Title Picture

'కానుక' అద్భుతమైన కథ అని ప్రముఖ రచయితలు, విమర్శకులు ఏకగ్రీవంగా ప్రస్తుతించారు. ఇందులో అధివాస్తవికత, మార్మికత ఉన్నాయని కూడా అన్నారు. అందరూ ఈ కథను అద్వితీయమైనదిగా పేర్కొన్నారు. అందులో సందేహమేమీ లేదు. కానీ, అసలు ఆ కథకు అర్థమేమిటి? ఆ విషయం ఎవరూ మాట్లాడలేదు. కథ చివరలో గల ముడిని ఎవరూ విప్పలేకపోయారు. ఆ మర్మాన్ని అలాగే వదిలేశారు. ఆ కథ ద్వారా రచయిత చెప్పదలచింది ఏమిటో ఎవరికీ తెలియకపోయినా కనీసం రచయితకైనా తెలిసి ఉండాలి కదా! ఎవరైనా అడిగితే రచయితైనా చెప్పగలగాలి కదా! రమణగారూ చెప్పలేదు - ఆయనా స్పష్టంగా, కచ్చితంగా చెప్పలేకపోయారు. ఆ 'మార్మికత'ను అలాగే వదిలేశారు.

హాస్యరచయితగా ప్రసిద్ధులైన ముళ్ళపూడి వారు ఇంత గంభీరమైన కథను ఎందుకు రచించారని ఒకరు ప్రశ్నించగా ఆయన చెప్పిన సమాధానం ఇది.

"కృష్ణుడు, సంగీతం రెండూ అద్భుతమైన వస్తువులు. కృష్ణుడిలా అల్లరి, అందం, సంగీతం; చిలిపిదనం, సంగీతం; ప్రణయం, సంగీతం; పోకిరీతనం, సంగీతం; నిండు దనం, గొప్పదనం, కరుణ, సంగీతం అన్నీ కలబోసుకుని ఎవరికి ఏ 'శ్రుతి'లో కావాలంటే ఆ శ్రుతిలో పలికే వ్యక్తి ఏ దేశ పురాణగాథలు చూసినా కనబడడు. కృష్ణుడి గురించి రాయాలని చాలా దురాశ ఉండేది, ఉంది. పన్నాలాల్ ఘోష్ వేణు నాదం విన్నప్పుడల్లా ఆ నాదాన్ని వాక్యాల్లో-తెలుగు వాక్యాల్లో ఇమిడ్చి ప్రేము కట్టాలన్న పేరాశ ఉండేది, ఉంది".

"సత్యాన్ని అన్వేషించబోయే వాడిని-స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ వన్ అని కనిపెట్టు అని గణితశాస్త్రారాధకుడు అన్నాడు. ఏడు రంగుల కలయికలో వెదకమని చిత్రకారుడు అన్నాడు. సప్తస్వరాల సమ్మేళనంలో వెదకమని నాదారాధకుడన్నాడు. సత్యాసత్య నిదానానికి ఈ వాక్యకారుడికి అర్హత ఉందని కాదు. నేతి నేతి అనుకోవడం కూడా చేతకాదు. కాని, అలా అనుకొని ఏదో పరమార్ధాన్ని అనుభూతికి తెచ్చుకోగలిగిన ఒక వ్యక్తి గురించి రాయాలన్న ఆశతో రాసిందీ కథ".

కృష్ణుని వేణు నాదాన్ని విని పరవశించే ఆరాధకుడు గోపన్న. కృష్ణుని కోసం ఒక వేణువును తయారు చేసి బహూకరించాలనుకున్నాడు.

"ఇంత మోహనమైన సంగీతాన్ని కృష్ణుడు ఒక వెదురు ముక్కలో ఎలా ఇమిడ్చాడా అని గోపన్న ఆలోచించాడు. ఒకసారి అతని ఇంటికి వెళ్ళి ఆ మురళిని ఎత్తుకవచ్చాడు. యమున ఒడ్డుకు వచ్చి చెంగుచాటు నుంచి మురళి తీసి వాయించాలనుకునే సరికి అది కనబడలేదు. మాయదారి కృష్ణుడు... గజదొంగ దగ్గర నేను దొంగతనమేమిటి అనుకున్నాడు గోపన్న. కాని, గజదొంగ ఆ సాయంత్రం కనబడి 'గోపన్న నా మురళి తీసుకుపోయావు కదూ... పోనీ ఇంకొకటి చేసిపెట్టు" అన్నాడు నవ్వి.

