శాస్త్రియ నృత్యానికి సామాన్య ప్రజల అభిమానాన్ని సంపాదించడం ఎలాగన్నది దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పెద్దసమస్యగా తయారయింది. ఈ సమస్య నృత్యానికే కాదు-శాస్త్రీయ సంగీతానికీ ఉంది. 30, 40 ఏళ్ళ క్రిందట దీన్ని గురించి ఎవరూ ఆలోచించలేదు. సామాజిక వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల ఈ సమస్య ఉత్పన్నమయింది. సామాజికంగా అప్పటి పరిస్థితికీ, ఇప్పటి పరిస్థితికీ పోలిక లేదు.

శాస్త్రీయ సంగీత నృత్యాలు రాజాస్థానాలకు పరిమితమై గ్రామీణ సామాన్య ప్రజలకు ఎప్పుడూ దూరంగా ఉంటూ వచ్చాయనీ, పూర్వపు వాగ్గేయకారులు, కళాకారులు ఫ్యూడల్ వ్యవస్థకు భజన చేస్తూ ఉండేవారని కొందరి వాదం. గ్రామీణ ప్రజలు జానపద సంగీత నృత్యాలనే తప్ప శాస్త్రీయ సంగీత నృత్యాలను అర్థం చేసుకోలేరని వారి అభిప్రాయం. ప్రస్తుత ప్రజాస్వామిక వ్యవస్థలో శాస్త్రీయ సంగీత నృత్యాలను సామాన్య గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటే, వారు మెచ్చగల విధంగా వాటిలో 'తగు' మార్పులు తీసుకురావాలని మరికొందరి అభిప్రాయం.

ఇవి దురభిప్రాయాలు మాత్రమే. ఉత్తర హిందూస్థానంలో పరిస్థితి ఎలా ఉన్నా, దక్షిణాదిని -ముఖ్యంగా తెలుగుదేశంలో శాస్త్రీయ సంగీత నృత్యాలు ఎప్పుడూ సామాన్య ప్రజలకు సన్నిహితంగా, ప్రజా జీవితంలో భాగంగా ఉంటూ వచ్చాయి. ప్రజాసామాన్యానికి దూరంగా ఉంటూ తమ కళను రాజాస్థానాలకు అంకితం చేసిన ఆస్థాన విద్వాంసులు, నాట్యాచార్యులు, నర్తకీమణులు, వాగ్గేయకారులు కొద్దిమంది మాత్రమే.

గ్రామీణ సంస్కృతిలో శాస్త్రీయ కళలు

ఆలయాలను ఆశ్రయించుకున్న దేవదాసీలు, భజనబృందాలవారు, కూచిపూడి భాగవతులు సామాన్య ప్రజల మధ్య జీవించినవారే. మడి మాన్యాలవంటివి ఇస్తే పుచ్చుకునేవారు కాని, తమంతట తాముగా వారు రాజాస్థానాలను ఆశ్రయించలేదు. వారు ప్రధానంగా ప్రజాదరణ పైనే ఆధారపడి జీవించారు. ఊరూరూ తిరిగి యక్షగానాలు ప్రదర్శిస్తూ, ప్రజలు తృణమో ఫణమో ఇస్తే దానినే మహాప్రసాదంగా స్వీకరించి నిరాడంబరంగా, తృప్తిగా జీవించారు. కూచిపూడి భాగవతులు అచ్ఛమైన ప్రజా కళాకారులు. తాళ్లపాక కవులు, నారాయణ తీర్థులు, సిద్ధేంద్రయోగి, క్షేత్రయ్య, రామదాసు, త్యాగరాజు, ఆయన శిష్యపరంపరలోని వారు ప్రజల మధ్య సామాన్యులుగా జీవించినవారే.

సంస్కృత గీతాలకు శుద్ధ శాస్త్రీయ సంగీతాన్ని మేళవించిన నారాయణతీర్ధుల తరంగాలను, భరత సంప్రదాయాన్ని అక్షరాలా పాటించిన సిద్ధేంద్రయోగి భామాకలాపాన్ని, జాను తెలుగుకు శాస్త్రీయ సంగీతాన్ని జోడించిన క్షేత్రయ్య పదాలను, రామదాసు కీర్తనలను, త్యాగరాజ కృతులను నిరక్షరాస్యులు సైతం ఆరాధించారు. ఇంకా అధ్యాత్మ రామాయణ కీర్తనలు, హరికథలు, పురాణ కాలక్షేపాలు కూడా మన గ్రామీణ సంస్కృతిలో భాగాలే. అటువంటి కార్యక్రమాలకు గొడ్లను కాసుకునే పాలేళ్లు కూడా హాజరయ్యేవారు. ప్రతి పదానికి అర్థం తెలియకపోయినా భావం చక్కగా గ్రహించేవారు. రాగతాళాలేమిటో తెలియకపోయినా సంగీతాన్ని విని ఆనందించగలిగే వారు. విమర్శనా జ్ఞానం లేకపోయినా శ్రావ్యమైన సంగీతానికి, చౌకబారు సంగీతానికి తేడా పసిగట్టగలిగేవారు. అలవాటు వల్ల అటువంటి శక్తి ఎవరికైనా అబ్బుతుంది. శాస్త్రీయ సంగీత నృత్యాలు సామాన్య ప్రజలకు అర్థం కాకపోవడం అనే సమస్య ఆ రోజుల్లో లేదు. సామాన్య ప్రజలు తేలిగ్గా అర్థం చేసుకోవడానికి వీలుగా మన వాగ్గేయకారులు తమ సంగీత సాహిత్యాలలో, నృత్యరచనలలో 'తగు'మార్పులు ఏవీ చేయలేదు. ఎటువంటి మార్పులను ప్రజలు ఆశించనూ లేదు. ఈనాడు మన సంగీత విద్వాంసులు, నర్తకీమణులు పాశ్చాత్య దేశాలలో అచ్చమైన భారతీయ శాస్త్రీయ సంగీత, నృత్య ప్రదర్శనలు ఇస్తూ విదేశీయుల అభిమానాన్ని చూరగొంటున్నారు. విదేశీయులకోసం సుబ్బలక్ష్మీ, యామినీ కృష్ణమూర్తి 'తగు' మార్పులేవీ చేయలేదు. మన సంస్కృతిలో పరిచయంలేని విదేశీయులే ఆనందిస్తూ ఉండగా, మన సంస్కృతిలో పుట్టి పెరిగిన గ్రామీణ ప్రజలు ఆనందించలేరా?

