Humor Icon

మృణాళిని కిటికీలోంచి వినీలాకాశం కేసి శూన్యంగా చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చింది. ఎన్నెన్నో ఆశల, భావాల దావాగ్నితో ఆమె హృదయం కాగిపోతున్నది. గ్రీష్మాతపానికి వాడిన కలువలా ఆమె వదనం ముకుళించింది. ఎవరికోసం ఈ ప్రతీక్ష? ఎందుకోసం ఈ జీవితం? ఎప్పుడు ఈ జీవికి విముక్తి? తన జీవితమనే సమస్యకి పరిష్కారం ఉందా? ఈ నిరీక్షణతోనే ఇప్పటికి తన జీవితంలో ఆరువసంతాలు గతించాయి. ఈ శేష జీవితం కూడా ఇట్లే అడవిని గాచిన వెన్నెలలా, యెడారి పూసిన పూవులా కృశించి, నశించిపోతుందేమో.

ఆమె చెదరిన ముంగురులతో మలయపవనుడు సయ్యాట లాడుతున్నాడు. ఆమె వదనారవిందంపై గంభీర మేఘాలు ఆవరించాయి. ఆమె ఇప్పుడు చరాచరమైన బాహ్య ప్రపంచానికి అతీతంగా ఆలోచనాలోకంలో విహరిస్తున్నది. ఇంతలో ఆ గాఢ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒకటాంగా వచ్చి ఇంటి ముందు ఆగింది. అందులో నుంచి ఆజానుబాహుడు, స్ఫురద్రూపి అయిన వ్యక్తి దిగాడు. తెల్లనిలాల్చీ, ధోవతి ధరించిన ఆ ఆగంతుకుడు ఆమె ఆలోచనలను పటాపంచలు చేశాడు. ఆమె విస్ఫారితనయనాలతో అతని తిలకించింది. వార్షుక మేఘ దర్శనోత్సుకతతో పురి విప్పిన నెమలిలా ఆమె హృదయం నృత్యం చేసింది. తన ప్రత్యక్షదైవం. తన జీవనసారధి, తన సర్వస్వం తన గేహం ముంగిట సాక్షాత్కరించినాడు. ఏ వ్యక్తి కోసమైతే తన సర్వస్వం త్యాగం చేసి ఈ విశాల ప్రపంచంలో ఏకాకిగా నిలిచి ఇన్నాళ్ళూ నిమిషమొక యుగంగా బ్రతుకును ఈడ్చుకుంటూ వచ్చిందో, ఏ వ్యక్తి అయితే తన శిశిర జీవితాన్ని చిగురింపచేసి వసంతాన్ని సృష్టించి, తన జీవితానికి సాఫల్యం చేకూర్చగలడనే విశ్వాసంతో ఉందో ఆ వ్యక్తి, ఆ హరీన్ బాబు తనపై కరుణించి అరుదెంచాడు.

"మృణాళినీ" అన్న పిలుపుతో ఆమె ఆలోచనా ప్రపంచం నుంచి మేల్కొన్నది. తలుపు తీసి, ఒక్క క్షణం అతని విశాల నేత్రాలలోకి ఆవలోకించి లజ్జావనతముఖియైనది. మేలిముసుగును ముందుకు లాక్కుని లోనికి దారితీసింది. హరీన్ బాబు మౌనంగా ఆమెను అనుసరించాడు. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఆమె అంది.

"ఇన్నాళ్ళకు ఈ నిర్భాగ్యురాలిపై దయకలిగిందా హరీన్ బాబూ. మీ కోసం అహర్నిశలూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసే పాదదాసి ఇక్కడ ఉందని మీకు జ్ఞాపకం లేదా హరీన్"?

హరీన్ మేఘ గంభీర స్వరంతో చెప్పనారంభించాడు.

"మృణాళినీ! జీవితం అతి విచిత్రమైనది. మనుష్యుల మధ్య మమతలు పెంచుతుంది. ఆశలు రగిలిస్తుంది అంతలోనే త్రుంచివేస్తుంది. మన ఆధీనంలో లేని ఏ అతీతశక్తియో మనల్ని ఇలా నడిపిస్తూంది. ఇందుకు నీవు గానీ, నేను గానీ బాధ్యులం కాము. భయంకరమైన జీవన పెనుతుపానులో సమస్యల వరద ఉరవడిలో కొట్టుకుపోయే గడ్డి పరకలం మనం. ఏ క్షణం కోసమైతే ఆరు వసంతాలు స్వాతి చినుకుకోసం ముత్యపు చిప్పలా ఎదురు చూస్తూ బ్రతుకు బరువును ఈడ్చుకు వచ్చానో, ఏ క్షణం నా ఈ నిస్సార జీవితానికి అమృతత్వం ప్రసాదించగలదని తలపోశానో ఆ క్షణం ఇప్పుడు అవతరించింది. కాని కాలవాహినిలో ఈ క్షణం ఒక తృణం. కాలప్రవాహం మనకోసం ఆగదు. ఈ ప్రవాహంలో మళ్ళీ మనం ఎటు కొట్టుకుపోతామో".