ఆ మర్నాటి నుంచి వేణు నిర్మాణం ఆరంభించాడు గోపన్న.

"మురళి సిద్ధం కాగానే శ్రుతి చూశాడు. గుండె బద్దలయినంత పనయింది. అది శ్రుతి శుద్ధంగా లేదు. పైగా జీర. రెండు మూడు వేణువులు పలికినట్లుంది. కృష్ణుడు ఊదుతాడన్న ఆనందంలో దానికి ఒళ్ళు పులకరించిందా? గోపన్న అది పడేసి మరోటి చేశాడు. అదీ అంతే. మర్నాడు వెదురు చాలా తెప్పించాడు. పది, పన్నెండు చేశాడు. ఒక్కొక్కటీ ఊది చూడడం, నచ్చక పారేయడం. నీకు వేణువు ఇవ్వందే నా ముఖం చూపను కృష్ణయ్యా! అనుకున్నాడు. నాటి నుంచి ఇదే పని పెట్టుకున్నాడు. సాయంకాలం బృందావని వేపు వెళ్ళి వేణుగానం వినడం, ఉదయాస్తమానం కొత్త వేణువులు చెయ్యడం"-ఇవన్నీ రమణగారి వాక్యాలే.

అలా పాతికేళ్ళు గడిచిపోయాయి. కృష్ణుడు పెద్ద వాడయ్యాడు. బృందావనికి రావడం లేదు. పట్నవాసం మనిషైపోయాడు. అయినా ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి వస్తున్నాడు. అప్పటికెలాగైనా శ్రుతి శుద్ధమైన వేణువును సిద్ధం చేయాలని గోపన్న ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కాని, వేణువు తయారయేది కాదు. గోపన్న పాకలోని అటక అంతా పనికిరాని వేణువులతో నిండిపోయింది.

మళ్ళీ వచ్చింది పండగ... రేపే కృష్ణాష్టమి. ఇదే చివరి ప్రయత్నం. కృష్ణుడికి వేణువు ఈసారి ఇవ్వలేకపోతే ఇక ఈ జన్మలో ఇవ్వలేడు. చివరి వేణువు తయారు చేశాడు. ఇక దీన్ని పరీక్షించదలుచుకోలేదు. పనికొస్తుందో లేదో అది కృష్ణయ్యే చూసుకుంటాడు అనుకున్నాడు. ఆ వేణువును కొడుక్కి ఇచ్చి ఇది రేపు పొద్దున్న కృష్ణయ్యకి ఇవ్వమని చెప్పాడు.

తన మురళిని కృష్ణుడు ఊదుతున్నట్లు ఊహించుకుంటుంటే తన పక్కనున్న వేణువులోంచి సన్నని చిక్కటి స్వరం నెమ్మదిగా ఇవతలకి రావడం, వచ్చి తన చెంప నిమరడం గమనించాడు గోపన్న. తర్వాత కుటీరంలోని సహస్త్ర వేణువులూ మేలుకొని భువన మోహనంగా గానం చేయసాగాయి. అన్నీ శ్రుతి శుద్ధంగా ఉన్నాయి. అసత్యమైన వేణువు లేనేలేదు. భగవంతుడికి ఉపయోగపడని వేణువే లేదు.

అంతలో కొడుకు వచ్చాడు. "అయ్యా... అయ్యా, కృష్ణయ్య నీ మురళి వాయించాడే. నాకు బువ్వపెట్టాడు. ఇక్కడ ముద్దెట్టుకున్నాడు. మరేం... కిష్టయ్య నీ మురళి వాయించేవాడే, కాని... ఎంత వాయించినా ఏమీ వినబడలే. అస్సలు పాట రాలేదే...." అని చెప్పాడు.

"గోపన్న తల పక్కకు తిప్పి గది నిండా పడివున్న వేణువులను చూశాడు. ఇంత సేపూ గానం చేసి అలసిపోయిన వేణువుల వంక ఆప్యాయంగా సగర్వంగా చూసి ఒకటి తీసి ముద్దు పెట్టుకున్నాడు".

ఆధ్యాత్మికత, ఆధివాస్తవికత, మార్మికత, పారలౌకికత, ఫేంటసీ అన్నీ కలబోసుకున్న కథ ఇది. గోపన్న పరీక్షించి పనికి రావనుకున్న వేణువులన్నీ-కృష్ణుడు ఊదకుండానే, వాటంతట అవే భువన మోహనంగా గానం చేశాయి. వేయి వేణువుల మనోహర బృందగానం. కాని, గోపన్న పరీక్షించకుండా పంపిన వేణువు మాత్రం కృష్ణుడు ఊదినా పలకలేదు. మార్మికత అంతా ఈ ముగింపులోనే ఉంది.

