Title Picture

రామమోహనరావు గారు కథానికగా రాసిన (బహుశా) ఒకే ఒక్క రచన ఇది.
-నం.పా.సా

నాకు కర్నాటక సంగీతమంటేనూ, అందులో ముఖ్యంగా త్యాగరాజ కృతులంటేనూ భక్తి కలిగించిన వ్యక్తి మా లలిత పిన్ని ఒక్కతే. అదివరలో త్యాగరాజ కృతులు చాలామంది పాడగా విన్నాను. ఎక్కువగా అయ్యర్లనోట విన్నానేమో, అవంటే నాకు పరమ అసహ్యం పుట్టుకొచ్చేది. 'శాస్త్రకట్టు' సంగీతమంటే సరిగమల తోముడు తప్ప మరేమీ లేదనే దురభిప్రాయంలో పడ్డాను.

లలిత పిన్ని నాకంటె రెండేళ్లు చిన్న. ఆవిడకి పెళ్లికాకముందు ఏడాది కొకసారైనా మా యింటికి వచ్చేది. మా యింట్లో ఉన్న పాతహార్మోనియం వాయిస్తూ పాడేది. మొదటిసారిగా నేను ఆమె నోటివెంట 'సంగీతజ్ఞానము భక్తివినా' అనే కృతి విన్నాను. లలిత పిన్ని సంగీతం పాడుతుందని నాకు తెలియదు. ఆమె పాట వినే సరికి సంగీతమంటే ఇదని నాకు మొదటిసారిగా తెలిసింది. అదివరకు నేనెన్నోసార్లు విని విసుగెత్తిన కృతులే ఆమె కంఠంలో కొత్త అర్థాలు వ్యక్తం చేసేవి.

"పిన్నీ! ఇంత చిన్నతనంలో ఇంత గొప్ప సంగీతం ఎక్కడ నేర్చావు?" అని నేనడిగితే, "నిజంగా అంత బావుందా నా పాట?" అని అమాయికంగా అన్నది. నిజానికి ఆమెకా సంగీతం నేర్చుకుంటే వచ్చిందని నేను నమ్మను. ఆమెకి మా తాత గారు సంగీతం మేష్టరును పెట్టి వీణ నేర్పించారు. కాని ఆమె వేసే స్వరాలు, సంగతులు ఇదివరకెక్కడా నేను వినలేదు. అయినా ప్రతిస్వరం అదివరకే పరిచితం, సన్నిహితం అయినట్లుగా నాలో కరిగిపోయేది. తరవాత కొన్నేళ్ళకి ఫిడేలునాయుడు గారి గానం విన్న తరవాత గాని మా పిన్ని కంఠానికి సరియైన ఉపమానం దొరకలేదు.

ప్రతి వేసవికాలం సెలవులకీ మా అమ్మమ్మగారి వూరు వెళ్లేవాణ్ణి. చాలాసార్లు ఆరుబయట వెన్నెల్లో కూర్చుని ఆమె వీణవాయిస్తూ పాడుతుంటే విన్నాను.

"ఒరేనువ్వు పాడరాదురా, అస్తమానమూ నన్ను పాడమనకపోతే?" అని ఒకసారి నవ్వుతూ అడిగింది పిన్ని.

"సరి సరి, నువ్వు పాడింతరవాత గొంతెత్తటానికి ఎన్ని గుండెలుండాలి?" అన్నాను.

కాలేజీలో స్నేహితులముందు సినిమా టుమ్రీలు పాడి గర్వపడే నేను మా పిన్ని ముందు కంఠమెత్తటానికి కూడా జడిసేవాణ్ణి.

"ఒక్క సినిమా పాట పాడరా, వినాలనుంది. ఆయనెవరు సైగలా, ఎవరో? ఆయనపాట వినిపించు", అని బలవంతం చేసింది పిన్ని.

చివరికి పాడక తప్పింది కాదు. కాని రెండు చరణాలు పాడానో లేదో, పిన్ని పాట తలపుకు వచ్చి, సిగ్గుపడి ఆపేశాను.

"పిన్నీ! ఇప్పుడు కాదు. తరువాతెప్పుడన్నా పాడతానులే. నీ పాట నా చెవుల్లో మోగుతున్నంతసేపూ నేను పాడటం అసాధ్యం" అన్నాను.