రసగ్రహణ శక్తిలో తారతమ్యాలు ఎప్పుడూ ఉంటాయి. విద్యావంతులలో కూడా ఆ శక్తి అందరికీ సమానంగా ఉండదు. కళల పరిచయం పెరుగుతున్నకొద్దీ రస గ్రహణ శక్తి పెరుగుతూ ఉంటుంది. తక్కువ స్థాయిలోని వారి కోసం కళాకారుడు తన స్థాయినుంచి దిగడం ప్రారంభిస్తే ఆ దిగడానికి అంతం ఉండదు. ఆ విధంగా దిగజారిన కళను ఉన్నత స్థాయి కళాప్రియులు మెచ్చుకోలేరు. అంతకంతకు ఉన్నత ప్రమాణాలను సాధించడానికి కళాకారులు ప్రయత్నించాలి. రసగ్రహణ శక్తిని పెంచుకోవడానికి కళాప్రియులు ప్రయత్నించాలి. ఒకప్పుడు గ్రామీణ సంస్కృతిలో భాగంగా ఉన్న శాస్త్రీయ సంగీత నృత్యాలు ఇప్పుడు సామాన్య ప్రజలకు ఎందుకు దూరమైపోయాయి? కూచిపూడి వారి 'భామాకలాపం' ఇప్పుడు మ్యూజియంలో వస్తువులాగా ఎందుకు చోద్యంగా కనిపిస్తున్నది? ఇందుకు చాలా కారణాలున్నాయి.

కంపెనీ నాటకాల దెబ్బ

మొదట కంపెనీ నాటకాలు బాగా దెబ్బతీశాయి. గయోపాఖ్యానం, పాండవోద్యోగ విజయాల వంటి పౌరాణిక నాటకాలను ప్రదర్శించిన నటులు మహారాష్ట్ర బాణిని దిగుమతి చేశారు. రాగయుక్తంగా పద్యం చదవడంలో ఒక క్రొత్త పద్ధతి ప్రచారంలోకి వచ్చింది. పద్యం చివర ఫర్లాంగు పొడుగు దీర్ఘం తీయడం మన దక్షిణాది సంప్రదాయం కాదు. అది మహారాష్ట్ర నుంచి ఎరువుతెచ్చుకున్నది. ఈ నాటకాలలో ఎన్నో హిందూస్థానీ రాగాలు తెలుగు దేశంలో ప్రచారంలోకి వచ్చాయి. ఆ నాటకాలు పట్టణాలలోనూ, గ్రామాలలోనూ విపరీతంగా ప్రజాదరణ పొందాయి. వాటిని ప్రదర్శించే కంపెనీల మధ్య పోటీ పెరుగుతూ వచ్చింది. గ్రామఫోన్ రికార్డులు వచ్చిన తర్వాత ఆ నాటకాలలోని పద్య రత్నాలకు ప్రచారం మరీ పెరిగింది. 'కురుక్షేత్రం'లోని పద్యాలన్నీ 'గొడ్డకాడబుడ్డోళ్ల'కు కూడా కంఠస్థం వచ్చాయి. సంస్కృత పద్యాల్లో, సుదీర్ఘ సమాసాలతో కూడిన పద్యాలను కూడా రికార్డులో ఉన్నట్లుగా పాడడం, పద్యం చివర చిలవలు పలవలుగా దీర్ఘాలు తీయడం కూడా వారు నేర్చుకున్నారు. ఈ నాటకాల వ్యాప్తివల్ల కూచిపూడి వారి నృత్య నాటకాలకు గిరాకీ తగ్గింది. మహారాష్ట్ర బాణి వ్యాప్తివల్ల కొన్ని శతాబ్దాలుగా గ్రామాలలో ఉన్న తెలుగు సంగీత సంప్రదాయం కూడా మూలబడింది. కంపెనీ నాటకాలలో నృత్యం లేదు. నటన కూడా చాలా తక్కువ. పద్యానికి దీర్ఘాలు తీయడంలో ఉన్న ఆసక్తి వారికి నటనలో లేదు. ఎంత గుక్కపట్టితే అంత గొప్ప నటుడనే స్థితికి ప్రేక్షకులు వచ్చారు.

