మెహ్దీహసన్

భారతీయులందరికీ ఇవాళ పండుగ రోజు-రిపబ్లిక్ దినం కనుక. జంటనగరాల సంగీత ప్రియులకు మాత్రం ఇది యేటా వచ్చే మామూలు పండుగ కాదు. ఇది ఒక ప్రత్యేకమైన పర్వదినం. మధుర మధురంగా మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వచ్చే అపురూపమైన పండుగ రోజు.

గజల్ సమ్రాట్ మెహ్దీహసన్ పాకిస్థాన్ నుంచి హిందూస్థాన్ కు వచ్చారు. ఇవాళ రాత్రి ఆయన రవీంద్రభారతిలో కచేరీ చేస్తారు. నాలుగైదు గంటల సేపు సంగీత రసికులను స్వరార్ణవంలో ముంచి వేస్తారు.

ఆయన గళం విప్పితేచాలు-తేనెలొలుకుతాయి. మనసున మల్లెలమాలలూగుతాయి. కన్నుల వెన్నెల డోలలూగుతాయి. సుందర గంధర్వలోకపు సప్తస్వర ద్వారాలు తెరుచుకుంటాయి. సుప్తరాగాలు రేకులు విచ్చుకుని పరిమళాలు వెదజల్లుతాయి. రాజకీయ విద్వేషాలకు, సంక్షోభాలకు, సంఘర్షణలకు అతీతమైన అద్భుత ప్రశాంత స్వప్నసీమ ఆవిష్కృతమవుతుంది.

సంగీతం కోసం పాకిస్థాన్ రేడియో పెట్టుకునే భారతీయులందరికీ మెహ్దీహసన్ చిరపరిచితుడు. అసలు ఆయన పాటల కోసమే పాకిస్థాన్ స్టేషన్లు పెట్టుకునే భారతీయ శ్రోతలెందరో ఉన్నారు. ప్రత్యక్షంగా ఆయనను ఎన్నడూ చూడకపోయినా వారందరికీ ఆయన ఆప్తబంధువు, ఆరాధ్య దైవం. మెహ్దీహసన్ విదేశాలలో కచేరీలు చేసినప్పుడు అక్కడి భారతీయ శ్రోతలు టేప్ చేసుకుని, వాటికి కాపీలు తీసి మన దేశంలోని మిత్రులకు పంపేవారు. డబ్బుగల వారు అదే పనిగా మనదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళి ఆయన కచేరీలువిని, పాటలను రికార్డ్ చేసుకుని వచ్చేవారు. ఆయన గ్రామఫోన్ రికార్డులు కొనుక్కుని తెచ్చుకునేవారు. కొందరు విదేశాల నుంచి ఆయన రికార్డులు తెచ్చి రెట్టింపు ధరకి అమ్మేవారు. అలా అలా ఆయన సంగీతం మన దేశమంతా వ్యాపించింది. గ్రామఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా వారు 1971లో కాబోలు ఆయన ఇ.పి. ఒకటి విడుదల చేశారు. దానితో సామాన్యులకు కూడా ఆయన పాటలు అందుబాటులోకి వచ్చాయి. మన దేశంలో ఆయన అభిమానుల సంఖ్య బాగా పెరిగింది. వివిధ భారతిలో తరచుగా ఆయన పాటలు వినిపించడం మొదలుపెట్టాయి. గ్రామఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియాకి, గ్రామఫోన్ కంపెనీ ఆఫ్ పాకిస్తాన్ కి కుదిరిన ఒప్పందం ఫలితంగా మెహ్దీహసన్ రికార్డులు 1976లో ఒక ఎల్.పి. 1977లో మరొక ఎల్.పి. విడుదలైనాయి. ఆ రికార్డులు విన్న తర్వాత భారతీయులకి ఆయనపై బెంగ ఎక్కువైపోయింది. భారత-పాకిస్తాన్ సంబంధాలు బాగుపడి ఆయన ఎప్పుడు మనదేశానికి వస్తారా అని కలవరిస్తున్నారు. వారి కలలు ఇప్పటికి ఫలించాయి.

