ఘంటసాల ఏడుకొండల స్వామి భక్తుడు. తిరుమల దేవస్థానం ఆస్థాన గాయకులలో ఆయన ఒకరు. తన ఇష్టదైవంపై ఆయన ఎన్నో పాటలు పాడి రికార్డులు ఇచ్చారు. ఆ పాటలన్నీ ఇప్పటికీ ఆంధ్రదేశమంతటా మారు మ్రోగుతూనే ఉన్నాయి. విని విని రికార్డులు అరిగిపోవలసిందేగాని, వాటి పట్ల జనానికి మక్కువ మాత్రం తరగడం లేదు. రికార్డులు అరిగిపోతే కొత్త కాపీలు కొనుక్కుంటున్నారు. వాటికి డిమాండు తగ్గడం అనేది ఉండదు. గ్రామఫోను కంపెనీవారు వాటిని ఇ.పి.లుగా, ఎల్.పి.లుగా వేస్తూనే ఉన్నారు; వేస్తూనే ఉంటారు.

ఘంటసాల చివరిరోజుల్లో, తను తనువు చాలించవలసిన రోజు ఆసన్నమైనదని తెలుసుకున్న తర్వాత 'నీ కొండకు నీవే రప్పించుకో' అని అతిదీనంగా, నిస్సహాయంగా ఏడుకొండలవానికి మొరపెట్టుకున్నారు. ఆయన వీడుకోలు తీసుకుని వెళ్ళిపోయినరోజు 'ఆకాశవాణి' సమర్పించిన శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని విన్నవారు ఆ పాటను ఎప్పటికీ మరచిపోలేరు. గంభీర మధురమైన ఆయన కంఠస్వరంలో స్పందించిన దైన్యం, విషాదం లక్షలాది శ్రోతలను కంటతడి పెట్టించాయి. ఆయన అది వరకు పాడిన భక్తి గీతాలలో భక్తి మాత్రమే ఉన్నది. ఈ పాటలో భక్తితోపాటు వైరాగ్యభావం ఎక్కువగా ఉన్నది. ఈ పాట 'అహీర్ భైరవ్' రాగంలో అద్భుతంగా ఉంది. ఇదే రాగాన్ని ఆయన పూర్వం 'పెళ్ళిచేసిచూడు' చిత్రంలో 'ఏడుకొండలవాడా వెంకటరమణా' పాటకు ఉపయోగించారు. కాని, ఆ పాటలో విషాదచ్ఛాయలు లేవు. 'నీ కొండకు నీవే రప్పించుకో' పాటను ఘంటసాల స్వయంగా రచించారట. ఆ పాటను గ్రామఫోను కంపెనీవారు రికార్డు చేశారో లేదో తెలియదు.

ఘంటసాల నిజమైన వ్యక్తిత్వం ఆయన భక్తిగీతాలలోనే కనిపిస్తుంది. సినిమా పాటల్లో గాయకునిగా ఆయనకు పూర్తి స్వాతంత్ర్యం ఉండదు. సన్నివేశపు అవసరానికి అనుగుణంగా, హీరో హావభావ ప్రదర్శనకు అనుగుణంగా, సంగీత దర్శకుని అభిరుచికి అనుగుణంగా పాడవలసి ఉంటుంది. సాహిత్యం నచ్చకపోయినా, సంగీతం నచ్చకపోయినా పాడక తప్పదు. తనకు ఇష్టమైన గీతాన్ని ఎంచుకొని దానికి తానే సంగీతాన్ని సమకూర్చుకొని పాడితే లభించే తృప్తి నిర్మాతలకోసం పాడేపాటల్లో లభించదు. తను పాడిన అసంఖ్యాకమైన సినిమా పాటలు అట్టే కాలం బ్రతికేవి కావని ఆయనకి తెలుసు. అందుకే ఆయన చివరికి వెళ్ళిపోయేటప్పుడు తనను విపరీతంగా అభిమానించిన ఆంధ్రప్రజలకు అమూల్యమైన, శాశ్వతమైన కానుకలు సమర్పించాలనుకున్నారు. జయదేవుని అష్టపదులలో నాలుగింటిని 'సూపర్-7' రికార్డుగా ఇచ్చారు. ఆ తర్వాత 'భగవద్గీత'ను రెండు ఎల్.పి. రికార్డులుగా ఇచ్చారు.

