Title Picture
ఆశాభావానికి బీజం నాటిన చలనచిత్ర కళా సదస్సు

"వ్యాపారుల కబంధ హస్తాల నుంచి భారత చలన చిత్ర కళ బ్రతికి బయట పడుతుందన్న ఆశలేదు. అసలు ఇప్పుడున్న స్థితిలో మన సినిమాలను 'కళ'గా భావించడం కూడా హాస్యాస్పదం. న్యూథియేటర్స్, ప్రభాత్ టాకీస్, వాహినీ సంస్థలు వైభవంగా విరాజిల్లిన రోజుల్లో సినిమా ఒక కళ. ఇప్పుడు ఇది కేవలం జూదంలాంటి వ్యాపారం". దేశంలో ఎందరో కళాభిజ్ఞులు ఈ భావం వెలిబుచ్చుతున్నారు.

బాక్సాఫీసు ఫార్ములా అనే మూసలో పోసిన చిత్రాలే ఈనాడు మార్కెట్టును కొల్లగొంటున్నాయి. బాక్సాఫీసు సూత్రాలంటే 'ప్రజలలోని బలహీనతలను, వాంఛలను రెచ్చగొట్టి తృప్తి పరిచేవి' అని అర్థం చెప్పుకోవలసి వస్తున్నది. ప్రజలకోసం, ప్రజల అభిరుచికి తగినట్లు చిత్రాలు తీస్తున్నామని, నిర్మాతలు వాదిస్తారు. ''అటువంటి చిత్రాలే వస్తున్నాయి కనుక అవే చూస్తున్నాము. చూడగా చూడగా ఒంటబట్టాయి'' అంటారు ప్రజలు. ప్రజలకోసం సినిమాలు పతనమవుతున్నాయా, సినిమాల వల్ల ప్రజలు పతనమవుతున్నారా అనేది తెగని ప్రశ్న. తెగటం నిర్మాతలకు ఇష్టం ఉండదు కూడా.

"ఇటువంటి చెత్త ఎందుకు ఉత్పత్తి చేస్తున్నావయ్యా?" అని నిర్మాతను అడిగితే అతను "డిస్ట్రిబ్యూటర్ని అడుగు. పో" అంటాడు. డిస్ట్రిబ్యూటరును అడిగితే ఎగ్జిబిటర్లను అడగమంటాడు. వాళ్ళను అడిగితే ప్రజలను అడగమంటారు. ప్రజలు మళ్ళీ నిర్మాతలనే అడగమంటారు. అప్పటికి వలయం పూర్తి అవుతుంది. "ఈ విషవలయానికి విచ్ఛేదం లేదా?"-అని సినిమాను కళగా ఆరాధిస్తున్న రసజ్ఞులు వాపోతున్నారు.

"ఉన్నది" అని సమాధానం చెప్పింది మద్రాసులో ఇటీవల జరిగిన 'చలనచిత్ర కళా సదస్సు'.

విషచక్ర వ్యూహానికి విచ్ఛేదం

"ఈ సమస్య ఒక మొండి సమస్య. దీన్ని ఒక పక్కనుంచి నరుక్కుంటూ వస్తే ఇంకొకపక్క నుంచి పెరుగుతూ ఉంటుంది. అందుకని దీన్ని ఒక్కచోటునుంచి కాక, ఏకకాలంలో అన్ని వైపుల నుంచి నరుక్కుంటూ రావాలి. అది ఒక్కటే పరిష్కార మార్గం" అని సదస్సు అభిప్రాయపడింది.

