Humor Icon

కామేశ్వరి : ఏవండీ... వెళ్ళిన పని ఏవఁయింది? కళ్యాణ మండపం ఏదైనా కుదిరిందా?

గోపాలరావు : ఆ కుదిరింది. ఎక్కే గుమ్మం దిగే గమ్మం... ఒళ్ళు హూనమైపోయింది. కనీసం పదిహేను మంటపాలైనా చూసి ఉంటాం...

కామేశ్వరి : ఉంటాం అంటున్నారు. మీతోపాటు ఇంకెవర్ని తీసికెళ్ళారండీ...

గోపాలరావు : నేను తీసుకెళ్ళడం ఏమిటీ... వియ్యాలవారే పంపించారు పెళ్ళికొడుకు తమ్ముణ్ణి - నేనేమైనా చౌకబారు హాలు బుక్ చేస్తానేమోనని. అసలే పెళ్ళిళ్ళ సీజను. ఒక పట్టాన దొరుకుతాయా హాల్సు? ఏదో ఒక హాలు దొరికితేనే చాలునని నేను చూస్తుంటే వాళ్ళకేమో దొరికినవి నచ్చవు. ఆ కుర్రాడికి బాగా చెప్పి పంపించారు. వాడు ప్రతిదానికీ లక్ష వంకలు పెడతాడు. వాడికి నచ్చిన హాల్సు ఇదివరకే బుక్ అయిపోయాయి. చివరికి ఎలాగో మన అదృష్టం కొద్దీ దొరికింది. రాజరాజేశ్వరీ కళ్యాణమండపం బుక్ చేశాం.

శకుంతల : అమ్మో.... అది చాలా కాస్ట్లీ కదు నాన్నా...

గోపాలరావు : అవునే తల్లీ... అద్దె పద్ధెనిమిది వేలు...

కామేశ్వరి : ఆడపెళ్ళివాళ్ళం. చేయగలిగింది ఏముంది? కట్నంగా యాభైవేలు ఇస్తున్నాం. వెండి కంచం, వెండి చెంబు, పట్టుబట్టలు, ఆడబడుచుల లాంఛనాలు, పానకబ్బిందెలు వగైరాలన్నింటికీ ఇంకో యాభై వేలు తేలిగ్గా ఖర్చవుతుంది. ఇవి కాకుండా పెళ్ళి ఖర్చులకని ఓ పాతిక వేలు ఇస్తామని ఒప్పుకున్నాం. అన్నిటితోపాటే ఈ హాలు ఖర్చు. పద్ధెనిమిది వేలయినా, ఇరవై వేలయినా తప్పదు.

గోపాలరావు : హాలుకి అద్దె కడితే సరిపోతుందా? దాని స్టైలుకి తగినట్టుగా డెకరేషన్ చేయించాలి. లైటింగు, మైకు సెట్టు... ఒకటా!

కిరణ్ : రోటిలో తలదూర్చి రోకటి పోటునకు వెరవ తగునా...

గోపాలరావు : అంత పెద్ద హాలు బుక్ చేయించారంటే అది నిండేంతమంది బంధుమిత్రులని భోజనాలకి పిలుస్తారన్నమాటేగా? భోజనాల ఖర్చు కూడా మన ఎష్టిమేటును దాటిపోయేట్టుంది.

కిరణ్ : పైగా ఆదివారం ఉదయం ముహూర్తం! తండోపతండాలుగా వస్తారు జనం.

కామేశ్వరి : గురువారం పగలు పదకొండుంబావుకి ఇంకో లగ్నం ఉందని చెప్పారు కదా శాస్త్రులుగారు... ఆ ముహూర్తం ఖాయం చేస్తే సరిపోయేది.

కిరణ్ : ఎంచక్కా అందరూ ఆఫీసులకి వెళ్ళిపోయేవారు. ఎవరో మరీ దగ్గరి వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు మాత్రం వచ్చేవారు.

గోపాలరావు : అంతా మన ఇష్టమేనేవఁర్రా? అందరికీ అనుకూలంగా ఉండేట్టు ఆదివారం ముహూర్తం కావాలని వాళ్ళు అంటుంటే కాదని ఎలా అంటాం?

కామేశ్వరి : పోన్లెండి... ఏదో మంచి సమ్మంధం. మనం యాభైవేలు కట్నం ఇస్తే వాళ్ళు అంతకంటే ఎక్కువగానే మన గౌరికి నగలు, చీరలు పెడతారు. వాళ్ళకి మిగిలేది ఏమీ ఉండదు. అలాంటప్పుడు ఇంక మనం ఖర్చులకి వెనకాడితే ఏం బావుంటుంది? మన వైపు వాళ్ళకి మనం పెద్దగా మర్యాదలు చేయకపోయినా ఫర్వాలేదు కాని వియ్యాలవారికి మాత్రం పెట్టుపోతల్లో ఎటువంటి లోపం జరగకుండా చూసుకోవాలి.

గోపాలరావు : అవునుమరి. ఇప్పుడు మనం కక్కుర్తి పడితే తర్వాత జీవితాంతం మన అమ్మాయిని దెప్పుతారు.

కామేశ్వరి : సరేమరి. కళ్యాణ మండపం బుక్ చేయడం అయింది గనక ఇంక వెంటనే శుభలేఖలు అచ్చువేయిస్తే మంచిదిగా...

గోపాలరావు : ఓ రెండొందలు వేయిస్తే చాలా?

కిరణ్ : రెండొందలు ఏం సరిపోతాయి నాన్నా... కనీసం నాలుగొందలైనా వేయించాలి.

కామేశ్వరి : నాలుగొందలు దేనికిరా... నువ్వు మరీను...

కిరణ్ : డోంట్ వరీ అమ్మా... జనం ఎక్కువమంది వస్తే బహుమతులూ ఎక్కువగానే వస్తాయి.

శకుంతల : భోజనాలకి వచ్చే వాళ్ళందరూ బహుమతులు తెస్తారని గ్యారంటీ ఏముంది? వచ్చేవాళ్ళు ఎక్కువ, తెచ్చే వాళ్ళు తక్కువ అయితే?

కామేశ్వరి : పోనీ ఓ మూడొందలు వేయిద్దావర్రా... మరీ ముఖ్యమైన వాళ్ళకి మాత్రం ముందుగా వేద్దాం కార్డులు. మిగతా వాళ్ళకి రేపు పెళ్ళనగా పోస్టు చేద్దాం. ఓ వందకార్డులు ఖరీదైనవి కొట్టించండి. మిగతావి ఏవో చౌకగా దొరికేవి సెలెక్టు చేయండి...

కిరణ్ : అమ్మా... కార్డుల సంగతి నేను చూసుకుంటాను. నాన్నకేం తెలీదు. పెళ్ళి కొడుకు పెద్ద ఇంజనీరు. హై పొజిషన్ లో ఉన్నాడు. పెళ్ళి స్టైలుగా చేయాలని వాళ్ళు అనుకుంటుంటే కార్డుల దగ్గర కక్కుర్తి పడితే దరిద్రంగా ఉంటుంది.