సినిమా సామ్రాజ్య విస్తరణ

టాకీ సినిమాల జోరు పెరిగిన తర్వాత నాటకాలూ దెబ్బతిన్నాయి. మొదట వచ్చిన తెలుగు సినిమాలు పౌరాణిక చిత్రాలే. అవి ఇంచుమించు నాటకాలకు నకళ్లుగా ఉండేవి. పాటలు, పద్యాలు, ఒకరకం డాన్సులు తోరణం గుచ్చినట్లుగా ఉండేవి. వాటిని చూడడానికి పల్లె ప్రజలు బళ్లు కట్టుకుని దగ్గరున్న బస్తీలకు వెళ్లేవారు. సినిమాలను మరిగిన ప్రజలకు నాటకాలలో మజా కనిపించలేదు. నాటకాలకు గిరాకీ లేకపోవడం వల్ల, నాటక రంగంలోని వారు సినిమా రంగంలోకి ప్రవేశించారు. తొలి తెలుగు సినిమాలలోని నటీనటులందరూ అంతకు ముందు నాటకాలలో వేషాలు వేసి పేరు పొందినవారే. క్రమంగా 'సినిమా సంగీతం', 'సినిమా నృత్యం' అనేవి ప్రచారంలోకి వచ్చాయి. మహారాష్ట్రబాణి లాగానే ఇవి కూడా బొంబాయి సినిమాలనుంచే దిగుమతి అయినాయి. ప్రజలకు సినిమా డాన్సుల మోజు పెరిగింది. కూచిపూడి నాట్యాచార్యులు కూడా సినిమా రంగంలో ప్రవేశించి, యథాశక్తిని సినిమావాళీ డాన్సులు తయారు చేశారు. వీరు సినిమా తారలకు కూచిపూడి నాట్యం నేర్పడం కాక, తారల నుంచి సినిమా డాన్సులు నేర్చుకున్నట్లు కనిపిస్తుంది. సినిమాలలో ఆదాయం ఎక్కువగా ఉంటుంది కనుక ప్రముఖ నటులు, నాట్యాచార్యులు, కవులు, సినిమాలలోకి ప్రవేశించారు. వీరు సినిమాలను బాగుచేయడానికి బదులు, సినిమావల్ల తాము చెడిపోయారు.

సినిమాను ఒక కళగా పరిగణించి, కళా ప్రియులను రంజిప జేయడం లక్ష్యంగా పెట్టుకొని, కళాత్మక చిత్రాలు తీసిన తెలుగు సినిమా దర్శకులు బి.ఎన్. రెడ్డి, నాగయ్య వంటి వారిని ఒక చేతి వ్రేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. వారు తప్ప మిగిలిన వారదంరూ సామాన్య ప్రజల కాళాభిరుచిని అంతో ఇంతో ఖరాబు చేశారు. వారు సినిమాను కేవలం ఒక వ్యాపారంగా పరిగణించారు. తెలుగులో ఇంతవరకు వచ్చిన వాటిలో నూటికి 90 పైగా చిత్రాలు చౌకబారు వని చెప్పడానికి మొహమాటపడనక్కర్లేదు. సగటు తెలుగు సినిమాలో తెలుగు తనం కనిపించదు.

సామాన్య ప్రజల కళాభిరుచిని పెంపొందించడంగానీ, దిగజార్చడంగానీ ప్రధానంగా కళాకారుల చేతుల్లో ఉన్నపని. అన్ని కళలకు సంగమ స్థానంగా ఉన్న సినిమా ప్రబలమైన ప్రచార సాధనం. మంచికి గాని, చెడుకుగాని సమాజాన్ని ప్రభావితం చేయగలశక్తి సినిమాకి ఉన్నంతగా మరి దేనికీ లేదు. మరి దేనితోనూ పోల్చడానికి వీలులేని అద్భుతమైన సాధనం సినిమా. అది ఒక కళ, ప్రచార సాధనం, పరిశ్రమ. సినిమాతో వినోదం అందజేయవచ్చు; రసానందం కలిగించవచ్చు; ఒక వాదాన్ని ప్రచారం చేయవచ్చు; ఒక తత్వాన్ని ప్రబోధించవచ్చు; ఒక సమాచారాన్ని అందజేయవచ్చు; విద్యా బోధన చేయవచ్చు. మంచిగానో, చెడుగానో ఈనాడు సినిమా వల్ల అంతో ఇంతో ప్రభావితం కావి రంగంలేదని చెప్పవచ్చు. ప్రపంచంలో ఎన్నో దేశాలలో విద్య, వ్యవసాయం, కళలు, విజ్ఞాన శాస్త్రం, వాణిజ్యం వంటి పెక్కు రంగాల అభివృద్ధికి సినిమా విశేషంగా దోహదం చేసింది. మన తెలుగు దేశంలో మాత్రం ఏడాదికి డెబ్భయ్యో, ఏనభయ్యో కాలక్షేపం కథా చిత్రాలు తప్ప, ఇతర రంగాల అభివృద్ధికి దోహదం చేసే డాక్యుమెంటరీ, ఎడ్యుకేషనల్ చిత్రాలు రావడం లేదు. కథా చిత్రాలు కూడా మన కళల అభివృద్ధికి ఎంత మాత్రం దోహదం చేయకపోగా విపరీతంగా దెబ్బతీస్తున్నాయి. సినిమా వల్ల నాటక రంగం దెబ్బతిన్నది. సినిమా సంగీతం వల్ల శాస్త్రీయ సంగీతం దెబ్బతిన్నది. జ్యోతిలక్ష్మి మార్కు సినిమా నృత్యాల వల్ల శాస్త్రీయ నృత్యం దెబ్బతిన్నది. ధనాకర్షణవల్ల, తేలిగ్గా పేరు తెచ్చుకోవచ్చుననే ఆశవల్ల మంచి కళాకారులు సినిమా రంగంలోకి ప్రవేశించి తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారు. తెలుగు సినిమా సర్వతోముఖంగా కృత్రిమత్వాన్ని, పలాయన వాదాన్ని, కుసంస్కారాన్ని ప్రచారం చేస్తున్నది. దానిని అదుపులో పెడితే తప్ప, తెలుగు దేశంలో ఉత్తమ కళాభిరుచికి మనుగడలేదు.

