"దేవుడనే వాడొకడున్నాడని ఇప్పుడు తెలుసుకున్నాను".

1929 ఏప్రిల్ లో ఒక పదమూడేళ్ళ కుర్రవాడి వైలిన్ కచేరీ విన్న తర్వాత ప్రఖ్యాత సంగీత విమర్శకుడు, పరిశోధకుడు, రచయిత ఆల్ఫ్రెడ్ ఐస్ స్టీన్ అన్నమాటలివి. తన కాలపు అగ్రశ్రేణి పాశ్చాత్య సంగీత విద్వాంసులందరి కచేరీలు విని, వాటిని నిగ్గు తేల్చిన ఆయన అప్పటిదాకా అంత గొప్ప వైలిన్ సంగీతం వినలేదన్నాడు.

ఆ కుర్రవాడు యెహూదీమెనూహిన్.

బెర్లిన్ లో జరిగిన ఆనాటి కచేరీలో బ్రూనో వాల్టర్ వంటి గొప్ప కండక్టర్ ఆర్కెస్ట్రాను కండక్ట్ చేయగా మెనూహిన్ వరసగా బాఖ్, బీతోవెన్, బ్రామ్స్ వైలిన్ కాన్ చెటోలను వాయించారు. అతడి సంగీతాన్ని ఆల్ఫ్రెడ్ ఐన్ స్ట్రీన్ వినడం అదే మొదటిసారి. కాని, అప్పటికే మెనూహిన్ అమెరికాలో సుప్రసిద్ధుడు.

దేవుడున్నాడని విశ్వసించేవారు మోసార్ట్, బీతోవెన్ లను దైవాంశ సంభూతులుగానే పరిగణిస్తారు. వారిలాగా కంపోజర్ కాకపోయినా మెనూహిన్ వైలిన్ విద్వాంసుడుగా వారి స్థాయికి చెందినవాడే. పాశ్చాత్య సంగీత చరిత్రలో మెనూహిన్ శ్రేణికి చెందిన వైలిన్ వాదకులను ఒక చేతివ్రేళ్ళ మీద లెక్కించవచ్చు. వారు-బీతోవెన్ సమకాలికుడైన పెగానినీ (1782-1840); తర్వాత ఈ శతాబ్దంలో క్రైస్లర్, హైఫెట్జ్, డేవిడ్ ఒయ్ స్ట్రాక్, మెనూహిన్. పెగానినీ గొప్ప వైలిన్ వాదకుడే కాక కంపోజర్ కూడా. వైలిన్ పై ఆయన ప్రావీణ్యం ఎంతటిదో ఆయన కంపోజిషన్స్ ద్వారా, చరిత్రకారుల వర్ణనల ద్వారా అంచనా వేసుకోవలసిందే. కాని, క్రైస్లర్, హైఫెట్జ్, ఒయ్ స్ట్రాక్, మెనూహిన్ ల సంగీతాన్ని మనం స్వయంగా విని ఆనందించగలుగుతున్నాం. వారి ప్రావీణ్యాలను, వారి ప్రత్యేకతలను మనకు మనంగా బేరీజు వేసుకోవడానికి వారి రికార్డులు మన ఎదుట ఉన్నాయి. 1962లో క్రైస్లర్, 1974లో ఒయ్ స్ట్రాక్, 1987లో హైఫెట్జ్ అస్తమించారు. 1999 మార్చి 12వ తేదీ మెనూహిన్ అస్తమయంతో పాశ్చాత్య శాస్త్రీయ సంగీత చరిత్రలో ఒక అధ్యాయం సమాప్తమయింది.

