ఆయన భాషకు అక్షరాలు ఏడు-సరిగమపదని. అక్షరాలు ఏడైనా అది అనంత విస్తృతమైన భాష. శిశువులను, పశువులను, పాములను కూడా రంజింపచేయగల మధురమైన, శ్రావ్యమైన భాష. అది విశ్వజనీనభాష. దానికీ వ్యాకరణం, ఛందస్సు, అలంకారాలు ఉన్నాయి. ఆ భాషలో ఆయన ఉద్దండ పండితుడు, కవి. ఆయన లేఖిని శహనాయి. శ్రోతల హృదయఫలకాలపై శహనాయితో మహా కావ్యాలు విరచిస్తాడు ఆయన. 'నానృషిః కురుతే కావ్యం'-ఆయన ఋషి; ఆయన పద్మశ్రీ బిస్మిల్లా.

శుద్ద స్వరస్వరూపాన్ని దర్శించడానికి ఆయన తపస్సే చేశారు. స్వరశుద్ధిని సాధించారు. పరిశుద్ధమైన స్వరం శ్రోతృ హృదయంలో మధురమైన ఆర్తిని జనింపచేస్తుందని తెలుసుకున్నారు. అప్పటి నుంచి శహనాయిని చేత బుచ్చుకుని వాడవాడలా తిరిగి ప్రజా హృదయంలో ఆర్తిని రగిలిస్తున్నారు.

''రేడియోలో ఒక్క ఐదు నిమిషాలు అవకాశం ఇస్తే చాలు-వేలాది హృదయాలను కొల్లగొట్టగలను'' అని ధీమాగా చెప్పగలరు ఆయన. రేడియోలోగానీ, సభలోగానీ ఒక్కసారి ఆయన శహనాయిని విన్నవారు ఎవరూ ఇక జీవితంలో దానిని మరిచిపోలేరు. మధుర స్మృతుల నిక్షేపంలో దానిని అపురూపంగా భద్రపరుచుకుంటారు. వినగా వినగా ఆయన శహనాయి శ్రోత వ్యక్తిత్వంపైన కూడా గాఢమైన ప్రభావాన్ని కలిగించగలదంటే అతిశయోక్తి కాదు. ఆయన శహనాయి కొందరి జీవితాలను మార్చటం సంభవం. విరహంలో ఉండే వేదన, మాధుర్యం, నిషా ఆయన సంగీతంలో ఉన్నాయి. వాటికే శ్రోతలు దాసులవుతారు.

బిస్మిల్లాఖాన్ దక్షిణాదికి-ముఖ్యంగా మద్రాసుకు-సుపరిచితులే. మద్రాసులో కచేరీ చేయటం అంటే ఆయనకు సంబరంగా ఉంటుంది. నిజానికి దేశంలోని సంగీత విద్వాంసులందరికీ మద్రాసు పట్ల ఆ విధమైన గౌరవం, అభిమానం ఉన్నాయి. మద్రాసు కర్నాటక సంగీతానికి కేంద్రం కావటం, ఎందరో గొప్ప విద్వాంసులకు నిలయం కావటం ఇందుకు కారణం. మద్రాసులో 'శభాష్' అనిపించుకోవటం విద్వత్తుకు నిదర్శనంగా భావిస్తారు గాయకులు. బిస్మిల్లా 'శభాష్' అనిపించుకోవటమేకాదు-ఎన్నోసార్లు మద్రాసు శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశారు. మూడు సంవత్సరాల తర్వాత ఆయన క్రిందటి నెల 16వ తేదీన మద్రాసులో కచేరీ చేశారు.

