Humor Icon

ప్రపంచంలో తప్పుచేయని వారూ, అప్పు చేయనివారూ ఉండరు. అప్పు తప్పు కాదు.

జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ధనకనకవస్తు వాహనాలలో ఏదో ఒకదానిని అప్పుతీసుకోనివారుండరు. ఏదో ఒకరూపంలో ఇతరులకు ఋణపడని వారుండరు.

అప్పు అనేది కొందరికి అవసరం, కొందరికి వ్యసనం. కొందరికి వేడుక, కొందరికి వాడుక. కొందరికి అది బొత్తిగా నిత్య జీవితావసరం. పొద్దున్నే లేవగానే కాఫీపొడి దగ్గర్నించి, నెయ్యి, పంచదార, పప్పులు, ఉప్పుల దగ్గర్నించి, పట్టుచీరలు, నగల దాకా సమస్తమైన వాటినీ బదులు అడిగి పుచ్చుకొంటూ ఉంటారు. అసలు సంపాదన అంటూ లేకుండా కేవలం అప్పులతో కులాసాగా జీవించే ప్రతిభావంతులు ఎందరో ఉన్నారు.

కేవలం పేదలు మాత్రమే అప్పులు చేస్తారనుకోవడం పొరపాటు. పేదవాళ్లు పదీ పరకా అప్పు చేస్తారు. మధ్యతరగతి వాళ్ళు వందలు, వేలూ అప్పు చేస్తారు. లక్షాధికారులు లక్షల్లో, కోటీశ్వరులు కోట్లలో అప్పులు చేస్తారు. ఎంత చెట్టుకంత గాలి అన్నట్లు ఎంతవారికంత అప్పు. సిరిని వరించిన, సిరి వరించిన శ్రీనివాసుడే పెళ్ళి కోసం కుబేరుడి దగ్గర అప్పుచేయాల్సి వచ్చింది. సిరి నట్టింట కొలువున్నా ఆయన అప్పు తీర్చలేకపోయాడు. అసలు సంగతి అలా ఉంచి వడ్డీయే జమకట్టలేకపోయాడు. శ్రీనివాసుని ఋణవిమోచన నిధికి శతాబ్దాల తరబడి కోట్లాది భక్తులు విరాళాలు సమర్పిస్తున్నా ఆయన అప్పు తీరలేదు. దేవుడికే దిక్కులేకపోతే ఇక మానవ మాత్రుల సంగతి చెప్పాలా? సింహాద్రి పైనున్నవాడు అప్పలస్వామి అయితే తిరుమలపై వేంచేసిన వాడు అప్పులస్వామి.

ప్రకృతికి మూలమైన పంచభూతాలలో అప్పొకటి. సంస్కృతంలో అప్పంటే నీరు. తెలుగులో అప్పంటే మనందరికీ తెలుసు. ఈ రెండప్పులకీ అర్థసామ్యం ఉంది. మనిషికి సిరి ఎంత అవసరమో అప్పు అంత అవసరం. నీరు ద్రవము, అప్పు ద్రవ్యము, రెండూ ఎత్తునుంచి పల్లానికి ప్రవహిస్తాయి.

అప్పిచ్చువాడూ, వైద్యుడూ, ఎప్పుడూ ఎడతెగక పారే ఏరూ లేని వూళ్ళలో కాపురం చేయవద్దని సుమతీశతక కర్త హెచ్చరించాడు. అప్పు, వైద్యం, నీరూ ఎంత అవసరమో దీన్ని బట్టి తెలుస్తుంది. అప్పిచ్చేవాడే వైద్యుడు అనే అంతరార్థం కూడా ఇందులో ఉంది. ప్రాణం మీదికొచ్చినప్పుడు అప్పిచ్చి ఆదుకొనేవాడే ప్రాణదాత.