రమణ గారు ఈ కథలోని ప్రతి వాక్యాన్నీ, ప్రతి పదాన్నీ, ప్రతి అక్షరాన్నీ అతి జాగ్రత్తగా, సున్నితపు త్రాసులో తూకం వేసి రచనాభరణంలో పొదిగారు. ఇలాంటి రచనలు 'అలవోకగా' జరగవు. భావనకు భౌతిక రూపం ఇచ్చే శిల్పి ఆలవోకగా శిల్పం చెక్కలేడు. ఊహ కచ్చితంగా శిల్పంలోకి ఒదగదు. కవి భావన సంపూర్ణంగా అక్షరాలలో ఆవిష్కృతం కాదు. తపస్సు అలవోకగా జరగదు. రమణగారు ధ్యానస్థితిలో దర్శించిన దృశ్యాలను, సత్యాలను తపోదీక్షతో అక్షరబద్ధం చేసినట్లు అనిపిస్తుంది.

ఈ 'కానుక' కథలో రెండే పాత్రలు-గోపన్న, అతని కొడుకు చిన్న గోపన్న. అసలు కథ అంతా కృష్ణుడికి సంబంధించినదే అయినా ప్రత్యక్షంగా కృష్ణుడు ఎక్కడా కనిపించడు. కృష్ణుడు గోపన్న మనస్సులోనే-మనస్సంతా నిండి ఉంటాడు. ఒక్క నిమిషం కూడా మనస్సును ఎడబాయడు. కథలో మొదటి నుంచి చివరిదాకా గోపన్న వేణువులు తయారుచేస్తూనే ఉంటాడు. అంతసేపూ అతడి మనస్సులో సన్నగా, లీలగా, స్మృతిగా కృష్ణుని వేణునాదం వినిపిస్తూనే ఉంటుంది-వేణు నిర్మాణానికి దారి చూపేది అదే. రమణగారు ఈ కథను చిన్న సినిమాగా తీస్తే ఎంత బావుండేది?

గాఢంగా ఆలోచించవలసిన, మననం చేయవలసిన వాక్యాలు, సంగీతానికి సంబంధించినవే ఎన్నో ఉన్నాయి 'కానుక'లో. కొన్ని చూద్దాం.

'గోపన్న పూర్వం ఎన్నో వేణువులు చేశాడు. తృప్తిగా వాయించాడు. బాగానే ఉందనుకున్నాడు. కాని, ఒక స్థాయి వచ్చాక అతనికొక ఊహపోయింది. వేణువును కింద పెట్టి, సంగీతాన్ని ఊహించబోయాడు. ఊహించిన సంగీతాన్ని భావన చేసి, భావించిన దానిని అనుభవించి దర్శించే సరికి అతనికొక సత్యం తోచింది. సంగీతాన్ని అనుభూతికి తెచ్చుకోవడానికి జంత్రగాత్రాలను ఉపయోగించబోవడం అవివేకం. జలపాతాన్ని వెదురు గొట్టంలో ఇమడ్చడం పొరపాటు. సముద్రాన్ని పాలకడవలో ఇమడ్చడం తెలివితక్కువ. ఊహకందే సంగీతంలో పాటకందేది శత సహస్రాంశం ఉండదు.

"ఊహ సాగిన కొద్దీ స్వరలత దిగంతాలకు వ్యాపించసాగింది. ఆకాశం వరకు వ్యాపించసాగింది. రోదసి అంతా నిండిపోసాగింది. క్రమంగా ఓంకార జనితమైన స్వరార్ణవం తిరిగి ఓంకారమై భువన సమ్మోహనంగా, భీకరంగా, అద్భుతంగా ఎరుకపడసాగింది. శ్రుత సంగీతంలా ఇందులో అపశ్రుతులు లేవు. అపశబ్దాలు లేవు. అన్ని వేదాంతాలు, అన్ని సత్యాలు అర్థసత్యాలేనంటూ, తనలో భాగాలేనంటూ నిలచే అద్వైత సత్యంలా ఈ సంగీతంలో అపస్వరాలు కూడా అర్థస్వరాల, పూర్ణస్వరాల పక్కన నిలిచి అందాలు సంతరించుకొని, అందంగా భాసించసాగాయి. ప్రతి అణువునా భగవంతుడున్నాడు, ప్రతి శబ్దంలోనూ సంగీతం ఉంది-అన్న వాక్యాల తాత్పర్యం అతనికి ఎరుకపడింది. గోపన్న అర్భక దేహానికిది దుర్భరమైపోయింది. అతను ఊహించిన సంగీతాన్ని అనుభవించడానికి శక్తి చాలలేదు. అవయవాలన్నీ విలవిలలాడేవి. హృదయం బద్దలయిపోయే స్థితికి వచ్చింది. అందం, ఆనందం దగ్గరగా వస్తే ఇంత దుర్నిరీక్ష్యాలై, దుర్భరాలై ఉంటాయని అతను ఊహించుకోలేదు. ఇప్పుడు గ్రహించి కూడా తప్పించుకోలేడు".