గోపాలరావు : సరే నాయనా... నువ్వే వెళ్ళి సెలక్టు చెయ్యి. జనరల్ బజార్ లో వెంకట సుబ్బయ్య గారి షాపుకి వెళ్ళి గోపాలరావు గారి అబ్బాయినని చెప్పు. మనకి తక్కువ ధరకిస్తాడు. ఏ ప్రెస్సులో అచ్చు వేయించాలో ఆయన్నే అడుగు. నేనాయనకి ఫోన్ చేసి చెబుతాను.

కిరణ్ : ఓకే... ఓకే... గోపాలరావు : ఇంకా పదిహేను రోజులుంది కదే పెళ్ళి. ఇప్పట్నించీ కొనడం దేనికి బట్టలు?

కామేశ్వరి : బావుంది మీ వరస. కుట్టేందుకు ఇవ్వద్దూ బట్టలు? మిషను వాడు వారం రోజులంటాడో పది రోజులంటాడో. పైగా పెళ్ళిళ్ళ సీజను.

గోపాలరావు : సరే మరి. ఎవరెవరికి ఏవేం బట్టలు పెట్టాలో లిష్టు రాశావా? మొత్తం ఎంత ఖర్చవుతుందో ఎష్టిమేటు వేశావా?

కామేశ్వరి : నలభై వేల దాకా కావచ్చు. కామాక్షీ ఎంపోరియంలో తీసుకుందాం. చెక్కు తీసుకుంటాడుగా?

గోపాలరావు : తీసుకోక ఏం చేస్తాడు గాని. అసలు ఏవేం కొనాలో వివరంగా చెప్పు.

కామేశ్వరి : ముందుగా పెళ్ళి కూతురి బట్టలు. మధుపర్కాలు కాక గౌరి కోసం నాలుగు పట్టు చీరలు కొనాలి. వాటిల్లో ఒకటి షుమారు ఏడు వేల రూపాయలది. రెండు చీరలు మూడేసి వేల రూపాయలవి. ఇంకోటి రెండు వేలది.

గౌరి : రెండు వేలకి పట్టు చీర ఏమొస్తుందమ్మా?

కామేశ్వరి : వస్తాయే... జరీ లేని మైసూరు సిల్కు చీరలు చాలా బావుంటాయే.

గౌరి : అయినా నాకు నాలుగు పట్టుచీరలేం సరిపోతాయే?

కామేశ్వరి : మీ అత్తారు ఎలాగూ ఇంకో నాలుగైదు పట్టుచీరలు పెడతారు, కావాలంటే ఇంకో రెండు మూడు నైలెక్స్ చీరలు కొనుక్కో.

శకుంతల : అమ్మా మరి నాకో?

కామేశ్వరి : నువ్వు ఒక మైసూరు సిల్కు చీర కొనుక్కుందువుగాని. తోడపెళ్ళికూతుర్ని చేసినప్పుడు కట్టుకోవచ్చు.

శకుంతల : అంటే ఒక్కటే చీర అన్నమాట.

కామేశ్వరి : పోనీ ఇంకో నైలెక్స్ చీర కూడా కొనుక్కుందువుగానిలే.

గోపాలరావు : ఊ... ఇంకా.. చదువు లిష్టు.

కామేశ్వరి : నాకు ఒక్క పట్టుచీర-మూడువేల రూపాయలది. లగ్గం టైములో కాస్త మంచి చీర కట్టుకోక పోతే బావుండదు. నలుగురిలో చిన్నతనంగా ఉంటుంది. దానితో పాటు జరీ ఉన్న గద్వాల నేత చీర కూడా కొనుక్కుంటే బాగానే ఉంటుంది. ఓ వెయ్యి రూపాయలకి రావచ్చు. దాని సంగతి తర్వాత చూద్దాం లెండి. పోతే ఇక మీరు, కిరణ్ చెరో రెండు జతల బట్టలు కుట్టించుకోండి. చిక్కడపల్లిలో కట్ పీసులు దొరుకుతాయి చవగ్గా. వంద రూపాయలకి పాంటు పీసులు, యాభై రూపాయలకి షర్టు పీసులు దొరుకుతాయి.

కిరణ్ : మీ అందరికీ కామాక్షీ ఎంపోరియం బట్టలు, నాకూ, నాన్నకీ మాత్రం చిక్కడప్లలి కట్ పీసులూ అన్నమాట.

కామేశ్వరి : కట్ పీసులైతే మాత్రం.... పెద్ద కంపెనీలవే కదుట్రా. నిక్షేపంగా ఉంటాయి. అవే బట్టలు తానులోంచి చింపిస్తే నాలుగు రెట్లు ఖరీదవుతాయి. కట్ పీసులు వద్దనుకుంటే మీరూ కామాక్షీ ఎంపోరియంలోనే తీసుకోండి. నాదేంపోయింది? డబ్బు మీ నాన్నది. అయినా... మేం కూడా జాకెట్ పీసులు చిక్కడపల్లి కట్ పీస్ షాపులోనేగా తీసుకునేది?

గోపాలరావు : సరేలేవే... వాడి మాటలకేం. నీ లిష్టు చదువు.

కామేశ్వరి : ఇహ... వియ్యాలవారికి పెట్టాల్సినవి. వియ్యపురాలికి ఒక పట్టు చీర - మూడు వేల రూపాయలది. ఇద్దరు ఆడపడుచులకి చెరో మైసూరు సిల్కు చీర-ఒక్కొక్కటి రెండు వేల రూపాయలు. వియ్యంకుడు గారికి కొంచెం ఖరీదైన నేత పంచెల చాపు. పెళ్ళైన ఆడబడుచు భర్తకి ఒక గ్లాస్కో పంచల చాపు. వీటికి ఓ నాలుగొందలు కావచ్చు.

గోపాలరావు : ఒసే శక్కూ... ఈ డబ్బు లెక్కంతా నువ్వు వేరే కాయితం మీద రాయవే.

శకుంతల : అన్నయ్యా... నువ్వు రాయి...

కిరణ్ : ఓఖే... నో ప్రాబళం... ఊ.. చెప్పమ్మా...

కామేశ్వరి : మధుపర్కాలకి ఓ వెయ్యి రూపాయల దాకా అవుతుంది. ఇంక మనవైపు వాళ్ళల్లో కొందరికి తప్పనిసరిగా బట్టలు పెట్టాలి. నా వైపు మా అమ్మకీ, నాన్నకీ, మా అక్కయ్యకీ, బావగారికీ, అన్నయ్యకీ, వదినకీ, మీ వైపు మీ అమ్మగారికీ, నాన్నగారికీ, మీ అన్నయ్యగారికీ, వదినగారికీ, మీ అక్కయ్యకీ, బావగారికీ, మీ తమ్ముడికీ, మరదలికీ, మీ చెల్లెలికీ, ఆవిడ భర్తకీ బట్టలు పెట్టాలి. వీళ్ళందరికీ ఏవో మామూలు పెట్టుబడి చీరలు, పంచలు పెడితే చాలు. వందా నూటయాభై రూపాయలు పెడితే నేత చీరలు దొరుకుతాయి. జాకెట్ పీసులన్నీ ఎలాగూ కట్ పీసులే కొంటాం. మగవాళ్ళకి పంచ, తుండుగుడ్డ కలిపి డెబ్భయ్, ఎనభై రూపాయలకి దొరుకుతాయి. అవన్నీ విడిగా ఏదైనా చిన్న షాపులో కొందాం.

గౌరి : వందా నూటయాభైకి చీరలేం వస్తాయమ్మా?