ఎల్లయ్య అప్పు తీర్చడానికి పుల్లయ్య దగ్గర అప్పు చేయడం, పుల్లయ్య అప్పు తీర్చడానికి మల్లయ్య దగ్గర అప్పు చేయడం మళ్లీ పుల్లయ్య దగ్గర అప్పు చేసి మల్లయ్య అప్పు తీర్చేయడం... ఈ ఋణచక్రభ్రమణానికి నమ్మకమే ఇరుసు. చెప్పిన రోజుకి బాకీ తీర్చేస్తారనే నమ్మకం ఉంటే ఎవరైనా ఎవరికైనా శక్తివంచన లేకుండా అప్పులిస్తారు. ఒక్క అప్పులకే కాదు-ప్రపంచంలో అన్ని సంబంధాలకీ నమ్మకమే ఆధారం. మన నిజాయితీ గురించి, స్తోమత గురించి ఎంతమేరకు నమ్మకం కలిగించగలమో అంత మేరకు మనం అప్పులు పుట్టించగలం. నెలరోజుల్లో తీర్చేస్తామని చెప్పిన బాకీని పదిహేను రోజుల్లోనే తీర్చేస్తే అప్పనంగా వచ్చినంత ఆనందంగా ఉంటుంది ఋణదాతకి. ఆనందం పట్టలేక ఆయనే ఎప్పుడైనా పదీ పరకా కావాలంటే అడిగి పట్టుకుపొండి అని నోరుజారేస్తాడు.

ఋణదాత క్షేత్రంలాంటి వాడు. నమ్మకం విత్తనంలాంటిది. విత్తనం వేసి విత్తం వండించేవాడు అవసరాల అప్పారావు గారు. క్షేత్రం ఎంత సారవంతమయినా విత్తనం మంచిది కాకపోతే మొలకెత్తదు. విత్తనం వేయాలనుకునేవాడు ముందు క్షేత్రస్వభావాన్ని తెలుసుకోవాలి. అడిగిందే తడవుగా లేదనే పాషాణ హృదయలుంటారు. లాకేత్వమివ్వని శిబి, దధీచిలాంటి వాళ్లుంటారు. ఈ రెండు రకాల మధ్య అనేకానేకరకాల వారుంటారు. అప్పురాబట్టుకోవాలంటే ఋణ హృదయవేదియై ఉండాలి. భోజరాజుని చూడగానే కవిత్వం చెప్పాలనిపించినట్లు కొందరిని చూడగానే అప్పు అడగాలనిపిస్తుంది. కొందరి దగ్గర డబ్బులు అడగాలంటే ఎంతో అభినయ ప్రావీణ్యం అవసరమవుతుంది. ఎన్నోలయలు, హొయలు ప్రయోగించాల్సి వస్తుంది.

ఏమాటకామాటే చెప్పుకోవాలి. నమ్మకంగా చెప్పిన రోజుకి బాకీ తీర్చేసి మళ్లీ అప్పు చేయడంలో గొప్పతనం లేదు. అందులో కళా లేదు. ప్రావీణ్యం లేదు. మజా అసలే లేదు. పాతబాకీలు తీర్చకుండా, పదే పదే అదే దాత దగ్గర అప్పులడగటం గొప్ప కళ. గొప్ప అడ్వెంచర్. అందులో గొప్ప త్రిల్ ఉంది. నిజాయితీకి నిదర్శనం చూపకుండా అభినయ ప్రావీణ్యంతో నమ్మోహపరిచి, స్పృహలోకి వచ్చేలోగానే అప్పుతీర్చేసి అంతర్ధానమైపోవడం ఒక రకం గారడీ. కొందరు దాతలు ఇలాంటి గారడీవాళ్లని ప్రథమ వీక్షణంలో మోహించి, 'అప్పుకావాలా నాయనా' అని అడిగి మరీ యిస్తారు.

అప్పు మొలకెత్తాలంటే నమ్మకం అనే విత్తనం కావాలని ఇంతకముందు మనవి చేశాను. కాని, ఇలాంటి గారడీ వాళ్లకి విత్తనంతో నిమిత్తం లేదు. రోడ్డు పక్క గారడీ ప్రదర్శించేవాళ్ళు మన కళ్ల ఎదటే నిమిషాలలో చెట్టు మొలిపించి, కాయలు కాయిస్తారు చూడండి-అలాగే వీళ్ళూ నమ్మకంతో కాక మాయలో అప్పులు పుట్టిస్తారు. అందుకే ఇది కళ.