ఆమె పాడిన కృతులు సముద్రమంత విశాలమూ, అగాధమూ అయినవి. నా పాటలు పిల్ల కాలవల్లాంటివి. పిల్లకాలవల్లో సౌందర్యం లేకపోలేదు. కాని సముద్రం ముందు కాదు వాటి దర్పం.

మా పిన్ని కొంచెం చామనచాయగా ఉన్నా, కళా కాంతీ ఉట్టిపడే ముఖం. ఆమె ఎక్కడ ఉన్నా సరే ఆ చోటుకి ఒక నిండు, శోభ వచ్చేది. ఎక్కడో దూరాలకు చూస్తున్నట్టుగా ఉండేవి ఆమె విశాలమైన కోలకళ్లు. బరువుగా అడుగులు వేస్తూ, నిదానంగా నడిచేది. మాటకూడా నిదానంగా, సౌమ్యంగా ఉండేది. ఆమెకి కోపం రావటం గాని, తొందరపడటం గాని నేనెప్పుడూ చూడలేదు.

ఆమె వ్యక్తిత్వంలోని గొప్పతనమంతా ఆమె సంగీతంలో ప్రతిఫలించేది.

ఆమె నాకంటే రెండేళ్లు చిన్నది కావటం వల్లనేమో మొదట్లో "పిన్నీ!" అని పిలుస్తుంటే ఏమిటోగా ఉండేది. కాని ఆమె పాట విన్నప్పుడల్లా ఆమె దగ్గర చంటి పిల్లాడివలె అయిపోయేవాణ్ణి. ఆమెని ఆమె సంగీతం నుండి వేరుగా చూడలేకపోయాను. ఆమె కళాప్రతిభ మీద నాకుండే ఆరాధనే ఆమె మీద కూడా ప్రసరించేది.

సముద్రతీరాన ఒంటరిగా విశాలాకాశం కింద నిలబడినప్పుడు మానవుడికి తన అల్పత్వం గోచరిస్తుంది.

ఎప్పుడూ మేమిద్దరం కలిసి తిరిగే వాళ్లం. మా దొడ్లో జామచెట్టెక్కి ఆమెకి పళ్లు కోసిపెట్టేవాణ్ణి. సెలవులికి వచ్చినప్పుడల్లా ఏవో కథల పత్రికలూ, నవలలు తెచ్చి చదివించేవాణ్ణి, కొత్తగా చూసిన సినిమా కథలు, పాటలు వినిపించేవాణ్ణి, నాకు ఆమె కృతులు నేర్పేటట్టు, నేనామెకి సినిమా పాటలు నేర్పేటట్టు ఒడంబడిక చేసుకున్నాం. కాని నాకు ఆ స్వరాలు నోరు తిరిగేవే కావు. ఆమె నా సినిమా పాటల్ని ఎంత నేర్చుకున్నా ఎక్కడో కర్ణాటకబాణీ దొర్లేది. దాంతో మా ఒడంబడిక రద్దు చేసుకున్నాం.

2

నైజాములో ఏదో పల్లెటూరి సంబంధం వెదికి మా పిన్నికి పెళ్లి చేశారు. ఆమె అత్తవారు చాలా భాగ్యవంతులు, ఆమె భర్తకి పాతికేళ్లుంటాయి. కొత్తగా కరిణీకంలో ప్రవేశించాడు. సాంప్రదాయం గల కుటుంబమనీ, డబ్బున్నవాళ్లనీ మా తాతగారు ఆ సంబంధం చేశారు. లలిత పిన్ని ఆ మారుమూల పల్లెటూరికి కాపరానికి వెళ్లిపోయింది.

వెళ్లిన కొత్తలో ఆమెని అత్తవారు మూడు నాలుగు సార్లు పుట్టింటికి పంపించారు గాని తరవాత క్రమంగా మానివేశారు. నేనొక సారి కాలేజీ నుంచి పెద్ద ఉత్తరం రాశానామెకి "పిన్నీ! నీ సంగీతం ఎప్పటికీ మర్చిపోలేను; నీ కంఠంలాంటి కంఠం నాకు మళ్లీ వినబడలేదు. నువ్వు నా ఆరాధ్య దేవతవి" అని. ఆ కవర్లోనే నా అడ్రసు రాసి మరోకవరు కూడా వుంచాను, ఆమె సమాధానం రాయటానికి పనికొస్తుందిగదా అని, దాని కామె సమాధానం రాయలేదు అప్పటికీ, యిప్పటికీ.

