Title Picture

బాలల చలన చిత్ర సంఘం ఆధ్వర్యాన ఈ మధ్య ఢిల్లీ, బొంబాయి, మద్రాసు, బెంగుళూరు నగరాలలో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం జరిగింది. మన దేశంలో పిల్లల కోసం ప్రత్యేకంగా చలన చిత్రోత్సవం నిర్వహించడం అపూర్వం కాకపోయినా అపురూపం. ఈ చలన చిత్రోత్సవం బెంగుళూరులో పదిరోజులపాటు-కబ్బన్ పార్కులోని 'బాలభవన్'లో జరిగింది. ఇండియాతో సహా 15 దేశాలకు చెందిన 27 చిత్రాలు ప్రదర్శించబడినాయి. వాటిలో పది ఫీచర్ (పూర్తి నిడివి కథా చిత్రాలు) ఫిల్ములు-అంటే సుమారు గంటన్నర సేపు నడిచే చిత్రాలు. మిగిలినవి చిన్న చిత్రాలు. అంటే 20 నిమిషాలలోపు చిత్రాలు. వీటిలో కొన్ని మరీ చిన్న చిత్రాలు. రెండు మూడు నిమిషాలవి కూడా ఉన్నాయి.

పది ఫీచర్ ఫిల్ములలో రెండు కార్టూన్ చిత్రాలు. వీటిలో జపాన్ చిత్రం 'మ్యాజిక్ బాయ్' (Magic Boy) అద్భుతంగా ఉంది. డెన్మార్క్ 'బెన్నీస్ బాత్ టబ్' బాగాలేదు. పిల్లల కోసం తీసిన ఆ చిత్రంలో అసభ్య శృంగార దృశ్యాలు, వెకిలి హాస్యం ఎందుకు చొప్పించారో ఆశ్చర్యంగా ఉంది. మిగిలిన ఎనిమిది ఫీచర్ ఫిల్ములు చక్కగా ఉన్నాయి.

'మ్యూజిక్ బాయ్'లో పది పన్నెండేళ్ళ కుర్రాడు కథానాయకుడు. అతను, అతని అక్క ఒక అడవిలో చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటారు. వారికి తోడుగా కోతులు, ఎలుగుబంటి పిల్లలు లేళ్ళు, కుందేళ్ళు, ఉడతలు కూడా ఆ ఇంట్లో నివసిస్తూ ఉంటాయి. అక్కడికి కొంత దూరంలో ఒక పర్వతగుహలో ఒక మంత్రగత్తె ఉంది. ఆమెకు ఒక బందిపోటు ముఠా ఉంది. ఆ బందిపోట్లు అడపా తడపా గ్రామాల మీద పడి ప్రజల ఆస్తులు దోచుకు పోతూ ఉంటారు. ఇళ్ళు తగలబెడుతూ, అడ్డం వచ్చిన వాళ్ళని ఊచకోత కోస్తూ ఉంటారు. కొంతమందిని ఎత్తుకుపోయి మంత్రగత్తెకు అప్పగిస్తూ ఉంటారు. ఆ మంత్రగత్తెను నాశనం చేస్తానని శపథం చేసి ఆ కుర్రాడు బయలుదేరుతాడు. ఒక సిద్ధుని వద్ద శిష్యరికం చేసి మంత్ర తంత్రాలన్నీ నేర్చుకుంటాడు. అతను ఇంటికి తిరిగి వచ్చే సరికి బందిపోటులు అప్పటికే అతని అక్కను ఎత్తుకుపోయి మంత్రగత్తెకు అప్పగించారు. కుర్రాడు కోతులను, ఎలుగుబంట్లను తోడు తీసుకొని పర్వత గుహ వద్దకు వెడతాడు. ఈలోగా ఇంకో వీరుడు బందిపోట్లను హతమార్చడానికి కొంత సైన్యంతో పర్వతం మీదకి వెడతాడు. బందిపోట్లకి, సైన్యానికి హోరా హోరీ యుద్ధం జరుగుతుంది. బందిపోటులందరు చచ్చిపోతారు. తర్వాత కుర్రాడు, మంత్రగత్తె ఒకరిని మించి ఒకరు మంత్ర తంత్రాలతో యుద్ధం చేస్తారు. చివరికి కుర్రాడు ఆ మంత్రగత్తెను చంపి, తన అక్కను రక్షిస్తాడు. అద్భుత, వీరరసాలు ప్రధానంగా ఉన్న ఈ చిత్రాన్ని పిల్లలు అధ్యంతం ఎంతో ఆసక్తితో, ఉత్కంఠతో చూశారు. ఇందులో చక్కని హాస్యం కూడా ఉంది. కలర్, యానిమేషన్ చాలా బాగున్నాయి.

