Humor Icon

ఆనాటి సంఘటన నా డైరీలో ఎర్రసిరాతో రాసుకున్నాను. ఆ గురుకులవాసం తలుచుకున్నప్పుడల్లా ఇప్పటికీ నాకు గుండె దడదడ కొట్టుకుంటుంది. ఆట్టే మెదిల్తే "నువ్వు ఓఠ్ఠి పిరికిపందవి. నువ్వు అటువంటి సంఘటన అంతకుముందు ఎప్పుడూ ఎరగవు. అందుకనే, నీ కంతభయం వేసింది. చూడు మా కేమన్నా భయం ఉందేమో!" అంటాడు మా రామచంద్రరావు సమర్థిస్తూ. అసలు సంగతి చెప్తాను వినండి.

'మొన్న వేసవికాలం సెలవుల్లో రామచంద్రరావు బలవంతాన లాక్కెళ్ళితే వాళ్ళ ఊరు వెళ్ళాను. ఆ ఊరు పేరు 'బ్రాహ్మణపాలెం'. ఎక్కడో డొంకల్లోని ఊరు. ఆ ఊరు చూస్తేనే నాకు కడుపులో తిప్పటం ప్రారంభించింది. ఆ ఊళ్ళో ఒక్క డాబా అయినా లేదు. అన్నీ పాకలు, ఒకటి రెండు తమాషా డాబాలు మట్టివి. రోడ్లు సరేసరి. అసలే లేవు. వర్షాకాలంలో మోకాల్లోతు బురద; వర్షం పట్టున పది గంటలు కురిసిందంటే, ఊళ్ళో వాళ్ళు బయటికీ, బయటి వాళ్ళు ఊళ్ళోకి రావటానికి వీల్లేదు. ఊరి చుట్టూ నీళ్ళు వ్యాపించి అదో సింహళ ద్వీపంలా తయారవుతుంది. సరే! ఆ ఊరు సంగతి దేనికి - అసలు విషయం.

ఊళ్ళోకి వెళ్ళగానే అతను నాకో విడిది చూపించాడు. అది ఊరంతటికీ రాజభవనం అని చెప్పవచ్చు. మా మిత్రుడి ఇల్లు పాక అవటం వల్ల బస్తీ వాణ్ణి నాకు అనువుగా ఉంటుందో, ఉండదోనని ఈ రాజభవంతికి తీసుకు వచ్చాడు. ఆ భవంతిని గురించి వర్ణించటం చాలా అవసరం.

అదొక మిట్టమీది మట్టి మిద్దె. అంటే గోడలన్నీ మట్టివే నన్నమాట. మేడమీద నాలుగయిదు గదులున్నాయి. అవీ మట్టివే. ఈ గదులు కాక మేడమీద సుమారు ఒక ఎకరం ఖాళీ డాబా ఉంది. పైన కూరగాయలు పండించుకోవచ్చు. గడ్డీ గాదం బాగా పెరిగి ఉన్నాయి. భారతదేశంలో అసలు ఇంతటి పల్లెటూరు ఉంటుందనీ, అందులో ఇటువంటి ఇళ్ళు కూడా ఉండటం సంభవమనీ నాకు కలలో కూడా తెలియదు. ఒక గదిలోకి తీసుకువెళ్ళాడు. ఆ గదిలో కూడా పచ్చ గడ్డి మొలిచి ఉంది. అసలు సంగతి చెప్పడం మరిచాను. ఆ ఇంటికి మరో ప్రత్యేకత ఉంది. ఏమిటంటే ఆ ఊరు అంతటికీ అది గురుకులవాసం. నేను దిగిన గదికి పక్కనున్న గదుల్లో ఒక పంతులుగారు కాపురం ఉంటున్నాడు. ఆయన దగ్గరో ఇరవై మంది శిష్యులున్నారు. వాళ్ళందరూ పగలూ రాత్రీ కూడా ఆ గురుకులవాసంలోనే కాపురం పెట్టి, గురువుగారికి శుశ్రూష ఎలా చెయ్యాలో నేర్చుకుంటున్నారు. ఆ గురువుగారు మహావిద్వాంసులట. మా రామచంద్రరావు కూడా, ఆయన దగ్గర అప్పుడప్పుడూ తెలుగు చెప్పించుకుంటూ ఉంటాడు. ఆయన ముఖం, తుమ్మల్లో పొద్దూకుతున్నట్లుంది. బట్టతలా, కురుక్షేత్రంలో దుర్యోధనుడి మీసాలూ అతికించినట్లు. లంబోదరుడు, వామనుడు. ఒక్కమాటలో సిసలైన పల్లెటూరి బడిపంతులు.

