Anuradha Picture
ఎల్.బి. ఫిలింస్ వారి 'అనూరాధ'

స్వచ్ఛమైన, ఆదర్శవంతమైన లలితసంగీతం అంటే ఏమిటో, నేపథ్య సంగీతం ఎలా వుండాలో నేర్చుకోవలసి వున్న మన సంగీత దర్శకులంతా తప్పక పదేసి సార్లు చూడదగ్గ చిత్రం 'అనూరాధ'. కేవలం కథా ప్రధానం కాకుండా, ఒకే ఒక సెంటిమెంటును తీసుకొని దాన్ని సినిమాగా మలచటం ఎలాగో తెలుసుకోవాలంటే మనదర్శకులు కూడా ఈ చిత్రాన్ని చూడడం చాలా అవసరం.

సంగీత మంటే 'చెవికోసేసుకునేవారూ', కేవలం వినోదం కోసం అలమటించేవారూ, 'సెంటిమెంటాలిటీ' అంటే బడాయి, మదపిచ్చిగా భావించేవారూ 'అనూరాధ' చిత్రాన్ని చూడటం శ్రేయస్కరం కాదు. అసలు ఈ చిత్రం అసంఖ్యాక జనవర్గానికి ఉద్దేశించింది కాదు. కళాకారులూ, కళాత్మకమయిన చిత్రాలకోసం అలమటించేవారూ తప్పక చూసి, మెచ్చదగ్గ చిత్రమిది. పండిత్ రవిశంకర్ అంతటి వాడు సంగీతం సమకూర్చాడు కనుక, తమ సంగీత ప్రియత్వాన్ని వెల్లడించుకునేందుకై కొందరు పాట మొదలుపెట్టడం తడవుగా ''వాహ్... వాహ్'' అంటూ హాలు ప్రతిధ్వనించేటట్లు గుండెలు బాదుకునే ప్రమాదం కూడా వున్నది.

అనూరాధ, నిర్మల్ చౌదరీ కారణజన్ములు. అనూరాధ సంగీత విద్వాంసురాలు. ఆమె జన్మించింది కేవలం సంగీతం కోసం. సంగీతం ఆమెకు ఊపిరి. నిర్మల్ చౌదరీ డాక్టరు. బీదరోగులకు ఉచిత వైద్యం చేయటం కోసమే అతను జన్మించాడు. అతని జీవితానికి అర్థం, ప్రయోజనం ఆ వృత్తే. ఆమెకు సంగీతం తప్ప మరోధ్యాస లేదు. అతనికి వైద్యం తప్ప మరో యావ లేదు. ఒకానొక ముహూర్తంలో ఈ విభిన్నతత్వాలు రెండింటికీ పరస్పరాకర్షణ ప్రారంభమై, ప్రబలమై, వివాహంగా పర్యవసించింది. తర్వాత ఘర్షణ ప్రారంభమవుతుంది. ఆమె అబల గనుక లొంగిపోతుంది. వీణకు బూజుపట్టుతుంది. ఆపై మనోవ్యాధి, విరక్తి-కర్తవ్యం, సంసారం యిదీ యీ చిత్రంలోని వస్తువు.

Hrishikesh Mukherjee
Director Hrishikesh Mukherjee

మెజారిటీ ప్రజల కాలక్షేపానికై కొన్ని పిట్ట కథలను కేటాయించకుండా ధైర్యంగా సూటిగా యీ వస్తువును చిత్రించారు దర్శకుడు హృషీకేశ్ ముఖర్జీ. అనవసర మనిపించే సన్నివేశాలుగానీ, అతి థోరణిగానీ, చిత్రంలో ఎక్కడా తొంగిచూడలేదు.

చిత్రంలోని ఆరు పాటలూ అద్భుతంగా వున్నాయి. వాటిలో నాలుగు అమరగీతాలుగా నిలిచిపోగలవు. గత ఏడెనిమిది సంవత్సరాలుగా సినిమాలలో అంత గొప్ప పాటలు ఎన్నడూ వినలేదు. సినిమాలకు నేపథ సంగీతం సమకూర్చటం చేతనైన బహుకొద్ది మంది భారతీయ సంగీత దర్శకులలో రవిశంకర్ మొదటివాడు - యీ చిత్రంలో నేపథ్య సంగీతం అద్భుతంగా వుందని వేరే చెప్పనక్కరలేదు.

ఈ చిత్రాన్ని ఆంధ్రలో విడుదల చేస్తున్న శ్రీ ఫిలింస్ వారు అభినందనీయులు.

ఈ చిత్రంలో ముఖ్య నటీనటులు : బల్రాజ్ సహానీ, లీలా నాయుడు, అభిభట్టాచార్య, నజీర్ హుస్సేన్.
నిర్మాత, దర్శకుడు : హృషీకేశ్ ముఖర్జీ.
సంగీత దర్శకుడు : రవిశంకర్
కథ, స్క్రీన్ ప్లే : సచిన్ భౌమిక్
సంభాషణలు : రాజేంద్రసింగ్ బేడీ
పాటలు : శైలేంద్ర
ఛాయాగ్రహణం : జయవంత్ ఆర్. పఠారే
నేపధ్య గాయకులు : లతామంగేష్కర్, మన్నాడే, మహేంద్ర కపూర్.

నండూరి పార్థసారధి
(1960 జూన్ 19వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post