కామేశ్వరి : ఎందుకు రావు? మహాఅయితే నూట డెబ్భెయ్ ఐదు. అందరికీ ఖరీదైన చీరలు పెట్టగలమా ఏవిఁటి?

కిరణ్ : అసలు పెట్టకపోతే ఏవుతుందమ్మా?

కామేశ్వరి : అమ్మాయికి పెళ్ళి చేస్తున్నాం గనక అయిన వాళ్ళకి బట్టలు పెట్టడం విధాయకం. బంధువుల ఇళ్ళలో పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడల్లా వాళ్ళకి మనం పెట్టడం లేదా? వాళ్ళు మనకి పెట్టడం లేదా? ఇకపోతే ముత్తైదులందరికీ జాకెట్ పీసులు పెడతాం చౌకలో. ఓ యాభై పీసులు కొని ఉంచడం మంచిది.

కిరణ్ : దిక్కుమాలిన సంప్రదాయాలు. ఎవడు పెట్టాడో గాని ఇవన్నీ...

గౌరి : ఒరేయ్ అలా విమర్శించకు. రేపు నీ పెళ్ళికీ ఈ తంతు అంతా జరుగుతుంది.

కిరణ్ : నేనా... హె... సంప్రదాయం గింప్రదాయం జాంతానై... మనది రిజిస్టర్ మేరేజ్.

గౌరి : అంతా నీ యిష్టమేనేవిఁటి? ఇంకా శక్కూ లేదూ పెళ్ళికి?

కిరణ్ : దాని పెళ్ళికీ నాకూ సంబంధం ఏమిటి?

గౌరి : ఏమిటేవిఁటి? నిన్ను మంచి గిట్టుబాటు ధరకి అమ్మేస్తే శక్కూకి మంచి మొగుణ్ణి కొనచ్చు.

కిరణ్ : హమ్మో... హమ్మో... ఎంత కుట్ర! కొడుక్కుల్ని అమ్మేసి కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేస్తారా?

గోపాలరావు : కుర్రవెధవ్వి... నీకేం తెలుస్తాయిరా పెద్ద వాళ్ళకష్టాలు! ఈ ఆడ పిల్లలిద్దరి పెళ్ళిళ్ళ కోసం పదిహేనేళ్ళనించీ ఎల్లైసీ ప్రీమియములు కడుతున్నాను. గౌరి పెళ్ళికోసం తీసుకున్న పాలసీ ఈ నెల్లో మెచూర్ అయింది. అది ఏ మూలకీ చాలదు. ప్రావిడెంట్ ఫండ్ లోంచి డెబ్బయ్ వేలు తీసుకుంటున్నా. ఈ రెండు కాక ఇంకా చిట్లు, అప్పులు...

కిరణ్ : అయితే అమాంబాపతూ ఎంతవుతుంది నాన్నా?

గోపాలరావు : నీకు దేనికిరా ఆ లెక్కలన్నీ....

గౌరి : మూడు లక్షలపై మాట.

కిరణ్ : అయితే రేపు శక్కు పెళ్ళికీ ఇంత ఖర్చు తప్పదన్నమాట!

గోపాలరావు : ఇంతకాదు. ఇంతకి ఇంత అవుతుంది. ఇంకో మూడేళ్ళకి ధరలు మూడింతలవుతాయి. జీతాలు మాత్రం అలా పెరగవు. అప్పటికి ప్రావిడెంట్ ఫండ్ లో కూడా ఇంత డబ్బు తీసుకునేందుకు వీల్లేకపోవచ్చు.

కిరణ్ : అయినా వీలైనంత లాగేస్తారు అందులోంచి. చిట్లు కడతారు, అప్పులు చేస్తారు. అవన్నీ తీరడానికి రెండు మూడేళ్ళు పడుతుంది. అప్పటికి నాన్న రిటైరైపోతాడు. ఇంక మిగిలేదేమిటి? చేతికి చిప్ప!

గోపాలరావు : అవున్రా నాయనా... మధ్య తరగతి బతుకులింతే.

గౌరి : నువ్వున్నావు కదురా సుపుత్రుడివి. కష్టపడి నిన్ను ఇంజనీరింగు చదివిస్తున్నారు కదా. ఇంకో మూడేళ్ళకి నీ పోస్టు గ్రాడ్యుయేషన్ కూడా అయిపోతుంది. ఉద్యోగంలో చేరి సంపాదన ప్రారంభిస్తావు. ఇంక అమ్మకీ, నాన్నకీ దిగులెందుకు?

కిరణ్ : అది సరేలేవే... నాన్నంటే నాన్న సంగతి కాదు. అసలు జనరల్ గా మాట్లాడుతున్నా. మధ్యతరగతి మనిషి ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసి, కొడుక్కి చదువు చెప్పిస్తే రిటైర్మెంటు తర్వాత తన డబ్బంతా తనకేమీ మిగలదన్నమాట.

గోపాలరావు : మిగలడమా! ఇంకా మనం నయం కదూ... రిటైరయ్యే నాటికి ఇంకా పిల్లల పెళ్ళిళ్ళు, చదువుల బాధ్యతలు తీరని వాళ్ళెందరో...

కిరణ్ : అయితే... ఈ సంప్రదాయాలు ఇంకా నలభై యేళ్ళదాకా ఉంటే, మీలాగే నేనూ వాటిని పాటించవలసివస్తే నా గతీ ఇంతేనన్నమాట!

కామేశ్వరి : ఆలూ లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం అన్నట్టు... నీకు పుట్టబోయే పిల్లల పెళ్ళిళ్ళ గురించి నీకు ఇప్పట్నించీ దిగులెందుకురా. ఏదో ఇప్పటికి దీని పెళ్ళి బాధ్యత తీరి గట్టెక్కితే ఆ తర్వాత మరేం ఇబ్బంది ఉండదు. ముందు నీ పెళ్ళి... తర్వాతే శక్కూ పెళ్ళి. లేకపోతే దానికి కట్నం ఎక్కణ్ణించి తెస్తాం?

కిరణ్ : అంటే నాకు కట్నం రాబట్టి దానికి కట్నం ఇచ్చి పెళ్ళి చేస్తారన్నమాట. కట్నం గిట్నం లేకుండా, బాజా భజంత్రీలు లేకుండా ఎంచక్కా రిజిస్టర్ మేరేజ్ చేసుకుంటానని ఓ పక్క నేను చెబుతుంటే మళ్ళీ అదే మాట!

కామేశ్వరి : కట్నం తీసుకోను కట్నం తీసుకోను అంటూ ఇంటో మా ముందు వాగితే వాగావు గాని ఇంకెక్కడా వాగకు.

కిరణ్ : అయినా కట్నం పెళ్ళికీ కట్నం లేని పెళ్ళికీ ఖర్చులో తేడా యాభైవేలో, లక్షో... అంతే కదా. కట్నం లేకపోయినా మూడు నాలుగు లక్షల ఖర్చు తప్పదు కదా. ఇదంతా బట్టలు, భోజనాలు, బ్యాండు మేళాల ఖర్చే కదా. శుభ్రంగా రిజిస్టర్ మేరేజ్ చేసుకుంటే ఈ గొడవంతా ఉండదు కదమ్మా....