భారత చలనచిత్ర సంఘాల సమాఖ్య (ఫెడరేషన్ ఆఫ్ ఫిలిమ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా), మద్రాసు రాష్ట్ర సంగీత నాటక సంఘం కలిసి ఈ సదస్సును నిర్వహించాయి. నిర్వహణలో మద్రాసు ఫిలిమ్ సొసైటీ ప్రముఖపాత్ర వహించింది. మార్చి 27వ తేదీ సాయంత్రం ఏడుగంటలకు మైలాపూర్ లోని రాజేశ్వరీ కళ్యాణమంటపంలో మద్రాసు ముఖ్యమంత్రి భక్తవత్సలం ప్రారంభోత్సవం చేశారు. సభకు కేంద్రసమాచార శాఖ ఉప మంత్రి సి.ఆర్. పట్టాభిరామన్ అధ్యక్షత వహించారు. చలన చిత్ర సంఘాల సమాఖ్య ఉపాధ్యక్షురాలు, మద్రాసు ఫిలిమ్ సొసైటీ అధ్యక్షురాలు అయిన అమ్ము స్వామినాధన్ స్వాగతం పలికారు. ప్రముఖ దర్శక నిర్మాత కె. సుబ్రహ్మణ్యం సదస్సుకు విచ్చేసిన ప్రతినిధులను పరిచయం చేశారు. మరునాడు 28వ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మైలాపూర్ లోని న్యూ వుడ్ లాండ్స్ హోటల్లో సదస్సు జరిగింది. దేశంలోని ఫిలిమ్ సొసైటీలు, క్లబ్బులకు చెందినవారు, పూనా ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్, మద్రాసు ఫిలిమ్ టెక్నాలజీ సంస్థలకు చెందిన వారు, స్థానిక ఫిలిమ్ పరిశ్రమకు చెందిన వారు, పత్రికలవారు, చలన చిత్ర కళాభిమానులు-మొత్తం సుమారు నాలుగువందల మంది హాజరయ్యారు.

చలనచిత్ర కళా లక్షణాలను (ఈస్తటిక్స్) గురించి ప్రముఖ బెంగాలీ దర్శకుడు మృణాళ్ సేన్, తమిళ యువదర్శకుడు జయకాంతన్, చలన చిత్ర ప్రక్రియ (ఫిలిమ్ టెక్నిక్) గురించి శాంతి ప్రసాద్ చౌధురీ, భారత చలన చిత్ర సాంఘికచరిత్ర గురించి ఎస్. కృష్ణస్వామి, చలన చిత్ర సమస్యల గురించి సతీష్ బహదూర్, సినిమా విమర్శలను గురించి కబితా సర్కార్, ఫిలిమ్ సొసైటీ ఉద్యమాన్ని గురించి చిదానంద్ దాస్ గుప్త, ఎమ్. సర్కార్, ఆమెరికాలో ఫిలిమ్ సొసైటీల నిర్వహణ సమస్యలను గురించి కె. సుబ్రహ్మణ్యం, రాజమ్మాళ్ అనంతరామన్ ప్రసంగించారు. ఒక్కొక్కరి ప్రసంగం కాగానే ఆ విషయంపై చర్చ జరిగింది. ప్రముఖ దర్శక నిర్మాత కె.ఎ. అబ్బాస్ అధ్యక్షత వహించారు.

ప్రసంగ పాఠాలను, వాటిపై జరిగిన చర్చలను ఇక్కడ పొందుపరచడం సాధ్యం కాదు. సినిమాల పట్ల ప్రజల అభిరుచిని పెంపొందించడం ఎలా, 'కళ'గా సినిమాను సముద్ధరించడం ఎలా అనే విషయాలు చర్చించడం, పరిష్కారాలను సాధించడం ఈ సదస్సు లక్ష్యం.

వర్తమాన అధ్వాన్న స్థితికి కారణమైన విషవలయాన్ని ఛేదించాలంటే సమస్యను వివిధ కోణాల నుంచి ఏకకాలంలో ఎదుర్కోవాలనీ, పెక్కు కార్యక్రమాలను ఒక్కుమ్మడిగా అమలు జరపాలనీ పూనా ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ ప్రొఫెసర్ సతీష్ బహదూర్ సూచించారు. అంటే-ప్రతి నగరంలోనూ ఫిలిమ్ సొసైటీలను స్థాపించడం, పూనా ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ వంటి సంస్థలను మరికొన్ని స్థాపించడం, కళాశాలల్లోను, పాఠశాలల్లోను మంచి చిత్రాలను ప్రదర్శించడం, ప్రయోగాత్మక కళాత్మక చిత్రాలను తీయాలని ఉత్సాహపడుతున్న ప్రతిభగల దర్శకులకు ఫిలిమ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ధారాళంగా సహాయం అందేటట్లు చేయడం వంటి కార్యక్రమాలను ఏకోన్ముఖంగా సాగించడం.