నాలుగైదేళ్ళ తరవాత గావును, మా అమ్మ ఒకసారి చెప్పింది పిన్ని సంగతి.

"విన్నావురా? లలితమ్మని దాని అత్తారు నానా బాధా పెడుతున్నారుట". "ఏమో మరీ, కొత్తలో దాన్ని బాగానే చూశారు. తరవాత వాళ్లకేం పోయేకాలం వచ్చిందోమరి? పాపం లలితమ్మ ఆ లంకలో ఎన్ని కష్టాలు పడుతున్నదో? ఎప్పుడన్నా వెళ్లి చూద్దామంటే దగ్గిరా దాపా?"

"నేనోసారి వెళ్లి చూసొస్తానే, అమ్మా! లలిత పిన్నిని చూసి చాలా ఏళ్లయింది".

"సరేలే. నువ్వు వెళ్ళటంకూడానా! వాళ్లసలే దానిపై లేనిపోని అపనిందలు మోపి హింస పెడుతున్నారు. వీళ్ల అనుమానాలూ, వీళ్లూ విరగడైపోనూ" అని అమ్మ లోపలికి వెళ్లిపోయింది.

లలితపిన్నిని చూసి ఎన్నేళ్ళయింది? ఆమె నా ప్రపంచానికి ఎంత దూరమైపోయింది? ఎప్పుడో విని మరచిపోయిన ఆమె మధురకంఠపు జ్ఞాపకం ఇప్పటికీ నన్నెందుకల్లా ఆరాటపెడుతుంది?

ఇంతకాలమైన తరవాత వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ చిన్నతనంలో జరిగిన సంఘటనలు మసకచీకట్లో నీడల్లా అస్పష్టంగా కళ్లకి కట్టి వేధిస్తాయి.

ఆమె పెళ్లి జరుగుతున్నప్పుడు నేను తీవ్రంగా గాయపడ్డాను. నన్ను లోకమంతా వంచించినట్టు, నాకొక్కడికే చెందిన ఒక అమూల్య వస్తువును ఎవరో దొంగిలించినట్టు, ఎందుకో ఆవేదనపడ్డాను. ఆమె అత్తవారింటికి వెళ్లినతర్వాత నా జీవితంలో గొప్ప వెలితి ఏర్పడ్డట్టు బాధపడ్డాను.

అది వైశాఖమాసం, నాకు మావాళ్లు పెళ్లి నిశ్చయపరిచారు. బంధువులందరికీ శుభలేఖలు పోస్టుచేశాము. లలిత పిన్ని ప్రసక్తి వచ్చింది. "నేను వెళ్లి పిన్నిని తీసుకువస్తానమ్మా" అన్నాను మా అమ్మతో.

"ఎందుకురా వెళ్లటం? వాళ్లు పంపిస్తారా, ఏమన్నానా? శుభలేఖ వేస్తే సరిపోతుంది" అన్నది మా అమ్మ.

"కాదమ్మా! నేను వెళ్లి పట్టుబడితే వాళ్లు తప్పక పంపిస్తారని నా నమ్మకం" అన్నాను.

వాళ్లామెని పంపిస్తారని నాకు ఏకోశానా నమ్మకం లేదు. కాని ఈ వంకతో వెళ్లి పిన్నిని చూసినట్టవుతుందికదా అని నా ఉద్దేశ్యం.

చివరి కెలాగయితేనేం మా అమ్మని వొప్పించి లలిత పిన్నిని పిలుచుకురావడానికి బయల్దేరాను. ఆవూరు మా అమ్మమ్మ గారి వూరికి నలభై మైళ్ళ దూరంలో ఉంది. అడవుల్లో పడి, మట్టిరోడ్డు మీద, బండి కట్టించుకుని పోవాలి. మా తాతయ్యా, నేనూ కలిసి వెళ్లాం.