తారాపథానికి దగ్గరదారి

ఇటీవల కాలంలో శాస్త్రీయ నృత్యం సామాన్య ప్రజలకు దూరమైపోవడానికి కళాకారుల మనస్తత్వం కూడా కొంతకారణం. వారికి ధనసంపాదనమీద, పబ్లిసిటీ మీద ఉన్న ఆసక్తి కళా ప్రచారం మీద లేదు. గ్రామాలలో, చిన్నపట్టణాలలో ప్రదర్శనాలు ఇస్తే ఆట్టే డబ్బురాదు. పబ్లిసిటీరాదు. అందుచేత వారికి ఎప్పుడూ రాజధానిమీదే కన్ను ఉంటుంది. ఈ రోజుల్లో కొంచెం ఆర్థిక స్తోమతుగలవారే నాట్యం నేర్చుకుంటున్నారు. అరంగేట్రం కూడా ఇవ్వకముందే భవిష్యత్ కార్యక్రమం అంతా తయారు చేసుకుని సిద్ధంగా ఉంటారు. రాజధానిలో అరంగేట్రం ఏర్పాటు చేయడం, మంత్రిగారినో, గవర్నర్ గారినో ముఖ్య అతిధిగా ఆహ్వానించడం, పత్రికల వారందరినీ ఆహ్వానించడం, ఫొటోలు, పబ్లిసిటీ మెటీరియల్ అంతా వారికి సరఫరా చేయడం, మంత్రి గారితో ఫొటోలు తీయించుకుని పత్రికల్లో వేయించుకోవడం, తర్వాత రాజధానిలోనే రెండు మూడు ప్రోగ్రాములు ఇచ్చి, నెమ్మదిగా ఢిల్లీకి బయలుదేరడం, అక్కడ కేంద్రమంత్రిగారి సమక్షంలోనో, రాష్ట్రపతి సమక్షంలోనో విజ్ఞాన భవనంలో ప్రదర్శినం ఇవ్వడం, మళ్లీ వెనక్కి రాకుండా అట్నించి అటే పాస్ పోర్టు, వీసా సంపాదించి విదేశాలకు విమానం ఎక్కేయడం, విదేశయాత్ర నుంచి తిరిగి రాగానే సినిమాల్లో హీరోయిన్ గా చేరడం-ఇదీ పథకం. ఈ పథకం ప్రకారం అన్నీ కలిసిరాకపోతే నిరాశా నిస్పృహలకు లోనుకావడం, చిన్న పట్టణాలలో ప్రదర్శనలివ్వడం, ఇష్టంలేక పెళ్లి చేసుకుని, సంసారంలో పడి కళకు తిలోదకాలివ్వడం జరుగుతుంది. కళాకారుల్లో ఈ ధోరణి మారాలి. పబ్లిసిటీ మీదకాక, కళ మీద దృష్టి కేంద్రీకరించాలి. పెద్ద పట్టణాల్లో, నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చి, విద్యావంతుల, కళాభిజ్ఞుల ప్రశంసలందుకుంటే లభించే తృప్తి సామాన్య ప్రజల ఎదుట ప్రదర్శించడం వల్ల కళాకారులకు లభించకపోవచ్చు. కాని ప్రతి కళాకారుడు తన కళను సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు పరిచయం చేయడానికి, తద్వారా వారి కళాభిరుచిని, రసగ్రహణ శక్తిని పెంపొందింపజేయడానికి ప్రయత్నించాలి. మోనోయాక్టర్ చంద్రశేఖరం గారు రాష్ట్రపతి ప్రశంసలు, ప్రధాన మంత్రి ప్రశంసలు పొందినా, విదేశీయుల ప్రశంసలు పొందినా, సామాన్య ప్రజలను రంజింపజేయడమే తమ ధ్యేయంగా పెట్టుకున్నారు. బస్సుల్లో, పడవల్లో, రెండెడ్ల బళ్లలో మారుమూల గ్రామాలకు, గని ప్రాంతాలకు, ప్రాజెక్టు ప్రాంతాలకు వెళ్లి ప్రదర్శనలు యిచ్చి గ్రామీణ ప్రజలను, కార్మికులను ఆనందపరచారు. కళాకారులకు అటువంటి దృక్పథం అవసరం. ప్రత్యేకంగా గ్రామాలకు, చిన్న పట్టణాలకు వెళ్లి ప్రదర్శనాలు ఇవ్వడం ఆర్థిక దృష్ట్యాసాధ్యం కాకపోవచ్చు. కాని, ఏదైనా ఒక పెద్ద పట్టణంలో ప్రదర్శనం ఇవ్వడానికి వెడుతున్నప్పుడు దారిలో ఉన్న కొన్ని చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో ప్రదర్శనాలు ఇవ్వడానికి ముందుగా ఏర్పాట్లు చేసుకోవచ్చును. ఆర్థికంగా ఎంతవరకు సాధ్యమైతే అంత వరకే ఈ విధమైన కృషి సాగించవచ్చు.

