రవిశంకర్ వినూత్న ప్రయోగం

1955 నుంచి 1980 దాకా-పాతికేళ్ళ పాటు-పాశ్చాత్య ప్రపంచంలో నిరాఘాటంగా జైత్రయాత్రలు జరిపి సంగీత ప్రియుల హృదయాలను కొల్లగొట్టిన పండిత్ రవిశంకర్ ఇప్పుడు ప్రాచ్య ప్రపంచంవైపు తిరిగారు. ఆయన ప్రాగ్దిగ్విజయ యాత్రలో తొలి విజయం 'ఈస్ట్ గ్రీట్స్ ఈస్ట్' లాంగ్ ప్లే రికార్డుగా రూపు దాల్చింది. భారతీయ వాద్యాలపై పాశ్చాత్య సంగీతాన్ని, పాశ్చాత్యవాద్యాలపై భారతీయ సంగీతాన్ని మనం ఇదివరకే చాలా సార్లు విన్నాం. నిత్యనూతన ప్రయోగ శీలియైన రవిశంకర్ ఇప్పుడు మొదటిసారిగా జాపనీస్ వాద్యాలపై భారతీయ సంగీతాన్ని వినే అవకాశం కల్పించారు.

కడచిన పాతికేళ్ళలో ఆయన యెహూదీ మెనూహిన్ (వైలిన్), బడ్ షాంక్ (ప్లూట్), డెనిస్ బూడిమిర్ (గిటార్), జాపియర్ రాంపాల్ (ప్లూట్), మార్టిన్ గెలియట్ (హార్ప్), జార్జి హరిసన్, ఆండ్రీ ప్రెవిన్ వంటి ప్రముఖ పాశ్చాత్య సంగీత విద్వాంసులతో కలిసి చేసిన ప్రయోగాలు ఏడెనిమిది లాంగ్ ప్లే రికార్డులలో విన్నాము. ఆయన, మెనూహిన్ కలిసి వాయించినవి మూడు రికార్డులు 'వెస్ట్ మీట్స్ ఈస్ట్' శీర్షికతో వెలువడినాయి. ఈ తాజా రికార్డులో ఆయన ఇద్దరు ప్రసిద్ధ జాపనీస్ సంగీత విద్వాంసులతో కలిసి ప్రయోగాలు చేశారు. సుసుమూ మియాషితా అనే ఆయన 'కోటో' అనే తంత్రీవాద్యం వాయించారు. హోజాన్ యమామోటో అనే ఆయన 'షకూహాచీ' అనే వాద్యం వాయించారు. మనదేశంలో సితార్, వీణలాగా జపాన్ లో 'కోటో' ప్రసిద్ధమైన వాద్యం. షకూహాచీ మన వేణువులాంటి వాద్యం. చూడడానికి కొంచెం షెహనాయిలాగా ఉంటుంది. షెహనాయి లాగానే నిలువుగా పట్టుకుని వాయిస్తారు. మియాషితా, యమామోటో ఇద్దరూ నలభైయేళ్ళలోవువారు. రవిశంకర్ తో వారి సంగీత మైత్రి భారత-జపాన్ సాంస్కృతిక సహకార చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని సృష్టించిందనే చెప్పాలి. 'ఈస్ట్ గ్రీట్స్ ఈస్ట్' (పాలిడార్ 2311006) రికార్డులో నలుగురూ విడివిడిగా వాయించినవి, నలుగురూ కలిసి వాయించిన ఒక రచన-మొత్తం ఐదు ఉన్నాయి. కోటో, షకూహాచీ వాద్యాల కోసం రవిశంకర్ ప్రత్యేకంగా సంగీత రచన చేశారు.

