మాండలిన్ మధురస్వరాల ముత్యాల ముగ్గు

హిందూస్థానీ శాస్త్రీయ వాద్య సంగీత రంగంలో పన్నాలాల్, విలాయత్, రవిశంకర్, బిస్మిలా, అలీ అక్బర్ వంటి హేమాహేమీల సరసన సరికొత్తగా చేరిన విశిష్ట విద్వాంసుడు ఉస్తాద్ సజ్జాద్ హుస్సేన్.

కేవలం జానపద సంగీత వాద్యంగా ఉన్న వేణువుకు కొత్త రూపం, కొత్త నాదం కొత్త ఊపిరి ఇచ్చి శాస్త్రీయవాద్యంగా పునర్జన్మ ప్రసాదించాడు పన్నాలాల్ ఘోష్. మంగళవాద్యంగా దేవాలయాలకు, శుభకార్యాలకు పరిమితమైపోయిన శహనాయికి 'బాండెడ్ లేబర్' నుంచి విముక్తి ప్రసాదించి, కచేరీ గౌరవం కల్పించాడు బిస్మిల్లా ఖాన్.

'గాయకీ అంగ్'ను ప్రవేశపెట్టి సితార్ కొక కొత్త 'డైమన్షన్' ఇచ్చాడు విలాయత్ ఖాన్.

కాలక్షేప కూనరాగాలు మీటుకోవడానికి తప్ప ఎందుకూ పనికి రాదనుకొన్న మాండలిన్ కు శాస్త్రీయ సంగీత వేదికపై ఘనపట్టాభిషేకం చేసి, బడాబడా బడేగులాముల సలాము లందుకున్నవాడు సజ్జాద్ హుస్సేన్.

"మాండలిన్ పై సజ్జాద్ హుస్సేన్ వాయించే తానాల వేగం నమ్మశక్యం కానంత అద్భుతంగా ఉంటుంది. మరెవ్వరూ అనుకరించలేనిది ఆయన శైలి" అని ఖాన్ సాహెబ్ బడే గులాం అలీఖాన్ జోహారులర్పించారు.

పన్నాలాల్ కు వేణువు. బిస్మిల్లాకు శహనాయి ఎంతగా ఋణపడి ఉన్నాయో మాండలిన్ సజ్జాద్ కు అంతగా ఋణపడివుంది.

సజ్జాద్ సినిమా సంగీతం నుంచి కాందిశీకుడుగా శాస్త్రీయ సంగీతానికి వలస వచ్చాడు. అటు సినిమా సంగీతంలోను. ఇటు శాస్త్రీయ సంగీతంలోను కూడా ఆయనది 'హైబ్రో' సంగీతం. సినిమారంగంలో ఆయన రాణించలేక పోవడానికి బహుశా ఆదొక కారణం కావచ్చు. ప్రజాదరణ పొందిన అగ్రశ్రేణి సంగీత దర్శకులు ఆయనకు "హాట్సాప్" అన్నారు. లత, తలత్, సురయ్యా వంటివారు ఆయన సంగీత దర్శకత్వంలో పాడడం గర్వకారణంగా భావించారు. అయినా సినిమా రంగంలో ఆయనకు నిలవనీడ లేకపోయింది, 'దోస్త్', 'సంగ్ దిల్', 'రుస్తుమ్ సొహ్రాబ్' వంటి మిక్కిలి కొద్ది చిత్రాలతోనే ఆయన ఆ రంగం నుంచి నిష్క్రమించవలసి వచ్చింది. 'ఏ హవా యేరాత్ యే చాందిని' (సంగ్ దిల్) 'ఏ దిల్ రుబా' (రుస్తుం సొహ్రాబ్) వంటి పాటలు ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ మధుర మధురంగా జ్ఞాపకం వస్తూ ఉంటాయి.

సినిమారంగం మీద 'కక్ష' సాధించడానికి అన్నట్లు ఆయన శాస్త్రీయ సంగీత తపస్సు ప్రారంభించారు. తన ఆయుధంగా సితార్, సరోద్ వంటి ప్రసిద్ధ వాద్యాలను కాక-అనామకమైన మాండలిన్ ను ఒక సవాలుగా స్వీకరించారు. సరిగా పన్నాలాల్ ఘోష్ కూడా ఇలాగే సినిమా రంగంలో చెల్లక శాస్త్రీయ సంగీతంలో విజృంభించాడు. సజ్జాద్ మాండలిన్ కు కీర్తి తీసుకు రావడానికే పుట్టారు. అయితే ఆ సంగతి ఆయన చాలా ఆలస్యంగా గుర్తిండం ఆయన దురదృష్టం. మన దురదృష్టం. మాండలిన్ దురదృష్టం. ఆయన మాండలిన్ కచేరీలు ఈ మధ్యనే ప్రారంభించారు.

మంద్రస్థాయిలో 'మీండ్'కు ప్రాధాన్యంగల అతి గంభీరమైన 'దర్బారీ' వంటి రాగాలను, లాలిత్యానికి ప్రాధాన్యం గల 'పీలూ', 'ఖమాస్' వంటి శృంగార రాగాలను కూడా ఆయన సమానమైన అధికారంతో అద్భుతంగా వాయిస్తారు.

'ముత్యాలముగ్గు' చిత్రంలో ఆయన తన మాండలిన్ సంగీత మాధుర్యాన్ని వాచవిగా 'శివరంజిని' రాగంలో చిరస్మరణీయంగా వినిపించారు.

నండూరి పార్థసారథి
(1978 ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post