రష్యా నుంచి అమెరికాకు వలసపోయిన యూదు దంపతుల తొలి సంతానంగా 1916 ఏప్రిల్ 22వ తేదీన న్యూయార్క్ లో యెహూదీ మెనూహిన్ జన్మించాడు. రెండేళ్ళ తర్వాత కుటుంబం శాన్ ఫ్రాన్సిస్కోకు మకాం మార్చింది. మెనూహిన్ తల్లిదండ్రులు సంగీత ప్రియులు. వారు కచేరీలకు వెళ్ళినప్పుడల్లా పిల్లవాడ్ని కూడా తీసుకువెడుతూ ఉండేవారు. పిల్లవాడి ఆసక్తిని గమనించి వారు అతడికి చిన్నసైజు వైలిన్ కొని పెట్టారు. నాలుగేళ్ల వయస్సులో సైమన్ ఆంకర్ అనే ఆయన వద్ద మెనూహిన్ వైలిన్ అభ్యాసం ప్రారంభమయింది. పద్ధెనిమిది నెలల తర్వాత లూయీ పెర్సింజర్ అనే మరొక గురువు దగ్గర అభ్యాసం ప్రారంభించాడు.

యెహూదీ మొట్టమొదటి కచేరీ 1924 ఫిబ్రవరి 29వ తేదీన ఓక్ లాండ్ ఆడిటోరియంలో జరిగింది. అప్పటికింకా అతడికి ఎనిమిదేళ్ళు నిండలేదు. 1926లో మెనూహిన్ తల్లిదండ్రులు యూరప్ కు నివాసం మార్చారు. మెనూహిన్ పారిస్ లో ప్రఖ్యాత రుమేనియన్ వైలిన్ విద్వాంసుడు, కంపోజర్ జార్జ్ ఎనెస్కో వద్ద వైలిన్ అభ్యాసం ప్రారంభించాడు. యూరప్ లో మెనూహిన్ మొదటి కచేరీ 1927 ఫిబ్రవరిలో పారిస్ లో జరిగింది. ఆ తర్వాత ఏడెనిమిది సంవత్సరాలు యూరప్ లోని ప్రధాన నగరాలన్నింటిలోనూ కచేరీలు చేశాడు.

1928 నుంచి మెనూహిన్ గ్రామఫోన్ రికార్డులివ్వడం మొదలుపెట్టాడు. 1932లో అతడు లండన్ లోని హెచ్.ఎం.వి. స్టూడియోలో ఎల్గార్ వైలిన్ కాన్ చెటోను రికార్డ్ చేసినప్పుడు ఎల్గార్ స్వయంగా ఆర్కెస్ట్రాను కండక్టర్ చేశాడు. అప్పటికి ఎల్గార్ వయస్సు 75. మెనూహిస్ కు పదహారేళ్లు. ఈ శతాబ్దపు గొప్ప కంపోజర్లలో ఒకడైన ఎల్గార్ ఆ కాన్ చెటోను క్రైస్లర్ కోసం రచించాడు. క్రైస్లర్ కే అంకితమిచ్చాడు. క్రైస్లర్ వాయించగా ఆయన విన్నాడు కూడా. కాని, తన కాన్ చెటోను మెనూహిన్ వాయించగా విని ఆయన పరమానందభరితుడైనాడు. అంత గొప్ప వైలిన్ వాదనం తాను అంతకు ముందెన్నడూ వినలేదని ఆయన అన్నాడు.

ఆరేళ్ళ వయస్సులో కంపోజింగ్ ప్రారంభించి, అద్భుతంగా పియానో కచేరీలు చేసిన మోసార్ట్ ను ఆరాధించినట్లే సంగీత ప్రియులు మెనూహిన్ నూ ఆరాధించారు. మెనూహిన్ పదకొండేళ్ళ వయస్సులో ఒకసారి న్యూయార్క్ సింఫనీ ఆర్కెస్ట్రాతో కలిపి బీతోవెన్ వైలిన్ కాన్ చెటోను వాయించినప్పుడు అతడి ప్రావీణ్యానికి శ్రోతలు నిర్విణ్ణులైపోయారు. వైలిన్ ను అంత గొప్పగా వాయించడం సాధ్యమా అని వారు ఆశ్చర్యపోయారు. ఆనందం, ఉద్వేగం భరించలేక ఆర్కెస్ట్రాలో కొందరు ఏడ్చేశారట.