ఫిలిమ్ సొసైటీ ఉద్యమం

సినిమాను కేవలం వినోదం కోసమే చూడటం కాకుండా, దానిని ఒక 'కళ'గా అభిమానించేవారికి దేశ విదేశాలలోని నిజమైన మంచి చిత్రాలను చూపించటం, తద్వారా వారి కళాభిరుచిని, కళా విజ్ఞానాన్ని పెంపొందించటం ఫిలిమ్ సొసైటీల ఉద్దేశం. వివిధ దేశాల రాయబార కార్యాలయాల నుంచి, ప్రపంచ ప్రసిద్ధమైన కళాత్మక చిత్రాలను పంపిణీ చేసే ప్రత్యేక సంస్థల నుంచి పూనా ఫిలిమ్ ఇన్ స్టిట్యూటుకు చెందిన ఫిలిమ్ లైబ్రరీ నుంచి ఉత్తమ చిత్రాలను సేకరించి తమ సభ్యులకు చూపుతూ ఉంటాయి ఈ సొసైటీలు. వివిధ చిత్రోత్సవాలలో బహుమతులు పొందిన వాటిని, చిత్రజగత్తులో విప్లవాన్ని సృష్టించిన వాటిని, మామూలుగా మార్కెట్టులో దొరకని అరుదైన చిత్రాలను, పాత చిత్రాలను చూపిస్తూ ఉంటారు. ఆయా చిత్రాలను గురించి, దర్శకులను గురించి కొంత సమాచారం కూడా సభ్యులకు ఇస్తారు. చలన చిత్ర కళా రంగానికి వీరి సేవ అమూల్యం. కలకత్తా ఫిలిమ్ సోసైటీ ఒక సత్యజిత్ రాయ్ ని ప్రపంచానికి సమర్పించింది. ఇటువంటి సొసైటీలు దేశంలో 29 ఉన్నాయి. వీటి అన్నింటికీ ఫెడరేషన్ లో సభ్యత్వం ఉంది.

చలన చిత్ర కళాశాలలు

ఉత్తమ చిత్రాలను నిర్మించాలంటే శాస్త్రోక్తంగా చలన చిత్ర కళాభ్యాసం చేసిన దర్శకులు, సాంకేతిక నిపుణులు అవసరం. అందుకని పూనా ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ నమూనాలో ప్రముఖ నగరాలన్నిటిలోనూ చలన చిత్ర కళాశాలలను స్థాపించాలి. విశ్వవిద్యాలయాలలో కూడా ఫిలిమ్ కి సంబంధించిన బోధన ఏర్పాటు చేయాలి. కళాశాలల్లోను, పాఠశాలల్లోను కళాత్మకమైన చిత్రాలను ప్రదర్శిస్తూ, విద్యార్థుల అభిరుచిని పెంపొందించాలి.

ప్రయోగాత్మక చిత్రాలు

ప్రయోగాత్మక మైన చిత్రాలను నిర్మించాలనే ఉత్సాహం, నిర్మించే ప్రతిభ ఉండి కూడా డబ్బులేని కారణం చేత ముందుకు రాలేకపోతున్న వారికి ఫిలిమ్ ఫైనాన్స్ కార్పొరేషన్ విరివిగా ప్రోత్సాహం ఇవ్వాలి. సంగీత నాటక అకాడమీల వంటి సంస్థలు కూడా గ్రాంట్లు ఇవ్వాలి. అటువంటి చిత్రాలను ప్రభుత్వమే కొని, మార్కెట్టులోకి తీసుకురావాలి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం మంచి చిత్రాలకు పోటీలు ఏర్పాటు చేసి, నగదు రూపంలో బహుమతులివ్వాలి.