మా తాతయ్య బలే సర్దా మనిషి. పూర్వకాలపువాడు కావటం మూలాన ఏ పదిమైళ్లో తప్ప తక్కిన దూరమంతా చకచక బండివెనకాలే నడిచాడు. దోవపొడుగునా ఏవో కబుర్లు చెప్పి నన్ను నవ్వించాడు.

"తాతయ్యా! ఇక బండి ఎక్కరాదా"? అని నేనంటే, "ఒరేయ్, ఇదో నడకట్రా? నా చిన్నతనంలో పాతిక ముప్ఫయి మైళ్లు చులాగ్గా ఒక రోజుల్లో నడిచేవాణ్ణి. ఇప్పటికాలపు సన్నాసులు మీరెందుకు పనికివస్తార్రా? పట్టుమని పది మైళ్లు నడవలేరు!" అన్నాడు.

3

లలిత పిన్ని అత్తారూరు ఆ మర్నాటి మధ్యాహ్నానికి చేరుకున్నాం. ఎండ మంచి తీవ్రంగా ఉంది. వడగాలి ఆ చెవినుండి ఈ చెవికి రివ్వున కొడుతోంది. ఆ పల్లెటూరి వీధుల్లో ఆ మధ్యాహ్నం వేళ పిట్టయినా తిరగటంలేదు. నాగరిక ప్రపంచానికి ఎటుచూసినా యాభై మైళ్ల దూరంలో ఉన్న ఆ గ్రామపు దృశ్యం నాకు చెప్పలేని దిగులు పుట్టించింది. ఈవూళ్లో లలిత పిన్ని ఇన్నాళ్లూ ఎలా నివసించగలిగిందా, ఆమె నిశ్చలమైన చూపులు ఇంకా అలానే అందరాని దూరాలకు చూస్తూనే ఉంటాయా, అనిపించింది.

వెళ్లగానే లలిత పిన్ని మొగుడు వాకిట్లో కనిపించాడు. మనిషి గాలికొట్టిన ఫుట్ బాల్ బ్లాడర్ లా, దొందగా ఉన్నాడు. కోరమీసాలు, నీరుకావిబట్టలు, నోట్లో చుట్ట అంతా పల్లెటూరి వాలకం. ముప్ఫైయ్యేళ్ళ మనిషైనా నలభైఏళ్ల వాడిలా ఉన్నాడు. మామగార్ని చూడగానే ఆశ్చర్యం కనబరిచాడు.

"అమ్మా! మామగారొచ్చారు. కాళ్లు కడుక్కోటానికి రెండు చెంబుల్తో నీళ్లు తీసుకురా," అని కేకేశాడు. నాకేసి తేరిపారచూస్తూ "కొంచెం పనుంది, వెళ్లి వస్తాను", అని మళ్లీ నాకేసి ఒకసారి చురచుర చూసి వెళ్లిపోయాడు.

"అంతా క్షేమమా"? అని లలిత పిన్ని అత్తగారిని మా తాతయ్య కుశలప్రశ్నవేశాడు. నన్ను ఫలానా అని తెలియజేశాడు.

"ఆ... పెళ్లప్పుడు చూశాగా ఈ అబ్బాయిని"! అని మూతి తిప్పుకుంటూ అన్నదావిడ.

ఇంతలో అయిదేళ్ల మగపిల్లడొకడూ, మూడేళ్ళ ఆడపిల్లా అక్కడికి వచ్చారు. తాతయ్య వాళ్లని దగ్గిరికి తీసుకుని, "వీళ్లనెప్పుడన్నా చూశావురా?" అని నన్నడిగాడు.

"చూడలేదు. లలితపిన్ని పిల్లలేనా"?

"ఊ... మరింకెవరనుకున్నావ్? ఒరే అబ్బీ! ఆయనెవరో తెలుసా"? అని తాతయ్య పిల్లవాడినడిగాడు.

"తెలవదు" అన్నాడు వాడు.

"మీ అన్నయ్యరా" అన్నారాయన.

"నా కన్నయ్యేంతి? ఆయనెవలో"? అన్నాడు వాడు.

నిజానికి ఆ పిల్లలెవరో, నేనెవరో? వాళ్లకీ నాకూ ఏమిటి సంబంధం? వాళ్లకేసి చూస్తుంటే వెయ్యామడల దూరంలో నుంచున్నట్టుగా కనిపించారు.