'భగవద్గీత'లోని 18 అధ్యాయాల నుంచి అష్టోత్తర శత (108) శ్లోకాలను ఎంచుకొని, వాటిని రాగ యుక్తంగా గానం చేశారు. మొదటి ఎల్.పి. రికార్డు (ECSD 3231)లో మొదటి తొమ్మిది అధ్యాయాల నుంచి ఎంచుకొన్న 56 శ్లోకాలను గానం చేశారు. ఈ రికార్డు జూలై నెలలో విడుదలయింది. రెండవ వాల్యూమ్ ఇంకా విడుదల కాలేదు. ఘంటసాల తన జీవితంలో పాడిన పాటలన్నీ ఒక ఎత్తు, ఈ భగవద్గీతా గానం ఒక్కటీ ఒక ఎత్తు. ఆయన హృదయం, ఆత్మ ఇందులో ఉన్నాయి. ఘంటసాల సంగీత సారమంతా ఇందులో ఉన్నది. ఘంటసాల వ్యక్తిత్వం ఏమిటో, ఆయన సంస్కారం ఎటువంటిదో, ఆయన గొప్పతనం ఏమిటో ఈ రికార్డు ఒక్కటి వింటే తెలుస్తుంది. ఇందులో ఆయన తన ప్రాణశక్తినంతానింపి గానం చేశారు. అష్టోత్తరశత శ్లోకాలతో ఆయన పరమపదానికి సోపానాలు నిర్మించుకొన్నారని అనిపిస్తుంది. ఒక్కొక్క శ్లోకంతో ఒక్కొక్క మెట్టు ఎక్కి ఆయన కైవల్యాన్ని చేరుతున్నట్లు అనిపిస్తుంది. ఈ రికార్డు ఘంటసాల నిర్మించుకున్న పరమపద సోపానపథంగా కనిపిస్తుంది.

'పార్థాయ ప్రతిబోధితాం' అనే శ్లోకంతో ఆయన ప్రారంభించారు. మొదటి 'అర్జున విషాదయోగం'లో అర్జునుడు చెప్పిన 'న కాంక్షే విజయం కృష్ణ' అనే శ్లోకాన్ని మాత్రం తీసుకున్నారు. మిగిలిన అధ్యాయాలలో అర్జునుని ప్రశ్నలను వదిలి పెట్టి, శ్రీ కృష్ణుని బోధలలో ముఖ్యమైన వాటిని తీసుకున్నారు. ఒక శ్లోకాన్ని రాగయుక్తంగా గానం చేసిన తర్వాత, తెలుగు వచనంలో దాని అర్థాన్ని వివరించారు. తెలుగు వచనాన్ని కె.ఎన్. రంగయ్య శాస్త్రిగారు రచించారు. ఘంటసాల చదివారు. వచన రచన క్లుప్తంగా, సరళంగా, నిర్దుష్టంగా ఉంది. దానిని ఘంటసాల చదివిన పద్ధతి అద్భుతంగా ఉంది. నాస్తికులకు సైతం ఒళ్ళు గగుర్పొడిచేటట్లుగా ఆయన చదివారు. 'భగవద్గీత' భక్తుడు భగవంతుని స్తుతిస్తూ గానం చేసినది కాదు-సాక్షాత్తూ భగవంతుడు బోధించినది. అందుకే ఘంటసాల రసావేశానికి అతీతమైన స్థితిలో గానం చేశారు. అందులో ప్రత్యేకంగా భక్తిగానీ, వైరాగ్యంగానీ, మరి ఏ భావంగానీ వ్యక్తం కాదు. ఒక విధమైన నిశ్చలత, గంభీరత మాత్రం కనిపిస్తాయి. సంస్కృత శ్లోకాలలోనూ, తెలుగు వచనంలోనూ కూడా ఘంటసాల ఉచ్చారణ స్పష్టంగా ఉంది.

