లయను పాదాక్రాంతం చేసుకొన్న
కథక్ చక్రవర్తి
ఉన్నత పర్వత శిఖరాల నుంచి అగాధాలలోనికి గుభేలునదూకేజలపాతాల గంభీర గర్జారవాలు, గండ శిలలపై విరుచుకుపడి చిటిలి చిటిలి, తుటిలి తుటిలి తుంపరలయే నీటి బిందువుల మెరుపు తళుకులు, చిన్న చిన్న గులకరాళ్ళను తోసుకుంటూ, దొర్లించుకుంటూ లోయల వెంట చిలిపిగా పరుగులెత్తే చిన్నారి సెలయేళ్ళ నీళ్ళ చప్పుళ్ళు, వసంతాగమనంతో నిలువు నిలువునా పులకరించి, పరవశించే ప్రకృతి, మామిడి చిగుళ్ళు మేసి మత్తెక్కిన కోకిలల కలకూజితాలు, హంసల నడకల ఒయ్యారాలు, తుమ్మెదల ఝంకారవాలు, లేళ్ళ పరుగులు, గుర్రాల ఠీవి... ఇంకా సృష్టిలోని ఎన్నెన్నో అందాలు వినయంతో, ప్రేమతో ఆయనకు పాదాక్రాంతమై, చరణ మంజీరాల రవళిలో ఒదిగిపోయాయి. ఆయన నృత్యంలో విశ్వసౌందర్యం ప్రతి ఫలిస్తుంది.
జంటనగరాల నృత్య కళాప్రియులను మూడు గంటలసేపు ముగ్దులను చేయడానికి ఢిల్లీ కథక్ కేంద్ర గురుపీఠం నుంచి దిగివచ్చారు బిర్జూమహారాజ్. గత బుధవారం రాత్రి రవీంద్రభారతిలో ఆయన ఇచ్చిన ప్రదర్శన మరువలేనిది, మరువరానిది. ఆయన అంతకు ముందు హైదరాబాద్ లో ప్రదర్శన ఇచ్చి పన్నెండేళ్ళయింది. అప్పటికీ ఇప్పటికీ ఆయన కళా సౌందర్యానికి కాలదోషమేమీ తగల్లేదు. నిజానికి ఆ సౌందర్యం కొత్త కళలను సంతరించుకున్నది. నలభై ఐదేళ్ళ వయస్సు నీడలు ఆయన నాట్యంపై ప్రసరించలేదు. పదగతులలో, ఆంగిక విన్యాసాలలో వెనకటి జవం, వేగం ఏమీ తగ్గలేదు.
కథక్ తో ఆట్టే పరిచయంలేని దక్షిణాదివారికి దానిపేరు చెప్పగానే 'ఝనక్ ఝనక్ పాయల్ బాజే'లో సుడిగాలిలా గిరగిర తిరిగే గోపీకృష్ణ నృత్యమే జ్ఞాపకం వస్తుంది. కథక్ అంటే అభినయానికి ప్రాధాన్యంలేని నిర్జీవమైన 'నృత్యం' అనే అపోహ దాక్షిణాత్యులలో చాలా మందికి ఉంది. బిర్జూమహారాజ్ తన ప్రదర్శనంతో ఈ అపోహను సమూలంగా పెకలించి వేశారు. 'ఠుమ్రీ', 'గత్ భావ్' లలో ఆయన ప్రదర్శించిన అభినయం చూస్తే కథక్ అభినయ దృష్ట్యా కూచిపూడి శైలికి ఏ మాత్రం తీసిపోదని అనిపిస్తుంది. కాగా ఆంగికాభినయంలో, లయ విన్యాసాలలో కూచిపూడి శైలి కథక్ కు ఏమాత్రం సరిపోదు.
కథక్ లో రెండు ప్రత్యేకమైన తరహాలున్నాయి. ఒకటి నృత్తం, రెండోది నృత్యం. నృత్తంలో సాత్వికాభినయం (హావభావ ప్రదర్శనం) ఉండదు. ఇది లయప్రధానమైనది. ఇందులో చిత్ర విచిత్ర పదగతులుంటాయి. తబ్లా, పఖావజ్ లతో కాలి గజ్జెలు పోటీ పడుతూ ఉంటాయి. సవాల్, జవాబ్ విన్యాసాలుంటాయి. సుడిగాలిలా గిరగిర తిరిగే ప్రావీణ్య ప్రదర్శనం ఉంటుంది. రెండో తరహా 'నృత్యం'లో సాత్వికాభినయానికి ప్రాధాన్యం ఉంటుంది. తబ్లా, పఖావజ్ వాద్యాల విజృంభణ, కాలి గజ్జెల జోరు తగ్గుతుంది. ఇందులో రసభావాల అతి సున్నితమైన అభినయం ఉంటుంది. ఠుమ్రీ, దాద్రా, భజన్, ఘజల్, హోరీ, కజరీ, గత్ భావ్-ఇవి ఈ రెండో తరహాకు ఉపకరించే రచనలు.
