సత్యజిత్ రాయ్ దర్శకత్వం క్రింద ఆర్.డి.బన్సాల్ నిర్మించిన బెంగాలీ చిత్రం 'చారులత' 1964వ సంవత్సరంలో తయారైన భారతీయ కథా చిత్రాలన్నింటిలో అత్యుత్తమ చిత్రంగా ఎన్నికై, రాష్ట్రపతి సువర్ణ పతకాన్ని గెలుచుకున్నది-ఈ వార్తలో విశేషమేమీలేదు. సత్యజిత్ రాయ్ ప్రతి ఏడాదీ ప్రభుత్వం నుంచి సువర్ణపతకాన్నో, రజతపతకాన్నో, ప్రశంసా పత్రాన్నో అందుకుంటూనే ఉన్నారు. ఆయన సువర్ణ పతకాన్ని అందుకోవటం ఇది మూడవసారి. ప్రభుత్వం చలన చిత్రాలకు బహుమతులు ఇవ్వటం ప్రారంభించిన తర్వాత ఇంతవరకు ఒకటి కంటే ఏక్కువ సువర్ణ పతకాలను పొందినవారు మరెవ్వరూ లేరు.
దేశంలో కంటే విదేశాలలో ఆయన కీర్తి, ధనం ఎక్కువగా సంపాదించుకున్నారు. ఆయన చిత్రాలు దేశంలోకంటే విదేశాలలో ఎన్నోరెట్లు ఎక్కువ డబ్బు చేసుకున్నాయి. దేశం దాటివెళ్లిన ఆయన చిత్రం ఏదీ కూడా ఏదో ఒక బహుమతి పొందకుండా తిరిగిరాలేదు. ఆయన మొదటి రెండు చిత్రాలు-'పథేర్ పాంచాలీ', 'అపరాజిత'-పొందినన్ని అంతర్జాతీయ బహుమతులు బహుశా ప్రపంచంలో ఏ చిత్రాలూ పొంది ఉండవు. కడచిన పది సంవత్సరాలలో అంతర్జాతీయ చలనచిత్ర రంగంలో ఆయన సంపాదించుకున్న కీర్తి కూడా చాలా కొద్దిమంది సంపాదించుకొన్నారు. చలన చిత్ర ప్రపంచపటంలో అనామకంగా ఉన్న భారతదేశానికి విశిష్టస్థానం కల్పించిన వ్యక్తి ఆయన. చిత్రరంగంలో ఆయన ఒక శక పురుషుడు. చాప్లిన్, పుడోవ్కిన్, ఐసెన్ స్టైన్, డిసీకా ప్రభృతుల సరసన నిలబడగల సమర్థుడు సత్యజిత్ రాయ్. ఆయన గొప్ప తనాన్ని గుర్తించి ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్ బిరుదులనిచ్చి గౌరవించింది. నలభై అయిదేళ్ల వయస్సుకే ఇంత గౌరవాన్ని పొందిన వ్యక్తులు బహుశా ఈతరంలో ఎవ్వరూ లేరు.