"హరీన్! నా జీవితంలో ఈ రోజు వేయి వసంతాలు వెల్లివిరిశాయి. ఇది అత్యంత పవిత్ర దినం. నా తపస్సు ఫలించిన పర్వదినం. నా దైవాన్నికి పాదసేవ చేసే భాగ్యం నాకు లభించింది" అంటూ మృణాళిని వంగి ఆతని పాదాలను సృశించి, పాద ధూళిని శిరస్సున ధరించింది. ఆతడు ఆమె శిరస్సును తన కరాంగుళులతో నిమిరాడు. ఆమె నేత్రాంచలముల నుంచి రెండు వెచ్చని ఆశ్రు బిందువులు రాలి ఆతని చరణారవిందాలను ప్రక్షాళితం చేశాయి.

కొంతసేపు ఇరువురి మధ్య మౌనం రాజ్యం చేసింది. నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఆమె ఇలా అంది.

"ఇవాళ నా చేతుల్లో స్వయంగా మీకు వడ్డిస్తాను రండి".

"నాకు ఆకలిగా లేదు మృణాళినీ, ఈ దీర్ఘ నిరీక్షణలో, నిస్పృహలో ఆకలిని ఎప్పుడో మరచిపోయాను".

"అలా అనకండి హరీన్. గతాన్ని విస్మరించండి. మీకు అప్పుడు ఎవ్వరూ లేరు. ఇప్పుడు నేనున్నాను. మీకు, మీ అన్నపానాదుల విషయంలో శ్రద్ధ తీసుకునే వ్యక్తి, మీకోసం జీవించే వ్యక్తి ఒకరున్నారని మరిచిపోకండి. మీకోసం కాకపోయినా నా కోసం మీరు భోజనం చేయాలి. మీరు తృప్తిగా భోజనం చేస్తేనే నాకు మనశ్శాంతి. ఈ శాంతి నుంచి కూడా నన్ను దూరం చేయకండి హరీన్. నన్నెందుకిలా పరీక్షిస్తున్నారు. నేను మీకు పరాయిదాన్నిగా కనిపిస్తున్నానా"? అన్నది మృణాళిని సజలనయనాలతో.

హరీన్ అవనతముఖుడై "నన్ను క్షమించు మృణాళినీ. తలవని తలంపుగా నీ హృదయాన్ని గాయపరచాను. నీ కోరికను కాదనను. నీ అమృత హస్తాలతో వడ్డించి భోజనం తినడం కంటే తెగిన గాలి పటంలా కొట్టుకుపోయే నా జీవితానికి కావలసిందేమిటి"? అన్నాడు.

మృణాళిని వంట గదిలోకి దారితీసింది. హరీన్ బాబు మంత్ర ముగ్ధునిలా ఆమెను అనుసరించాడు. ఆమె పీటవేసి వెండి కంచంలో నాలుగు పూరీలు వడ్డించింది. అతడు భోజనానికి ఉపక్రమించాడు. ఆమె పక్కనే నేలపై కూర్చుని మేలిముసుగు ముందుకు లాక్కుని విసనకర్రతో విసురుతోంది.

"మృణాళినీ! నా కోసం ఎందుకింత శ్రమపడతావు. ఆ విసనకర్ర ఇటివ్వు. నేను విసురుకుంటాను"?

"ఈ నిర్భాగ్యురాలికి ఈ కాస్త ఆనందం కూడా మిగలకుండా చేస్తారా హరీన్. ఈ క్షణం కోసం ఆరు వసంతాలు తపస్సు చేశాను. దేవుని కైంకర్యంకంటే పూజారి జీవితానికి సార్ధక్యం ఏముంటుంది హరీన్ బాబూ" అంది మృణాళిని మరి రెండు పూరీలు వడ్డిస్తూ.

"మీ జీవితం ఎలా ఉంది హరీన్"

"హు! జీవితం! ఈ ఇరవై ఏడేళ్ళ జీవితంలోనే అరవై ఏళ్ళ అనుభవం సంపాదించాను మృణాళినీ. ఎన్నెన్నో ఆవేదనలతో, ఆకాంక్షలతో విసిగివేసారిపోయాను. ఇక ఇప్పుడు నాకు ఏ ఆశ లేదు...."

(ఈ వ్యధ, ఈ కథ అనంతం. దీన్ని ఇంకా సాగదీయడం వృధా. శరత్ మూసలో 'మణిపూస' లెన్నో తెలుగు పత్రికల్లో ధారావాహికంగా వెలువడుతున్నాయి. ఆ 'మణిపూస'లకు ఇదొక మచ్చుతునక మాత్రమే.)

నండూరి పార్థసారథి
(1960 నెలవంకలో ప్రచురితమైనది)

Previous Post Next Post