గౌరి : నువ్వొక్కడివీ చేసుకుంటే చాలదు కదురా... శక్కూకి కూడా నీలాగే రిజిస్టర్ మేరేజ్ చేసుకునేవాడు దొరకాలి కదా. అలా దొరికితే సమస్యే లేదు. రిటైరయ్యాక నాన్న ఓ నాలుగు లక్షలు ఫిక్సెడ్ లో వేసుకోవచ్చు.

గోపాలరావు : అబ్బబ్బ... ఎప్పటి సంగతో ఇప్పుడు దేనికర్రా... ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఇంక చాలు ఈ తర్జన భర్జన.

కిరణ్ : ఓకే... ఓకే.... (బట్టల దుకాణంలో)

గోపాలరావు : అబ్బబ్బ... ఇంకెంత సేపే బాబూ నీ సెలక్షన్. నువ్వు అడిగిన చీరలన్నీ తీసి తీసి పాపం అతని చేతులు నెప్పెట్టి ఉంటాయి.

దుకాణంవాడు : మరేం ఫర్వాలేదు అయ్యగారూ... మాకిది మామూలే. అమ్మగారిని తీరిగ్గా చూసుకోమనండి. పెళ్ళి బట్టల సెలక్షనంటే అంత తొందరగా అవుతుందా!

కామేశ్వరి : అయిపోయిందండీ బాబూ... ఇదిగో ఈ ఒక్క చీరతో ఇక్కడ మన పనైపోయినట్లే. (దుకాణం వాడితో) ఇంక ఇవన్నీ పాక్ చేయించుబాబూ... మొత్తం టోటల్ ఎంతయింది?

దుకాణంవాడు : పట్టుచీరలకి, నేత చీరలకి, నైలెక్స్ లాంటి చీరలకి వేరే వేరే బిల్సు ఉంటాయండి. మీరు క్యాష్ దగ్గరికి వెడితే అన్నింటినీ టోటల్ చేసి చెబుతారండి. డెలివరీ కూడా అక్కడే తీసుకోవచ్చు.

గోపాలరావు : (భార్యతో) సరే... ఇంక పద...

కామేశ్వరి : నాలుగ్గంటలకి వచ్చాం. ఇంకా ఆరు కాలేదు. ఈ మాత్రానికే ఊరికే కంగారు పడతారు.

శకుంతల : అవును నాన్నా... పెళ్ళి బట్టల్ని ఇంత తొందరగా ఎవరూ సెలెక్టు చెయ్యలేదు. అందులోనూ ఇంత పెద్ద షాపులో బోలెడు వెరైటీ ఉంటుంది కదా కళ్ళు చెదిరిపోయేట్టు...

గోపాలరావు : ఒరే కిరణ్... ఈ పాకెట్లు పట్టుకోరా... శక్కూ... నువ్వు కూడా కొన్ని తీసుకో... (క్యాషియర్ తో) మొత్తం ఎంతయిందండీ...

క్యాషియర్ : 35,637 రూపాయలండీ.

గోపాలరావు : అయ్యబాబోయ్... బడ్జెట్ కంటె చాలా ఎక్కువైపోయిందే... ఊ... అయ్యా... చంద్రయ్య గారూ... ఇదుగోండి చెక్కు... (పెళ్ళాం పిల్లలతో)... ఊ... ఇంక పదండి...

కామేశ్వరి : ఒరే కిరణ్... రెండు ఆటోలు మాట్లాడరా...

కిరణ్ : రెండు దేనికమ్మా... వచ్చేటప్పుడు ఒక్క ఆటోలోనే వచ్చాంగా...

కామేశ్వరి : (భర్తతో) ఏవండీ... ఈ ప్యాకెట్లన్నీ తీసుకుని మీరూ, శక్కూ ఇంటికి వెళ్ళండి. నేను వీణ్ణి తీసుకుని చిక్కడపల్లి వెడతాను.

గోపాలరావు : ఈ బట్టల వ్యవహారం ఇంకా కాలేదన్నమాట.

కామేశ్వరి : పెట్టుబడి బట్టలు కొనద్దుటండీ... పైగా మీకు, కిరణ్ కి, పెళ్ళికొడుకు తమ్ముడికి కట్ పీసులు కొనాలి కదా.

గోపాలరావు : అవేవో ఇక్కడే కొంటే సరిపోయేది కదా?

కామేశ్వరి : పెట్టుబడి బట్టలు కూడా ఇక్కడే కొంటే ఆరిపోతాం. ఈ షాపులో రెండొందల యాభై రూపాయలకి తక్కువ చీరలేదు.

గోపాలరావు : అయితే... పెట్టుబడి బట్టలు కాకుండానే 35 వేలపైగా బిల్లు అయిందన్నమాట. ఇంక అవ్వెంత అవుతాయో!

కామేశ్వరి : అవన్నీ కలిపి నాలుగు వేలల్లో వచ్చేస్తాయనుకుంటాను. మొత్తం నలభై వేలదాకా అవుతుందని ముందే చెప్పాను కదండీ.

గోపాలరావు : సరే సరే... దిగిన తర్వాత ఇక తప్పేదేముంది? (ఆటోల శబ్దం) ఆటోలు వచ్చాయా? పాకెట్లు ఆటోలో పెట్టండర్రా... రావే శక్కూ... ఇందులో ఎక్కు. కిరణ్! నువ్వు అమ్మా ఆ ఆటోలో ఎక్కండి. గంటల తరబడి అక్కడ పాతుకుపోకుండా తొందరగా వచ్చేయండి. (ఆటోలు కదిలిన శబ్దం) శకుంతల : అక్కా చూడవే... నీ చీరలు ఎంత బావున్నాయో! ఇదుగో ఇది అన్నిటికంటే ఖరీదయింది. ఎనిమిది వేలు. అమ్మేమో ఏడు వేలల్లో కొనాలనుకుంది. కాని ఇది చూసిన తర్వాత వదలబుద్ధి కాలేదు. ఇధిగో ఇది మూడు వేల ఐదొందలు. ఇది మూడు వేలు. ఈ రెండు మైసూరు సిల్కు చీరలు రెండేసి వేలు. నీ కోటి నాకోటి. నీకేది బావుంటే అది తీసుకో.

గౌరి : నీకేది కావాలో అది తీసుకోవే. రెండూ ఒక మాదిరిగానే ఉన్నాయిగా.

గోపాలరావు : ఏవఁర్రా... ఎలా ఉన్నాయి బట్టలు?

గౌరి : చాలా బావున్నాయి నాన్నా. మరి నీ బట్టలేవీ?

గోపాలరావు : అమ్మ చిక్కడపల్లిలో కొనుక్కొస్తుంది. నేనే బట్టలు వేసుకోవాలో అమ్మే నిర్ణయిస్తుంది.

గౌరి : ఫరవాలేదు నాన్నా... అమ్మ సెలక్షన్ బాగానే ఉంటుంది. పైగా కిరణ్ కూడా ఉన్నాడుగా పక్కన.

గోపాలరావు : ఏడున్నర దాటింది. వీళ్ళింతవరకు రాలేదు. ఎన్నివేలు తగలేసుకొస్తారో ఏవిఁటో!

(బైట ఆటో ఆగిన శబ్దం)

శకుంతల : అదుగో... మాటలోనే వచ్చేశారు. (అమ్మతో) ఇంకా రాలేదేవిఁటా అని కంగారు పడుతున్నాడు నాన్న. ఆ ప్యాకెట్లు ఇలా ఇయ్యి.