ఇంతలో లోపల నుంచి ఒకామె వచ్చింది, చంకలో చంటి పిల్లని వేసుకుని. "ఏం నాన్నా! ఎప్పుడొచ్చావు? అంతా కులాసాగా వున్నారా? ఏమయ్యోవ్ నువ్వేనా? పెద్దవాడివయ్యావే? జ్ఞాపకమున్నానా"? అంది.

"ఆహా, జ్ఞాపకం లేకేం"? అన్నాను.

కాని ఆమె ఎవరు? లలిత పిన్ని పోలికలు కొద్దికొద్దిగా స్పష్టపడుతున్నాయి. మొహాన ముడతలు, లోతుకు పోయిన కళ్లు, వాటి కింద నల్లటి చారలు, కుంగిపోయిన బుజాలు, పుల్లల్లాంటి కాళ్లు ఎత్తెత్తి వేసుకుంటూ... నా లలిత పిన్నేనా ఈమె? ఇలాగయి పోయిందేం? ఏడేళ్లనించీ ఏ స్త్రీ రూపం నా మనస్సులో నిరంతరం నటించిందో ఆ లలిత పిన్నేనా ఈమె?

నేను నిశ్చేష్టుణ్ణయి ఆమె కేసే చూస్తున్నాను. ఆమెని చూశాక నాకు పూర్వపు లలితపిన్ని ఎంత గుర్తుకు తెచ్చుకున్నా జ్ఞాపకం రావటం లేదు.

ఆమె చంకలోని చంటిపిల్ల కొత్తవాళ్లని చూసి కాబోలు కావురుమంది. అప్పటికి నేను తెప్పరిల్లాను.

"ఆదేమిటే, అమ్మాయ్! మరీ అంత నీరసించిపోయావ్"? అంటున్నాడు తాతయ్య.

"అబ్బే. ఏం లేదు, నాన్నా"! అన్నదామె.

"ఏమీ లేకపోవటమేమిటి? కిందటిసారి నేను చూసినప్పటికంటే బాగా చిక్కావ్, వంట్లో బాగుండలేదా"? అన్నాడు తాతయ్య. రెండు కన్నీటి బొట్లు ఆయన కళ్ల చివరలదాకా వచ్చి ఆగిపోవటం చూశాను నేను.

"ఆ, ఏమోనండి! మీ పిల్ల వట్టి రోగిష్టి మనిషి" అని ఇంకేదో సణుక్కుంటూ అత్తగారు లోపలి కెళ్లిపోయింది.

నేనూ, తాతయ్యా దొడ్లో నూతి దగ్గర స్నానాలు చేశాం. పిన్ని అప్పటికప్పుడు మడికట్టుకుని మా కోసం వంట చేసింది.

భోజనాలదగ్గిర ఎవ్వరం మాట్లాడలేదు. తరవాత పిన్ని ఆకు, వక్క చుట్టి నాకూ, తాతయ్యకీ యిచ్చింది. ప్రయాణం బడలిక మీద ఉన్నామేమో, వసారాలో మంచాల మీద వళ్లు వాల్చామో లేదో సుఖమైన నిద్రపట్టింది.

సాయంత్రం ఆరుగంటలకి కొద్దిగా చల్లపడింది. నేను బట్టలు వేసుకుని ఊరిబైటకి షికారుగా వెళ్లాను. ఊరంతా పూరిగుడిసెలే. పెంకుటిళ్లు అరుదుగా కనిపించాయి. నేలంతా ఎర్రదుమ్ము. ఆ వూళ్లో వాళ్లు ఇస్త్రీబట్టలు వేసుకున్న వాళ్లని ఎప్పుడూ చూసివుండరేమో, దోవపొడుగునా నిలిచి వింత జంతువుని చూసినట్టు చూశారు నన్ను.

ఆ రాత్రి భోజనాల దగ్గిర మా తాతయ్య మేము వచ్చిన సంగతి చెప్పాడు. నా పెళ్లికి అందర్నీ రమ్మని అడిగాడు.

"మా కెక్కడ వీలుకుదురుతుందీ రావటానికి" అన్నది అత్తగారు.

"పోనీ లలితపిన్నినైనా పంపించండి, పెళ్లికాగానే ఎవరమన్నా వచ్చి దిగబెడతాము" అన్నాను నేను.