'ఫ్రెండ్స్ ఫర్ లైఫ్' (రష్యా)లో యజమాని పట్ల ఒక చిరుతపులిపిల్ల విశ్వాసం కథా వస్తువు. ఆ పులి పిల్ల తల్లిని వేటగాళ్ళు కాల్చి చంపేస్తారు. దిక్కులేని ఆ పిల్లని ఒక వృద్ధుడు తీసుకు వెళ్ళి ఎంతో ప్రేమగా పెంచుకుంటాడు. ఆ వృద్ధుని వద్ద ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్క, పులి పిల్ల స్నేహంగా ఉంటాయి. రెండూ కలిసి రోజూ అడవిలో షికార్లు చేస్తూ ఉంటాయి. ఒక రోజు పులిపిల్ల వేటగాళ్ళు ఫన్నిన ఉచ్చులో పడుతుంది. కుక్క గబగబా పరుగెత్తుకు వెళ్ళి యజమానిని పిలుచుకు వచ్చి కాపాడుతుంది. ఒక రోజు వేటగాళ్ళు కుక్కను కాల్చి చంపేస్తారు. తర్వాత పులిపిల్లను ఎత్తుకుపోయి, ఒక సర్కస్ కంపెనీకి అమ్మేస్తారు. చివరికి అది బోనులో నుంచి తప్పించుకొని పారిపోయి తన యజమాని ఇంటికి చేరుకుంటుంది. ఇది కరుణరస ప్రధాన చిత్రం.

బ్రిటిష్ చిత్రం 'హొరేషియో నిబిల్స్' పూర్తిగా హాస్య చిత్రం. ఇది చాలా వరకు వాల్డ్ డిస్నీ నిర్మించిన 'బ్లాక్ బియర్డ్స్ ఘోస్ట్' లాగా ఉంది. ఇందులో మిస్టర్ హొరేషియోనిబిల్స్ కుందేలు మనిషి. అతను మనిషంత ఎత్తు ఉంటాడు. మనిషిలాగానే నడుస్తాడు. మాట్లాడతాడు. సూటు వేసుకుంటాడు. కాని, తల, కాళ్ళు కుందేలు లాగా ఉంటాయి. అతను చాలా మంచివాడు. పిల్లలంటే ఎంతో యిష్టం. అయితే అతను ఎవరికీ కనిపించడు. అతనికి ఓ పదేళ్ళ అమ్మాయితో స్నేహం చేయాలనిపించింది. ఆ అమ్మాయికి కుందేళ్ళంటే చాలా యిష్టం. కళ్ళు మూసుకుని ఒకటి, రెండు మూడు, నాలుగు, ఐదు అని లెక్క పెట్టి కళ్ళు తెరిస్తే అతను ప్రత్యక్షమవుతాడు. ఆ పిల్లకి తప్ప ఇంకెవరికీ కనిపించడు. అతను, ఆ అమ్మాయి మాట్లాడుకుంటుంటే, ఇద్దరూ కలిసి ఆటలాడుతుంటే ఎవరితో మాట్లాడుతోందో, ఎవరితో ఆటలాడుతోందో తెలియక అందరూ ఆశ్చర్యపడతారు. అతను ఆమె పుట్టినరోజు పండుగనాడు విందుకు వచ్చి, అందరితో పాటు దర్జాగా కూర్చుని పిండి వంటలు మెక్కుతూ ఉంటాడు. మనిషి కనిపించకుండా ప్లేటులోని పిండి వంటలు మాయమైపోతుంటే చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అతను గ్లాసుతో మంచినీళ్ళు తాగుతుంటే గ్లాసు గాలిలో తేలిపోతున్నట్లు కనిపిస్తుంది. అందులో నీళ్ళు మాయమైపోతాయి. సినిమా అంతటా ఇలాంటి తమాషాలు ఎన్నో ఉన్నాయి. చివరికి ఆ అమ్మాయి చెప్పినట్లు పిల్లలందరూ కళ్ళు మూసుకుని ఐదు అంకెలు లెక్కబెట్టి కళ్ళు తెరుస్తారు. కుందేలు మనిషి అందరికీ కనిపిస్తాడు. కాసేపు పిల్లలతో ఆటలాడి 'టాటా' చెప్పి మాయమైపోతాడు.