కామేశ్వరి : ఊ... మీ నాన్నకెప్పుడూ కంగారే.

కిరణ్ : అబ్బ...! నాన్నా... నిజంగా అమ్మా ఈజ్ ఎ జీనియస్ నాన్నా...

గోపాలరావు : ఏవిఁట్రా నీ గోల...?

కిరణ్ : అబ్బ... అమ్మ బేరం ఆడింది ఆడింది.. నా తల తిరిగిపోయిందనుకో. ద మోస్ట్ చౌకబారు చీరలు కొంది నాన్నా. భారతం అత్తయ్య కోసం ఓ చీరకొందీ.. నువ్వు చూసి తీరాల్సిందే నాన్నా... ఇదుగో ఇది.

గోపాలరావు : ఇదేం చీరే? ఇంక కంటే చౌకబారుది దొరకలా?

కిరణ్ : ఇంతకంటే చౌకబారుదా? ఇంఫాజిబుల్. అమ్మ షాపంతా గాలించినా దొరకలా... దొరకదు.

గోపాలరావు : ఈ అలికీ చీర రెండొందల యాభై రూపాయలా? మోసం కదుట్రా.

కిరణ్ : ఆ చీటిమీది ధర చూసి భయపడకు నాన్నా. దాని ధర నూట పాతిక రూపాయలే. చీటీ మీద మనం ఎంత ధర వెయ్యమంటే అంత ధర వేసి ఇస్తాడు ఆ షాపు వాడు.

గోపాలరావు : రామరామా! మరీ ఇలాంటి చీరపెడితే అప్రతిష్టగా ఉంటుందేమోనే.

కామేశ్వరి : మీ వైపు వాళ్ళకీ, మా వైపు వాళ్ళకీ అందరికీ ఒకే మాదిరివి కొన్నాను. నాకేం పక్షపాతం లేదు. మీరు మీ వాళ్ళకి పట్టు చీరలు పెట్టదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు. డబ్బు మీది, సంపాదన మీది. కామాక్షీ ఎంపోరియంలో 35వేలు దాటిపోయిందని గుండెబాదుకున్నారు. పోనీ ఖర్చు తగ్గిద్దామని తక్కువ ధరవి కొంటే ఇదీ వరస.

కిరణ్ : కట్టుబడి వర్గం కోసం కాదు కదు నాన్నా... పెట్టుబడి వర్గం కోసమే కదా! ఇది చాలు.

గోపాలరావు : ఈ కట్టుబడి వర్గం, పెట్టుబడి వర్గం ఏవిఁట్రా?

కిరణ్ : నిజంగా కట్టుకోవాలనే ఉద్దేశంతో మనం ఎవరికైతే బట్టలు పెడతామో వాళ్ళు కట్టుబడి వర్గం వాళ్ళు. కట్టుకునేందుకు పనికిరాని బట్టలు ఎవరికైతే పెడతామో వాళ్ళు పెట్టుబడి వర్గం వాళ్ళు. అయితే మరి వాళ్ళకెందుకు పెడతామంటే ఏదో శాస్త్రానికి.

కామేశ్వరి : నేనంటే మీ అందరికీ వేళాకోళం అయిపోయింది. నేనేదో పరమ పీనాసినైనట్టూ... మనకేవన్నా బ్యాంకుల్లో డబ్బులు మూలుగుతున్నాయా?

గౌరి : ఊరుకోవే అమ్మా... వాడేదో సరదాకి అంటే...

కామేశ్వరి : అటువైపు ఇటు వైపు ఎన్నో పెళ్ళిళ్ళకి వెళ్ళాం. ఏడాదికి మూడు నాలుగు పెళ్ళిళ్ళు. వాళ్ళెవళ్ళయినా నాకు ఇంతకంటే మంచి చీరలు పెట్టారా? కట్టుకునేందుకు పనికొచ్చే చీర ఒక్కళ్ళయినా పెట్టారా? కొన్ని నైలాన్ చీరల్ని కిటికీలకి కర్టెన్లుగా కుట్టించాను. ఓ అలికీ నేత చీర పని మనిషికిస్తే అది మళ్ళీ నా మొహానే కొట్టింది.

శకుంతల : అవును నాన్నా... చివరికి అమ్మ ఆ చీరని నీట్ గా కామాక్షీ ఎంపోరియం వాళ్ళ అట్ట పెట్టెలో ప్యాక్ చేసి ఎవరికో పెళ్ళిలో ప్రెజెంట్ చేసేసింది ఏడాది క్రితం.

గౌరి : ఆ తీసుకున్నావిడ ఏం చేసిందో పాపం!

శకుంతల : ఆవిడ ఇంకెవరికో ఇచ్చేసి ఉంటుంది అలాగే. కొందరు చౌకబారు వస్తువులని అందంగా ప్యాక్ చేసి పైన పేరు రాయకుండా ప్రెజెంట్ చేస్తారు. రేపు మనింట్లో పెళ్ళికి అలాంటి వాళ్ళపై ఓ కన్నేసి ఉంచాలి.

కిరణ్ : తెలిసిన వాళ్ళయితే జ్ఞాపకం పెట్టుకోవచ్చు. బైటవాళ్ళయితే? 'అయ్యా... అమ్మా... లిస్టు రాసుకోవాలి ప్యాకెట్ మీద పేరు రాయండి' అని అడుగుతామా?

గోపాలరావు : ఇంక చాల్లెండర్రా చర్చ.... పనికి మాలిన చర్చ. (భార్యతో) ఏమే... వంట వాళ్ళ సంగతి ఏం చేశావు?

కామేశ్వరి : పొద్దున్నే సీతమ్మగారికి ఫోన్ చేసి చెప్పాను. ఆవిడ రేపు వంట వాళ్ళని పంపిస్తానన్నది. రేట్లూ అవీ మనల్నే మాట్లాడుకోమన్నది. వంటలు చేయించడమా, కేటరింగ్ కి ఇవ్వడమా... ఏది తక్కువవుతుందో, ఏది సౌకర్యంగా ఉంటుందో చూడాలి. వంటవాడు : అమ్మగారూ... కామేశ్వరమ్మగారిల్లు ఇదేకదండీ...

కామేశ్వరి : అవును... మీరు భీమాస్ కేటరింగ్ వాళ్ళా?

వంటవాడు : అవునమ్మగారూ... సీతమ్మగారు పంపించారు. మీ ఇంట్లో ఏదో శుభకార్యం ఉందని చెప్పారు.

కామేశ్వరి : మరే... వచ్చే ఆదివారం కాక ఆపై ఆదివారం... మా పెద్దమ్మాయి పెళ్ళి... రాజరాజేశ్వరీ కళ్యాణమండపంలో... పొద్దున్న కాఫీ పలహారాలు, మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం లైట్ టిఫిను, టీ, మళ్ళీ రాత్రి కొద్ది మందికి మాత్రం భోజనాలు... (లోపలున్న భర్తతో) ఏవండీ... వంటవాళ్ళు వచ్చారు. వచ్చి మాట్లాడండి.

గోపాలరావు : వస్తున్నా... కిరణ్...కాయితం, పెన్నూ తీసుకురా. (వంటవాడితో) ఊ... మీరేట్లు అవీ చెప్పండి.

