Title Picture

(నవల రచన : శ్రీ కిశోర్ సాహు; అనువాదం : శ్రీ బాలశౌరి రెడ్డి; ప్రచురణ, ప్రాప్తిస్థానం : పద్మప్రియ పబ్లికేషన్స్, 6-ఎ, లక్ష్మీనారాయణ వీధి, వెస్ట్ మాంబళం, మద్రాసు-33; క్రౌన్ సైజు : 470 పేజీలు; వెల : అయిదు రూపాయలు)

కిశోర్ సాహు ప్రముఖ హిందీ చిత్ర నిర్మాత, దర్శకుడు, రచయిత, నటుడు. సినిమా రంగంలో ఆయనకు దాదాపు నలభై సంవత్సరాల అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని పురస్కరించుకుని-బొంబాయి సినిమా రంగం స్వభావ స్వరూపాలను చిత్రిస్తూ ఈ నవలను రచించారు. సినిమారంగంలో-ముఖ్యంగా బొంబాయిలో వ్యాపారస్తులకే గానీ నిజమైన కళాకారులకు స్థానం లేదని చెప్పటం ఆయన ఉద్దేశం.

స్వార్థం, సంకుచితత్వం, అహంకారం 'మొదలయినవన్నీ కలిసి కరడు కట్టిన పదార్థాలు నిర్మాతలు. అందితే జుట్టు, అందకుంటే కాళ్లు పట్టుకోవటం వారి జీవనవిధానం. అటువంటి వారికే సినిమారంగం నిలవ నీడ ఇస్తుంది. నిర్మాతలలో నూటికి ఒకరు నిజాయితీగలవారు ఉంటే, మిగిలిన తొంభై తొమ్మిది మందీ అతడిని పొడుచుకుని తినాలని చూస్తూ ఉంటారు.

ఇది కేవలం కిశోర్ సాహు 'ఆత్మకథ' కాకపోవచ్చు కానీ-ఇందులో కథానాయకుని జీవితానికి, కిశోర్ సాహు జీవితానికి చాలా పోలికలు కనిపిస్తాయి. ఇందులో కథానాయకుడు ప్రతిభ, నిజాయితి, ఆత్మగౌరవంగల చలనచిత్ర దర్శకుడు. బొంబాయిలో బికారిగా జీవితం ప్రారంభిస్తాడు. ఎలాగో కష్టం మీద అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగం సంపాదించుకుంటాడు. నిర్మాత, దర్శకుడు, కథానాయకి అందరూ కలిసి అవమానించగా ఉద్యోగం వదిలివేస్తాడు. నిరుద్యోగిగా ఉన్న అతనికి ఒక చిన్నతార, ఒక హీరో సహాయం చేస్తారు. అతను స్వయంగా ఒక చిత్రాన్ని నిర్మిస్తాడు. ఆత్మహత్యకు పాల్పడబోతున్న ఒక అమ్మాయిని రక్షిస్తాడు. ఆమెకు కథానాయిక వేషం ఇచ్చి, గొప్ప తారను చేస్తాడు. వారు పరస్పరం ప్రేమించుకుంటారు. కాని మధ్యలో మరొక వ్యక్తి చొరబడి కలతలు తెస్తాడు. చివరికి కలతలు సమసిపోతాయి.

అనవసరమైన సన్నివేశాలు, పాత్రలు ఎన్నో ప్రవేశపెట్టి, కావలసినదానికి రెట్టింపు పేజీలు వ్రాశారు. సగానికి కుదిస్తే ఇది మంచి నవలే అయ్యేది. "2000 కేండిల్ గల బేబీ లైట్ వెలుతురు...", "గ్రేట్ ఇండియా పిక్చర్స్ రేశ్మీరుమాల్, సీన్ 53, షాట్... టేక్ నంబర్..."-ఇటువంటి సాంకేతిక వివరాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి కథకు అవసరం లేదు. పాఠకులకు వీటి పట్ల ఆసక్తి ఉండదు. పచ్చిశృంగార ఘట్టాలు కూడా రెండు మూడు ఉన్నాయి.

ఈ నవలను బాలశౌరిరెడ్డి గారు హిందీ నుంచి అనువదించారు. భాష సరళంగా, సాఫీగా లేదు. కొన్నిచోట్ల మరీ 'మక్కికి మక్కి' అనువదించారు. 'సిగరెట్ ఇవ్వు' అని అడగటానికి "సిగరెట్ త్రాగించు కైలాష్" అనటం తెలుగులో ఎక్కడా వినము. అలాగే-"మీతో కలిసి చాలా సంతోషమైనది", "సలమా స్వయంగా విస్మితురాలై" అనే వాక్యాలు కూడా విడ్డూరంగానే ఉంటాయి. "సాహిత్యకమైనవి" అనేది మరొక విచిత్ర ప్రయోగం.

అచ్చుతప్పులు కొల్లలుగా ఉన్నాయి. కొన్ని చోట్ల మనుషుల పేర్లు కూడా తారుమారు అయినాయి. ఏమయినా, ఈ నవల ఒకసారి చదవతగినదే-ముఖ్యంగా సినిమా జీవులకు.

నండూరి పార్థసారథి
(1965 జూన్ 23వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post