ఈ వాతావరణంలో నాకు మరీ కంపరం పుట్టింది. ఇహ మా రామచంద్రరావు. నా ప్రాణాలకి వాడో 'సైకాలజిస్టు', 'పామిస్టు', 'పెసిమిస్టు'. ఈ జిస్టు గాళ్ళన్నా, 'మిస్టు' గాళ్ళన్నా నాకు ఒళ్ళుమంట. వీటికి తోడు వాడో పెద్ద వేదాంతి. ఇహ లంకించుకున్నాడు. పొద్దున భోంచేసిన దగ్గర్నుంచి సాయంకాలం వరకూ సైకాలజీ, ఫిలాసఫీ. ఉపవ్యాసం దంచి దంచి చివరికి వాదన దెయ్యాల్లోకి దించాడు వద్దు మొర్రో అంటున్నకొద్దీ. పైగా అసుర సంధ్యవేళ. దెయ్యాల ఊళ్ళోని భూతాల కొంప, దానికి తోడు వీడి వర్ణన.

"దెయ్యాలూ భూతాలూ లేవు. ముందు నోర్ముయ్. నువ్వెపుడన్నా దెయ్యాన్ని చూసేవుట్రా మహా లావు మాట్లాడుతున్నావ్" అన్నాను.

"దెయ్యాల్లేవంటా వేమిట్రా రాస్కెల్. దెయ్యాలని గురించి నీ కేం తెలుసు. పల్లెటూరి వాణ్ణి. నాకు తెలుసా, నీకు తెలుసా. దెయ్యాల్లో ఎన్ని రకాలుంటాయో తెలుసా. లంబాడీ దెయ్యం, కొరివి దెయ్యం, విధవ దెయ్యం, పునిస్త్రీ దెయ్యం... ఇలా పదో పన్నెండో రకాలున్నాయి. కొరివి దెయ్యాల్ని నేను రోజూ చూస్తూనే ఉంటాను-పొలాల్లో చీకటి పడిం తర్వాత. అసలింతకీ దెయ్యమంటే ఏమిటో తెలుసా" అన్నాడు.

"అసలూ లేదు, పెసలూ లేదు నోర్ముయ్. దెయ్యమట దెయ్యం. మనలో ఉండే భయం తప్ప దెయ్యం లేదు, భూతం లేదు" అన్నాను.

"అది కాదోయ్, దెయ్యమనగా...." ఇహమొదలెట్టాడు నిర్వచనం, వ్యుత్పత్తి... "మానవుని ఆత్మ వుంది చూశావ్! అది మానవ దేహంపై మమకారం చావక, శవాన్ని పాతిపెట్టేశాక కూడా ఆ గోరీ చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. జీవితంలో తీరని కోరికలు తీరింతర్వాత అవి మాయమైపోతాయట అంతులేకుండా. అది - తెలిసిందా" అంటూ గుక్క తిప్పుకున్నాడు.

"ఇహ అయిందిగా ఉపన్యాసం! ఇంక నోర్ముయ్"

"నువ్వు నమ్మటం లేదు కదూ! దెయ్యాలున్నాయో లేదో నీకే తెలుస్తుంది ఎప్పటికైనా" అన్నాడు.

"ఏడిశావ్"

చీకటి పడింది. మళ్ళీ భోజనం చేసి వచ్చాము.

"అరే! ఇవాళ అర్జెంటుగా మా పొలంలో కెళ్ళి పడుకోవాలి కాపలాకి. మా నాన్న గారు ఊళ్ళో లేరు. నీకు ఇక్కడ మంచం ఉందిగా. పడుకో. తెల్లవారుతూనే వచ్చేస్తాను" అన్నాడు.

"ఓరి నీ - ఇదేనట్రా నువ్వు చేసే మర్యాద... రాక రాక మీ ఊరు వస్తే... రావటం ఏమిటి, లాక్కొచ్చి..." అన్నాను.

"అరె! ఏం అనుకోకురా! మా నాన్నగారు ఊళ్ళో లేరు. అందుకని. లేకపోతే ఇక్కడే పడుకునేవాణ్ణి. అయినా నీకేం భయం! పడుకోలేవు ఒక్కడివీ".