ఆయన హైదరాబాద్ కు రావటం ఇదే మొదటిసారి. మొన్న ఆయన ఇక్కడ నిజాం క్లబ్ లో సుమారు గంటన్నరసేపు మాటకచేరీ చేశారు. ఆయన పాటల్లోని నాజూకుతనం, హుందాతనం, సంస్కారం ఆయన మాటల్లో కూడా వ్యక్తమైనాయి. ఆయన పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతుంటే ఒక విదేశీయుడుగా కనిపించలేదు. ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఛలోక్తులతో, చిరపరిచితునివలె మాట్లాడారు. గజల్ సమ్రాట్టుగా ప్రపంచ విఖ్యాతి పొందినా ఆయన మాటల్లో ఎక్కడా అహంకారం తొంగిచూడలేదు. భారతీయ సంగీత విద్వాంసులపట్ల ఆయన ఎంతో గౌరవాన్ని వ్యక్తం చేశారు. భారతీయ గాయకులలో నిజానికి తన కంటే తక్కువ స్థాయిగల వారిని సైతం ఆయన మెచ్చుకున్నారు.

మెహ్దీహసన్ అచ్చమైన ఉర్దూలో మాట్లాడారు. పత్రికా ప్రతినిధులూ ఉర్దూలోనే ప్రశ్నించారు. గంటన్నర గోష్ఠిలో రాజకీయాల ప్రసక్తి రాలేదు. "క్షుద్ర రాజకీయాలవల్ల ఆస్తులు పంచుకుని వేరైపోయినా అసలు మనది ఒకే దేశం. ఒకే సంస్కృతి. ఒకే కుటుంబం. మనలో ప్రవహిస్తున్నది ఒకే సంగీతం" - ఈ మాటలను ఆయన మాటల్లో చెప్పకపోయినా చూపుల్లో చెప్పారు.

ఆయన జన్మస్థలం రాజస్థాన్ లోని జైపూర్ జిల్లాలో ఒక గ్రామం. దేశ విభజన అనంతరం ఆయన కుటుంబం పాకిస్థాన్ లో స్థిరపడింది. తన జన్మస్థలాన్ని సందర్శించాలన్న ఆయన చిరకాల వాంఛ ఇన్నాళ్ళకు నెరవేరింది. భారతదేశానికి రాగానే ఆయన తన గ్రామానికి వెళ్ళి చూశారు. అక్కడ ఆయన తల్లి సమాధి శిధిలావస్థలో ఉంది. అక్కడ కచేరీ చేసి వసూలైన ధనంతో ఆ సమాధిని బాగు చేయించాలనీ, ఆ గ్రామంలో తన తాతగారి పేరిట ఒక పాఠశాల నెలకొల్పాలనీ సంకల్పించినట్లు ఆయన చెప్పారు.

"భారతీయులలో ఎవరి గజళ్ళు మీకు బాగా నచ్చుతాయి?" అని ప్రశ్నించగా, "బేగం అఖ్తర్ బాగా పాడేవారు. రసూలన్ బాయ్, బర్కత్ అలీఖాన్ కూడా చెప్పుకోదగినవారు. అన్నట్టు తలత్ మహమ్మద్ గజల్స్ గొప్పగా పాడతారు" అని ఆయన సమాధానమిచ్చారు. కాని, వీరందరికంటే లతామంగేష్కర్ పట్ల ఆయనకు గౌరవం ఎక్కువ. "లతామంగేష్కర్ పాడిన గాలిబ్ గజళ్ళు అద్భుతంగా ఉన్నాయి. వాటికి హృదయనాథ్ మంగేష్కర్ కూర్చిన వరసలు గొప్పగా ఉన్నాయి" అన్నారు ఆయన. లత పాడిన మీరా భజన్ లన్నా ఆయనకు ఎంతో ఇష్టం.

16 తరాలుగా తమ కుటుంబంలో అందరూ గాయకులేననీ, తన పూర్వులు అక్బర్ ఆస్థానంలో పాడేవారనీ ఆయన చెప్పారు. ఆయన ఆరోయేటనే శాస్త్రోకంగా శాస్త్రీయ సంగీతాభ్యాసం ప్రారంభించారు. ఒకప్పుడు ఆయన ఖయాల్, ఠుమ్రీవంటి శాస్త్రీయ సంగీత రచనలు గానం చేసేవారు. కాని తన గొంతు గజల్ లకు ప్రత్యేకంగా తగినట్టిదని తెలుసుకొని, గజల్ గానంలో సాధన చేయడం మొదలుపెట్టారు. అనేక రాగాలను అవలీలగా మేళవిస్తూ, అనితర సాధ్యమైన రీతిలో ఆయన గానం చేస్తారు. ఆపాత మధురమైన ఆయన గానంలో ఇది ఏ రాగం, ఇది ఏ తాళం అనే మీమాంసకి ఆస్కారం లేదు. అసలు ఆయనకు రాగ తాళాల స్పృహ ఉన్నట్లే అనిపించదు. వెనకటికి ఒక మహాకవి 'వాణి నా రాణి' అని ధీమాగా చెప్పుకున్నట్లు మెహ్దీహసన్ పాడుతుంటే రాగ తాళాలు ఆయన వెంటపడి వస్తాయి. ఆయన ఒకే పాటను నాలుగు కచేరీలలో పాడితే ప్రతి సారీ ఆ పాట కొత్తగానే ఉంటుంది. ప్రతిసారీ కొత్త కొత్త గమకాలను పొదిగి జిగేల్ మనిపిస్తారు. గజల్ లో ప్రతి పదానికి నగిషీలు చెక్కుతారు. అందుకే ఆయన పాటను రెండు రికార్డులలో పాడితే రెండూ కొనుక్కోవాలనిపిస్తుంది.