బాల్యదశలో అసాధారణ ప్రతిభ కనబరచే వారిలో చాలా మంది పెద్దయిన తర్వాత అతి సామాన్య కళాకారులుగా మిగిలిపోతుంటారు. చిన్నప్పటి ఆకర్షక శక్తిని కోల్పోయి, క్రమంగా తెరమరుగైపోతారు. కాని, మెనూహిన్ విషయంలో అలా జరగలేదు. మోసార్ట్ లాగానే మెనూహిన్ ప్రతిభ కూడా వయస్సుతో పాటు పెరుగుతూనే వచ్చింది. అయినా, ఆయన చిన్ననాటి రికార్డులలో కొన్నింటిని వింటే ఆ రచనలను అంతకంటే గొప్పగా వాయించడం సాధ్యం కాదనిపిస్తుంది. చివరిదాకా మోనూహిన్ కు బాగా నచ్చిన తన రికార్డులలో పదహారేళ్ళ వయస్సులో ఇచ్చిన ఎల్గార్ కాన్ చెటో ఒకటి.

పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో వెలసిన వైలిన్ కాన్ చెటోలన్నింటిలోకి అత్యద్భుతమైనది బీతో వెన్ కాన్ చెటో. ఒకసారెప్పుడో మెనూహిన్ నౌకాయానం చేస్తుండగా ఆ కాన్ చెటో రికార్డు వినిపించింది. చివరి దాకా తన్మయత్వంతో విని 'బీతో వెన్ కాన్ చెటో అంటే అలా వాయించాలి' అనుకున్నాడట. రికార్డు అయిపోయిన తర్వాత కనుక్కుంటే అది పూర్వం ఎప్పుడో తను యిచ్చిన రికార్డేనని తెలిసింది!

ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో క్షతగాత్రులైన సైనికులకు ఊరట కల్గించడానికి మెనూహిన్ వందలాది కచేరీలు చేశాడు. ఒక్కొక్క రోజు రెండు మూడు చోట్ల కచేరీలు చేశాడు. యుద్ధంలో యిళ్లు, వాకిళ్లు కోల్పోయిన ప్రజల కోసం తన కచేరీల ద్వారా ఆయన లక్షలాది డాలర్ల ధనం సేకరించాడు. యుద్ధ కాలంలో ఆయన అందించిన సేవలకు గానూ బ్రిటన్, ఫ్రాన్స్, పశ్చిమజర్మనీ, బెల్జియం, గ్రీస్ ప్రభుత్వాలు అత్యున్నత శ్రేణి బిరుదులతో ఆయనను సత్కరించాయి. ఆ తర్వాత ఆయన తన కళా జీవితాన్ని పూర్తిగా మానవ సేవకే అంకితం చేశాడు.

భారతదేశంతో ప్రత్యేకానుబంధం

ప్రఖ్యాత సితార్ విద్వాంసుడు రవిశంకర్ తో మైత్రి ద్వారా మెనూహిన్ కు భారతదేశంతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. 1952లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆహ్వానంపై మొదటిసారి మెనూహిన్ మన దేశానికి వచ్చాడు. అప్పుడే ఢిల్లీలో వి.కె. నారాయణ మీనన్ నివాసంలో ఆయన రవిశంకర్ సితార్ కచేరీ విన్నాడు. భారతీయ శాస్త్రీయ సంగీతం ఆయనను ఎంతో ఆకర్షించింది. రవిశంకర్ ద్వారా ఆయన మన సంగీతం గురించి, మన సంస్కృతికి గురించి ఎంతో తెలుసుకున్నాడు. తర్వాత కాలంలో ఆయన భారతీయ వేదాంతాన్ని అధ్యయనం చేశాడు. యోగవిద్యను అభ్యసించాడు. తన తొలి భారత పర్యటనలోనే ఆయన కచేరీల ద్వారా 74,000 డాలర్లు సేకరించి క్షామనివారణ నిధికి సమర్పించాడు. ఆ తర్వాత నాలుగైదు సార్లు ఆయన మన దేశాన్ని సందర్శించాడు. 1964లో నెహ్రూ మరణానంతరం ఢిల్లీకి వచ్చి శ్రద్ధాంజలిగా కచేరీ చేశాడు.