ట్రిప్లికేన్ లోని పార్థసారథిస్వామి సభవారు బిస్మిల్లా కచేరీని ఏర్పాటు చేశారు. ఆయన శహనాయిని వినే భాగ్యం సాధ్యమైనంత ఎక్కువ మందికి కల్పించే ఉద్దేశంతో రేట్లు తక్కువగా పెట్టారు. మామూలు కచేరీల లాగా మందిరాలలో కాక, ప్రత్యేకంగా వేయించిన పందిళ్ళ క్రింద ఏర్పాటు చేశారు. దాదాపు నెల రోజుల ముందు నుంచి ఈ కచేరీని గురించి ప్రకటనలు వేశారు. అందుకే సాధారణంగా మద్రాసులో ఏసంగీత సభకూ రానంతమంది జనం-వేలసంఖ్యలో-వచ్చారు. వచ్చిన వారందరూ నిజంగా సంగీతం పట్ల అభిమానం ఉన్నవారే గానీ, కాలక్షేపం కోసం వచ్చిన వారు కారు. సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రారంభమైన కచేరీ పదిన్నర వరకు సాగింది.

బిస్మిల్లా, ఆయన బృందం వేదికమీదకు రాగానే సదస్సులు కరతాళ ధ్వనులతో అభివాదం చేశారు. బిస్మిల్లా సవినయంగా సభకు నమస్కరించి, శహనాయిని తీసుకొన్నారు. భగవతీ రాగంతో కచేరీ ప్రారంభించారు. ఆయన పూరించిన ప్రప్రథమ స్వరమే శ్రోతల హృదయాలను ఝల్లుమనిపించింది. సుదీర్ఘంగా సాగిన ఆ ఒక్క స్వరంతో అంతవరకు అక్కడ నెలకొని ఉన్న వాతావరణం మారిపోయింది. గంభీర నిశ్శబ్దం ఆవరించుకొన్నది. పవిత్రత నెలకొన్నది. శహనాయి స్వరం రాజ్యం చేయటం ప్రారంభించింది. శహనాయి అధికారానికి శ్రోతలు వశ్యులైపోయారు.

శహనాయిని పూరిస్తున్నంత సేపు ఆయన కన్నులు మూసుకునే ఉంటారు. మనస్సును ప్రాపంచిక స్మృతులనుంచి ఉపసంహృతం చేసి, తనదైన సంగీత సామ్రాజ్యంలో విహరింపచేస్తారు. ఆ సమయంలో-తన ఎదుట కొన్ని వేలమంది శ్రోతలు ఉన్నారనీ, వారికోసం తాను కచేరీ చేస్తున్నాననీ ఆయన గుర్తించినట్లు కనిపించరు. కేవలం ఆత్మానందం కోసం వాయిస్తున్నట్లుగా కనిపిస్తారు. అది ఆనంద సాధనగా సాగుతుంది. స్వరాలతో స్వర్గానికి సోపానాలు నిర్మిస్తున్నట్లు ఉంటుంది. శ్రోతలతో తనకేమీ నిమిత్తం లేనట్లు ఆయన వాయిస్తున్నా-ప్రతిశ్రోతా బిస్మిల్లా కేవలం తన కోసం గానం చేస్తున్నట్లు, తనకే జోల పాడుతున్నట్లు, ఆయన తనకు అత్యంత ఆప్తుడైనట్లు అనుభూతి పొందుతాడు. నాగస్వరం విన్న నాగుబాములా, మురళీస్వనం విన్న గోపికలా ప్రతిశ్రోత పరవశించుతాడు.