"అతన్ని ఆస్థితి నుంచి ఐహిక స్థితికి తెచ్చి కాపాడినది కృష్ణుడి మురళి. అది విన్న క్షణాన అతను ముగ్ధుడైపోయాడు. ఆ స్థితిలోకే మేలుకున్నాడు. తన ఊహకు అందిన దానికన్నా గొప్పదీ, ఆకళింపు చేసుకుని అనుభవించడానికి సులువైనదీ అతనికి ఆనాడే వినిపించింది. నాటి నుంచి ప్రతి నిత్యం కృష్ణుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి మురళి వినేవాడు..."

ఇక-చిట్ట చివరి మార్మికత సంగతేమిటి? దాన్ని పరిష్కరించడం ఎలా?

కథ రమణ గారిది-అందులో జోక్యం చేసుకునే అధికారం నాకు లేదు. కాని, చాపల్యంతో నేనూహించిన కొత్త ముగింపును సూచిస్తున్నాను-రమణగారికి క్షమాపణలతో.

ఇక్కడ గోపన్న పాకలో వేయి వేణువులు భువన మోహనంగా గానం చేస్తుంటే అక్కడ స్వయంగా కృష్ణుడే వాయిస్తున్న వేణువు మోగకపోవడం ఏమిటి? ఆ వేణువూ, ఈ వేయి వేణువులూ అన్నీ కృష్ణుడికి నైవేద్యంగా గోపన్న చేసినవే కదా! గోపన్నకు న్యాయం జరిగేట్టు, పాఠకులకు, సినిమా తీస్తే ప్రేక్షకులకు త్రిల్ కలిగేట్లు నేను భావన చేసిన దృశ్యం వినండి.

చిన్న గోపన్న పరుగెత్తుకుంటూ వచ్చాడు. వాడి మొహం సంతోషంతో వెలిగిపోతోంది. "అయ్యా అయ్యా... కిష్టయ్య వాయించింది ఈ పాటే, సరిగ్గా ఈ పాటే, కిష్ణయ్య ఇంకా వాయిస్తూనే ఉన్నాడు. నీకు చెప్పాలని లగెత్తుకొచ్చేశాను" అన్నాడు చిన్న గోపన్న.

ఆ మాటలు వినిపించలేదు గోపన్నకి. ఆనందంతో కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. వేణువులన్నీ అతడికి దగ్గరై అతడి చెంపలను ముద్దాడుతూ గానం చేస్తున్నాయి. అతడు వాటిని గట్టిగా పొదువుకున్నాడు. వాటి పరిష్వంగంలో అలౌకిక కృష్ణ స్పర్శను అనుభూతం చేసుకున్నాడు. అతడికి అంతా అర్థమయింది. అక్కడ కృష్ణ మురళీ శ్రుతులు, ఇక్కడ వాటి అనుశ్రుతులు, అక్కడ స్వరాలు, ఇక్కడ అనుస్వరాలు. అక్కడ నుంచి ఇక్కడి దాకా ఒకే నిరంతర కృష్ణగాన వాహిని.

చిన్న గోపన్నకీ ఏదో మైకం కమ్మినట్లయింది. నాన్నపై అంతులేని బెంగ కలిగింది. వెళ్ళి నాన్న పక్కన పడుకున్నాడు. గోపన్న వేణువులతో పాటు కొడుకునీ కౌగిట పొదువుకున్నాడు. గానం సాగుతూనే ఉంది. సన్నగా, క్రమంగా వేణుగానమూ అలసిసొలసి గోపన్న కౌగిట నిదురించింది.

నండూరి పార్థసారథి
(2015 జులై 13, ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైనది)

Next Post