కేవలం సంగీతపరంగా చూసినా ఇది గొప్ప రికార్డు, ఘంటసాల ఇందులో దాదాపుగా అన్నీ హిందూస్థానీ రాగాలే ఉపయోగించారు. పూర్యాధనశ్రీ, యమన్ కళ్యాణ్, జోగీయ, సింధుభైరవి, కళావతి, భూపాలీ, మధువంతి, దేశ్, రాగేశ్వరి, దుర్గ, బిలాస్ ఖానీతోడి, చారుకేశి, శ్యామ్ కళ్యాణ్, అహీర్ భైరవ్, మాల్కౌస్, భీమ్ పలాస్, పూర్యాకళ్యాణ్, శంకర, హంసధ్వని వంటి దాదాపు పాతిక రాగాలలో ఆయన 56 శ్లోకాలను గానం చేశారు. మొత్తం అంతా 40 నిమిషాల రాగమాలికగా కనిపిస్తుంది. రెండే వాద్యాలు-సితార్, వేణువు ఉపయోగించారు.

'భగవద్గీత' కంటే కొంచెం ముందుగా జయదేవ అష్టపదుల రికార్డు (S/7 LPE 16003) విడుదలయింది. ఈ 'సూపర్-7' రికార్డులో ఆయన రెండువైపులా సుమారు 20 నిమిషాలసేపు నాలుగు అష్టపదులు గానం చేశారు. మొదటి వైపు 'ప్రవిశరాధే' (రెండవ అష్టపది) 'రాధికా కృష్ణ రాధికా' (9వ అష్టపది) పాడారు. రెండోవైపు 'ధీరసమీరే' (11వ అష్టపది), 'రమతే యమునా' (15వ అష్టపది) పాడారు. వీటిని కూడా ఆయన హిందూస్థానీ రాగాలలోనే పాడారు. మొదటిది 'యమన్ కళ్యాణ్', రెండవది 'దర్బారీ కానడ', మూడవది 'భూపాలీ', నాల్గవది 'పీలూ'. ఈ రికార్డులో కూడా సితార్, వేణువు మాత్రమే ఉపయోగించారు. నాలుగు అష్టపదులూ ఒకదాని కంటే ఒకటి బావున్నాయి. ఘంటసాల గొంతులో విశేషమైన మార్దవం కనిపిస్తుంది.

సంగీతప్రియులు, భక్తి సంగీతప్రియులు, ఘంటసాల అభిమానులు అందరూ కొనుక్కోవలసిన రికార్డులు ఈ రెండూ. ఆంధ్రప్రజలకు ఇవి ఘంటసాల చివరి కానుకలు. మరొక గొప్ప కానుక సంకల్పించికూడా ఆయన అందజేయలేకపోయారు. హైదరాబాద్ లో ఒక సంగీత కళాశాలను నెలకొల్పాలనుకున్నారు. ఆ పని చేసే లోపుగానే ఆయన జీవిత వ్యవధి ముగిసింది. ఆయనకు మిత్రులు, సన్నిహితులు అయినవారు ఘంటసాల 'స్మారకనిధి'ని సేకరించి, ఆ సంకల్పాన్ని సిద్ధింపజేస్తే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుంది.

పునర్జన్మ అనేది ఉంటే ఘంటసాల మళ్ళీ ఆంధ్రలోనే జన్మించి, తను లేని లోటును తనే భర్తీ చేసుకుంటారని ఆశిద్దాం.

నండూరి పార్థసారథి
(1974 అక్టోబర్ 11వ తేదీన ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమైనది)

Previous Post Next Post