Title Picture

మిస్ చేయకూడని చిత్రం

ఏ దేశంలోనైనా, ఏ భాషలోనైనా రాజకీయ చిత్రాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అటువంటివి ఆర్థికంగా విజయవంతం కావడమూ అరుదే. వర్తమాన రాజకీయ చర్రిత నేపథ్యంలో చలన చిత్రాలు నిర్మిస్తూ ఆర్థికంగా కూడా నెగ్గుకొస్తున్న ఉత్తమ దర్శకుడు కాన్ స్టంట్లెన్ కోస్టా గవ్రాస్. ఆయన ఇప్పటి దాకా తీసిన ఐదు చిత్రాలు- 'జడ్', 'కన్సెషన్', 'స్టేట్ ఆఫ్ సీజ్', ' స్పెషల్ కనెక్షన్', 'మిస్సింగ్' రాజకీయ సంఘటనల నేపథ్యంతో తీసినవే. ఆమెరికాలో మూడు సంవత్సరాల క్రిందటే విడుదలైన 'మిస్సింగ్' చిత్రం ఇప్పుడు ఇండియాకు వచ్చింది. అమెరికా రాజకీయంగానో, సైనికంగానో, బాహాటంగానో, ప్రచ్ఛన్నంగానో బడుగు దేశాల వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్న సంగతి, తనకు అనుకూలంగాలేని ప్రభుత్వాలను కూలదోసి, తనకు తొత్తులుగా ఉండే పాలకులను ప్రతిష్ఠిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. చిలీలో 1973లో జరిగిన సైనిక తిరుగుబాటులో అమెరికా పాత్ర ఉన్నదని ఈ చిత్రం అన్యాపదేశంగా ఆరోపిస్తుంది.

చిలీలో తిరుగుబాటు జరిగినప్పుడు నిజంగా సంభవించిన ఒకానొక సంఘటన ఆధారంగా ఈ చిత్రకథను తయారుచేశారు. చిలీలో నివసిస్తున్న ఒక అమెరికన్ యువకుడు చార్లెస్ ఉన్నట్టుండి ఒక రోజు మాయమైపోయాడు. సైనికులు వీధుల్లో స్వైర విహారం చేస్తూ పిచ్చెక్కినట్లు ప్రజలను కాల్చి చంపుతున్నారు. కొందరిని అరెస్టు చేస్తున్నారు. కొందరిని సోదా చేసి ప్రశ్నించి వదిలేస్తున్నారు. ఇళ్లలోకి చొరబడి సామాన్లు ధ్వంసం చేసి వెడుతున్నారు. చార్లెస్ ఏమైపోయాడోనని అతడి భార్య ఆందోళన పడుతుంది. అతడిని అరెస్టు చేశారా, చంపేశారా, ఎక్కడైనా దాక్కున్నాడా అనేది తెలీక కంగారుపడుతుంది. కొడుకు సంగతి తెలుసుకోవడానికి చార్లెస్ తండ్రి ఎడ్మండ్ హార్మన్ న్యూయార్క్ నుంచి వస్తాడు. కోడలిని తీసుకుని ఆమెరికా రాయబార కార్యాలయానికి వెళ్లి అధికారుల సహాయాన్ని అర్థిస్తారు. అధికారులు సానుభూతి వాక్యాలు వల్లించడం తప్ప ఇంకేమీ చేయరు. దర్యాప్తు చేస్తున్నామనీ, శాయశక్తులా ప్రయత్నిస్తున్నామనీ కొంచెం టైము పడుతుందనీ చెపుతూ కాలయాపన చేయడం తప్ప వారింకేమీ చేయరు. తండ్రికి, కోడలికి రోజు రోజుకీ ఆందోళన పెరుగుతూ ఉంటుంది. తమకు సాధ్యమైనంత మేరకు వారు కూడా దర్యాప్తు చేస్తూ ఉంటారు. చార్లెస్ ను సైనికులు అరెస్టు చేసి తీసుకుపోయారని స్వయంగా చూసినవారు చెప్పారు. అతడిని కాల్చివేసి ఉంటారని హార్మన్ అనుమానం. అయినా ఇంకా ఏదో ఆశ పీకుతూ ఉంటుంది. రాయబార కార్యాలయం వారి అనుమతి తీసుకుని అతడు కోడలితో పాటు ఆసుపత్రులకు వెళ్ళి క్షతగాత్రులందరినీ చూస్తాడు. కాల్పులలో మరణించిన వారి శవాలున్న కొట్టానికి వెళ్ళి శవాల మధ్య కొడుకు కోసం వెతుకుతాడు. కొడుకు జాడతెలియదు. చివరికి ఒక వ్యక్తి ద్వారా అసలు సంగతి తెలుస్తుంది. అరెస్టు చేసిన మూడో రోజునే చార్లెస్ ను ఒక స్టేడియంలో ఉరితీశారని ఆ వ్యక్తి చెప్పాడు. విదేశీయుడిని, అందులోనూ అమెరికా పౌరుడిని ఆ విధంగా ఉరి తీశారంటే అమెరికా రాయబార కార్యాలయానికి తెలీకుండా, పరోక్షంగానైనా వారి అనుమతి లేకుండా అతనికి అలా జరగడానికి వీల్లేదని కూడా ఆ వ్యక్తి చెప్పాడు. తన పౌరులకు రక్షణ కల్పించవలసిన బాధ్యతగల అమెరికా ప్రభుత్వమే తన పౌరులలో ఒకడిని ఉరి తీయడానికి అనుమతించిందంటే అందుకు కారణం ఏమై ఉంటుంది? సైనిక తిరుబాటు వెనుక అమెరికా పాత్ర ఏమిటో చార్లెస్ కు తెలుసు. అతడు లెఫ్టిస్ట్ భావాలుగలవాడు. అటువంటి వ్యక్తి బతికుండడం అమెరికా ప్రభుత్వానికి శ్రేయస్కరంకాదు. ఇదంతా నిక్సన్ హయాంలో జరిగిన కథ.