వంటవాడు : సరుకులన్నీ మీరే తెప్పిస్తే మేము ఊరికే వంటలు చేయడమా, లేకపోతే కేటరింగ్ కిస్తారా? మీకు ఎలా కావాలో చెబితే మా రేట్లు చెబుతామండి.

కిరణ్ : ఇదుగో నాన్నా కాయితం, పెన్ను.

గోపాలరావు : ఏమే... ఏం చేద్దామంటావ్? వంటలు చేయించాలంటే ముందుగా సరుకులు కొని తెచ్చిపెట్టుకోవాలి. పెళ్ళి తర్వాత చాలా సరుకులు మిగిలిపోవచ్చు. అదంతా తలనొప్పి వ్యవహారం. అంతకంటే కేటరింగ్ కి ఇస్తే నయమనిపిస్తోంది.

కామేశ్వరి : నాకూ అలాగే అనిపిస్తోంది. ముందు రేట్లు కనుక్కుందాం. (వంటవాడితో) ఊ... కేటరింగ్ అయితే ప్లేటుకు ఎంత తీసుకుంటారు?

కిరణ్ : అమ్మా... ప్లేట్ మీల్సు పెట్టిస్తావా అందరికీ?

కామేశ్వరి : వెధవ కొంటె ప్రశ్నలూ నువ్వునూ... అవతలికిపో...

శకుంతల : ప్లేటు మీల్సు కాదన్నయ్యా... 'ప్లేటుకు ఇంత అంటే ఒక్కొక్క మనిషికి ఇంత' అని.

కిరణ్ : అయితే ఫుల్ మీల్సేనన్నమాట. ఇంకోలడ్డూ కావాలంటే వేస్తారన్నమాట!

వంటవాడు : మామూలుగా పెళ్ళి భోజనం అంటే రెండు కూరలు, రెండు పచ్చళ్ళు, కలగలపు పప్పు, సాంబారు, ఊరగాయ, పెరుగు, నెయ్యి, ఒక స్వీటు, హాటు, పులిహోర, అప్పడాలు, వడియాలు ఉంటాయండి. దానికి మేము యాభై రూపాయలు చొప్పున తీసుకుంటామండి.

కామేశ్వరి : అమ్మో... యాభై రూపాయలే. అదేమిటి... సీతమ్మగారు ఇది వరకు తను ముప్ఫయి ఐదు రూపాయలే ఇచ్చానని చెప్పింది! మీరే సప్లయి చేశారు కదా!

వంటవాడు : అవునమ్మగారూ... ఏడాది కిందట 35 రూపాయలకే చేశామండి. మరి అప్పటికీ ఇప్పటికీ సరుకుల ధరలు, కూరల ధరలు ఎంత పెరిగిపోయాయో మీకు తెలియనిదేముందండి. నాలుగైదు నెలల కిందట కూడా కిలో పన్నెండు రూపాయలకి మంచి సన్నటి బియ్యం దొరికేవండి. తుఫాను తర్వాత ఇప్పుడు కిలో పదిహేను రూపాయలకి కూడా మంచి బియ్యం దొరకడం లేదండి. మరి పెళ్ళి భోజనాలకి కిలో ఏడెనిమిది రూపాయలకి దొరికే చౌకరకం బియ్యం వాడలేం కదండీ...

గోపాలరావు : అవుననుకోండి... అయితే మాత్రం అంత ధరా!

వంటవాడు : అదీ కాకుండా... మామూలు రోజుల్లోకంటే ఈ పెళ్ళిళ్ళ సీజన్లో మా రేటు కొంత ఎక్కువగానే ఉంటుందండి. ఆ మాటకొస్తే ఈ సీజనులో మీకు పురోహితుల రేటు, మంగళవాద్యాల రేటు, బంగారం ధర, అన్నీ ఎక్కువగానే ఉంటాయండి. మీకు తెలీనిదేముందండి.

కామేశ్వరి : అయినా... యాభై అంటే చాలా ఎక్కువ. కొంత తగ్గించండి.

వంటవాడు : మధ్యాహ్నం భోజనాలకి ఎంత మంది వస్తారండి?

కామేశ్వరి : 350, 400 మధ్య ఉంటారు. మీరు ఒకేసారి 400 మందికి వండి తీసుకువస్తే మిగిలిపోవచ్చు. 350 మందికే తీసుకు వస్తే తక్కువ కావచ్చు. మరి ఎలా ఎడ్జస్ట్ చేస్తారో!

వంటవాడు : అదేం ఫర్వాలేదండి. కళ్యాణమండపం దగ్గర వంటగదిలో కొంత సరుకు పెట్టుకుని అవసరమైతే అక్కడ వంట చేస్తామండి. మాకిది మామూలేనండి. కాస్తో కూస్తో ఏవైనా మిగిలిపోయినా ఆ నష్టం మేమే భరిస్తామండి.

కామేశ్వరి : మరి రాత్రి భోజనాల సంగతి.... కాఫీ టిఫిన్ల సంగతి?

వంటవాడు : రాత్రికి ఎన్ని విస్తళ్ళు లేస్తాయండి?

కామేశ్వరి : నూటయాభై అనుకోండి. రాత్రికి ఒక కూర, ఒక పచ్చడి, ఊరగాయ, సాంబారు, అప్పడాలు, వడియాలు, పాయసం, బజ్జీల్లాంటివి చాలు.

వంటవాడు : రాత్రి భోజనానికైతే విస్తరికి పాతిక రూపాయలు అవుతుందండి. ఇంక పోతే పొద్దున కాఫీ, ఉప్మాకి ఆరు రూపాయలు, సాయంత్రం టీ, మిక్చర్ కి నాలుగు రూపాయలు తీసుకుంటామండి.

గోపాలరావు : ఒరే కిరణ్... లెక్కవెయ్యరా... మధ్యాహ్నం భోజనం... 350 x 50 ఎంతయింది? 17,500. రాత్రి భోజనాలు 150 x 25 ఎంత?

కిరణ్ : 3,750 నాన్నా...

గోపాలరావు : పొద్దున్న ఉప్మా కాఫీలకి... 300 x 6 ఎంత? 1800. సాయంత్రం టీ, టిఫిన్ కి ఎంత మంది ఉంటారే?

కామేశ్వరి : నూటయాభై మంది కంటే ఉండరండీ...

గోపాలరావు : పోనీ రెండొందలనుకో. 200 x 4 = 800.

కామేశ్వరి : ఈ భోజనాలకి కాకుండా వేరే... వియ్యాలవారికి ఇవ్వడానికి ఓ యాభై పెద్ద సైజు లడ్డూలు, యాభై సున్నుండలు, యాభై జంతికలు, యాభై బాదుషాలు కావాలి.

వంటవాడు : లడ్డూల్లో జీడిపప్పు, కిస్ మిస్ వెయ్యాలాండీ?

కామేశ్వరి : వెయ్యాలి కదా మరి.

వంటవాడు : ఏం లేదమ్మగారూ... భోజనాల్లో వడ్డించే లడ్డూల్లో మేం కిస్మిస్ మాత్రమే వేస్తామండి. జీడిపప్పు వెయ్యం. మాకు మిఠాయి షాపు కూడా ఉందండి. ఒక్కొ లడ్డూ రెండు రూపాయలు పడుతుందండి. మీరు చెప్పే యాభై స్పెషల్ లడ్డూలకి నూట యాభై అవుతుందండి.