సుసుమూ మియాషితా (కోటో), హోజాన్ యమామోటో (షకూహాచీ)

మియాషితా 'దుర్గా' రాగంలో కోటోపై వాయించిన ఆలాప్-జోడ్-ఝాలా అత్యద్భుతంగా ఉంది. ఆ సంగీత రచనకు 'పదసపా' అని పేరు పెట్టారు. 'పదసప' అనే స్వరసంపుటి ఈ రచనలో పదే పదే వినిపిస్తుంది. అందుకే దానికా పేరు పెట్టారు. దుర్గారాగం (సరిమపదస-సదపమరిస) ఔడవ-ఔడవ జాతి రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని శుద్ధ సావేరిని పోలి ఉంటుంది. ఈ రచనలో కోటో నాదమాధుర్యం, మియాషితా వాదన ప్రావీణ్యం కేవలం అనుభవైకవేద్యం. కోటో నాదం కొద్దిగా జలతరంగ్, కాష్ఠతరంగ్ నాదాలను పోలి ఉంటుంది. కాని, కోటోలాంటి వాద్యం మనకు లేదనే చెప్పాలి. జలతరంగ్ లో మాదిరిగానే కోటో మీద కూడా 'మీండ్' (జారుస్వరాలు) వంటి గమకాలు పలకవు. అయినా, నాదంలోని శ్రావ్యతవల్ల, రచనలో సౌందర్యంవల్ల, కొత్తదనం వల్ల మనకు ఆ వెలితి ఏమీ కనిపించదు.

అల్లారఖా

'పదసపా' తర్వాత అల్లారఖా తబ్లా సోలో 'కెహర్వా' తాళం వాయించారు. ఎప్పటివలెనే ఆయన తబ్లా వాదనం ప్రతిభావంతంగా, ఉత్సాహభరితంగా ఉంది. దీని తర్వాత రవిశంకర్, మియాషితా, యమామోటో, అల్లారఖా కలిసి 'గుణ్ కలి' రాగంలో ఆలాప్, గత్ వాయించారు. ఈ రాగం (సరిమపదస-సదపమరిస) బైరవ్ థాట్ జన్యం. ఇది కర్ణాటక సంగీతంలోని 'మలహరి'కి దగ్గరగా ఉంటుంది. మొదట ఆలాప్ లో ఒకరి తర్వాత ఒకరుగా వాయించి, తర్వాత గత్ లో అందరూ కలుసుకున్నారు. విలంబగతిలో మొదలు పెట్టి క్రమంగా వేగం పెంచుతూ ఝాలాతో ముగించారు. ఇందులో ప్రతి స్వరం ముందుగా రచించి సిద్ధం చేసినదే అయినప్పటికీ రికార్డు వింటుంటే అలా అనిపించదు. అంతా సద్యః కల్పనగానే అనిపిస్తుంది.

రికార్డు రెండో వైపు మొదటి అంశం 'శివరంజని' (సరిగపదస) రాగంలో షకూహాచీ సోలో. ఈ రచనకు 'నమః శివాయ' అని పేరు పెట్టారు. కొద్దిసేపు ఆలాప్ వాయించిన తర్వాత యమామోటో ఆరు మాత్రల దాద్రా తాళంలో ఒక గత్ వాయించారు.

రవిశంకర్

చిట్టచివరి అంశం రవిశంకర్ సోలో. గంభీరమైన 'కౌశిక ధ్వని' (సగమదనిస) రాగంలో ఆయన ఆలాప్, జోడ్-ఝాలా, గత్ (రూపక్ తాళం) వాయించారు. ఈ రికార్డులో వినిపించిన నాలుగూ ఔడవ-ఔడవ జాతి రాగాలు (ఆరోహణలోనూ, అవరోహణలోనూ కూడా ఐదే స్వరాలు గల రాగాలు) కావడం ఒక విశేషం.

శాస్త్రీయ సంగీత ప్రియులు-ముఖ్యంగా నూతన ప్రయోగాలను హర్షించే వారు-తప్పకుండా కొని, విని, ఆనందించి, భద్రపరచుకోవలసిన రికార్డు 'ఈస్ట్ గ్రీట్స్ ఈస్ట్'.

నండూరి పార్థసారథి
(1981 జనవరి 25వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post