"ఛట్... నాకు భయం ఏమిట్రా. అది మన జన్మలో లేదు. ఫో నువ్వు. అది సరే గానీ తేళ్ళూ, గట్రా రావు గదా" అనడిగాను.

"అబ్బే! అటువంటి వేమీ రావుగానీ, మహావస్తే ఒకటీ, రెండూ పాములే వస్తుంటాయి. అప్పుడప్పుడూ" అంటూ ఉడాయించాడు. వాడు వెళ్ళగానే నిండా ముసుగు పెట్టుకొని పడుకొన్నాను. ఇహ అసలు కథ, రసకందాయంలోకి వచ్చింది. కొంత సేపటికి అంతా నిశ్శబ్దం అయింది. పక్కగదిలోని పిల్లలు కూడా, రణగుణ ధ్వనిగా చదువుతున్నవాళ్ళు, ఆపి నిద్రకు పడ్డారు. భయంకర నిశ్శబ్దం. "మహావస్తే ఎప్పుడైనా ఒకటీ ఆరా పాములే వస్తుంటాయి" అని వాడు చెప్పి వెళ్ళిన మాటలు చెవుల్లో గింగురు మంటున్నాయి. ముసుగు ఇంకా కాస్త గట్టిగా పెట్టి, అంజనేయ దండకంలో జ్ఞాపకం ఉన్న మొదటి రెండు ముక్కలు చదువుకున్నా. దండక ప్రభావమో ఏమో గాని గట్టిగా గాలి విసిరి, దీపాన్ని అర్పివేసింది. కటికి చీకటి. కీచురాళ్ళు గుక్క తిప్పుకోకుండా, కురుక్షేత్రంలోని పద్యాల్లా, 'గీ' పెట్తున్నాయి. ఊరిబయట కుక్క ఒకటి, ఉండుండి గుబులు పుటినప్పుడల్లా 'ఖంయ్' మంటోంది జడుసుకునేటట్లు.

కొంత సేపటికి, తాచుపాము ఒకటి పడగ విప్పి బుస కొట్తున్నట్లు వినిపించింది. భయంతో గజగజ వణికి పోయాను. ఆ బుస అంతకంతకూ తీవ్ర మవుతూంది. నాకు నోటితడి ఆరిపోతూంది. రామనామ జపం చేసుకుందామన్నా, మనసు నిలవటం లేదు. పాములు ఒకటి, రెండై, మూడై, యింకా తీవ్రంగా బుస కొట్టుతున్నాయి. చివరికి కొన్ని వందల పాములు ఒక్కసారిగా పడగలు ఊపుతూ భయంకరంగా బుస కొట్తున్నాయి. నాకు ఊపిరి అందటం లేదు. కొయ్యబారి, బిగ్గుసుకుపోయింది ఒళ్ళు. సెలవు లివ్వగానే తిన్నగా మా ఊరుపోక, ఈ పాడు ఊరు ఎందుకొచ్చానా అని ఏడుపొచ్చింది. ఎప్పటి కప్పుడు పడగ ఎత్తి కాటు వేస్తున్నట్లే ఉంది బుస. ముసుగు కొంచెం కూడా కదిల్చే ధైర్యం లేదు. అలాగే శవంలా బిగదీసుకుని పడుకున్నా.