చతుష్షష్టి కళల జాబితాలో ఇది ఉందో లేదో గాని, లేకపోతే దీన్ని అర్జెంటుగా చేర్చడం అవసరం. 'బెగ్, బారో, ఆర్ స్టీల్' అన్నారు. ముష్టెత్తో, అప్పుచేసో, దొంగిలించో సంపాదించడం అన్నమాట. ముష్టెత్తడం హీనం, దొంగిలించడం మరీహినం. రెండింటికీ మధ్యస్దమైన 'అప్పు' భేషైన పద్ధతి. నిక్కచ్చిగా బాకీ తీర్చేసేటట్లయితే అది పెద్దమనిషి తరహాయేగాని, ఎగవేసేటట్లయితే అది ముష్టెత్తడం అవుతుంది. కాకపోతే దొంగతనం అవుతుంది. ఇచ్చేవాడు మళ్లా వస్తుందేమోనన్న ఆశలేకుండా ఇచ్చినా, పుచ్చుకునేవాడు మళ్ళీ ఇచ్చే ఉద్దేశం లేకుండా పుచ్చుకున్నా అది ముష్టి అవుతుంది. ఇచ్చేవాడు ఆశాభావంతో ఇచ్చి, పుచ్చుకున్నవాడు ఎగనామం పెడితే అది దొంగతనం అవుతుంది. కాని, పుచ్చుకున్న వాడు ఎప్పటికైనా మీడబ్బు మీకు పువ్వుల్లో పెట్టి అప్పజేప్పేస్తాను అని వాయిదా వేసినంతకాలం అది అప్పుగానే చెలామణీ అవుతుంది.

ఋణదాతని సమ్మోహపరిచే అభినయ కళాప్రావీణ్యం గురించి ఇందాక ప్రస్తావించాను. ఈ అభినయంలో సాత్వికాభినయం, ఆంగికాభినయం, వాచికాభినయం, ఆహార్యాభినయం అని నాలుగురకాలున్నాయి. ఈ నాలుగింటిని సందర్భోచితంగా తగు మోతాదుల్లో మేళవించుకొని ప్రయోగించాలి. ఔచిత్యం తప్పితే రసాభాస అవుతుంది. సాత్వికాభినయం అంటే - ముఖకవళికలతో హావభావ విన్యాసాలు ప్రదర్శించడం. ఆత్మాభిమానం, దైన్యం, నిస్సహాయత, లజ్జ, ఆభిజాత్యం, నిజాయితీ వగైరా స్థాయీ భావాలను వ్యక్తం చేయాలన్నమాట. ఋణదాత చదువు, సంస్కారం, అంతస్తు, హోదా, స్వభావం - వీటిని దృష్టిలో పెట్టుకొని నటించాలి. ఓవరాక్టింగ్ చేస్తే క్లాస్ కి నచ్చకపోవచ్చు. మరీ పొదుపుగా నటిస్తే మాస్ కి నచ్చకపోవచ్చు. ఋణదాత క్లాస్ రకమో, మాస్ రకమో గమనించి తదనుగుణమైన నటన ప్రదర్శించాలి. మరీ అవసరమయితే ట్రాజిక్ హీరోలా కూడా నటించక తప్పదు.

ఆంగికాభినయం అంటే సాత్వికాభినయానికి అనుగుణమైన కరచరణాద్వవయవ విన్యాసం. 'హలో' అంటూ కరచాలనం చేయడం, భుజం తట్టడం, ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం, 'బాబ్బాబు' అంటూ గడ్డం పట్టుకోవడం, చేతులు పట్టుకొని ఇవే కాళ్లనుకోమనడం, లేదా కాళ్లు పట్టుకుని యివి కాళ్లుకావు చేతులనుకోమనడం ఈ చేష్టలన్నీ ఆంగికాభినయం కిందికి వస్తాయి. మూడోది - వాచికాభినయం. ఇది చాలా క్లిష్టమైనది. నాలిక్కి నరం లేదంటారు. ఎలా పడితే అలా తిరుగుతుంది. దాన్ని జాగ్రత్తగా అదుపులో పెట్టుకొనకపోతే చాలా ప్రమాదం. సమయోచిత పదజాలంతో ప్రస్తుతించడం, ప్రశంసించడం, అభినందించడం, 'భేష్ అని మెచ్చుకోవడం, అడగడం, అభ్యర్థించడం, మొరబెట్టుకోవడం-ఇవన్నీ వాచికాభినయంలో భాగాలు. మొరపెట్టుకుంటే గాని పని గడవనిచోట దర్జాగా అడిగితే 'ఓరి వీడి పొగరు మండిపోను' అనుకుంటాడు ఋణదాత. అసలుకే మోసం వస్తుంది.