"ఆ, అదెక్కడ వస్తుందిలే. జబ్బు మనిషి, చంటిపిల్లతల్లి" అందావిడ.

మాకింక ఏమనాలో తోచలేదు. తలుపుచాటునే నుంచుని ఉంది పిన్ని.

"ఆట్టే రోజులుండను, అత్తయ్యా! పెళ్లి అయిన వెంటనే వచ్చేస్తాను. మా అక్కయ్యని, పిల్లల్ని చూసి చాలా ఏళ్లయింది" అన్నది బెరుకుగా.

"ఊ, వెడతావు; మా చక్కగా వెడతావు. నీ పాడుమొహం పెట్టుకుని అక్కడికి వెళ్లకపోతే వచ్చిన నష్టమేమీ లేదులే. చూశావుగా నువ్విన్నాళ్ళూ కలవరిస్తున్న మీ అక్కయ్య కొడుకుని", అని కసిరాడు పిన్ని మొగుడు.

పక్కన పెద్దవాడు, మామగారు ఉన్నారనైనా ఆలోచన లేకుండా ఆ మాట లన్నవాడిని పీటపెట్టి నెత్తి పగలగొడదామా అన్నంత కోపం వచ్చింది. అన్నం దగ్గిర్నించి లేచిపోవాలనిపించింది. మా తాతయ్య 'శాంతించ'మన్నట్టు నాకేసి చూశాడు. పిన్ని తలుపుచాటునించి అవతలకి వెళ్లిపోయిన చప్పుడు వినిపించింది.

భోజనాలు అయినాయో లేదో పిన్ని మొగుడు చెప్పులు తొడుక్కుని కర్రపట్టుకుని ఎక్కడికో వెళ్లిపోయాడు.

పిన్ని నాకూ తాతయ్యకీ దక్షిణపు వేపున మల్లె పందిరికింద పక్కలు వేసింది. తాతయ్య వీధి అరుగుమీద చుట్టకాలుస్తూ మా బండి తోలుకొచ్చిన వెంకన్నతో మాట్లాడుతున్నాడు. నేను పందిరికింద మంచం మీద పడుకుని, ఎర్రగా నిప్పుముద్దలా, కళాకాంతీ లేకుండా ఉదయిస్తున్న తదియచంద్రుణ్ణి చూస్తున్నాను. మల్లెచెట్టు విరగబూసింది. కన్నీటి బొట్లలా అప్పుడప్పుడు బాగా విచ్చిన పువ్వులు నా మీద రాలుతున్నాయి.

మరచెంబులో నీళ్లు తీసుకుని పిన్ని వచ్చింది. తలవేపున చెంబు పెట్టి తాను తాతయ్య మంచం మీద కూర్చుంది.

"పిన్నీ! నువ్వు వచ్చేసెయ్యి. వీళ్లెమన్నా సరే, నేను తీసుకువెళ్లదలుచుకున్నాను" అన్నాను.

"ఎలా రమ్మంటావయ్యా, వాళ్లు వద్దంటుంటే? పట్టుకు లాక్కెళతావా"? అన్నది నీరసంగా, రాని నవ్వు తెప్పించుకుని.

"పిన్నీ! ఎందుకిలాగైపోయావ్ నువ్వు"?

"ఏం చేస్తాను, నా ఖర్మ! ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నానో ఈ ఇంట్లో పడ్డాను".

"కాదు, పిన్నీ! ఇది నీ పాపం కాదు. దీనికి బాధ్యత పూర్తిగా తాతయ్యదే".

"ఆయన తప్పేముంది? పెళ్లి చేసినప్పుడు కలగన్నాడా, వీళ్లిట్లాంటి వాళ్లని"?

"నువ్వు ఇంకా సంగీతం పాడుతున్నావా పిన్నీ"!

ఈ ప్రశ్న వినగానే ఆమె మొహం మరోవైపుకి తిప్పింది. ఆ గుడ్డి వెన్నెల్లో ఆమె జొటజొట కన్నీళ్లు కార్చటం కనిపించింది.

"ఎందుకేడుస్తున్నావు, పిన్నీ"!

ఆమెకి దుఃఖం పుక్కిలింతలుగా వచ్చింది. వెక్కి వెక్కి బిగ్గరగా ఏడ్వసాగింది.