మెల్లగా పాముల బుసలు తగ్గాయి. కొంత సేపు నిశ్శబ్దంగా ఉంది. భగవంతుడికి వెయ్యి దణ్ణాలు పెట్టుకున్నాను. కొంత సేపటికి పిల్లులు పోట్టాడుకొంటున్నట్లు వినిపించింది. ఆ కీచులాట ముదిరి ముదిరి పాకానపడి, మహా యుద్ధంగా పరిణమించింది. ఆ శబ్దం ఎంతో భయంకరంగా తయారయింది. ఈ గొడవ అంతా ఏమిటో నా కర్థం కాలేదు. పిల్లులు ఒకదాన్ని ఒకటి రక్కుకుంటూ ఎగిరెగిరి పడుతూ చివరికి నా మీద పడతాయేమోనని వణికి పోయాను. వచ్చి వచ్చి ఈ దెయ్యాల కొంపలో పడ్డాను. క్రమంగా అదీ ఆగిపోయి చంటి పిల్లాడి ఏడుపు వినవచ్చింది. క్రమంగా హోరు ఎక్కువయి, శ్రుతి మించి రాగాన పడింది. ఇహ గుక్క తిప్పకుండా ఒకటే ఏడుపు. ఎక్కడిదీ పిల్లాడి ఏడ్పు. పక్కనున్న పంతులుగారికి పిల్లాపీచూ ఎవరూ లేరు. ఇటువంటి వేషాలన్నీ లంబాడీ దెయ్యాలు చేస్తూ ఉంటాయని, సాయం కాలమే వర్ణించి చెప్పాడు ఆ వెధవ. దయ్యాలమాట తలుచుకోగానే నాకు నవనాడులూ క్రుంగిపోతున్నాయి. ఒక్కొక్క ప్రాణమే మెల్లగా ఎగిరిపోవటం మొదలెట్టింది. వాడు యిందాక చెప్పనే చెప్పాడు, "దయ్యాలున్నాయో లేదో నీకే తెలుస్తుంది ఎప్పటికైనా" అని. అసలు ఇదంతా వాడిపనే. నా చేత ఒప్పించేందుకే, నన్ను ఒంటరిగా విడిచి, పొలం కాపలాకనే వంకతో వెళ్ళాడు. ఇహ రూఢి అయింది దయ్యాలుంటాయని. నాకు కొద్ది అడుగుల దూరంలో దయ్యాల స్వైర విహారం చేస్తూంటే నమ్మక ఏం చేస్తాను. నేనే కాదు. ఆ పరిస్థితుల్లో ఎవరయినా నమ్మక తప్పదు. కొంతసేపటికి పిల్లవాడి గుక్క ఆగిపోయింది గ్రామఫోను 'కీ' తగ్గిపోయినట్లుగా.

ఇహ బతికాం గదా అనుకున్నాను. పందులు గురగుర మంటున్న శబ్దాలు బాబోయ్! ఇప్పుడిప్పుడే ఇవన్నీ వదలవు. తెల్లవారే దాకా నైనా బ్రతుకుతానా! ఇంకా కాసేపు చూసి ఇవి నా పీక పిసికేయవు కదా! పందులు ఇక ఆపాయి. ఇహ కథ క్లయిమాక్సుకు వచ్చింది. పందులు, కుక్కలు, పిల్లులు, గాడిదలు ఒకేసారి అరవడం, పాముల బుస బుసలు, చంటి పిల్లాడి ఏడుపూ, నక్క కూతలూ, అన్నీ ఒకేసారి మొదలయ్యాయి. ఆ భయంకర శబ్దాలు తలుచుకుంటే ఇప్పటికీ వణుకు పుడుతుంది నాకు. 'రాత్రల్లా దయ్యాలు, ఈ పాటకచేరీ ఆపవుగాబోలు దేవుడా! తెల్లవారుతుందా అసలు. రేపటి సూర్యోదయాన్ని చూడగలనా! ఒక వేళ బతికినా, తెల్లవారేలోగా పిచ్చెక్కటం మాత్రం రూఢి అనుకున్నాను. మొండి ధైర్యం చేసి, చెయ్యి కాస్త పైకి ఎత్తి, మామగారు పెట్టిన, రేడియం డయల్, సెవెన్ టీన్ జ్యూయల్స్, రోలెక్స్ వాచీ కేసి చూశాను. నాలుగయింది. ఇంకా రెండు గంటలు భరించాలీ బాధ. కొంతసేపటికి ఆ నక్కలూ, కుక్కలూ, గాడిదలూ, పాములూ మొదలయినవి సంగీత సమ్మేళన కార్యక్రమం ముగించాయి. ప్రసారం సమాప్తం అయింది. తెల్లవారుజామున నాలుగున్నర అయింది. ప్రాణాలు కుదుట పడ్డాయి.

