Title Picture

(నవల, రచన : ముద్దంశెట్టి హనుమంతరావు; ప్రచురణ : నవోదయ పబ్లిషర్స్, విజయవాడ-2; ప్రాప్తి స్థానం కూడా అదే. క్రౌన్ సైజు : 144 పేజీలు; వెల : రెండున్నర రూపాయలు)

'ఒక అబ్బాయి ఎదురింటి అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా అదే పనిచేసింది. కనుక ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. కాని అమ్మాయి తండ్రి ఏకీభవించలేదు. వాళ్ళ అంతస్తు కొంచెం పెద్దది. కుల గోత్రాల పేచీ ఏమీ లేదు. సరే, మంచి ముహూర్తం చూసి అమ్మాయి, అబ్బాయి పారిపోయి వేరే ఊళ్లో లక్షణంగా రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. ఇదంతా నవలారంభానికి ముందు జరిగిన కథ. వివాహానంతరం సమాజంలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, మానసికంగా వారు పొందిన క్షోభ-ఇది ఈ నవలకు వస్తువు. ప్రేమించడం తప్పుకాదు. పెళ్ళి చేసుకోవాలనుకోవటం, చేసుకోవటం తప్పు కాదు. అయినా వాళ్ళు చేసిన ఆ పనే మహా నేరంగా కనిపించింది సమాజానికి. సమాజం అంటే ఎవరు? బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అనబడేవాళ్ళు. అమ్మాయిని గురించి, అబ్బాయిని గురించి నానా మాటలూ అనుకున్నారు. చాటుగా చెవులు కొరుక్కున్నారు. అంచెలంచెలుగా వార్తను చేరవేశారు. అంతా కలిసి ఉమ్మడిగా వాళ్ళు వివాహానికి పెట్టిన ముద్దు పేరు 'లేచిపోవటం'. అందరూ అనుకునే మాటలు విని, వినలేక క్షోభించిపోయారు నూతన దంపతులు. వాళ్ళు పై మెరుగులు చూసి ప్రథమ వీక్షణంలో ప్రేమించుకుని తొందరపడి వివాహం చేసుకున్నవారు కాదు. ఎదురెదురు ఇళ్ళవాళ్ళు కావటం వల్ల ఒకళ్ళనొకళ్ళు చాలాకాలం గమనించి, అర్థం చేసుకుని ప్రేమలో పడ్డారు. తల్లితండ్రులు వరించినవాళ్ళను కాక, స్వయంగా వరించి చేసుకోవడమే వారి నేరం. చివరికి కథలో-వాళ్ళను గురించి శాయశక్తులా దుష్ర్పచారం చేసిన ఆవిడ తమ్ముడే అటువంటి పని చేసేసరికి ఆవిడ నోరు మూతపడిపోతుంది. 'కాల ప్రభావమే అంత' అని సరిపెట్టుకుంటుంది ఆవిడ.

ఈ కథలోని సమస్య వర్తమాన సమాజంలో సజీవంగా, నవనవలాడుతూ ఉన్నది. వర్ణాంతర వివాహాలు, వితంతు వివాహాలు కూడా మామూలైపోయిన ఈ రోజుల్లో ఇంకా ఇది కూడా ఒక సమస్యేనా అని అంటారు కొందరు. నిజానికి ఇటుంటివి నవలల్లో, సినిమాల్లో మామూలైపోయాయి గానీ నిజ జీవితంలో కాదు-కనీసం తెలుగు జీవితంలో కాదు.

ఇంతకూ చెప్పవచ్చేదేమంటే - గడచిన ఏభై అరవై సంవత్సరాల్లో మన సమాజం చెప్పుకోదగినంతగా ఏమీ పురోగమించలేదు. మన మనుషులు మనస్సులు ఇంకా యథాతథంగా - ఇరుకుగా, చీకటిగానే ఉన్నాయి.

పెద్ద నగరాల్లో ఒకరి సంగతి ఒకరు పట్టించుకునేంత తీరిక ఉండదు కాని, చిన్న పట్టణాలలో, గ్రామాల్లోని మనుషులు వర్ణాంతర వివాహాలు కావు కదా, మామూలు ప్రేమ వివాహాలను కూడా ఆమోదించటం లేదు. అందుకే ఈ నవల్లో రచయిత వ్రాసినదంతా అక్షరాలా నిజం. అతిశయోక్తి అలంకారాలు లేకుండా సహజంగా చిత్రించారు సమస్యను. భాష సరళంగా ఉంది.

రచయిత ఒక పెద్ద పొరపాటు చేశారు. 41వ పేజీలో దయానిధిగా పరిచయమైన వ్యక్తి 127వ పేజీ నుంచి అనంతంగా మారిపోయాడు. రచయిత తను సృష్టించిన పాత్ర పేరు తానే మరిచిపోయారు. మరొకచోట-సావిత్రిని గురించి వ్రాస్తూ గబుక్కున పార్వతి అని వ్రాశారు. తర్వాత వాక్యంలో మళ్ళీ సావిత్రి అని దిద్దుకున్నారు. పోనీ ఇది అచ్చుతప్పు అని సరిపెట్టుకుందాం.

ఈ పొరపాట్లను సరిపెట్టుకుంటే-ఇది పఠనీయమైన చక్కటి నవల.

నండూరి పార్థసారథి
(1964 ఏప్రిల్ 15వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post