గ్రామీణ ప్రజల మాట అటుంచి అసలు పట్టణాలలోని విద్యావంతులలోనే చాలా మందికి శాస్త్రీయ నృత్యంతో పరిచయం లేదు. ఏ కళ పట్లనైనా అవగాహన పెరుగుతున్న కొద్దీ ఆసక్తి పెరుగుతుంది. అందుచేత విద్యావంతులకు, కళాశాల విద్యార్థులకు శాస్త్రీయ నృత్యాన్ని గురించి తెలియబరచడం, శాస్త్రీయనృత్యాన్ని వారికి అలవాటుచేయడం అవసరం. ఇందుకోసం పురమందిరాలలోనూ, కళాశాలల్లోనూ అప్పుడప్పుడూ సోదాహరణ ప్రసంగాలు నిర్వహిస్తూ ఉండడం అవసరం. సాహిత్యం చదివి ఆనందించాలంటే భాష తెలియాలి. భాష నేర్చుకోవాలంటే దాని అక్షరాలు, వ్యాకరణం నేర్చుకోవాలి. నిరక్షరాస్యులు కూడా ఎవరైనా కథ చదివి వినిపిస్తే అర్థం చేసుకోగలరు. కాని విద్యావంతులు అర్థం చేసుకొనే దానికి, నిరక్షరాస్యుడు అర్థం చేసుకొనేదానికి తేడా ఉంటుంది. నృత్యం కూడా ఒకభాష. దానికీ వ్యాకరణం ఉంది. ఆ వ్యాకరణం తెలిస్తే నృత్యం బాగా అర్థమవుతుంది. అర్థమైతే దాని పట్ల ఆసక్తి పెరుగుతుంది. నాట్యాచార్యులు నర్తకీమణులు నాట్యకళా విశేషాలను వివరిస్తూ హస్తముద్రలను, చరణవిన్యాసాలను ప్రదర్శించిచూపిస్తూ బోధపరచడం అవసరం. కూచిపూడి ప్రత్యేకత ఏమిటో, దానికీ, భరత నాట్యానికీ గల తేడా ఏమిటో, లాస్య నర్తన రీతికీ, తాండవనర్తన రీతికీ గల తేడా ఏమిటో-ఇటువంటి వివరాలన్నీ తెలియజేయాలి. పెద్ద నగరాలలో-ముఖ్యంగా సంగీత మహాసభల సందర్భంలో ఇటువంటి సోదాహరణ ప్రసంగాలు జరుగుతూ ఉంటాయి. ఇవి చిన్న పట్టణాలలో, కళాశాలల్లో జరగడం అవసరం.

మూసపోత నృత్యాలు

శాస్త్రీయ నృత్యం-అంటే మన తెలుగు దేశానికి సంబంధించినంత వరకు భరతనాట్యం, కూచిపూడి-ఇటీవల కాలంలో విద్యావంతులను, కళాప్రియులను సైతం అంతగా ఆకర్షించలేక పోవడానికి ఒక కారణం వైవిధ్యం లోపించడం. నృత్య ప్రదర్శనలు చాలావరకు మూసపోసిన విధంగా ఉంటున్నాయి. భరతనాట్య ప్రదర్శనంలో అంశాలు-అలరిపు, స్వరజతి, శబ్దం, వర్ణం, పదం, కృతి, తిల్లానా. ఒక నర్తకి సాధారణంగా ప్రతిప్రదర్శనంలోనూ ఒకే స్వరజతిని, ఒకే వర్ణాన్ని, ఒకే తిల్లానాను ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆ నర్తకి ప్రదర్శనం ఒక్కసారి చూస్తే ఇంకోసారి చూడనక్కర్లేదు. అంతేకాదు-ఒక గురువువద్ద నేర్చుకున్న శిష్యురాండ్రు అందరూ ఎప్పుడూ ఒకే అంశాలను ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రతి ప్రదర్శనంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త అంశాలను ప్రదర్శించాలన్న శ్రద్ధ వారికి ఉండదు. గురువుగారి దగ్గర వారు నాలుగైదేండ్లు నేర్చుకుని అరంగేట్రం ఇచ్చినప్పుడు ఏఏ అంశాలను ప్రదర్శిస్తారో ఆ అంశాలనే సంవత్సరాల తరబడి ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రతి గురువు సుమారు రెండున్నర గంటల ప్రదర్శనానికి సరిపడిన కొన్ని అంశాల తోరణాన్ని తయారు చేసి శిష్యురాలికి తర్ఫీదు ఇస్తారు. అరంగేట్రం తర్వాత నర్తకి ఎదగడం మానేస్తుంది. ఎప్పటికప్పుడు కళకు మెరుగులు దిద్దుకుంటూ విస్తృత పరుచుకుంటూ కొత్త ప్రయోగాలు చేస్తున్నవారు చాలా అరుదు.

