Humor Icon

వేషధారణలో ఫాషన్లు మారిమారి చివరికి మళ్ళీ పంచలు, లాల్చీలవంతు వచ్చింది. నవయువకులందరికీ ఇప్పుడు పంచలపై మోజు హెచ్చింది. ఎందుకంటే 'లాల్చీ, పంచ' వేషంలో శృంగారపు కళ ఉంది, పెద్ద మనిషి తరహా ఉంది. పైజామా తొడుక్కుంటే మరీ కుర్రతనం కనిపిస్తుంది. డిగ్నిటీ ఉండదు. సూట్ వేసుకోవడం కేవలం ఆడంబరంగా ఉంటుంది. పాంటూ, శ్లాక్ షర్టు వేసుకోవడంలో పెద్ద మనిషి తరహా లేదు. అలా కాక శుభ్రంగా కాలరు పట్టీ ఉన్న సిల్కు లాల్చీ వేసుకుని, మల్లెపువ్వులాంటి తెల్లని గ్లాస్కో పంచ కట్టితే భేషుగ్గా ఉంటుంది. ఆడ పిల్లలు 'ఎంచక్కా ఉన్నాడో శరత్ బాబు హీరో లాగా' అని మెచ్చుకుంటారు. సాటి యువకులు 'యమ ఫోజులో ఉన్నాడే శోభనం పెళ్ళికొడుకులాగా' అనుకుంటారు. పెద్దలు 'బుద్ధిమంతుడు, యోగ్యుడు, చూడండి ఆ వినయం, ఒద్దిక, నిరాడంబరత, చక్కగా పదహారణాల తెలుగువాడిలా ఉన్నాడు' అంటారు. ఈ వేషంలో ఐదు సుగుణాలున్నాయి; గాంభీర్యం, శృంగారం, సభాగౌరవం, సుఖం, చవక. అందుకే ఆంధ్ర రాజధానిలో ఈ వేషానికి ఇప్పుడు గిరాకీ పెరిగింది.

మధ్య మధ్యే పానీ

ప్రతి స్వతంత్ర దేశానికీ ఒక జాతీయ పతాకం, జాతీయ గీతం తప్పనిసరిగా ఉండాలి. ఈ మధ్య భారతీయులు జాతీయ పక్షిని కూడా నిర్ణయించుకున్నారు. ఇవి మన నడమంత్రపు సిరులు.

కొన్ని దేశాలకు తరతరాలుగా కొన్ని అలవాట్లు చెలామణీ అయి అవే ఆ దేశాల జాతీయ చిహ్నాలవుతాయి. శీతోష్ణ పరిస్థితుల మూలంగా కొన్ని జాతులు కొన్ని రకాల పానీయాలను త్రాగుతారు. అవి వాళ్ళ ట్రేడు మార్కులు.

రష్యన్లు వోడ్కా, అమెరికన్లు మార్టినీ, ఇంగ్లీషు వాళ్లు విస్కీ, ఫ్రెంచి వాళ్లు కోన్యాక్ సేవిస్తారు. సోమయాగాలు పూర్వం చేయబడ్డ ఈ పవిత్ర భారతదేశంలో మనం ఇటువంటి అసాధ్యపు మధువులు గ్రోలం. అయినా కొన్ని ప్రాంతాలకు కొన్ని అలవాటైన పానీయాలున్నాయి.

అరవ వాళ్ళు కాఫీ, హిందీవాళ్లు ఛాయ్, పంజాబీలు లస్సీ ఎక్కువగా ఇషఅటపడతారు. ముసల్మానులు షరబత్తు గ్రోలుతారు. మన శుద్ధాంధ్రులు తీరికూర్చుని మక్కువతో ఎక్కువగా త్రాగే నేషనల్ డ్రింగు ఏమిటి, చెప్పుకోండి? (గోలీ సోడా).

నండూరి పార్థసారథి
(ఈ రచన 1963లో జ్యోతి మాసపత్రికలో ప్రచురితమయింది)

Previous Post Next Post