర్తనుదుట వీరకుంకుమ దిద్దింది. మాంగల్యం కన్నులకద్దుకున్నది.
''ఎల్లొస్తానే... నువ్వేంగాబరా పడమాకు...'' అంటూ అతడు వీధిలోకి నడిచాడు. ఆమె గుమ్మంలో నుంచుని చూస్తున్నది. కొద్దిక్షణాల్లో అతడు వీధి మలుపుతిరిగి జనసందోహంలో లీనమైపోయాడు. ఆమె దీర్ఘనిశ్వాసం విడిచి లోపలకు వెళ్ళిపోయింది.
* * *
రోడ్డుమీద జనంలో నుంచి తోసుకుని ముందుకు పోతున్న అతడి మస్తిష్కంలో ఆలోచనా తరంగాలు ఉవ్వెత్తున్న ఎగసిపడుతున్నాయి. అయినా అతడు ఏకైకలక్ష్యంతో గమ్యాభిముఖంగా సాగిపోతున్నాడు. మధ్యమధ్య ఎడమ కన్ను అదురుతున్నది.
''....ఇయాల పొద్దుటాల నుంచి కుడి కన్నదరతాఉంది... గుండె దడదడ లాడతా ఉంది... వద్గు మావాఁ...'' తన తోడిదే జీవనమని నమ్మిన తన సహధర్మచారిణి అశ్రుసిక్త వదనారవిందం కళ్ళ ముందు కనిపిస్తున్నది....
ఉహూఁ... ఇటువంటి మమకారాలకు లోనై తన లక్ష్యాన్ని విస్మరించరాదు...
కర్తవ్యదీక్ష అతడి పదగతిని తొందరింపజేస్తున్నది. అడుగులు వడివడిగా ముందుకు సాగుతున్నాయి.
''..... ఆడకిబోయినోళ్ళు తిన్నగా తిరిగి రారంట... ఎదురింటి ఎంకమ్మత్త కోడా సెప్పింది... నీకేదేనా ఐతే...''
భార్యమాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి... ఛీ... ఏమిటిది! ఎన్నడూ లేనిది... తనకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి!
''ఈ ఊళ్ళో నా తడాకా తెలీనోడు లేడు... తలొంచని ఈరుడని మనకి పేరు....''
అవును... తలవంచని వీరుడు తను. భయపడి వెనక్కి తగ్గడం తన రక్తంలో లేదు. వందమంది కాదు... వెయ్యిమంది ఉన్నా దూసుకుపోగలడు తను...
మందభాగ్యుని మీదికి ముంచుకు వస్తున్న మృత్యువులా ఆకాశంలో చీకటి అలముకుంటున్నది... అప్పుడప్పుడే వీధిలో లైట్లు వెలుగుతున్నాయి.
గమ్యం దగ్గరపడుతున్న కొద్దీ ఆవేశంతో అతడి హృదయం ఉప్పొంగుతున్నది. కర్తవ్యదీక్ష అతివేగంగా అతడికి గమ్యానికి ఈడ్చుకు వెడుతున్నది...
రావలసిన చోటికి రానేవచ్చాడు... గుంపులు గుంపులు జనం... ఇసుకవేస్తే రాలని జనం... తోపిడి... త్రొక్కిసలాట... హాహాకారాలు... చొక్కాలు చిరుగుతున్నాయి... మక్కెలు విరుగుతున్నాయి... పోలీసుల లాఠీఛార్జీ... కొందరికి రక్తపుగాయాలు...
''శత్రువులను తరిమికొట్టండి. దేశ ద్రోహులను తుదముట్టించండి. విద్రోహులముఠాను సర్వనాశనం చేసిన సాహస గూఢచారికథ... అంతర్జాతీయ గూఢచారి ముఠాను హడలెత్తించిన అపూర్వ గూఢచారి కథ... నేడే చూడండి...
...జేమ్స్ బాండ్ 7 7 7''.
రెండు చేతుల్లో రెండు పిస్తోళ్ళు పట్టుకుని, ఎడంకాలితో ఒకణ్ణి, కుడికాలితో ఒకణ్ణి తన్నుతున్న కథానాయకుని 20 అడుగుల ఎత్తుబొమ్మ కనిపించగానే అతడికి పూనకం వచ్చింది. 'హుం' అని హుంకరించి, కరికి లంఘించుకొదమ సింగమువలె 40 పైసల బుకింగ్ వద్ద మూగిన వందలాది జనం మీదికి విరుచుకుపడ్డాడు. మోచేతులతో అడ్డువచ్చిన వాడినల్లా పొడిచేశాడు. చొక్కా చిరిగిపోయింది. దానితో పూనకం మరీ ఎక్కువయింది. ముందున్న వాళ్ళని జుట్టుపట్టుకుని వెనక్కి లాగాడు. పక్కనున్న వాళ్ళ డొక్కల్లోతన్నాడు.
''ఏయ్... నీకే చెప్పేది... ఏంటా దౌర్జన్యం... ఇవతలికి వచ్చావా లేదా'' అంటూ పోలీసు లాఠీతో కొట్టాడు. నుదురు చిట్లి బొటబొటరక్తం కారింది. అయినా అతడు లక్ష్యపెట్టలేదు. నెత్తురు తుడుచుకోనైనా లేదు. పద్మవ్యూహంలో అభిమన్యుడిలా ద్విగుణీకృతావేశంతో గుంపును చీల్చుకుని వెళ్ళి బుకింగ్ గూట్లో చెయ్యి పెట్టాడు.
''ఈ ఊళ్ళో మన తడాకా తెలీనోడు లేడు. తలొంచని ఈరుడని మనకి పేరు'' అని మీసం దువ్వుతూ, టిక్కెట్ తీసుకుని హాల్లోకి ప్రవేశించాడు.
నండూరి పార్థసారథి
(ఈ రచన 1972లో యువ మాసపత్రికలో ప్రచురితమయింది)