వస్తుతః చాలా విశాలమైన నాట్యకళ యిటీవల కాలంలో సంకుచితమై పోయినట్లుగా కనిపిస్తున్నది. లాస్యనర్తన రీతే తప్ప తాండవ నర్తన రీతి ఎక్కడా కనిపించడం లేదు. నాట్యం స్త్రీలకే పరిమితమైనది. పురుషులు చేయడం చాలా అపురూపం. పూర్వం 'భామాకలాపం', 'ఉషాపరిణయం' వంటి సంగీత నృత్య రూపకాలలో నృత్యం ఒక భాగంగా ఉండేది. ఏకపాత్ర నర్తనరీతి (సోలో డాన్స్) చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు సంగీత నృత్య రూపకాలు తగ్గిపోయి, ఏకపాత్ర నృత్యాలు ఎక్కువైనాయి. శాస్త్రీయ నృత్యం గురించి తెలియని సామాన్యులకు 'సోలో' నృత్యం కంటే సంగీత నృత్య రూపకాలే ఎక్కువ ఆకర్షణగా ఉంటాయి.

నాట్యకళ పరాధీనత

అసలు మొదటి నుండి మన శాస్త్రీయ నాట్యకళ తన కాళ్లకు తానే బంధం వేసుకుని తనను తాను ఒక చట్రంలో బిగించుకుని, స్వేచ్ఛను కోల్పోయి విస్తృతికి అవకాశం లేకుండా చేసుకున్నదేమోననిపిస్తుంది. ఈ ఆరోపణ మన నాట్యశాస్త్ర వేత్తలకు ఆగ్రహం కలిగించవచ్చు. భరతముని గీతాన్ని, సంగీతాన్ని, నృత్యానికి ఉపాంగాలుగానే భావించాడు. నృత్యానికి దోహదపడడంమే వాటి ప్రయోజనమన్నట్లుగా ఆయన భావించాడు. కాని, క్రమంగా సంగీతం నృత్యంతో నిమిత్తం లేకుండా స్వతంత్రమైన కళగా మారింది. స్వశక్తితో రాణించడం మొదలు పెట్టింది. కాని, నృత్యం మాత్రం సంగీతాన్ని, గీతాన్ని అంటిపెట్టుకునే ఉండిపోయింది. అవి లేకపోతే తాను రాణించలేని స్థితికి వచ్చింది. అంతేకాదు-నృత్యం కంటే గీతం, సంగీతం ఎక్కువ ఆర్భాటం చేయడం మొదలుపెట్టాయి. గీత, సంగీతాలు ఎలా ఆజ్ఞాపిస్తే అలా ఆడటం మొదలుపెట్టింది. నృత్యం, నృత్యప్రదర్శనలోని అంశాలు-స్వరజతి, వర్ణం, పదం, కృతి, తిల్లానా-ఇవన్నీ సంగీతం నుండి ఎరువు తెచ్చుకున్నవే. ఆ నృత్యాలన్నీ వర్ణం, పదం, కృతి వంటి చట్రాలలో బిగింపబడినాయి. అసలు నృత్యం కంటే ముందు పాట ప్రారంభమవుతుంది. ఆ పాటకు అనుగుణంగా నర్తకి నృత్యం చేస్తుంది. వాద్యాలను, గీతాన్నికాదని నర్తకి అప్పటి కప్పుడు తనకు తానుగా, స్వతంత్రంగా ఏమీ చేయడానికి వీలుండదు. మరొక ముఖ్య విషయం-ప్రతి అంశం ముందుగా ఎవరో రచించియిస్తే, దానిని సాధన చేసి అప్పగించడమే తప్ప అప్పటి కప్పుడు స్వయంగా సృష్టించే దేమీ ఉండదు. నర్తకి కేవలం కళా ప్రదర్శకురాలు (పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్) గానే ఉండిపోతుంది. స్రష్ట (క్రియేటివ్ ఆర్టిస్ట్) కాదు.

ఇటువంటి పరాధీనత, నిస్సహాయత సంగీతానికి లేదు. గాయకుడు తన సొంత కృతిని పాడకపోయినా, త్యాగరాజ కృతిని పాడినా అతను కేవలం పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ కాదు. ఎందుకంటే రాగాలాపన, తానం, స్వరకల్పన, పూర్తిగా అతని సొంతం. వాటిని కూడా అతను ముందుగా సిద్ధం చేసుకొని బట్టిపట్టి అప్పగించడం లేదు. మన కళ్లఎదుట ఏ క్షణానికాక్షణం సృష్టిస్తున్నాడు. ఎలా సృష్టిస్తున్నాడు? స్వరాలనే అక్షరాలతో, ఆరోహణ, అవరోహణ, వాది, సంవాది వగైరా లక్షణాల వ్యాకరణంతో కవనం అల్లుతున్నాడు. ఆ పని ఒక నర్తకి, లేదా నర్తకుడు, ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయలేకపోతున్నారు? నృత్యదర్శకులు నృత్యాలు కంపోజ్ చేస్తున్నారు కదా? అలాగే నర్తకి సరాసరి రంగస్థలం మీదనే అప్పటికప్పుడే కంపోజ్ చేసుకుంటూ, స్వరప్రస్తారంలాగా ఎందుకు నర్తించకూడదు? గాయకుడు స్వరకల్పన చేస్తుంటే, ప్రక్కవాద్యాలవారు అనుసరిస్తున్నట్లుగా నృత్యానికి కూడా అనుసరించవచ్చుకదా. సంగీతంలో గాయకుని స్వయం ప్రతిభ వ్యక్తీకరణకోసం ఆలాపన స్వర ప్రస్తారం ఉన్నట్లు నాట్యంలో కూడా 'నాట్యాలాపన', 'నాట్యతానం' వంటివి ఎందుకు ప్రవేశపెట్టరు?

