Title Picture

విజ్ఞానం మాట ఎలా ఉన్నా, చిత్రం చూసిన కాసేపూ పుష్కలంగా వినోదం లభిస్తే, మనస్సులోని అశాంతిని దులిపేసి నిర్మలంగా ఉంచగలిగితే, తాత్కాలికంగానైనా వేసవికాలంలో కూల్ డ్రింక్ తాగినంత హాయిగా ఉంచగలిగితే, ఆ చిత్రం సినిమాల ఆదర్శంలో సగం సాధించినట్లే. డబ్బులు పెట్టుకుని చూసిన వాళ్ళు విసుక్కోరు. పండితులూ తిట్టరు. విజ్ఞానం లేకపోగా, సినిమా చూస్తున్నంత సేపూ సస్పెన్సుతో హై రానపడి, ఇంటికి వచ్చిన తరువాత బఫూను వెకిలిచేష్టలూ, పిస్తోలు పుచ్చుకుని బెదిరించే గగ్గుల మొహం విలనూ సస్పెన్సు మ్వూజిక్కు కలలోకి వచ్చాయంటే ఉభయ భ్రష్టత్వం సిద్ధిస్తుంది.

దృశ్యం, శ్రవ్యం, కన్నుల పండువుగా, వీనుల విందుగా ఉన్నంతసేపూ కథ ఏమిటి? అది ఇల్లా ఉందేం? అది అసహజం కాదా? ఇందులో విజ్ఞానం ఏదీ, ఈ పాటకి రాగం ఏమిటి? అని అడ్డు ప్రశ్నలు వేయకుండా చూసేవాళ్ళకి కల్పనా పిక్చర్సు వారి 'మంజిల్' చిత్రం హాయిగా ఉంటుంది. మధురమైన సంగీతం, మనోహరమైన శృంగారం, మనోజ్ఞమైన వాతావరణం, లలితమైన హాస్యంతో ఉల్లాసమైన సన్నివేశాల తోరణంగా ఇంటర్వెల్ వరకూ సినిమాను అవలీలగా సాగించారు సంగీత దర్శకుడు బర్మన్, దర్శకుడు మండి బర్మన్. ఈసన్నివేశాల ఉల్లాసంలో కథ కనుపించదు. కథ లేదే అనే ప్రశ్న ప్రేక్షకులకు రాదు. ఇంటర్వెల్లో కథసంగతి గుర్తుకు వచ్చి ప్రేక్షకులు గట్టిగా నిలవేసి అడగటంతో దర్శకుడు కంగారు పడి, నిజమే! మర్చిపోయా సుమా! అసలు ఇంతకీ కథ ఏమిటంటే, అని చెప్పబోయి, మరచిపోయి ఆసువుగా అప్పటికి తోచిన కథ యేదో చెప్పేసి, చిత్రాన్ని ముగించాడు. ఈ అసుకవిత్వం అంత మధురంగా లేదు. ప్రేక్షకులు కొంచెం విసుక్కుంటారు. దర్శకుడిని ఎస్.డి.బర్మన్ కూడా కాపాడలేక పోయాడు చిత్రం ఉత్తరార్ధంలో.

నాయకుడుకాక ప్రత్యేకంగా వెకిలివేషాలు వేసేందుకు వేరే బఫూనును ఏర్పాటు చేయలేదుకనుక చాలా తెరిపిగా ఉంది. విలన్ నామకుడొకడున్నా చివరలో వచ్చి త్వరలోనే చనిపోతాడు. ఒక వ్యాంప్ కూడా ఉంది. కానీ ఆమె ప్రేక్షకులవేపు కొరకొరా చూడదు. నూతన్ అభిమానులకు ఈ చిత్రంతో ఆమె మీద అభిమానం వెయ్యి రెట్లు పెరిగిపోతుంది. దేవానంద్ నటన శృంగారేతర సన్నివేశాలలో రమ్యంగా లేదు. ముఖ్యంగా త్రాగుడు దృశ్యాలలో అతడి నటన కృతకంగా ఉంది.

రాజు ఇంగ్లండ్ నుంచి సిమ్లా రైల్వేస్టేషన్ లో దిగటంతో కథ ప్రారంభమవుతుంది. అదే రైలులో పుష్ప కూడా దిగుతుంది. వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఒకరి నొకరు గుర్తించుకుంటారు. ప్రథమ వీక్షణం కాదుకాబట్టి వెంటనే ప్రేమ బలపడుతుంది. అతను ఇంగ్లండ్ లో సంగీతం నేర్చుకుని వచ్చాడు. ఆమె కూడా బాగా పాడుతుంది. సిమ్లా వాతావరణంలో ఇద్దరూ అద్భుతమైన సరికొత్త వరసలతో, రకరకాల ప్రయోగాలతో వింత వింత డ్యూయెట్లు పాడుతూ, ఇంటర్వెల్ వరకూ గడిపేస్తారు. అప్పుడు రాజు నాన్నకి కోపం వచ్చి, పియానో అమ్మివేసి కొడుకును బొంబాయికి తరిమివేస్తాడు. రాజు అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. ఓ వాంప్ ప్రియాప్రియుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడవకుండా ఆపుచేస్తుంది. పుష్ప అపార్థం చేసుకుని వేరే పెళ్ళి చేసుకుంటుంది. రాజు అది తెలుసుకుని కసికొద్దీ త్రాగుడు ప్రారంభిస్తాడు. పుష్ప భర్త విలన్ గా మారి చివరకు చనిపోతాడు. రాజు విధవా వివాహం చేసుకొని సంఘ సంస్కర్తగా కూడా పేరుమోస్తాడు.

సన్నివేశాలను చిత్రీకరించిన తీరులో ఎంతో సౌలభ్యం కనుపిస్తుంది. బర్మన్ సంగీతంలో ఇంకా సౌలభ్యం కనుపిస్తుంది. నేపథ్య సంగీతంలోనూ, పాటలలోనూ, ఎన్నడూ వినిఎరుగని ఎవరూ ఊహించని వింత వింత ప్రయోగాలు సునాయాసంగా చేశాడు. ఆయన ప్రతిభకు ఈ చిత్రం పరాకాష్ట.

బిక్కుబిక్కుమనే కటిక చీకటి, నిశ్శబ్ద నిస్థబ్ద వాతావరణానికీ, తప్ప త్రాగిన వాని వివశతకూ, ఉల్లాసం కలిగించే పిల్లవాయువులకూ, నాయిక హృదయంలో నుంచి పొంగిపొరలివచ్చే ప్రేమకూ, ఆనందపు పరమావధికీ, ఆయన చేసే వ్యాఖ్యానం అనన్య సాధ్యం అనిపిస్తుంది. ఆ సంగీతంలో ఆయా భావాలను ప్రేక్షకుడు స్పృశించ గలుగుతాడు. ఆయన సంగీతం ఇంద్రజాలం... సంగీత దర్శకుల నందరినీ కూడా దిగ్ర్భమ కలిగించగలవి ప్రత్యేకంగా రెండు యుగళగీతాలు ఉన్నాయి. శాస్త్రీయ సంగీతానికి కూడా దర్శక, నిర్మాతలు కొంత చోటునిస్తే, ఇంకా గొప్పగా ఉండేది.

నండూరి పార్థసారథి
(1960 ఫిబ్రవరి 28వ తేదీన ఆంధ్రప్రభ సంచికలో ప్రచురితమైనది)

Previous Post Next Post