కిరణ్ : యాభై జీడిపప్పులు మేం కొనిస్తాంలెండి. రెండేసి రూపాయలకే చేసివ్వండి.

కామేశ్వరి : ఒరే వెధవా... నువ్వూరుకో...

కిరణ్ : ఏమే శక్కూ... జీడిపప్పుల డజను ఎంతకిస్తారు?

వండవాడు : ఇక పోతే యాభై సున్నుండలకు వందరూపాయలు, జంతికలు, బాదుషాలు కూడా అదేరేటండి.

గోపాలరావు : కిరణ్... లెక్కెయ్యరా... లడ్డూలు 150 రూపాయలు, సున్నుండలు, జంతికలు, బాదుషాలు 150 x 2 =300. ఇప్పుడు అంతా టోటల్ చెయ్యి.

కిరణ్ : ఊ... మొత్తం 24,300 అయింది నాన్నా.

కామేశ్వరి : సరే... ఆ పై 4,300 తీసేసి 20 వేలకి చేసెయ్యండి.

వంటవాడు : మాకు గిట్టదండి అమ్మగారూ... కావాలంటే మీరు ఇంకెవర్నైనా కనుక్కోండి. ఇంతకంటే తక్కువకి ఎవరూ చెయ్యరండి. అలా కాకపోతే మీరు సరుకుల తెచ్చి ఇవ్వండి. మేము వచ్చి వంట చేసి పెట్టి వెడతాం. మూడు వేలు ఇప్పించండి.

కామేశ్వరి : అమ్మో... ఒక్కరోజుకి మూడు వేలా? వద్దులెండి. కేటరింగ్ సంగతే చెప్పండి. ఇంకో వెయ్యి తీసుకుని 21 వేలకి చెయ్యండి.

వంటవాడు : అలా కాదమ్మగారూ... ఆఖరి మాట 22 వేలు ఇచ్చేయండి. ఓ పాతికో, ముప్ఫయ్యో విస్తళ్ళు ఎక్కువైనా అది మేమే భరిస్తాం.

గోపాలరావు : సరే... రెండు రోజుల ముందుగా మళ్ళీ ఫోన్ చేసి జ్ఞాపకం చేస్తాం. ఇంకెవరికీ ఒప్పుకోకండి.

వంటవాడు : అలాగేనండి. (కళ్యాణ మండపంలో పెళ్ళి సందడి. పురోహితుల మంత్రాలు, మంగళవాద్యాల హోరు)

గోపాలరావు : ఒరే కిరణ్... అందరికీ కాఫీ పలహారాలు అందుతున్నాయో చూడు. శక్కూ... ఇటు ఆడవాళ్ళందరికీ కాఫీ పలహారాల సంగతి చూడు.

కిరణ్ : ఏమండీ ఉప్మా తీసుకోండి... ఏమండీ మీరు కూడా... (బిగ్గరగా) ఇదుగో ఎవరక్కడ... ఇక్కడ కాఫీలు చూడండి.

శక్కు : పిన్ని గారూ... ఉప్మా తీసుకోండి... అత్తయ్యగారూ మీరు కూడా... (బిగ్గరగా) ఏవండీ... కాఫీ పంపించండి. (కిరణ్ తో) అన్నయ్యా నువ్వు మధ్యమధ్య ఆ వీడియో అతన్ని కనిపెట్టి ఉండు. ఎలా తీయాలో చెప్పు.

కిరణ్ : ఆ సంగతి నువ్వు చెప్పాలిటే. అది మోస్ట్ ఇంపార్టెంట్.

శక్కు : మామూలు ఫొటోగ్రాఫర్ కూడా ఉన్నాడుగా. అతని క్కూడా సలహాలిస్తూ ఉండాలి మధ్య మధ్య.

కిరణ్ : ఓఖే... నో ప్రాబళం.

(మాంగల్యం తంతు నానేన మమజీవన... మంత్రాలు, మంగళ వాద్యాల హోరు)

పురోహితుడు : అయ్యా... అమ్మా... అందరూ అక్షింతలు వేయండి. ఇలా రండి... ఇలా రండి... ఇదుగోండి అక్షింతలు. అయ్యా... ఈ అక్షింతలు తీసుకోండి. కిరణ్ : వీడియో గ్రాఫరు గారూ... పసందైన సీను... తలంబ్రాలు పోసుకుంటున్నారు. పెళ్ళికూతురు మొహం, పెళ్ళికొడుకు మొహం క్లోజప్పులో రావాలి. తలంబ్రాలు పడుతుంటే స్లో మోషన్... ఓకే.

గోపాలరావు : ఏవిఁట్రా నీ హడావిడి?

కిరణ్ : దర్శకత్వ పర్యవేక్షణ, ఎడిటింగ్ కిరణ్ కుమార్. నిర్మాత గోపాలరావు, చిత్రం గౌరీ కళ్యాణ వైభోగం... కాదు కాదు డౌరీ కళ్యాణ వైభోగం.

గోపాలరావు : ష్... బిగ్గరగా వాగకు వెధవా... పురోహితుడు : అయ్యా ఇంక చదివింపులు. కన్యాదాతకి గాని, వధూవరులకి గాని ఎవరైనా కట్నాలు చదివించదలచుకుంటే చదివించండి.

కిరణ్ : వీడియో గ్రాఫరు గారూ... బహుమతులిచ్చేవారందరినీ బాగా తియ్యండి. వాళ్ళ మొహాలు, వాళ్ళ చేతుల్లోని ప్యాకెట్లూ బాగా కనిపించాలి.

వీడియోగ్రాఫర్ : అది వేరే చెప్పాలా మాకు?

పురోహితుడు : అయ్యా... ఇలారండి... తమ పేరు ఏవఁన్నారూ... వెంకటేశ్వర్రావు గారా?... శ్రీ వెంకటేశ్వర్రావు గారు తమ బావమరిది యైన కన్యాదాతగారిని, వారి సతీమణిని ఆశీర్వదించి ఇచ్చినటువంటి పట్టుపంచెలు, పట్టు చీరలున్నూ...

కిరణ్ : శాస్తుర్లు గారూ... అవి పట్టు బట్టలు కావండీ... మామూలు నేత బట్టలే.

పురోహితుడు : అయినా... సంప్రదాయం ప్రకారం, అలవాటు ప్రకారం అలా అంటూ ఉంటాం నాయనా... అమ్మా... ఎవరైనా మంగళహారతి పాడండమ్మా...

కామేశ్వరి : శక్కూ పాడవే...

శక్కు : ఏం పాడనే... నాకేం వచ్చూ...

కిరణ్ : 'పాడమని నన్నడగ వలెనా పదుగురెదుటా పాడనా' అదేదో పాత పాట ఉంది కదే.

కామేశ్వరి : 'పార్వతీ బ్రోచుగాతా' పాడవే....

శక్కు : అది నేను నేర్చుకోందే...

కామేశ్వరి : పోనీ... 'మంగళంబూ వేగనీకూ' పాడు.

శక్కు : మరిచిపోయానే..

కామేశ్వరి : అబ్బ... ఏం బెట్టు చేస్తావే... పోనీ నీ కొచ్చిన ఇంకేదైనా పాటపాడు.

కిరణ్ : హారతి పళ్లెంలో మూడొందలో, నాలుగొందలో పడతాయే. లక్కీ ఛాన్సు.