పూర్వం ఎప్పుడో ఏదో ఒక రూపంలో నాట్యంలో ఈ స్వేచ్ఛ ఉంది. అది ఇప్పుడు పోయిందా, అసలు ఎప్పుడూ లేదా? సంగీతంలో ఉన్న సద్యఃకల్పన నృత్యంలో ఎందుకు లేకుండా పోయింది?

సంగీతం మీద ఆధారపడని శుద్ధనృత్త రీతిని ఇప్పుడు మనవాళ్ళు ఊహించలేకపోతున్నారు. "నృత్యం లేకుండా సంగీతం ఉంది. కాని, సంగీతం లేకుండా నృత్యం లేదు. నృత్యానికి సంగీతం ప్రాణం" అని ఒక కళావిమర్శకుడు అన్నారు. మన వాళ్లు నృత్యాన్ని అటువంటి స్థితికి తీసుకు వచ్చారు. నిజానికి నృత్యం.. సంగీతంతో నిమిత్తం లేని ఒక స్వతంత్రమైన కళ. నృత్యానికి సంగీతం అనేది ఒక అలంకారం కావచ్చు. ప్రాణం మాత్రం కానవసరం లేదు. అలంకారం లేకపోయినా నృత్యానికి సహజ సౌందర్యం ఉన్నది. అందంగా ఉండడానికి అలంకరించుకోవచ్చు... కేవలం అలంకారం వల్ల అందం రాదు. ప్రపంచంలో ఏదేశంలోనూ నృత్యం సంగీతంపై ఇంతగా ఆధారపడటం లేదు.

సహజ సౌందర్యం

సంగీతం లేని శుద్ధ నృత్తం సుందరంగా ఉంటుందనడానికి ఒక ప్రయోగం చేసి చూడండి. గాత్రసంగీతం, వాద్యసంగీతం హంగులన్నింటితో ఒక భరతనాట్య ప్రదర్శనను చిత్రీకరించి ప్రదర్శించండి. కాస్తాగి సౌండ్ ట్రాక్ తీసేసి చూడండి. అప్పటికీ నృత్యం దర్శనీయంగా, రసానందదాయకంగా ఉంటుంది. ఆ మిగిలిన నృత్యాన్ని ఒక నీడగా చూపించండి. ఆ నీడ కదులుతున్న దృశ్యమే అందంగా ఉంటుంది. అంటే ఆహార్యాభినయం, సాత్వికాభినయం, వాచికాభినయం కూడా లేకపోయినా, కేవలం ఆంగికాభినయమే సుందరంగా ఉంటుంది. అది 'శుద్ధ నృత్యం' (ప్యూర్ డాన్స్). నార్మన్ మెక్లారెన్ అనే కెనడా సినీ దర్శకుడు 'పాడే డు' అనే ఒక చిన్న పదినిమిషాల చిత్రాన్ని పూర్తిగా బాలే నృత్యంతో తీశాడు. ఒక నర్తకి, నర్తకుడు బాలే సంప్రదాయం ప్రకారం ఒంటికి అంటుకుని ఉండే బిగుతు దుస్తులతో, దాదాపు నగ్నంగా కనిపిస్తూ, రకరకాల భంగిమలతో నాట్యం చేస్తారు. ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ తో ఇంద్రజాలంతో దర్శకుడు ఆ నాట్య సౌందర్యాన్ని అద్భుతంగా చిత్రీకరించాడు. నర్తకీ నర్తకుల ముఖాలు, దేహాలు కూడా కనిపించకుండా, వారి దేహం అంచులు మాత్రం రేఖలవలె కనిపించేటట్లుగా చిత్రీకరించి, ఆ రేఖల చాలన విన్యాసంలోని సౌందర్యాన్ని చూపించాడు. దానికి నేపథ్య సంగీతం ఉన్నది. కాని, అది లేకుండా చూసినా గొప్పగా ఉంటుంది. అది శుద్ధ నర్తనరీతికి ఉదాహరణ.