రాత్రివేళ దీపాలు ఆర్పివేసి, రేడియోలో బిస్మిల్లా శహనాయిని వినటం మహాద్భుతమైన అనుభవం. అనంతమైన ఆర్తితో ఆయన ఆక్రందనం చేసినట్లుగా ఉంటుంది. తన వేదననంతా నివేదన చేయాలని ప్రయత్నిస్తున్నట్లు, నివేదించలేకపోతున్నట్లు అనిపిస్తుంది. ఆయన వేదనను అర్థం చేసుకోవాలని మనం ఆరాటపడతాము-కాని అది పూర్తిగా అవగతం కాదు. ఫలితంగా మనలో వేదన రగులుతుంది. అర్థంకాని పరమార్థం కోసం సత్యాన్వేషకుడు పడే ఆవేదనలా ఉంటుంది ఆ సంగీతం. ఒక్కొక్కప్పుడు ఆయన సంగీతం-యుగయుగాల భారతీయ సంస్కృతిని మన మనోనేత్రం ఎదుట ఆవిష్కరిస్తున్నట్లు, 'భారతీయతకు అర్థం నేనే' అని రహస్యం చెప్పినట్లు, ఏవో గొప్ప సందేశాలిస్తున్నట్లు ఉంటుంది. మరొకప్పుడు-సంగీతమే తన మధుర స్మృతులను మననం చేసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఇంకొకసారి-కన్నుపొడుచుకున్నా కనిపించని కటిక చీకటిలో గాలిలో ఈదులాడుతూ ఎవరో ప్రియునికోసం వెతుక్కుంటున్నట్లు అనిపిస్తుంది. ఇలా భావుకుని సంస్కారాన్ని బట్టి ఎన్నైనా భావాలను స్పందింపచేయగల మహాకవి బిస్మిల్లా. శ్రోత హృదయాన్ని ఇంతగా వశం చేసుకోగల సంగీత విద్వాంసులు దేశంలో ఈనాడు ఇద్దరు ముగ్గురుకంటే ఎక్కుమంది లేరు.

బిస్మిల్లా భగవతీ రాగాన్ని గంటసేపు వాయించారు. ఆ తర్వాత గంటసేపు శ్యామ్ కళ్యాణ్ రాగాన్నీ, మరొక గంటసేపు మాల్ కౌస్ రాగాన్ని వాయించారు. చివరికి ఒక అరగంట సేపు 'గూంజ్ ఉఠీ శహనాయ్' చిత్రంలోని పాటలను వాయించారు. యువతరం వారికి 'స్వరం' మీద కంటే 'లయ' మీద మోజు ఎక్కువ అని బిస్మిల్లా అభిప్రాయం. కానీ ఆయనకు మాత్రం 'స్వరం' మీదనే ఎక్కువ గౌరవం. శ్రోతలను తన్మయులను చేయగలిగేది స్వరమే కానీ లయ కాదని అంటారు ఆయన. అయితే ఆయన సాధారణంగా కచేరీ అంతంలో కొంతసేపు 'లయ' అభిమానులను కూడా తృప్తిపరుస్తూ ఉంటారు. ఈ కచేరీలో కూడా ఆపని చేశారు.

శాస్త్రీయ సంగీతం పామరులను రంజింపచేయలేదనే భావం ఆయనకు లేదు. శాస్త్రీయ సంగీతం పండిత పామర భేదం లేకుండా అన్ని వర్గాల వారినీ రంజింప చేయగలదనీ, దానిని ప్రజాసామాన్యానికి సన్నిహితం చేయాలనీ ఆయన అంటారు. సుమారు పాతిక, ముప్ఫయి సంవత్సరాల క్రితం వరకు కూడా శాస్త్రీయ సంగీతం కేవలం ధనిక వర్గం వారి పోషణ క్రింద ఉంటూ, వారికి మాత్రమే పరిమితం అయి ఉండేది. ఆ రోజులు పోయి ఇప్పుడది ప్రజాసామాన్యం అందుబాటులోకి వస్తున్నది. రేడియో ద్వారా, సినిమా ద్వారా సంగీతం ప్రజలను సమీపిస్తున్నది. సినిమాలలో వినిపిస్తున్నదంతా గొప్ప సంగీతం కాకపోయినా, మొత్తం మీద సంగీతం పట్ల ప్రజల ఆసక్తిని పెంచటానికి సినిమాలు చేసిన సేవ చాలా ఉందని బిస్మిల్లా విశ్వసిస్తారు.

