Humor Icon

కన్ను పొడుచుకున్నా కనిపించని కటిక చీకటి...

చీమ చిటుక్కుమన్నా వినిపించే భయంకర నిశ్శబ్దం రాజ్యం చేస్తున్నది.

తప్పతాగినట్లు ఒళ్లు మరచి నిద్రిస్తున్న నగరంలో నిశాకన్య జుట్టు విరబోసుకుని విలయతాండవం చేస్తున్నది.

వీధులు నిర్మానుష్యంగా వున్నాయి.

గాలి స్తంభించిపోయింది... ఆకు అల్లల్లాడడం లేదు.

ఠంగ్.... ఠంగ్... ఠంగ్...

అమావాస్య నాటి నిస్తబ్ద నీరవ నిశీధిలో గాఢ నిశ్శబ్దాన్ని చీలుస్తూ టవర్ క్లాక్ పన్నెండు గంటలు కొట్టింది.

అంతే... మళ్ళీ అంతా నిశ్శబ్దం....

ప్రకృతి రహస్యపు దుప్పటిలో దాక్కుంది....

ఆ సమయంలో ఏం జరిగినా ఎవరికీ ఏమీ తెలియదు, ఏమీ వినిపించదు. ఎన్ని దారుణాలు జరిగినా, కిరాతకాలు జరిగినా అడ్డుపడే నాధుడు లేడు.

ఆ క్షణంలో నగరంలో... ఎన్ని హత్యలు, ఎన్ని మానభంగాలు, మరెన్ని దోపిడీలు, దౌర్జన్యాలు జరిగాయో ఎవరికి తెలుసు?

తెల్లవారేవరకు అంతా గప్ చిప్...

బెడ్ లైట్ మసకకాంతిలో చలనం లేని ప్రతిమలా కూర్చున్నాడు ప్రకాశరావు... అతడి ఎదుట... రక్తంలో నిర్జీవంగా ఒక జీవి... కొద్ది క్షణాల క్రితం జరిగిన ఒక దారుణ కృత్యానికి సాక్షులుగా రక్తసిక్తమైన అతడి హస్తాలు... అతడి గుండెల్లో వేయిరైళ్లు పరుగెడుతున్నాయి. మస్తిష్కంలో మహాగ్ని గోళాలు ప్రజ్వరిల్లుతున్నాయి. అంతరాత్మ శత సహస్ర శూలాలతో పొడుస్తున్నది...

హత్య.....

ఏమిటిది? ఏం జరిగింది?.... తనేనా ఈ పని చేసింది?.... ఏనాడూ ఒక్క చీమనైనా చంపని అహింసా మూర్తి... రోడ్డు పక్క ఏదైనా కుక్క దెబ్బ తగిలి కుంటుతుంటే చూడలేని తాను... ఇంత ఘోరానికి ఎలా ఒడిగట్టాడు?.... క్షణికోద్రేకానికి లోనై ఎంత పని చేశాడు... ఇంత హేయమైన పని భగవంతుడు తనచేత ఎందుకు చేయించాడు?.... అసలు ఇదంతా నిజమేనా? కలా? కల అయితే ఎంత బావుండును!

ఉహూఁ కాదు... ఇది నిజం... నమ్మడానికి వీల్లేని కటిక చేదు నిజం....

ఆలోచనలతో ప్రకాశరావు తల పగిలిపోతోంది. కళ్ళ ఎదుట రక్తం. రక్త పంకిలమైన హస్తద్వయం.... హహ్హహ్హహ్హ.... ఆదర్శాలను పరిహసిస్తూ అంతరాత్మ వికటాట్టహాసం...

ఊ.... ఊ... ఊ....

అరిష్ట సూచకంగా వీధి మొగలో దిక్కు మాలిన కుక్క మోర పైకెత్తి ఏడుస్తున్నది. దానితో శ్రుతి కలుపుతూ ఎక్కడో నక్క ఊళవేసింది.... పక్క ఇంటి పిట్టగోడ మీద రెండు జంగురు పిల్లులు భీకరంగా అరుస్తూ పోట్లాడుకుంటున్నాయి. జువ్విచెట్టుపై తీతూ పిట్ట కూస్తున్నది.