Picture
జాక్ లెమన్, సిస్సీ స్పేసెక్

దర్శకుడు ఈ కథ చిలీలో జరిగినట్లు ఎక్కడా వాచ్యంగా చెప్పలేదు. ప్రపంచంలో ఎక్కడైనా జరిగి ఉండవచ్చు. విదేశాలతో అమెరికా ప్రభుత్వం ఆడుతున్న నాటకాన్ని కపట నీతిని బైట పెట్టడం ఈ చిత్రం లక్ష్యం. హార్మన్ గా జాక్ లెమన్, చార్లెస్ గా షియా, కోడలుగా సిస్సీ స్పేసెక్ నటించారు. జాక్ లెమన్ నటన ఈ చిత్రంలో అత్యున్నత స్థాయిలో ఉంది. బహుశా అతని నట జీవితానికి అదే పరాకాష్ఠ. ఈ చిత్రంలో నటనకు గాను అతనికి ఆస్కార్ నామినేషన్ కూడా వచ్చింది. అయితే చివరికి ఆస్కార్ అవార్డు మాత్రం గాంధి పాత్ర ధారి బెన్ కింగ్ స్లే కి లభించింది.

చిత్రం నిడివి కొంచెం ఎక్కువే అయినా అనవసరమైన సన్నివేశాలు ఎక్కడా లేవు. ఆద్యంతం ఉత్కంఠను సమర్థంగా పోషించారు దర్శకుడు.

అమెరికా విదేశాంగ నీతి ఎంత తుచ్ఛమైనదైనా ఈ చిత్రానికి వారు అభ్యంతరం చెప్పకపోవడమే గొప్ప విషయం. మన దేశంలో అయితే ప్రభుత్వాన్ని దుయ్యబట్టే అటువంటి చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ లభించి ఉండేది కాదు. బహుశా ప్రపంచంలో మరే దేశంలో లేనంత భావ ప్రకటన స్వేచ్ఛ అమెరికా ప్రజాస్వామ్యంలో ఉన్నదనడానికి ఈ చిత్రం ఒక నిదర్శనం.

నండూరి పార్థసారథి
(1985 నవంబర్ 11వ తేదీన ఆంధ్రప్రభ బెంగళూరు ఎడిషన్ లో ప్రచురితమయింది.)

Previous Post Next Post