మెనూహిన్, రవిశంకర్

1966లో బాత్ మ్యూజిక్ ఫెస్టివల్ లోనూ, 1967లో ఐక్యరాజ్య సమితి మానవహక్కుల దినోత్సవంలోనూ మెనూహిన్, రవిశంకర్ జుగల్ బందీ కచేరీలు చేశారు. ఆ కచేరీలలో వారు వాయించిన 'తిలంగ్', 'పీలూ' రచనలు రికార్డులుగా కూడా వచ్చాయి. రవిశంకర్ మైత్రి వల్ల మెనూహిన్ హిందూస్థానీ సంగీతతత్త్వాన్ని వంట బట్టించుకున్నారు.

మెనూహిన్ జీవితంపై భారతీయ సంస్కృతి ప్రభావం ఎంతో ఉంది. అలాగే భారతీయ వైలిన్ విద్వాంసులందరిపైనా అంతో ఇంతో ఆయన ప్రభావం ఉన్నది. ఎం.ఎస్. గోపాలకృష్ణన్, లాల్గుడి జయరామన్, ఎల్. సుబ్రహ్మణ్యం, ఎల్. శంకర్-మెనూహిన్ వాదన శైలిని అధ్యయనం చేసినవారే. వీరందరినీ ఆయన పాశ్చాత్య శ్రోతలకు పరిచయం చేశాడు. పాశ్చాత్య సంగీత చరిత్రలో హైఫెట్జ్, ఒయ్ స్ట్రాక్, క్రైస్లర్ ల కంటే మిన్నగా ఒక విశిష్ట స్థానం మెనూహిన్ కు లభిస్తుంది. తన కళను మానవ సేవకు అంకితం చేసిన అటువంటి కళాకారుడు మరొకరు లేరు. వైలిన్ వాదనంలో ప్రతిభను, ప్రావీణ్యాన్ని కూడా మించిన మరేదో విశేషం, మరేదో గుణం మెనూహిన్ వాదనంలో ఉందని పాశ్చాత్య సంగీతంలో నిష్ణాతులైన వారు అంటారు. హైఫెట్జ్, ఒయ్ స్ట్రాక్ తాము వాయించే కంపోజిషన్ కు నూటికి నూరు పాళ్లు న్యాయం చేస్తే మెనూహిన్ ఇంకా ముందుకు పోయి కంపోజర్ ఆశించగలిగినదాని కంటే మిన్నగా ఆ రచనకు ఒక కొత్త డైమెన్షన్ యిస్తాడనీ, ఆయన వాయిస్తుంటే కంపోజర్ కు తన రచనలో తనకే తెలియని కొత్త అందాలేవో కనిపిస్తాయనీ అంటారు. మెనూహిన్ సంగీతం వింటున్నప్పుడు ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని కూడా అంటారు. భౌతికంగా మెనూహిన్ యిప్పుడు లేకపోయినా, తరతరాల సంగీత ప్రియులు, విమర్శకులు, విద్యార్థులు, పరిశోధకులు అధ్యయనం చేయడానికి ఆయన రికార్డులు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. బాఖ్ మొదలుకొని బార్టోక్ వరకు నాలుగు శతాబ్దాలలో వెలువడిన గొప్ప వైలిన్ రచనలలో దేనినీ మెనూహిన్ వదిలిపెట్టలేదు. జీవితం పట్ల, సంగీతం పట్ల తన దృక్పథాన్ని, తన తత్వాన్ని ఆయన 'ది అన్ ఫినిష్ట్ జర్నీ', 'థీమ్ అండ్ వేరియేషన్స్' అనే గ్రంథాలలో వివరించాడు.

నండూరి పార్థసారథి
(1999 ఏప్రిల్ 02వ తేదీన మాభూమిలో ప్రచురితమైనది)

Previous Post