శహనాయి చరిత్ర

శహనాయికి చెప్పుకోదగ్గ గొప్ప చరిత్ర లేదు. దాని జీవితాన్ని చరితార్థం చేసిన వ్యక్తి బిస్మిల్లా ఖాన్. శహనాయి లోపరహితమైన వాద్యమనీ, శాస్త్రీయ సంగీతానికి తగిన వాద్యమనీ నిరూపించి, దానికి సభాగౌరవాన్ని కల్పించిన వ్యక్తి ఆయనే. ఆయన చేపట్టక పూర్వం అది కేవలం పెళ్ళిళ్ళలోనూ, దేవాలయాలలోనూ ఉపయోగించే మంగళవాద్యం. శహనాయి వాయించే వారిని కేవలం భజంత్రీవాళ్ళుగానే చూసేవారు. శాస్త్రీయ సంగీత కచేరీ చేయడానికి పనికి వచ్చే వాద్యంగా దానిని ఎవరూ గుర్తించలేదు.

బిస్మిల్లా వారణాసివాసి. యాభై ఏళ్ళవాడు. ఆయన తండ్రి, తాత ముత్తాతలు అందరూ రాజస్థానంలో భజంత్రీ వాద్యగాళ్ళుగా ఉండేవారు. రాజావారు కొలువులోకి వస్తున్నప్పుడు శహనాయితో స్వాగతం పలకడం, దేవాలయంలో దేవునికి రోజూ హారతి ఇచ్చేటప్పుడు వాయించటం వారి పని. బిస్మిల్లాకు ఈ పద్ధతి నచ్చలేదు. శహనాయికి ఉన్నత గౌరవం కల్పించాలని కంకణం కట్టుకున్నారు. తీవ్రంగా సాధనచేసి సాధించారు. తన అన్నగారు స్వర్గీయ షంసుద్దీన్ తో కలిసి వాడవాడలా పాట కచేరీలు చేసి పండితులను దిగ్ర్భాంతులను చేశారు. 'భజంత్రీ వాద్యంలో ఇంత సంగీతం ఉన్నదా' అని అందరూ విస్తుపోయారు. బిస్మిల్లా సోదరులకు దేశం జోహారు చేసింది.

ప్రతి వాద్యానికీ ఏదో ఒక లోపం ఉంటుంది. గాయకుడు తన ప్రతిభను పూర్తిగా వెలార్పడానికి ఆలోపం ఆటంకమవుతూ ఉంటుంది. కానీ శహనాయిలో ఆ లోపం లేదంటారు బిస్మిల్లా. పరిమితి గాయకుని పాండిత్యానికి ఉండవలసిందేకాని శహనాయికి ఉండదని అంటారు ఆయన. బిస్మిల్లా ఒక కచేరీలో ఒక రాగాన్ని ఆలాపిస్తూ 'సరిగ' అనే మూడు స్వరాలను ముప్పావు గంట సేపు వాయించారట. ఆయన పాండిత్యానికి అదే నిదర్శనం.

భారతీయ సంగీతానికి ఆయన చేసిన సేవను గుర్తించి ప్రభుత్వం ఆయనను 'పద్మశ్రీ' బిరుదంతో సన్మానించింది. ఎడింబరో (ఇంగ్లండ్)లో జరగనున్న అంతర్జాతీయ సంగీత మహాసభకు భారత ప్రతినిధిగా పంపుతూ ప్రభుత్వం మరొక సారి ఆయనను గౌరవిస్తున్నది.

శాస్త్రీయ సంగీతానికి ఒక అమూల్యమైన వాద్యాన్ని సమర్పించిన వ్యక్తి బిస్మిల్లా. శహనాయి ఆయన సొంతం అనే చెప్పవచ్చు. శహనాయి జీవించినంత కాలం బిస్మిల్లాను స్మరిస్తూనే ఉంటుంది. శహనాయి జీవించినంత కాలం ఆయన జీవించే ఉంటారు. అమరజీవి పద్మశ్రీ బిస్మిల్లా.

నండూరి పార్థసారథి
(1965 జూన్ 23వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post