శక్కు : నేనూ, పిన్నీ కలిసి పాడతామే. రా పిన్నీ... 'గౌరీ కళ్యాణ వైభోగమే' పాట పాడదాం. నీకూ వచ్చుగా...

కిరణ్ : (వాళ్ళు పాడుతుంటే వెక్కిరింపుగా, కొంటెగా, నెమ్మదిగా, తనలో తను పాడుకుంటున్నట్టు) డౌరీ కళ్యాణ వైభోగమే...

కామేశ్వరి : (నెమ్మదిగా... మందలిస్తున్నట్టు) ష్... వెధవా... నువ్వు ఇక్కణ్ణించి ఫో.. ఆడవాళ్ళమధ్య నువ్వు దేనికి? (భోజనాల సీను కలకలం.

లౌడ్ స్పీకర్లో 'వివాహ భోజనంబు వింతైన వంటకంబు' పాట వినిపిస్తూ ఉంటుంది)

గోపాలరావు : నెమ్మదిగా కానీండి. తొందర్లేదు.... మొహమాట పడకండి. ఏవండీ... నెయ్యి తీసుకురండి ఇటు.

వంటాయన : పప్పండీ పప్పు... పప్పు... పప్పు... మీకండీ పప్పు.

గోపాలరావు : ఎవరక్కడ... మంచి నీళ్ళు కనుక్కోండి. ఒరే కిరణ్... పులిహోర పట్టుకురా... మీరు కొంచె పులిహోర వేయించుకోండి.

కామేశ్వరి : శక్కూ... అటువైపు అన్నీ అందుతున్నాయో లేదో చూడు. గోపాలరావు : హమ్మయ్యా... ఓయజ్ఞం పూర్తయింది. ఒళ్ళు హూనమైపోయింది.

కామేశ్వరి : అందుకే అన్నారు... 'పెళ్ళి చేసి చూడు' అని...

కిరణ్ : మొత్తం ఎంత ఖర్చయింది నాన్నా?

గోపాలరావు : అబ్బా... ఇప్పుడెందుకురా ఆ లెఖ్క... ముందు ఓ రెండు రోజులు పడి నిద్రపోవాలి. తర్వాత ఆ లెఖ్కలన్నీ... శక్కూ ఏదర్రా?

కిరణ్ : అది బహుమతుల ప్యాకెట్లు విప్పుతోంది.

శక్కు : ఏం నాన్నా... పిలిచావా?

గోపాలరావు : ఏవేం వచ్చాయే బహుమతులు?

శకుంతల : అత్తారింటికెళ్ళాక అక్క ఎంచక్కా దుకాణం పెట్టుకోవచ్చు నాన్నా. మూడు కుక్కర్లు, నాలుగు నాన్ స్టిక్ పాన్ లు, ఐదు గడియారాలు, ఆరు ఫ్లాస్క్ లు, రెండు టిఫిన్ కారియర్లు, రెండు టీ సెట్లు.

కిరణ్ : పేరు లేని ప్యాకెట్లు ఏవైనా వచ్చాయిటే?

శకుంతల : నాలుగొచ్చాయి. వాటిలో చౌకబారు హాండిక్రాప్ట్స్ బొమ్మలేవో ఉన్నాయి. వాటిని షోకేస్ లో పెట్టుకుంటే షో కేస్ అందం కూడా పోతుంది.

కిరణ్ : వాటిని మళ్ళీ అల్లాగే ప్యాక్ చేసి ఉంచు. వీడియో క్యాసెట్ వచ్చాక పరిశోధిద్దాం వాటిని ఎవరిచ్చారో.

గోపాలరావు : అమ్మకి ఎన్ని చీరలు వచ్చాయే?

శకుంతల : పదహారు చీరలు వచ్చాయి నాన్నా. వాటిల్లో వియ్యాల వారు పెట్టిన చీర ఒక్కటి తప్ప ఇంకేవీ కట్టుకునేందుకు పనికిరావు. ఆ పెట్టిన వాళ్ళు కూడా అమ్మ లాగానే చిక్కడపల్లి 'చీప్ అండ్ బెస్ట్' షాపులో కొనివుంటారు వాటిని.

కిరణ్ : మనం ఆ షాపుకి పోటీగా 'చీప్ అండ్ వరస్ట్' అనే పేరుతో ఒక షాపు పెట్టుకోవచ్చు నాన్నా. మనకు వచ్చిన పనికిరాని చీరలు, పంచెలు, జాకెట్ పీసులు అమ్మకానికి పెట్టచ్చు. షాపు బోర్డు మీద 'పెట్టుబడి బట్టలు మా ప్రత్యేకత' అని రాయించాలి.

శకుంతల : సుశీలత్తయ్య పెట్టిన ఈ చీర నువ్వు చూసి తీరాలి నాన్నా.

గోపాలారవు : ఏవిఁటే దాని విశేషం? నాసిరకం చీర.. అంతేనా?

శకుంతల : ఈ చీరకి చాలా హిస్టరీ ఉంది నాన్నా.

కామేశ్వరి : ఏవిఁటర్రా ఈ పంచాయితీ? ఎవరి స్తోమతుకు తగ్గట్టు వాళ్ళు పెడతారు. దాని మీద ఇన్ని వ్యాఖ్యానాలా?

శకుంతల : ఈ చీర రెండు సంవత్సరాల కిందట చిక్కడపల్లి షాపులో అమ్మేకొన్నది నాన్నా.

గోపాలరావు : నీకెలా తెలుసే?

శకుంతల : అమ్మా, నేనూ కలిసి వెళ్ళే కొన్నాం. నాకు బాగా జ్ఞాపకం.

కామేశ్వరి : కాని ఆ చీర నేను మీ సుశీలత్తయ్యకి పెట్టలేదు. ఇంకెవరికో పెట్టాను.

కిరణ్ : ఆ తీసుకున్న వాళ్ళు ఇంకెవరికో పెట్టి ఉంటారు. అలా అలా రెండేళ్ళు చేతులు మారి, సుశీలత్తయ్యకి చేరి, అక్కణ్ణించి మళ్ళీ ఒరిజినల్ ప్లేస్ కి చేరిందన్న మాట.

కామేశ్వరి : పోనీ లెండర్రా వస్తే వచ్చింది.

కిరణ్ : దాన్ని ఇంకెవరికీ పెట్టకుండా చీప్ అండ్ బెస్ట్ వాడికి సగం ధరకి అమ్మేయమ్మా.

కామేశ్వరి : ఏదో ఒకటి చేస్తాను. నీకు దేనికిరా?

కిరణ్ : నీ ధోరణి చూడబోతే శక్కూ పెళ్ళిదాకా దాచి పెట్టి మళ్ళీ సుశీలత్తయ్యకే పెట్టేటట్లున్నావు.

శకుంతల : అయితే అది ఇంకెన్ని రౌండ్లు కొడుతుందో!

కిరణ్ : ఆహా... కళ్యాణ వైభోగమే... గౌరీ కళ్యాణ వైభోగమే... డౌరీ కళ్యాణ వైభోగమే....! (ఈ శ్రవ్యనాటికలో రేట్లు అన్నీ 1997 నాటివి)

నండూరి పార్థసారథి
(రేడియో నాటిక - 1997లో ప్రసారితం)

Previous Post