Title Picture

మార్స్ అండ్ మూవీస్ వారు అజిత్ చక్రవర్తి దర్శకత్వం క్రింద నిర్మించిన 'అర్ధాంగిని' చిత్రాన్ని ఆ సంస్థ స్థాపకుడు, ఉత్తమ దర్శకుడూ అయిన కీ.శే.అమీయ చక్రవర్తికి అంకితం చేశారు. ఈ చిత్రం అంతటికీ రెండే ఆకర్షణలు. ఒకటి: నటి - మీనాకుమారి, రెండు: సంగీత దర్శకుడు - వసంత దేశాయ్.

అందమూ, గుణమూ వగైరా సద్గుణాలన్నింటితోను పరిపూర్ణురాలయిన ఛాయ అనే నాయికకు పెళ్లికాదు. ఒకావిడ పిల్లను చూసుకునేందుకు వచ్చి, పిల్ల నచ్చి ఒప్పుకోబోతుండగా ఒక జ్యోతిష్కుడు "ఈ పిల్లను కోడలుగా తెచ్చుకుంటే ఇల్లు సర్వనాశనమైపోతుంది, కొడుకు చనిపోతాడు" అని చెబుతాడు. ఆవిడ తిరిగి వెళ్లిపోయి ఉత్తరం రాస్తుంది. ఇక్కడ ఈ అమ్మాయి ఆనందంతో డ్యాన్సు చేస్తూ పాటపాడుతుండగా ఈ విషాదమైన ఉత్తరం వచ్చి తండ్రిని చంపేస్తుంది. ఈలోగా ఈ అమ్మాయి (ఛాయ) కట్నం పేచీతో ఆగిపోతున్న తన స్నేహితురాలి పెళ్లిని తన బంగారు గాజులిచ్చి నిలబెట్టి తను త్యాగశీల కూడానని ప్రేక్షకులకు రుజువు చేస్తుంది. ఏ దిక్కులేక బొంబాయి వచ్చి స్నేహితురాలింట్లో మకాం చేస్తుంది. ఇలా ఉండగా ఆమెకు ఒకవైమానికుడు తటస్థపడి, హృదయం చూరగొని మర్నాడు ఆమెతో డ్యూయెట్ పాడుతాడు. వాళ్లిద్దరు షికారుకు వెళ్లినచోట కోయవాళ్లు డాన్సు చేస్తారు.

తర్వాత వైమానికుడు ఈమెను వెంటబెట్టుకుని ఇంటికి తీసుకువెళ్లి తల్లికి చూపిస్తాడు. తల్లి ఎవరో కాదు. పూర్వం ఈమెను తిరస్కరించిన ఆవిడే. ఆవిడ నిరాకరిస్తుంది. అయినా ఇతను పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ఆమె అత్తగారి వద్ద కోడరికం పాట్లు పడుతూ ఉంటుంది.

ఇంతలో విమానం కూలిపోయినట్లు వార్త రాగా ఎప్పుడూ దురదృష్టవతి అని నిరసించే అత్తగారు కోడల్ని ఇంటి నుంచి తరిమేస్తుంది. ఆమె విమానాశ్రయానికి పరుగెత్తి, కారు ప్రమాదంలో చిక్కుకొని ఆసుపత్రి పాలవుతుంది.

అదృష్టవశాన జీవించి తిరిగి వచ్చి భార్యను కానక అస్వస్థుడైన ప్రకాష్ గురించి తెలుసుకొని ఛాయ ఆసుపత్రి నుంచి వచ్చి భర్తను కలుసుకొంటుంది.

ఇందులో రాజకుమార్ తొలిసారిగా నాయకుడుగా నటించాడు. మీనాకుమారి మామూలుగా తన అందచందాలతో బాగానే నటించింది. ఆగా, శుభాఖోటేల దాంపత్యం ముచ్చటగా చిత్రం అంతటికీ జీవం పోసి హాయినిచ్చింది. అత్తగారి భూమికలో దుర్గాఖోటే అభినయం తగు మాత్రంగా ఉంది. చిత్రంలో సన్నివేశాలు మరింత బిగువుగా ఉంటే బాగుండుననిపించింది.

వసంత దేశాయ్ పాటలకు కూర్చిన సంగీతం చాలా బాగుంది. 'బడేభోలే హా హసతేహో' అనే పాటకు కూర్చిన సంగీతం గొప్పగా ఉంది. ఒక యుగళగీతం కూడా బాగుంది. నేపధ్య సంగీతం ఆద్యంతం 'ఓహో' అనుకోతగినంత అద్భుతంగా ఉంది. చిత్రంలోని స్వల్ప లోపాలను సంగీతం క్రమ్మివేసింది. వైలిన్, సితార్, సరోద్, జలతరంగ్ మధురస్వర లహరుల్లో ప్రేక్షకులను ముంచి ఎత్తాడు వసంత దేశాయ్. ఈ మధ్య వచ్చిన చిత్రాలలో 'నౌరంగ్', 'సుజాత'ల తర్వాత నేపథ్య సంగీతం ఇంత చక్కగా మరే చిత్రంలోనూ వినిపించలేదు.

నండూరి పార్థసారథి
(1959 డిసెంబర్ 27వ తేదీన ఆంధ్రప్రభ సంచికలో ప్రచురితమైనది)

Previous Post Next Post