పత్రికలు, విమర్శలు

ఈనాడు సినిమాలపై నిష్పాక్షికమైన విమర్శలు అందిస్తున్న పత్రికలు కరువైపోయాయి. వ్యాపార సరళిలో నడుస్తున్నాయి పత్రికలు. సినిమా ప్రకటనలపై ఆధారపడిన పత్రికలు ఆ సినిమాలను ధైర్యంగా విమర్శించలేవు. పత్రికలలో వ్రాసినవి చదివి, ఆ సినిమాలు బాగుంటాయి కాబోలుననిచూస్తున్న ప్రేక్షకులు అసంఖ్యాకంగా ఉన్నారు. అందుకని మంచి విమర్శలను అందజేసేందుకు ప్రతి ఫిలిమ్ సొసైటీ స్వయంగా ఒక పత్రికను స్థాపించాలి. (ఇలా పత్రికలు నడుపుతున్న సొసైటీలు కొన్ని మనదేశంలో ఉన్నాయి). చలనచిత్ర సాంకేతిక పరిజ్ఞానం కోసం విమర్శకులకు ప్రత్యేకంగా రిఫ్రెషర్ కోర్సులు నిర్వహించాలి.

సెన్సారింగ్

ప్రభుత్వ ప్రతినిధులు, చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధులు, ఫిలిమ్ సొసైటీల ప్రతినిధులు, పత్రికా ప్రతినిధులు-అందరూ సమావేశమై సినిమా సెన్సారింగ్ విధానాన్ని పునరాలోచించవలసిన అవసరం ఉంది. సెన్సారింగ్ సినిమాలకే ఏర్పాటు చేశారు గానీ, పోస్టర్లకు ఏర్పాటు చేయలేదు. సినిమాలలో ప్రవేశపెట్టడానికి వీల్లేకపోయిన అసభ్యాలను పోస్టర్ల మీదికి ఎక్కించి ప్రజలను ఆకర్షిస్తున్నారు నిర్మాతలు.

సంచార బృందాలు

సినిమా వర్తకుల దృష్టి ఎప్పుడూ 'మాస్' (సామాన్య ప్రజ) మీద ఉంటుంది. కళాత్మక చిత్రాలకు ఆదరణ లభించాలంటే ప్రజల అభిరుచిని మెరుగుపరచాలి. అందుకని కళాత్మక చిత్రాలను-సంచార ప్రదర్శక బృందాల ద్వారా-ప్రజల అందుబాటులోకీ తీసుకురావాలి. క్రమంగా ప్రజలు-కనీసం కొన్ని వర్గాలవారైనా-వాటికి అలవాటు పడతారు. శృంగారం, హాస్యం మొదలైన వాటిని అన్నింటినీ-వాస్తవికతకు భంగం కలగకుండా-ఆరోగ్యకరమైన మోతాదులో ప్రజలకు అందించవచ్చును.

పైన చెప్పిన వాటిలో ఏ ఒక్కటీ తనంతట తానుగా పరిష్కారాన్ని సాధించలేదు. కాని-అన్నీ ఏకకాలంలో, ఏకోన్ముఖంగా అమలులోకి వస్తే పరిష్కారం తప్పకుండా సాధ్యం. ఈ కార్యక్రమాలన్నింటినీ సమన్వయపరచటం అన్నది ఏడు గుర్రాల రథాన్ని నడపటం వంటిది. దీనికి కేంద్ర సమాచార శాఖ స్వయంగా సారథ్యం వహించడం మంచిది. పరిస్థితిని సమీక్షించడానికి ఏడాదికి ఒకసారి ఇటువంటి సదస్సులు ఏర్పాటు చేయటం అవసరం. ఆశించినది సాధించడానికి పదేళ్ళు పట్టవచ్చు, ఇరవై ఏళ్ళు పట్టవచ్చు. కాని ఏ కాస్త కృషి జరిగినా అది సోమరితనంకంటే మెరుగే. ఏకొంచెం ఫలితం దక్కినా అసలు లేనిదానికంటే నయమే. లక్ష్యానికి బీజం వేసింది మద్రాసు సదస్సు (ఈ మోస్తరు సదస్సు ఇదే మొదటిది). ఈ బీజం మొలకెత్తి, మొక్కయి, మానయి, ఫలాలనందించే నాటికి ఈ తరం గడిచిపోవచ్చు. వచ్చే తరానికైనా ఫలాలు దక్కటం మంచిదేకదా?

సదస్సులో చెప్పుకోతగ్గ ముఖ్య విషయం-తెలుగు, తమిళ సినీవర్తక ప్రముఖులు మచ్చుకు ఒక్కరైనా హాజరుకాకపోవటం. ఇందులో ఆశ్చర్యమేమీలేదు.

నండూరి పార్థసారథి
(1965 మే 5వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post