"ఊరుకో, పిన్నీ! ఇంట్లో వాళ్లు వింటారు" అన్నాను, నా కళ్లనీళ్లు తుడుచుకుంటూ.

ఆమె ఏడుపు నాపింది కాసేపటికి- "ఇన్నేళ్లలోనూ నన్నీ ప్రశ్న అడిగిన వాడివి నువ్వొక్కడివే. అందుచేత ఏడుపునాపుకోలేకపోయాను. నేను ఇక్కడికి కాపరానికొచ్చేటప్పుడు నా వీణ తెచ్చుకున్నాను. జ్ఞాపం వుందా"? అన్నది.

"అవును. జ్ఞాపం ముంది. ఆ వీణని ప్రాణంతో సమానంగా చూసుకునేదానివి కూడాను".

"దాన్ని మా ఆయన విరగ్గొట్టిపారేశారు. పాడుతున్నట్టు వినిపిస్తే గొంతు పిసికి చంపేస్తానన్నారు. నాకు సంగీతం రావటం వాళ్ల కిష్టం లేదు. ఒకటి రెండుసార్లు నేను పాడుకోబోయాను. 'బోగం దానిలా ఆ పాటలేమిటే'? అని మా అత్తగారు నన్ను గదమాయించి పాటలు మానిపించారు. ఇప్పుడు నాకు సంగీతం మీద ఇదివరకటి శ్రద్ధా లేదు, పాడుకునే ఓపికా లేదు", అన్నది పిన్ని నిస్పృహగా.

"పిన్ని! ఒక్క మాటడుగుతాను, కోపం రాదుగదా"? "నీ మీద ఏవో అపనిందలు వేశారుట, నిజమేనా"?

"ఆ, అవన్నీ యిప్పుడెందుకులే"?

"కాదు పిన్నీ. నిజమేనా?"

"నువ్వు కొత్తలో ఉత్తరం రాశావు చూడు. ఆ ఉత్తరం మా ఆయన చూశారు. దాంతో అనుమానపడి నన్ను నానా మాటలూ అని కొట్టాడు. ఆ తరవాత కూడా ఊళ్లోవాళ్లతో లేనిపోనివి కల్పించి బాధపెడుతూనే వున్నారు. ఏ పాపమూ ఎరక్కపోయినా నా కీ అపనిందలు తప్పలేదు. ఇక నా బతుకంతా యిలాగే తెల్లవారిపోవలసివుందేమో"?

రెండు నిమిషాల సేపు ఎవ్వరం మాట్లాడలేదు.

"నే నా ఉత్తరం రాయడం చాలా తెలివితక్కువే. నా పొరపాటు క్షమిస్తావా పిన్నీ"?

"ఇందులో నువ్వు తెలిసి చేసిందేముంది, క్షమించటానికి? అప్పుడు నా పెళ్లిలో నువ్వు అస్తమానమూ నా కూడా కూడా తిరిగేవాడివి జ్ఞాపకం వుందా? అప్పుడే మా ఆయన తల్లితో అన్నారుట, 'ఎవరా అబ్బాయి, పోకిరీ మొహం వేసుకుని దాని వెంట తిరుగుతున్నాడు'? అని".

"పిన్నీ! నువ్వెంత కాదన్నా, నీ కష్టాలకు కొంత వరకు నేను కూడా కారణమైనట్టు తోస్తున్నది. నిన్నీ నరకంలో నుంచి ఎలా రక్షించగలనా, ఏం చేస్తే నీ కష్టాలు గట్టెక్కుతాయా అని వేదనపడుతున్నాను"

"సర్లే, నువ్వేం చేస్తావు నా కోసం? నువ్వు రేపు లక్షణమైన పిల్లని చేసుకోబోతున్నావు. నువ్వు సుఖంగా వుంటే నా కదే చాలు. ఈ పిల్లల్ని చూసుకుంటూ ఇలాగే కాలం గడుపుతాను".