ప్రకాశరావు అప్రయత్నంగా తలఎత్తాడు... "నీ పాపకృత్యాన్ని నేను చూశానులే" అన్నట్లు భయపెడుతూ మర్రిచెట్టు తొర్రలోంచి మిర్రిమిర్రి చూస్తున్న గుడ్లగూబ కళ్ళు కిటికీలోంచి కనిపించాయి. ఒళ్ళు జలదరించింది....

ఉహూఁ.... తన పాపానికి నిష్కృతి లేదు. భగవంతుడు కూడా తనను క్షమించలేడు. హృదయం వున్న ఏ మానవుడూ చేయలేని పని చేశాడు తను... అవును... తనకు హృదయం లేదు. తాను మనిషికాదు... పాషాణం... కాదు రాక్షసుడు. లేకపోతే... తన రక్తంలో రక్తం పంచుకున్న ఒక జీవిని... ఇంత నిర్దాక్షిణ్యంగా హత్య చేయలేడు...

"నువ్వు హంతకుడివి... హంత... హం..."

అంతరాత్మ పొడిచి పొడిచి హింసిస్తున్నది....

అవును... తన రక్తంలో రక్తం... ప్రాణంలో ప్రాణం... తనతో కలిసి జీవించింది... తన తోడిదే జీవిత మనుకున్నది... తనపైనే ఆధారపడింది... తను లేకపోతే బ్రతుకేలేదనుకున్నది... తను తప్ప వేరే ప్రపంచమే ఎరుగనిది. దేవుడు కూడా విడదీయలేని రక్త సంబంధం తమది... అవును రక్తసంబంధం...

ఈనాటితో... ఈ రాత్రితో ఋణం తీరిపోయింది... చేజేతులా ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. ఆ అనుబంధాన్ని త్రెంచివేశాడు.

బాధగా మూలిగాడు ప్రకాశరావు.

".... ఇదే రక్తసంబంధం"

మధ్యాహ్నం రేడియోలో విన్నపాట పదే పదే జ్ఞాపకం వస్తున్నది.... మనస్సును పిండి పిప్పి చేస్తున్నది...

 నీలో నాలో ఒకటే రక్తం....
 నీది నాదీ ఒకటే ప్రాణం....

....మరొక పాట... మనసును రంపపు కోత కోస్తున్నది... భారంగా నిట్టూర్చాడు ప్రకాశరావు.

ఎంత బాధపడినా... వేదనతో మనస్సు వేగి పోయినా... పోయిన ప్రాణం తిరిగి రాదు... ఒక పీడకలగా మరచిపోవాలి... మనస్సును రాయి చేసుకోవాలి..... జీవితంలో యిట్టి క్షణికోద్రేకానికి... గురి కాకుండా నిగ్రహించుకోవాలి. అంతే... తను చేయగల్గిందీ, చేయవలసిందీ అదే...

తనను ఎంతో బాధించింది... నిజమే.... నిద్రలేకుండ చేసింది. అయినా అంత బాధను తాను చిరునవ్వుతో సహించాడు యిన్నాళ్ళు.... ఎన్నడూ సహనాన్ని కోల్పోలేదు. కోపాన్ని దరిజేర నివ్వలేదు.... తన సుఖాన్ని త్యాగం చేశాడు... రక్తాన్ని ధారపోశాడు.

కానీ ఈ రోజు ఎందుకో నిగ్రహించుకోలేక పోయాడు... మొదటి ఆట మంచి రొమాంటిక్ ఇంగ్లీష్ పిక్చర్ చూసివచ్చాడుతను... కన్ను మూసుకున్నాడో లేదో నిద్రాదేవి బిగికౌగిట్లో బంధింపబడ్డాడు. అతి సుందర స్వప్నంలో... హీరోయిన్ తో... శృంగారం... పతాకస్థాయి నందుకుంటున్న దశలో... దారుణంగా కుట్టింది.... అంతే ఉద్రేకం కట్టలు త్రెంచుకోగా... ఒక్క ఉదుటున లేచి, కసిదీర నేలరాచి వేశాడు... జీవితంలో ఎన్నడు దొరకని అవకాశం అప్పుడు దొరికింది. స్వార్థాన్ని అడ్డుకున్న నల్లినైనా సహించలేని మానవుని సహజ గుణంలోంచి ప్రకాశరావు ఒక క్షణం నిద్రలేచి కలలోకి కరిగిపోవడానికి హత్యచేశాడు.

నండూరి పార్థసారథి
(1972 జూలైలో 'తరుణ' మాసపత్రికలో ప్రచురితమైనది)

Previous Post Next Post