Title Picture

బూడిదలో పోసిన పన్నీరు

ఉత్తమాభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న శశికపూర్ కోట్లు ఖర్చు పెట్టి తీసిన చిత్రం ఇది. 'కాడు', 'వంశవృక్ట' వంటి కళాత్మక కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించిన గొప్ప నటుడు గిరీశ్ కర్నాడ్ దీని దర్శకుడు. దేశంలోని అరడజను మంది అత్యుత్తమ నటీమణులలో ఒకతయిన రేఖ ఈ చిత్ర కథానాయికగా నటించింది. శశికపూర్ తన నట జీవితంలో మొదటిసారిగా ఈ చిత్రంలో దుష్టపాత్ర ధరించాడు. తన సినీ జీవితానికి ఈ చిత్ర నిర్మాణం పరాకాష్ఠ అనీ, ఇటువంటి చిత్రం మరొకటి తన జీవిత కాలంలో నిర్మించలేకపోవచ్చుననీ శశికపూర్ ప్రకటించాడు. ఇది అద్భుతమైన చిత్రమని విడుదలకు ఏడాది ముందు నుంచి ప్రచారం జరిగింది. ఈ చిత్రంపై వెలువడిన తొలి సమీక్షలు కూడా దీన్ని కళాఖండంగానే వర్ణించాయి.

ఉత్తమాభిరుచి గల కావ్యస్థాయి చిత్రాల కోసం ఆవురావురుమంటూ ఎదురుచూసే కళా ప్రియులు ఈ సమాచారం అంతా చదివి ఈ చిత్రం మీద కొండంత ఆశ పెట్టుకోవడం సహజం. పైగా ఇది అతి ప్రసిద్ధమైన, మహాద్భుతమైన సంస్కృత నాటకం 'మృచ్ఛకటికం' ఆధారంగా తీసిన చిత్రం. 'వసంత సేన' చిత్రం ద్వారా దీని కథ తెలుగు, కన్నడ చలన చిత్ర ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. 'మచ్ఛకటికం'లోని వసంతసేన పాత్ర, శకారుని పాత్ర ఎందరో సినీ రచయితలకు, దర్శకులకు ఉత్తేజమిచ్చాయి. అటువంటి పాత్రలు ప్రాచీన సంస్కృత సాహిత్యంలో మరెక్కడా కనిపించవు. వేశ్యాకులంలో పుట్టినా సౌందర్యానికి తోడు సౌశీల్యం కూడా కలిగిన ఉదాత్త నాయిక వసంతసేన. మనసారా ప్రేమించిన ఒక్క వ్యక్తికి తప్ప మరెవరికీ లొంగని ప్రేమిక ఆమె. ఆపదలో ఉన్న ఎందరినో ఆదుకున్న దానశీలి ఆమె. పాకీజా, ఉమ్రావ్ జాన్, కన్యాశుల్కంలో మధురవాణి, వీరంతా వసంతసేన వారసులే. అలాగే శకారుని పాత్ర విలక్షణమైనది. అడుగడునా హాస్యం అందించే దుష్టుడు, క్రూరుడు శకారుడు. 'పాతాళ భైరవి'లో రేలంగి పాత్ర శకారుని మూసలో తయారైనదే.

కనకవర్షం కురిపించగల బాక్సాఫీస్ చిత్రానికి కావలసిన లక్షణాలన్నీ మృచ్చకటికంలో ఉన్నాయి. యథాతథంగా దాన్ని వెండితెర కెక్కిస్తే అది గొప్ప కళాత్మక చిత్రం కూడా అవుతుంది. అయినా గిరీశ్ కర్నాడ్ ఈ కథలో బొత్తిగా అనవసరమైన మార్పులు చేసి, అక్కరలేని పాత్రలను ప్రవేశపెట్టి భ్రష్ఠుపట్టించాడు. భాసమహాకవి రచించిన 'చారుదత్త' నాటకం, శూద్రకుడు రచించిన 'మృచ్ఛకటికం' ఆధారంగా ఈ చిత్రాన్ని తీసినట్లు టైటిల్స్ లో ప్రకటించారు. ఇందులో వాత్స్యాయనుడిని ప్రవేశ పెట్టవలసిన అవసరం ఎందుకొచ్చిందో తెలియదు. వేశ్యావాటికలో తలుపుకన్నాల్లోంచి తొంగిచూసి కామసూత్రాలు రచించే హాస్యగాడుగా వాత్స్యాయనుడిని చిత్రించారు. అదంతా చౌకబారు హాస్యం. హాస్యం కోసం ఆపాత్రను చొప్పించవలసిన అవసరం లేదు. అంత కంటే గొప్ప హాస్యాన్ని అందించగల శకారుడి పాత్ర ఉంది. కాని శకారుడి పాత్రను కూడా పూర్తిగా మార్చేశారు. అచ్చోసిన ఆబోతులాగా రంకెలు వేస్తూ వీధుల్లో తిరిగే దుర్మార్గుడు గానే చూపారుగాని, మూలంలోని హాస్య సంభాషణలేవీ లేవు.

