ప్రపంచంలో ఈనాడు 'జాజ్'కు ఉన్నంత ప్రచారం మరి ఏ ఇతర సంగీత రీతికీ లేదు. ఇతర సంగీత రీతులను 'జాజ్' ఇముడ్చుకున్నంతగా మరి ఏదీ ఇముడ్చుకోలేదు. అలా ఇముడ్చుకోగల శక్తి 'జాజ్'కు ఉన్నంతగా మరి దేనికీ లేదు. అలాగే ఇతర సంగీతాలను 'జాజ్' ప్రభావితం చేసినట్టుగా మరి ఏదీ ప్రభావితం చేయలేదు. 'జాజ్' మిగిలిన సంగీతాలన్నింటికంటే శీఘ్రంగా పరిణతి చెందింది. శతాబ్దాల, సహస్రాబ్దాల చరిత్ర గల శాస్త్రీయ సంగీత రీతులకంటే ఎక్కువగా విశ్వజనీన తత్వాన్ని సంతరించుకున్నది 'జాజ్'.

ప్రపంచంలోని అన్ని భాషలనుంచి పదాలను స్వీకరించి ఆంగ్లభాష ఎంతగా సంపన్నమైనదో, ఇతర సంగీతాలలోని అనేక లక్షణాలను స్వీకరించి 'జాజ్' అంతగా సంపన్నమయింది. అంతర్జాతీయ భాషగా, ఆంగ్లం అభివృద్ధి చెందినట్లుగానే అంతర్జాతీయ సంగీతంగా 'జాజ్' రూపుదిద్దుకుంటోంది. ఎప్పటికైనా అంతర్జాతీయ సంగీతంగా పరిగణన పొందే అవకాశం 'జాజ్'కే ఉంది. కాగా ప్రపంచ భాషల్లో సంస్కృతానికి ఎటువంటి గౌరవ స్థానం ఉన్నదో ప్రపంచ సంగీత రీతుల్లొ భారతీయ సంగీతానికి అటువంటి గౌరవస్థానం ఎప్పుడూ ఉంటుంది.

స్వభావంలోనూ, స్వరూపంలోనూ కూడా భారతీయ సంగీతం, జాజ్ పూర్తిగా భిన్నమైనవి. అయినా ఇటీవలి కాలంలో ఈ రెండు రీతులూ పరస్పరాకర్షణకు లోనైనాయి. భారతీయ శాస్త్రీయ సంగీతం అనుల్లంఘనీయమైన నిబంధనల చట్రంలో బిగించబడింది. ఎన్ని ప్రయోగాలైనా, నూతన కల్పనలైనా ఆ నిబంధనల పరిధిలోనే జరగవలసి ఉంది. అయితే ఆ పరిధిలోనే కళాకారుని ప్రతిభా ప్రదర్శనకు అనంతమైన అవకాశం ఉన్నది. 'జాజ్' ఇటువంటి నిబంధనలు లేని స్వేచ్ఛా సంగీతం. ఒక రకమైన విప్లవ సంగీతం. అది శాస్త్రీయ సంగీతం కాదు. జానపద సంగీతం కాదు. లలిత సంగీతం కాదు. ఈ మూడింటి లక్షణాలను మేళవించుకున్న, ఈ మూడింటికీ భిన్నమైన ఒక విచిత్ర సంగీతం. భారతీయ సంగీతం అతి ప్రాచీన సంగీతమైతే. జాజ్ అత్యాధునిక సంగీతం. ఇంకా కొన్ని దశాబ్దాల తర్వాత కూడా అది అత్యాధునిక సంగీతం గానే ఉండిపోగలదు; నిత్య విప్లవ సంగీతంగా విలసిల్లగలదు. నిత్య నూతనత్వమే దాని స్వభావం.