మరొక బ్రిటిష్ చిత్రం 'మారో ది జిప్సీ' కూడా చాలా బావుంది. ఇది మారో అనే ఒక జిప్సీ (దేశ ద్రిమ్మరి జాతి) కుర్రవాడి కథ. అతను చాలా మంచివాడు. ఉన్నత కుటుంబానికి చెందిన ఒక చిన్న పిల్లతో అతనికి స్నేహం కలుస్తుంది. ఇద్దరూ చెట్టపట్టావేసుకుని అడవిలో షికార్లు కొడుతూ ఉంటారు. అతను ఒక గుహలో ఎవరూ దూరలేని ఒక రహస్య స్థలాన్ని కనిపెట్టాడు. అప్పుడప్పుడూ అక్కడకు వెళ్ళి తను సేకరించిన తమాషా వస్తువులని అక్కడ దాచుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఆ రహస్య స్థలాన్ని ఆ అమ్మాయికి చూపిస్తాడు. వీళ్ళ స్నేహం చూసి ఇంకో కుర్రాడు అసూయపడుతూ ఉంటాడు. తను చేసిన దొంగతనాలన్నీ జిప్సీ కుర్రాడి మీదకి నెట్టేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ చెడ్డ కుర్రాడు అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటే జిప్సీ కుర్రాడు ప్రాణాలకు తెగించి మంటల్లోకి వెళ్ళి, అతన్ని బైటికి తీసుకొస్తాడు. ఆ చెడ్డ కుర్రాడు పశ్చాత్తాపపడి తన అబద్ధాలన్నీ ఒప్పుకుంటాడు. ఆ అమ్మాయి జిప్సీకుర్రాణ్ణి వెతుక్కుంటూ గుహలోని రహస్య స్థలానికి వెళ్ళి లోపల చిక్కుపడిపోతుంది. ఆ సమయంలో అతను అక్కడ లేడు. 'జోరున వర్షం కురిసి నీరు గుహలోనికి ప్రవహించి' అంతా జలమయమవుతుంది. జిప్సీ కుర్రాడు మళ్ళీ ప్రాణాలకు తెగించి లోపలకు వెళ్ళి, పోలీసుల సహాయంతో ఆ పిల్లను కాపాడి బైటికి తీసుకొస్తాడు.

చెకొస్లోవాకియా చిత్రం 'ప్రిన్స్ బయాయా' దుష్టశిక్షణకు, శిష్ట రక్షణకు కంకణం కట్టుకున్న రాజకుమారుని కథ. అతను ఒక రాజ్యానికి వెళ్ళి, అక్కడ రాకుమార్తెను బలికోరిన ఒక భయంకరమైన మూడు తలల డ్రాగన్ ను చంపి, రాజకుమార్తెని రక్షించి, ఆమెను వివాహం చేసుకుంటాడు.

Picture

'అవెంజర్స్ ఎట్ ది రీఫ్' (ఆస్ట్రేలియా), 'కె కెవ్ యుకానే' (యుగోస్లావియా), 'అడ్వెంచెర్స్ ఇన్ ది డాన్యూబ్ డెల్టా' (రుమేనియా) చిత్రాలు మూడూ సాహస చిత్రాలు. మూడింటిలోనూ ఇద్దరిద్దరు కుర్రాళ్ళు జంటగా సాహసాలు చేశారు. తమను పట్టుకోవడానికి తరుముకువస్తున్న దుష్టుల నుంచి తప్పించుకొని పారిపోవడం, చివరికి తామే ఆ దుష్టులను పట్టి ఇవ్వడం ఆ చిత్రాల ఇతివృత్తాలు. ఆ మూడు చిత్రాలలోనూ ఉత్కంఠ గొప్పగా పోషించడింది. ఆ చిత్రాలు పిల్లలకు ఎంతో నచ్చాయి.

మనదేశం తరపున సత్యజిత్ రే నిర్మించిన 'గోపీ గాయన్, బాఘా బాయన్' చిత్రం ప్రదర్శించబడింది. సత్యజిత్ రే దీనిని ప్రత్యేకంగా పిల్లల కోసం తయారు చేయకపోయినా, జానపద కథ కనుక, మాయలు, మంత్రాలు, హాస్యం ఉన్నాయి కనుక పిల్లలకు బాగా నచ్చింది.

నండూరి పార్థసారథి
(సెప్టెంబర్ 1974లో చలనచిత్రలో ప్రచురితమయింది)

Previous Post Next Post