ఇద్దరు భార్యలతో, పదముగ్గురు బిడ్డలతో సంసార యాత్ర సాగిస్తున్న నలబై నాలుగేళ్ళ నడి వయస్కుడైనా ఆయన తన గళ మాధుర్యంతో యువ హృదయాలను వెర్రెత్తించగలడు. 'మొహబ్బత్ కర్నేవాలే కమ్ నహోంగే' అని ఆయన పాడుతుంటే, తొలి ప్రేమ బాధతో వేగిపోయే నూనూగు మీసాల నవయువకుడుగా మనోవేత్రం ఎదుట సాక్షాత్కరిస్తాడు. ఆయన పాడే గజళ్ళలో ఆయనకి, ఆయన అభిమానులకు బాగా నచ్చినవి మీర్ తాఖి మీర్ రచించిన 'పత్తా పత్తా బూతా బూతా', 'దేఖ్ తోదిల్ కెహెజాన్ సే', ఫైజ్ అహమ్మద్ ఫైజ్ రచించిన 'గులోంమే రంగ్ భరే', హఫీజ్ హోషియార్ పురీ రచించిన 'మొహబ్బత్ కర్నేవాలే' గీతాలు. ఇవి ఆయన రెండు ఎల్.పి. రికార్డులలో ఉన్నాయి. ఆయన పాడే గజళ్ళలో చాలా వాటికి ఆయనే వరసలు కూర్చారు.

నటుడుగా, గాయకుడుగా సినిమాల్లో చేరకముందు ఆయన ట్రాక్టర్ మెకానిక్ గా పనిచేసేవాడట. సినిమాల్లో ఆయన పాడిన పాటలన్నీ హిట్లే, ముఖ్యంగా నూర్జహాన్ తో ఆయన పాడిన డ్యూయెట్లంటే పాకిస్థానీలకు మరీ ఇష్టం.

పత్రికా గోష్ఠిలో ఆయన పైపు కాల్చుతుండగా ఒక విలేఖరి "పోగపీల్చడం వల్ల మీ గొంతు పాడైపోదా"? అని ప్రశ్నించాడు. "అబ్బే నాకు ప్రత్యేకమైన నియమాలేమీలేవు. శుభ్రంగా తింటాను, తాగుతాను. సంగీత సాధనకీ, దీనికీ సంబంధం లేదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కసరత్తు చేస్తాను. బస్కీలు, దండీలు తీస్తాను. ఇదివరకు వెయిట్ లిఫ్టింగ్ లో మొనగాణ్ణి. మా ఇంట్లో ఒక పాత కారు ఉండేది. దాన్ని బాగుచేయాలంటే జాకీ అవసరం లేకుండానే చెయ్యి బోటు పెట్టి మరమ్మతు చేసేవాణ్ణి. నాది మంచి గట్టి శరీరం" అని నవ్వుతూ చెప్పాడు ఆయన.

హిందూస్థానీ సంగీత విద్వాంసులలో కరీంఖాన్, బడేగులాం అలీఖాన్ ల పట్ల ఆయనకు అభిమానం ఎక్కువ. అమీర్ ఖాన్, డి.వి. పలూస్కర్ ల సంగీతం కూడా తనకు చాలా ఇష్టమని ఆయన చెప్పారు. ఆయన ఈ మూడు రోజులూ ఇక్కడ అమీర్ ఖాన్, లతామంగేష్కర్, సజ్జాద్ హుస్సేన్ (మాండలిన్)ల టేప్ లు వింటూ గడిపారు.

నండూరి పార్థసారథి
(1978 జనవరి 26వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post Next Post