Title Picture

కాలక్షేప నిక్షేపం

లోగడ ఫిల్మిస్తాన్ సంస్థ పేరిట, దరిమిలా ఫిల్మాలయా (స్వంత) సంస్థ పేరిట ఎస్.ముఖర్జీ నిర్మించిన, నిర్మిస్తున్న చిత్రాలన్నీ కాలక్షేపానికి నిక్షేపాలనతగ్గవి. విజ్ఞానం పాలు కొరవడినా వినోదం పాలు ఆయన చిత్రాలలో పుష్కలంగా లభిస్తుంది. విశ్రాంతికోసం, వినోదంకోసం తపించే జనానికి మత్తుచల్లి, సేద తీర్చడమే పరమాశయంగా ఆయన చిత్రాలు నిర్మిస్తున్నాడు. ఫిల్మాలయా పేరిట తాజాగా వెలువడిన ఈస్ట్ మన్ కలర్ చిత్రం 'హమ్ హిందూస్తానీ' కూడా ఆ కోవకే చెందుతుంది.

పేరు చూసి ఇదేదో దేశభక్తికి సంబంధించిన చిత్రం అయి ఉంటుందని దురాశపడి వెళ్తే తప్పక ఆశభంగం కలుగుతుంది. కాని ముఖర్జీ గారి సంగతి లోగడ ఏమాత్రం ఎరిగున్నవారైనా అలా అపోహపడరు. భారతప్రజల జీవన విధానాన్ని గురించి, మనస్తత్వాన్ని గురించి చిత్రించడం ఈ చిత్ర లక్ష్యమని ప్రచారం జరిగింది కాని ఆ ఛాయలు మచ్చుకైనా ఇందులో కనపడవు. అందుచేత వినోదార్ధులు నిర్భయంగా ఈ చిత్రాన్ని చూడవచ్చును.

ఇది రెండు జతల ప్రేమ పక్షుల కథ. ఇంకా విలనులు, విదూషకులు మొదలయిన పాత్ర సామగ్రి, శృంగార భీభత్స భయానక సన్నివేశాలు, ప్రకృతి దృశ్యాలూ, నృత్య గీతాలు మొదలయిన 'తప్పనిసరి' అంశాలు పుష్కలంగా ఉన్నాయి. కన్నుల పండువైన రంగు రంగుల సంఘటనలు, శ్రుతిమించని మధుర సంగీతం, అందమైన అమ్మాయిలు ఉండడం వల్ల చిత్రంలో అడుగు మేరకూడా ప్రేక్షకులకు విసుగు పుట్టదు.

ముఖర్జీ గారి జ్యేష్టపుత్రుడు రామ్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. తొలి అనుభవం అయినా తండ్రి అభిరుచులకు అనుగుణంగా అతను చెప్పుకోతగ్గ ప్రతిభను ప్రదర్శించాడు. సంగీతం, ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు. ఉషాఖన్నా సంగీతం 'దిల్ దేకే దేఖో' చిత్రంలోకంటే ఎన్నో రెట్లు శ్రావ్యంగా ఉంది. పాటలన్నీ మధురంగా, నిరాడంబరంగా ఉన్నాయి. ఆమె సంగీతంలో ఇది వరకటి కంటె శబ్దం పాలు తక్కువై, మాధుర్యంపాలు ఎక్కువయింది. 20 ఏళ్లయినా నిండని ఈమె కూర్చిన సంగీతం అగ్రశ్రేణి బొంబాయి సంగీత దర్శకుల తలలూయించడమే కాదు, కొందరి తలలు వంచగలదు కూడా. నేపథ్య సంగీతం అతి సున్నితంగా, హాయిగా ఉంది. సాధారణంగా హిందీ చిత్రాలన్నిటిలో వలెనే ఇందులో కూడా కెమేరా పనివాడితనం మెచ్చుకోదగ్గ విధంగా ఉంది. చిత్రం మొదట్లో రంగులు కొంత ముతకగా ఉన్నట్లు అనుపించినా తర్వాత తర్వాత చక్కగా ఉన్నాయి. నిజానికి ఈ చిత్రాన్ని రంగులలో నిర్మించవలసిన అవసరమేమీ లేదు. కథలోని వాతారణానికి అది అత్యవసరమయింది కాదు. ఎలాగూ రంగులలో నిర్మిస్తున్నారు కనుక పనిలోని పని ప్రకృతి దృశ్యాలను కూడా కొన్నింటిని ఇమిడ్చారు.

జాయ్ ముఖర్జీ (ముఖర్జీ గారి కనిష్ఠ పుత్రుడు) నటన 'లవ్ ఇన్ సిమ్లా' చిత్రంలో కంటే చాలా మెరుగుగా ఉంది. అచిరకాలంలోనే అగ్రశ్రేణి నటుడుకాగల లక్షణాలను ప్రదర్శించాడు. ఆశాపరేఖ్ హాయిగా, మితంగా నటించింది. మిగతావారంతా తగు మాత్రంగా అభినయించారు.

నిర్మాత : ఎస్. ముఖర్జీ ; స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రామ్ ముఖర్జీ ; సంగీతం : ఉషాఖన్నా ; సంభాషణలు : రామ్ దత్తా ; పాటలు : భరత్ వ్యాస్, మనోహర్, ప్రేమ్ ధవన్, సాహిర్, రాజేంద్ర కిషన్ ; నేపథ్యగానం : లత, ఆశా, గీతా, రఫీ, ముఖేష్, ఉషాఖన్నా; తారాగణం : సునీల్ దత్, జాయ్ ముఖర్జీ, ఆశాపరేఖ్, హెలెన్, జాగీర్దార్, ఆగా, ముబారక్, లీలా చిట్నిస్, విజయ చౌదరి, శ్యామ్ ముఖర్జీ వగైరా....

నండూరి పార్థసారథి
(1961 ఫిబ్రవరి 19వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post