Title Picture

పాఠకుల విషయం అంత రూఢిగా చెప్పలేము కాని, పాఠకులు కానివారికి ఈ చిత్రం షడ్రసోపేతమైన భోజనం సుష్టుగా తిన్నంత తృప్తినిస్తుంది. తీరుబడిగా మూడు గంటలసేపు కమ్మగా చూసి, తృప్తిగా, ఆయాసంగా బయటకు వస్తారు. తర్వాత చాలా కాలం నెమరువేసుకుంటారు. పండిత ప్రేక్షకులనబడే అల్పసంఖ్యాకులకు యీ చిత్రం తిండిపుష్టి లేని వారికి పెళ్ళి భోజనం వలె అనిపించవచ్చును.

కనకదుర్గమ్మ పేరు చూసి అయినా పొరుగుపల్లెల నుంచి భక్తులు చద్ది మూటలు, బళ్ళు కట్టుకుని వస్తారు కనుక నిర్మాతల కొంగుబంగారం కావచ్చును.

ఈ చిత్రంలో అనేక మాయలు, మంత్రాలు, తంత్రాలూ, శాపాలూ, వరాలు, కామినీపిశాచాలూ, కత్తి యుద్దాలు, నృత్యాలు, పద్యాలు, పాటలు, పొడుగాటి డైలాగులు, వికటాట్టహాసాలూ మొదలయినవి యింకా ఏవేవో చాలా ఉన్నాయి. ఒక సిద్ధుని రూపంలో విఠలఆచార్య ఈ తమాషాలన్నీ చేసి మెజారిటీ ప్రేక్షకులను సమ్మోహితులను చేశారు. ఎందుకో ఒకందుకు మొత్తానికి ప్రేక్షకులు నూటికి నూరుమందీ కడుపు చెక్కలయ్యేట్టు నవ్వుకుంటారు.

దర్శకత్వంలో బాగా చెయ్యి తిరిగిన పనివాడితనం కనుపిస్తుంది. విఠలఆచార్యగారు చాలా అనాయాసంగా, కులాసాగా సిగరెట్టు తాగినంత హాయిగా చిత్రాన్ని నిర్మించారు. ప్రేక్షకుల ఆయువు పట్టులు ఆయన గుప్పిట్లో ఉన్నట్లున్నాయి.

పద్యాలు, పాటలు, దండకాలు మొత్తం అన్నీ 15 వరకూ ఉన్నాయి. అన్నీ జనానికి ఆహ్లాదకరంగానే ఉంటాయి. కొన్ని కొన్ని నృత్య సన్నివేశాలలో సంగీతదర్శకులు చేసిన తమాషా ప్రయోగాలు మెచ్చుకోతగినవిగా ఉన్నాయి.

దుష్ట సిద్దుని పాత్రను రాజనాల అవలీలగా నటించాడు. అతనికి సమఉజ్జీగా కాంతారావు నటించాడు. బాలకృష్ణ హాస్యం మంచినీళ్ళ ప్రాయంగా ఉంది. కృష్ణకుమారి నటన సుపరిచితమే. వినోదానికి ప్రతివారు కుటుంబంతో సహాచూసి ఆనందించవచ్చును. బెజవాడ కనకదుర్గ గుడినీ, పరిసరాలను కూడా యిందులో చిత్రించడం ఒక ఆకర్షణ.

నిర్మాత, దర్శకుడు : విఠల ఆచార్య ; రచన : జి. కృష్ణమూర్తి; సంగీతం : రాజన్, నాగేంద్ర; కెమేరా : జి. చంద్రన్; తారాగణం : కృష్ణకుమారి, కాంతారావు, రాజనాల, ముక్కామల, బాలకృష్ణ, సత్యనారాయణ, ఆదోని లక్ష్మి, మిక్కిలినేని, మీనాకుమారి, మాధురి వగైరా....

నండూరి పార్థసారథి
(1960 నవంబరు 20వ తేదీన ఆంధ్రప్రభ సంచికలో ప్రచురితమైనది)

Previous Post Next Post