బిర్జూమహరాజ్ ఈ రెండు తరహాలనూ ప్రదర్శించారు. కొన్ని అంశాలను తన శిష్యురాలు కుమారి సాస్వతీ సేన్ తో కలిసి ప్రదర్శించారు. ఆమె విడిగా కొన్ని అంశాలను ప్రదర్మించింది. రకరకాల పక్షుల శబ్దాలను, జంతువుల నడకలను స్పురింపజేసే 'బోల్' లను నోటితో ఉచ్చరిస్తూ, తర్వాత వాటిని నర్తనగతులుగా ప్రదర్శిస్తూ ఆయన ప్రేక్షకులను ముగ్ధులను చేశారు. వాటిలో కొన్ని బోల్ లు నోటితో పలకడమే కష్టం. వాటిని గజ్జెలతో పలికించడం మరీ కష్టం. ఆ బోల్ లను వింటుంటే, ఆ నర్తనాలను చూస్తుంటే మన మనస్సులో ప్రకృతి అందాలు పురులు విప్పుకుంటాయి.
తీన్ తాల్ (16 మాత్రలు) 'పరన్'లో ఆయన ఎన్నో రకాల లయ విన్యాసాలు చూపారు. ఆ విన్యాసాల అవకాశం అనంతం అనిపిస్తుంది. లయపై ఆయనకు నిరంకుశమైన అధికారం ఉంది. లయ ఆయనకు చరణదాసి అనిపిస్తుంది. ఆయన నర్తిస్తుంటే లయల హొయలు ఆయన వెంట పడి వస్తున్నట్లుగా అనిపిస్తుంది. తీన్ తాల్ లోనే మరొక అంశంలో ఆయన పదహారు రకాల లయ విన్యాసాలను మహాద్భుతంగా, మహేంద్రజాలంలా ప్రదర్శించారు. ముందు ఒక్కొటొక్కటి, తర్వాత రెండు రెండు, మూడు మూడు, నాలుగు నాలుగు... అలా పదహారు దాకా... అంతకంతకు వేగం పెంచుతూ గజ్జెలతో విన్యాసాలు ప్రదర్శించారు. దంపులవాళ్ళు ముందు ఒక్కరు దంపుతూ ఉంటే ఎలా ఉంటుందో, తర్వాత ఇద్దరు దంపుతుంటే ఎలా ఉంటుందో, ముగ్గురు, నలుగురు, ఐదుగురు... చివరికి పదహారుమంది లయ తప్పకుండా వేగంగా రోకటి పోటు వేస్తుంటే ఎలా ఉంటుందో మనస్సులో ఊహించుకోగలిగితే ఈ చరణ మంజీర లయ విన్యాసం ఎలా ఉంటుందో పాఠకులకు కొంతవరకు అర్థమవుతుంది. ఒక కోణం నుంచి పరిశీలిస్తే ఈ లయ విన్యాసమంతా గణితశాస్త్ర వ్యవహారంగా కనిపిస్తుంది. మరో కోణం నుంచి చూస్తే స్వర్ణకారుని అతి సున్నితమైన నగిషీ పనితనంగా, డక్కామజ్లిన్ నేతగా కనిపిస్తుంది.
బిర్జూమహారాజ్ ప్రదర్శన కేవలం నృత్య కార్యక్రమంగానే కాక ఒక సోదాహరణ ప్రసంగ కార్యక్రమంగా కూడా భాసించింది. 'గత్ భావ్'లో ముగ్ధనాయిక మేలి ముసుగుతో ఆడే సరాగాలను ఆయన గొప్పగా ప్రదర్శించారు. మేలి ముసుగు (ఘూంఘట్) ను మెల్లగా తొలగించుకొని ఓర చూపు చూడడం, అంతలోనే సిగ్గుతో మళ్ళీ మునుగు దించుకోవడం... ఇందులో ఎన్నెన్నో రకాలు, ఎన్నెన్నో సొగసులు. ప్రతి చేష్టా ఒక్కొక్క మధుర కవిత. కూచిపూడివారి భామాకలాపంలో భామ జడ ఎటువంటిదో కథక్ లో నాయిక 'ఘూంఘట్' అటువంటుంది.
'కాహే కరూంగీ' అనే కాఫీ ఠుమ్రీని బిర్జూ మహారాజ్ స్వయంగా పాడుతూ అభినయించారు. ఆయన గొప్ప నర్తకుడే కాదు - మధుర గాయకుడు కూడా.
గురువు, శిష్యురాలు కలిసి ప్రదర్శించిన అంశాలలో 'అహల్యా ఉద్ధార్' ప్రత్యేకించి చెప్పుకోదగ్గది. ఇందులో అహల్యగా శిష్యురాలు, గౌతమ మహర్షిగా, ఇంద్రుడుగా, శాపవిమోచనం కల్పించిన శ్రీరాముడుగా గురువు అభినయించారు. సాస్వతీసేన్ విడిగా రెండు మీరా భజన్ లను ప్రశంసనీయంగా అభినయించింది. గురువు, శిష్యురాలు కలిసి తబ్లా, పఖావజ్ వాద్యాలతో జరిపిన లయ విన్యాసం మరో గొప్ప అంశం. తంత్రీ వాద్యాలపై వినిపించే 'మీండ్' (జారుస్వరం) 'గమక్' లను సైతం బిర్జూ మహరాజ్ తన కాలి గజ్జెలతో అనుకరించారు.
జంటనగరాలలో పదేళ్ళుగా కళాసేవ చేస్తున్న 'సుర్ మండల్' సంస్థ ఈ నృత్య కార్యక్రమాన్ని 'ఓం విద్యాలయ' సంస్థ సహకారంతో నిర్వహించింది.
నండూరి పార్థసారథి
(1981 జూలై 12వ తేదీన ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితమయింది)
Copyright © 2021 nanduri.com | All Rights Reserved | Site designed and maintained by CodeRhythm Works