రేపు వాడు రాగానే, ఝాఢించేవి నాలుగూ ఝాడించి చక్కాపోతాను. వెధవ, వాళ్ళ ఊరు లాక్కొచ్చి, చేయవలసిన మర్యాద ఇదా! ఇంకా నయం ప్రాణాలు దక్కాయి. పైగా వాడు, ఈ విషయం చెబితే, అంతా విని, ఏమంటాడో తెలుసా 'ఆటో సజెషన్' అంటాడు. "సాయంకాలం అంతా దయ్యాలని గురించి మాట్లాడుకున్నాం కదా! అందుకని ఆ భయం, దయ్యాల వర్ణన అన్నీ మనస్సులో మెదులుతున్నాయి నీకు. వాటిని తలుచుకుంటున్నకొద్దీ అవన్నీ నిజంగా వచ్చినట్లున్నాయి. అదంతా నీ భ్రమ; మనస్సు యొక్క ఒకానొక విధమైన కల్పన; లేదా పీడ కలలు. అంతేగానీ దయ్యాలూ లేవు, పాములూ లేవు" అంటాడు పెద్ద సైకాలజిస్టులా పోజు పెట్టి. అసలు ఇదే కాదు. ఏ విషయం ఐనా సరే చెప్పండి. వాడు ఇలాగే అంటాడు. "వర్షంలో తడిసి వచ్చి, జ్వరం వస్తుందేమోనని నువ్వు భయపడి ఉంటావు. అందుకే నీకు జ్వరం వచ్చింది" అంటాడు. ఇంకా ఎంత మొండివాడంటే, తలనొప్పిగా ఉందిరా అంటే, "అది నీ మనస్సు కల్పించుకున్న ఒకా నొక విధమైన భ్రమ" అంటాడు. పిల్లికీ, బ్రహ్మ రాక్షసికీ ఒకటే సూత్రం. రేపు అంతా విన్న తరువాత, ఇలాగే అంటే మాత్రం దవడ పళ్ళు రాలేటట్లు కొట్తాను. అలా ఆలోచించుకొంటూ పడుకున్నాను.

రాత్రల్లా నిద్రలేదు. ఇహ ఇప్పుడైనా ఒక కునుకు తీద్దామనుకున్నా. పక్కన శిష్యులు, ఒక్కొక్కరే లేచి గుణ గుణ మంటూ మొదలెట్టారు వేద పఠనం. వీళ్ళు రోజూ ఈవేళకే లేవటం ఆ భూతాలకి తెలుసు కాబోలు. కాస్త ముందుగానే నిష్ర్కమించాయి. సరే పక్కన వాళ్ళ గొడవ ఉన్నా, అదే జోలపాట అనుకుని కుంభకర్ణుడిలా నిద్రకు ఒరిగాను.

తెల్లవారింది. ఎనిమిదిన్నర అయింది. రామచంద్రరావు వచ్చి గట్టిగా కుదిపి లేపాడు నవ్వుతూ. వాడి నవ్వు చూస్తే నాకు వుడుక్కు వచ్చింది. తందామనుకున్నాను. బిక్క మొగంతో "మీ ఊరు ఇందుకేనా తీసుకొచ్చింది, పుండాకోర్ రాస్కెల్" అన్నాను కోపం పట్టలేక. వాడు నవ్వుతూ "అసలు యింతకీ జరిగిందేమిటో చెప్పవోయ్" అన్నాడు. ఇంకేం అంతా, సవిస్తరంగా చెప్పాను. రాత్రి జరిగిన పిశాచాల 'కదన కుతూహల'రాగాలాపనంతా. అంతా విని వాడు బి.. గ్గ..ర..గా నవ్వటం మొదలెట్టాడు. కాస్త మధ్యలో ఆగి.. "ఏం దయ్యాలు లేవన్నావుగా.. ఇప్పటికైనా ఒప్పుకున్నావా" అంటూ మళ్ళీ ఉప్పెనగా నవ్వటం మొదలెట్టాడు. "అఘోరించినట్లే ఉన్నాయి నీ తెలివితేటలు. ఇందుకేనా నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళింది. నేనివాళే మా ఊరుపోతున్నాను" అన్నాను. వాడు చివరికి నవ్వు ఆపుకొని "అది కాదురా! మాకవి ఎప్పుడూ మామూలే. అలవాటయిపోయాయి" అంటూ అటూ ఇటూ చూసి, ఎవరూ లేరని తెలుసుకుని చల్లగా చెప్పాడు, "ఇంతకీ అదంతా ఏమిటో తెలుసా! మన ప్రక్కనున్న పంతులుగారి గుర్రు".

"అంటే ఇది గురకలవాసం అన్నమాట."

నండూరి పార్థసారథి
(1958 ఆంధ్రప్రభ వీక్లీలో ప్రచురితమైనది)

Next Post