ప్రపంచమంతటా సంగీతంలో రోజూ ఎన్నో కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. అవి కొన్నాళ్లు చెలామణి అయి, క్రమంగా అంతరించి పోతున్నాయి. కాని, 'జాజ్' అలా కొన్నాళ్ళు వెలిగి ఆరిపోయేది కాదు. ఎన్ని రకాల బాణీలనైనా, రీతులనైనా హరాయించుకోగలిగిన శక్తి 'జాజ్'కు ఉన్నది. నదులన్నింటినీ తనలో కలుపుకోగలిగిన సముద్రంలాంటిది 'జాజ్'. ఎన్నటికీ మారనిది భారతీయ సంగీతమైతే, ఎప్పుడూ మారుతూ ఉండేది 'జాజ్'. భారతీయ సంగీతానికి 'రాగం' ప్రాతిపదిక. పాశ్చాత్య శాస్త్రీయ సంగీతానికి 'స్కేల్' ప్రాతిపదిక. 'జాజ్'కు అటువంటి స్థిరమైన ప్రాతిపదిక లేదు. 'జాజ్' మోడరన్ ఆర్ట్ లాంటిది, మోడరన్ పొయట్రీలాంటిది.

భారతీయ సంగీతంలోనూ, జాజ్ లోనూ ఒక సమాన గుణం ఉన్నది. రెండింటిలోనూ 'సద్యఃకల్పన' (ఇంప్రువైజేషన్)కు ప్రాధాన్యం ఉన్నది. అంటే-ఇది వరకే రచించబడిన ఒక 'కృతి' (కంపోజిషన్)ని గానం చేయడం కంటే, అప్పటి కప్పుడు స్వయంగా భావన చేసి, కల్పన చేసి గానం చేయడం ఎక్కువగా జరుగుతుంది. భారతీయ సంగీతంలో గాయకుని సొంతం కానిదల్లా 'కృతి' మాత్రమే. ఆలాపన, తానం, స్వరకల్పన-ఇవి గాయకుడు అప్పటికప్పుడు భావనచేసి, కల్పన చేసి పాడేవే. కేవలం రాగ లక్షణాలు ఆధారంగా అతడు వాటిని సృష్టిస్తాడు. ఈ పద్ధతి 'జాజ్'లో కూడా ఉంది. 'జాజ్' కచేరీలో కళాకారులు ఒక చిన్న 'రచన'ను ఆధారం చేసుకుని, అప్పటికప్పుడు స్వరాల రంగులతో చిత్ర విచిత్రమైన సంగీత చిత్రాలను నిర్మిస్తారు.

ఈ సమానగుణాన్ని ఆధారం చేసుకుని భారతీయ సంగీతానికి, 'జాజ్'కు మధ్య సంపర్కాన్ని సాధించడానికి సుమారు పదేళ్ళుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. మన సినిమా సంగీతంపై 30, 40 ఏళ్ల క్రిందటే పాశ్చాత్య సంగీత ప్రభావం పడింది. పాశ్చాత్య వాద్యాలు మన సినిమా సంగీతంలో ధారాళంగా ఉపయోగించ బడుతున్నాయి. పాశ్చాత్యుల 'పాప్' సంగీతాన్ని మన సంగీత దర్శకులు యధేచ్ఛగా కాపీ కొడుతున్నారు. అయినా ఈ విదేశీ రీతులేవీ మన శాస్త్రీయ సంగీతం జోలికి రాలేదు. మన శాస్త్రీయ సంగీతం ఎన్నడూ ఏ విదేశీ సంగీతం వల్ల ప్రభావితం కాలేదని చెప్పడానికి వీల్లేదు కాని, చాలా తక్కువగా ప్రభావితమైనదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇతర ప్రభావాలను ప్రతిఘటించే స్వభావం మన సంగీతానికి ఉన్నది.

ఇప్పుడు 'జాజ్' మన శాస్త్రీయ సంగీత పరిధిలోనికి చొరబడడానికి ప్రయత్నిస్తున్నది. భారతీయ-జాజ్ సంగీతాల సమ్మేళనానికి ఒక ప్రాతిపదిక ఏర్పడుతున్నది. దీనివల్ల మన సంగీతం సంకరమై, భ్రష్ఠమైపోతుందని భయపడనవసరం లేదు. మన సంగీతపు విశుద్ధతను కాపాడుకొంటూనే. ''భారతీయ-జాజ్'' (ఇండో-జాజ్)ను ఒక కొత్త ప్రక్రియగా స్వీకరించడానికి అభ్యంతరం ఉండనక్కర్లేదు.

నండూరి పార్థసారథి
(1974 ఏప్రిల్ 5వ తేదీన ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమయింది)

Next Post