"ఎంత మారిపోయావ్ పిన్నీ! మన చిన్నప్పటి రోజులు తలుచుకుంటే ఏడుపు వస్తున్నది. ఆ సుఖదినాలు మళ్లీ ఎప్పటి కన్నా వస్తాయా? నీ మీద నాకు అంత గౌరవం కలిగించింది నీ సంగీతమే. నీ కంఠంలో అప్పటి అమృతపు నదులు ఎక్కడ యింకిపోయాయి? అప్పుడు పాడేదానివి, 'శ్రీరామపాదమా! నీకృప చాలునే' అని అమృత వాహిని రాగంలో ఒక కృతి, జ్ఞాపకం ఉందా? ఆ ఒక్కముక్క అనవూ, వినాలనుంది".

"సర్లే. ఇప్పుడేమిటి? అవన్నీ ఎప్పుడో మర్చిపోయాను" అన్నదామె.

ఇంతలోకే అత్తగారు "ఓ లలితమ్మా! ఎక్కడున్నావమ్మా తల్లీ"! అని కేకేసింది. పిడుగుపడ్డట్టు ఉలిక్కిపడ్డాం ఇద్దరమూ. పిన్ని లేచి వెళ్లిపోయింది గబగబ, కాళ్లు ఎత్తెత్తి వేసుకుంటూ....

నాకా రాత్రి నిద్రపట్టనేలేదు. తెల్లవారుకట్ట ఏ గంటో నిద్రపోయి వుంటాను. లేచేసరికి పక్క మీద ఒత్తుగా మల్లెపువ్వులు రాలివాడి నలిగిపోయి వున్నాయి. అవన్నీ ఏరి పొట్లం కట్టి నా సంచీలో పదిలపరిచాను.

పొద్దున్నే మొహం కడుక్కుని నేనూ, తాతయ్యా బండికట్టుకుని తిరుగుముఖం పట్టాము. ముసలాయన ఆ ఒక్కరోజులోనే నెలరోజులు లంకణాలు చేసిన వాడల్లే అయిపోయాడు. బండిలోనే కూర్చుని, తలవంచుకుని కుమిలికుమిలి ఏడ్డాడు.

బండితోలే వెంకన్న అన్నాడు:

"తాతయ్యగోరూ! బంగార బ్బొమ్మ లాంటి పిల్లని ఈ యెదవసచ్చినోళ్ల కెల్లాగిచ్చారండీ! మీ యల్లుడి ఊసు ఈ వూళ్లో ఎత్తితే సాలు అంతా తిట్టేవాళ్లే. ఎప్పుడూ మాలగూడెంలోనే ముండలమ్మట తిరుగుతాడంట. ఒల్లంతా రోగాలేనంట, నాయాలకి" అన్నాడు.

"ఒరే, నువ్వూరికే వాగబోకురా. అసలే ఆయన కష్టపడుతున్నాడు" అన్నాను నేను కోపంగా.

"నీకేం తెలుసుద్దయ్యా? నేను మీ తాతయ్యగోరింట్లో యింతప్పట్నించీ పనిచేశా. ఆ పిల్ల ఎసుమంటి పిల్లో నాకు తెలవదనా? మాలచ్చిమంటి తల్లి. ఎన్ని కట్టాలు పడుతుండదో ఆళ్ల సేతుల్లో?" అన్నాడు వెంకన్న. ఆ మాటలు విని తాతయ్య మరీ కుంగిపోయాడు.

4

ఎక్కడ త్యాగరాజకృతి విన్నా నాకు మా లలితపిన్నే జ్ఞాపకం వొస్తుంది. ఆమె సంగీతం గాని, కంఠం గాని ఇప్పుడు జ్ఞాపకం తెచ్చుకుందామన్నా జ్ఞాపకం రావు. పెళ్ళి కాకముందు ఎలా వుండేదో కళ్లు చించుకున్నా గుర్తుకు రాదు. కాని చంటిపిల్లని చంకన వేసుకుని ఎత్తెత్తి కాళ్లు వేస్తూ వచ్చి నన్ను పలకరించిన ఆ లలితపిన్నే జ్ఞాపకం వచ్చి మనస్సును రంపంకోత కోస్తుంది ఇప్పటికీ. ఆమె వ్యక్తిత్వానికి కేంద్రమైన వీణ లాగానే ఆమె జీవితం కూడా భగ్నవీణ.

నండూరి రామమోహనరావు
(1951 జనవరి 03వ తేదీన ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ప్రచురితమైనది)

Previous Post Next Post