Picture
రేఖ

వసంతసేనగా రేఖ అద్భుతంగా నటించింది. వసంతసేన, చారుదత్తుల సమాగమ సన్నివేశాన్ని అతి మనోహరంగా చిత్రీకరించారు. చిత్రం మొత్తం మీద అత్యంత కళాత్మకమైన ఘట్టం అదే. అయితే తొలి సమాగమంలోనే వారిద్దరూ కామకలాపానికి దిగినట్లు చూపించడంలో ఔచిత్యం లేదు. పోనీ దాన్ని క్షమించినా, వసంతసేన పాత్రను చివరిదాకా హుందాగా పోషించినా, చిట్టచివరి దృశ్యంలో ఖూనీ చేశాడు. పతాక సన్నివేశంలో మరణదండన నుంచి ఆఖరు క్షణాన తప్పించుకున్న చారుదత్తుడు, అతడి భార్య కౌగలించుకుని ఏడుస్తూ ఉండగా అల్లంత దూరంలో ఉండి చూస్తూ ఖిన్నురాలైన వసంతసేన అక్కడి నుంచి పరుగెత్తుకుని ఇంటికి వచ్చి శకారుడికి తనను తాను అర్పించుకున్నట్లుగా చూపించడం దారుణం. ఇది ఆమె వ్యక్తిత్వాన్ని హత్య చేయడం. వధ్యస్థానం దగ్గర చారుదత్తుడు ఆమెను చూడలేదు. ఆమె పట్ల విముఖత చూపలేదు. అటువంటప్పుడు అతడిపై వసంతసేనకు ఏవగింపు కలగవలసిన అవసరమేముంది? చారుదత్తుడు తన భార్యను 'వసంతసేన ఏది' అని అడిగే సమయానికే వసంత సేన అక్కడి నుంచి వెళ్లిపోయింది. వసంతసేన పాత్రను, మూలకథను ఈ విధంగా మార్చడంలో దర్శకుడి ఉద్దేశం ఏమిటి? ఈ మార్పు చిత్రాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. చివరి దృశ్యంలో మనసు వికలమైపోతుంది. దీన్ని కళా ప్రియులు క్షమించలేరు.

శశికపూర్ కేవలం వెరైటీకోసం దృష్టపాత్ర ధరించి ఉంటాడు. కాని అతడి నటన ఘోరంగా ఉంది. అంత కంటే చారుదత్తుడి పాత్రనే అతడు ధరిస్తే బాగుండేది. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం వారి మామూలు శైలికి భిన్నంగా ఉందికాని గొప్పగా లేదు. ఇందులో లోపాలున్నా ఈ చిత్రం మామూలు కమర్షియల్ చిత్రాలకంటే ఎన్నో రెట్లు బాగుంది. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవలసినవి ఫొటోగ్రఫీ, కళాదర్శకత్వం. ఇది ఎన్నో శతాబ్దాల కిందటి కథ అనే విషయం ప్రేక్షకుల మనస్సులకు హత్తుకునేటట్లుగా అప్పటి వాతావరణాన్ని చక్కగా చిత్రించారు. దుస్తులు, ఆభరణాలు, సెట్టింగ్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు.

కథలో మార్పులు చేయకుండా యథాతథంగా తీసి ఉంటే ఇది నిజంగా అపూర్వ చిత్రమనిపించుకొని ఉండేది.

నండూరి పార్థసారథి
(1985 సెప్టెంబరు 7వ తేదీన ఆంద్రప్రభ బెంగుళూరు ఎడిషన్ లో ప్రచురితమయింది)

Previous Post Next Post