ఆహార్యాభినయం అంటే ఎప్పటికి ఏ వేషం వెయ్యాలో ఆ వేషం వెయ్యడం. ఒకచోట కుచేలావతారం, వేరొకచోట కుబేరావతారం దాల్చడం. మాసిన గడ్డంతో పెరిగిన జుట్టుతో, చిరిగిన షర్టుతో అరిగిన జోళ్ళతో వెడితేనే ప్రసన్నులవుతారు కొందరు ఋణదాతలు. ఆ రూపానికి మాచింగ్ గా ఉండేటట్లు గద్గదిక కంఠంతో 'మహా ప్రభువులు మీలాంటి వారు ఆదుకోపోతే మాలాంటి వారి గతి ఏమవుతుంది' అనే డైలాగుతో మెలోడ్రామా ప్రదర్శిస్తే గాని ఫలితం దక్కదు కాని, ఈ మెలోడ్రామా కొందరి దగ్గర చెల్లదు. ఇంత నికృష్టంగా ఉన్నవాడు మళ్ళీ అప్పేం తీరుస్తాడు అని పొమ్మంటారు. కుచేలావతారంలో కోటీశ్వరుని ఇంటికి వెడితే గేటు దగ్గర గూర్ఖావాడే ఆటకాయిస్తాడు. కిరాయి సూటూ, పరాయి బూటూ వేసి, ప్రైవేటు టాక్సీలో వెళ్ళి దర్జాగా సమాన స్థాయిలో జోకులు వేస్తూ మాట్లాడి అప్పురాబట్టాలి. అప్పుకోసం వచ్చినట్లు కోటీశ్వరరావుగారికి ఏ మాత్రం అనుమానం రాకుండా ప్రవర్తించాలి.

ఈ చతుర్విధాభినయంలో ఆరితేరిన అప్పారావు దమ్మిడీ పెట్టుబడి లేకుండా కోటీశ్వరులతో స్నేహం చేయగలడు. ఆ స్నేహాన్ని పెట్టుబడిగా పెట్టి బ్యాంకుల నుంచి లక్షలు మంజూరు చేయించుకోగలడు. ఆ లక్షలతో పాతబాకీలు తీర్చేసి కొత్తవి పుట్టించగలడు. గారడీవాడు పది పన్నెండు బంతులని రెండు చేతులతో గిరగిర తిప్పుతూ ఒక వలయాన్ని సృష్టించినట్లు, అప్పారావు గొలుసు కట్టుగా అప్పులు చేస్తూ, తీరుస్తూ ఋణచక్రాన్ని తిప్పుతూ ఉంటాడు.

ఇదివరకు అప్పుల కోసం కేవలం వ్యక్తులపై ఆధారపడవలసి వచ్చేది. ఇప్పుడు బోలెడు బ్యాంకులున్నాయి. భూమి తనఖా పెట్టుకుని, పంట కుదువబెట్టుకుని, బంగారం తాకట్టుబెట్టుకుని అప్పులు ఇస్తున్నాయి. అసలు ఏమీ తాకట్టు పెట్టుకోకుండా మనిషి నమ్మకంతో మాట నమ్మకంతో స్వయం ఉపాధి కల్పన పథకం కింద అప్పులిస్తున్నారు. జాతీయం చేసిన బ్యాంకులు మరీ చేతికి ఎముక లేకుండా ఋణాలిస్తున్నాయి. బ్యాంకుల నిబంధనలన్నీ కంఠస్థం చేసి, ఏ నిబంధనని ఎలా మనకి వర్తింపచేసుకోవచ్చునో తెలుసుకొంటే బోలెడు అప్పులు. బాకీలు తీర్చినా తీర్చకపోయినా ఈ బ్యాంకులు కాబూలీవాలా లాగా, మనల్ని రచ్చకీడవ్వు. ఈ బ్యాంకులు అత్యంత సారవంతమైన ఋణక్షేత్రాలు. ఆధునిక ఋణసాయ పద్ధతుల ప్రకారం కృషి చేస్తే పుష్కలంగా ఋణాలు పండుతాయి.