"అసలు-సంగీతం ఉంటే ఇప్పుడు వచ్చిన నష్టం ఏముంది? సంగీతాన్ని ఎందుకు తొలగించాలి?" అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. సంగీతంతో కూడిన సాంప్రదాయిక నృత్య ప్రదర్శనలను కొనసాగించవచ్చు; కొనసాగించవలసిందే. పాత సంప్రదాయాలలో మార్పులు చేయనక్కరలేదు. కాని, కొత్త సంప్రదాయాలను సృష్టించవచ్చు. కొత్త రీతులను సృష్టించవచ్చు. అలా సృష్టిస్తే కళ విస్తృతమవుతుంది. భరతనాట్యానికి ఒక 'ఇడియం' ఉంది. కూచిపూడికీ ఒక 'ఇడియం' ఉంది. ఆ 'ఇడియం'ను తీసుకుని, సంగీతంలోని 'సద్యఃకల్పన' లక్షణాన్ని తీసుకుని నాట్య కళాకారులు, నాట్యకళకు ఎక్కువ స్వేచ్ఛను, వైవిధ్యాన్ని, ఆకర్షణను సంతరించి పెట్టవచ్చు. నటరాజ రామకృష్ణ గారు పరిశోధన చేసి పేరిణి తాండవ రీతిని పునరుద్ధరించారు. అటువంటి పరిశోధనల ద్వారా కాలగర్భంలో కలసిపోయిన అపురూప నర్తన రీతులను పునరుద్ధరించి, నాట్య కళను సంపన్నం చేయాలి.

ప్రపంచ విఖ్యాత నర్తకుడు ఉదయశంకర్ భారతీయ నృత్యరీతులన్నింటిని అభ్యసించి, అధ్యయనం చేసి, విప్లవాత్మకమైన ప్రయోగాలెన్నో చేశారు. ఆ ప్రయోగాల ద్వారా 40 ఏండ్ల క్రిందటే ఆయన నాట్యకళా రంగంలో నవచైతన్యాన్ని సాధించారు. భారతీయ నృత్య సామ్రాజ్య విస్తృతికి ఆయన చేసినంత కృషి మరెవ్వరూ చేయలేదు. ఆ తర్వాత అడయార్ 'కళాక్షేత్ర' వారు కూడా కొత్త కొత్త నృత్య నాటకాలను తయారు చేసి, ప్రచారం చేశారు. వెంపటి చినసత్యం గారు 'విప్రనారాయణ', 'క్షీరసాగర మధనం' నృత్య నాటకాలను తయారు చేశారు. నటరాజ రామకృష్ణ గారు కూడా కొత్త నృత్య నాటకాలు సృష్టించారు. కాని, వీరి ప్రయోగాలలో సద్యఃకల్పనకు స్థానం లేదు. సంగీతంలో వలె నృత్యంలో సధ్యఃకల్పనకు గల అవకాశాన్ని మన నాట్యాచార్యులు పరిశీలించాలి. భావనచేసి, దాని కొక శాస్త్రీయమైన స్వరూపాన్ని ఇవ్వాలి. అటువంటి నర్తనరీతి వల్ల కళాకారుల ప్రతిభా వ్యక్తీకరణకు విశేషమైన స్వేచ్ఛలభిస్తుంది. వర్ష మేఘాలను చూసి పురివిప్పిన నెమలి లాగా హాయిగా, స్వేచ్ఛగా, సహజంగా నృత్యం చేయగలుగుతారు.

ప్రభుత్వ కర్తవ్యం

నాట్యకళా ప్రచారానికి వ్యక్తిగతంగా కళాకారులు చేయగలిగిన దానికంటే ప్రభుత్వం, అకాడమీ చేయగలిగింది, చేయవలసింది చాలా ఎక్కువ. కాని, ఇంతవరకు సంగీత నాటక అకాడమీ వల్ల జరిగిన దోహదం పూజ్యమనే చెప్పాలి. వ్యక్తిగతంగా వెంపటి చినసత్యంగారు, నటరాజ రామకృష్ణగారు చేసిన కృషిలో పదోవంతు కూడా అకాడమీ చేయలేదు. ముఖ్యంగా అకాడమీ చేయవలసినపని-తెలుగుదేశంలోని శాస్త్రీయ, జానపద నాట్యరీతులన్నింటి గురించి చిన్న చిన్న డాక్యుమెంటరీ చిత్రాలు తీయించడం. కేంద్ర సంగీత నాటక అకాడమీ 'కథకళి'పై ఒక కలర్ ఫిలిం నిర్మించింది. ఫిల్మ్స్ డివిజన్ 'కూచిపూడి'పై ఒక డాక్యుమెంటరీ తీసింది. అటువంటి చిత్రాలు ప్రచారానికి చాలా అవసరం. వాటి 16 ఎం.ఎం. ప్రింట్లు విరివిగా తీయించి అన్ని కళాశాలల్లో విద్యార్థులకు చూపించడం అవసరం. ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలలోనూ నాటకశాలలు నిర్మించాలని సంకల్పించింది. అవి సిద్ధమైతే నాట్య ప్రదర్శనలకు చాలా అనుకూలంగా ఉంటాయి.

రాష్ట్ర ప్రభుత్వం గాని, సంగీత నాటక అకాడమీ గాని జిల్లా కేంద్రాలన్నింటిలోనూ సంగీత నృత్య పాఠశాలలను నిర్వహించడం అవసరం. ముఖ్యంగా కూచిపూడి నృత్యం నేర్పడానికి ఎక్కువ అవకాశాలు కల్పించడం అవసరం.

నండూరి పార్థసారథి
(1976 జూలై 18వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post Next Post