అప్పులు అందరికీ అవసరమే. కాని, వాటిని పుట్టించడం అందరికీ చేతకాదు. అటువంటి వారు అవస్ధపడవలసిందేనా? వారిని ఆదుకోవలసిన బాధ్యత ఋణ విజ్ఞానవేత్తలకు లేదా? రోగమొస్తే ఏ మందు వేసుకోవాలో తెలియక డాక్టరు దగ్గరకి వెడుతున్నాం. ఆస్తి లావాదేవీలు పరిష్కరించుకోవడానికి న్యాయవాదుల దగ్గరకి వెడుతున్నాం. దొంగలు పడితే పోలీసుల దగ్గరికి వెడుతున్నాం. కంపెనీ అక్కౌంట్లని పరిష్కారం చేయడానికి ఆడిటర్ల దగ్గరకి వెడుతున్నాం. మరి అప్పులు కావాలంటే సలహా సంప్రదింపుల కోసం ఎవరి దగ్గరకి వెడతాం?

ఏ అంతస్తులో వారికి ఏ అవసరానికి ఎక్కడ ఎంత అప్పు దొరికే అవకాశం ఉందో సలహా ఇచ్చే కన్నల్టెన్సీ సర్వీసులు ప్రారంభించడం అవసరం. క్లయంట్ స్తోమతను బట్టి, అతని అవసరాన్ని బట్టి సరసమైన ఫీజును నిర్ణయించాలి. క్లయంట్ వెంటనే ఫీజు చెల్లించలేకపోతే అప్పుగా సలహాలివ్వాలి. సలహా ప్రకారం క్లయింట్ అప్పు సంసాదించుకున్న తర్వాత సలహా ఫీజు చెల్లించేస్తాడు.

అక్కౌంటెన్సీ, బ్యాంకింగ్ లాంటి వాణిజ్య సంబంధమైన శాస్త్రాలెన్నో వున్నాయి. ఋణాలకు సంబంధించిన శాస్త్రం అంటూ ఒకటి లేకుండా పోయింది. ఈ లోటును అకాడమీలే తీర్చాలి. ఋణ విజ్ఞాన ఖనులతో ఒక ఎడిటోరియల్ బోర్టు వేసి ఋణసాయ శాస్త్రాన్ని రూపొందింపజేయాలి. ఈ బృహత్పథకానికి ప్రభుత్వం ఉదారంగా గ్రాంటు మంజూరు చేయాలి. అది సాధ్యం కాకపోతే కనీసం ఋణాలైనా మంజూరు చేయాలి.

దరిమిలా ఈ ఋణసాయ శాస్త్రాన్ని విశ్వవిద్యాలయాలన్నింటిలో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి. డిప్లొమాలు, డిగ్రీలు ఇవ్వాలి. ఈ శాస్త్రంలో రిసెర్చి చేసిన వారికి డాక్టరేట్లు ఇవ్వాలి. క్రమంగా ఈ శాస్త్రాన్ని వయోజన విద్యలో కూడా ప్రవేశపెట్టాలి.

వ్యక్తులే కాదు - రాష్ట్రాలు అప్పుచేస్తున్నాయి. దేశాలు అప్పు చేస్తున్నాయి. ఈ ఋణచక్ర భ్రమణం ఆగిపోతే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుంది. అందుచేత ఈ ఋణసాయ శాస్త్ర ప్రాముఖ్యం ఇంతా అంతా అని చెప్పడానికి వీల్లేదు. ఇది అచిరకాలంలో వటవృక్షంలా విస్తరించే అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆహార సంస్థ లాగా అంతర్జాతీయ ఋణబాధా విమోచన సంస్థ నొకదానిని ఏర్పాటు చేయడం అవసరం. అప్పుడే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది.

నండూరి పార్థసారథి
(ఆకాశవాణి సౌజన్యంతో 1979 అక్టోబర్ 28వ తేదీన ఆంద్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post