ఏడుపులు, అట్టహాసాలు, కత్తిపోట్లు, కుస్తీ పట్లు, కడుపుబ్బ నవ్వించు జోకులు, మోతగా ఉండే పాటలు, యమగా ఉండే డాన్సులు, చెమ్మీ దుస్తులు, భారీ సెట్టింగులు, కెమెరా ట్రిక్కులు, ఏడిచినప్పుడెల్లా పలికే శివరంజనీ రాగాలు, నవ్వినప్పుడెల్లా ఒలికే ఆనందభైరవీరాగాలు లేకుండా - జీవితాన్ని నూటికి నూరు పాళ్లు జీవితంలాగే-అత్యంత వాస్తవికంగా తెరమీద చిత్రిస్తారు సత్యజిత్ రాయ్. డాక్యుమెంటరీ సంవిధానంలో చిత్రీకరించినా అందులో అంతర్లీనంగా రాయ్ కి జీవితం పట్లగల దృక్పథం అగుపిస్తూనే ఉంటుంది. తాను మనస్సులో రూపించుకున్న చిత్రాన్ని-సాధ్యమైనంత సన్నిహితంగా-సెల్యులాయిడ్ మీదికి అనువదించటం కోసం ఆయన చిత్ర నిర్మాణానికి సంబంధించిన ముఖ్య బాధ్యతలన్నింటినీ తానే స్వయంగా నిర్వహిస్తారు. సినేరియో తానే వ్రాసుకుంటారు. సంగీతం తానే సమకూర్చుతారు. కొన్ని చిత్రాలకు కథ కూడా వ్రాశారు. ఆయన చిత్రాలు చూస్తూంటే జీవితాన్ని చూస్తున్నామనే అనుభూతి కలుగుతుంది. నటీనటులు నటిస్తున్నట్లు కాక జీవిస్తున్నట్లే అనిపిస్తుంది. రిహార్సల్స్ ఎక్కువగా ఇస్తే 'నటించటం' ప్రారంభిస్తారనే భయంతో రాయ్ రిహార్సల్స్ చాలా తక్కువగా ఇస్తారు. నటీనటులు గొప్పవారై 'నటించటం' నేర్చుకుంటే, వెంటనే వారిని వదిలి కొత్త వారికోసం అన్వేషిస్తారు ఆయన. షూటింగ్ లో కూడా ఆయన సాధారణంగా ఒక్కటే 'టేక్' తీసుకుంటారు.
సత్యజిత్ రాయ్ శైలి చలనచిత్ర కళాభిజ్ఞులందరికీ విదితమే. పేరు చెప్పకపోయినా ఆయన చిత్రాన్ని చూడగానే గుర్తుపట్టవచ్చు. ఆయన శైలిని అనుకరిస్తూ, ఆయన అడుగు జాడలలో నడుస్తున్న యువదర్శకులు బెంగాల్ లో కొందరు ఉన్నారు కానీ, వారి చిత్రాలలో ఇంత పరిపక్వం కనిపించదు.
రాయ్ నిర్మించిన చిత్రాలలో 'చారులత'కు ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ఇంతవరకు నిర్మించిన పన్నెండు చిత్రాలలో-'అపూ' చిత్రాలు మూడింటి తర్వాత స్థానం 'చారులత'కే వస్తుంది. రాయ్ తీసిన మిగతా చిత్రాలకూ, దీనికీ శైలి (స్టైల్) లో మార్పులేకపోయినా, సంవిధానం (టెక్నిక్)లో మార్పు ఉంది. ఇతివృత్తం స్వభావంలో కూడా మార్పు ఉంది. నాయిక పరపురుషునివైపు ఆకర్షింపబడటం ఇందులో ఉంది. ఇటువంటి 'యాంటీ సెంటిమెంట్'గల కథను రాయ్ ఇంతకు ముందు ఎప్పుడూ తీసుకోలేదు. కెమెరా చాలనంలో కూడా ఆయన ఇంతకు ముందు ఎప్పుడూ ఉపయోగించని పద్ధతులను ఉపయోగించారు. ఇదివరకటి చిత్రాలలో ఆయన 'సూపరింపోజిషన్' ప్రయోగం చేయలేదు. అటువంటి కెమెరా విన్యాసాలు ఆయన సిద్ధాంతానికి విరుద్ధమేమో ననిపించేది. కానీ ఈ చిత్రంలో ఒకచోట 'సూపరింపోజిషన్' పెట్టారు. ఒకచోట జూమ్ లెన్స్ ప్రయోగం కూడా చేశారు. ఫ్రెంచి 'న్యూవేవ్' దర్శకులలో ప్రముఖుడైన ట్రూఫా ప్రభావం రాయ్ మీద కొంతవరకు పనిచేసినట్లు అనిపిస్తుంది ఈ చిత్రం చూస్తే. ట్రూఫా తీసిన '400 బ్లోస్'లో మాదిరిగా ఈ చిత్రాన్ని 'ఫ్రోజెన్ షాట్'తో ముగించారు. భార్యా భర్తలు రాజీపడి, చేయి చేయి కలిపిన దృశ్యాన్ని ఫ్రీజ్ (చలనరహితం) చేశారు.
విశ్వకవి టాగూర్ రచించిన నవల 'నష్టనీర్' ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కథాకాలం 1880. కథాస్థలం కలకత్తా. భూపతిదత్ 'సెంటినెల్' అనే ఒక రాజకీయ వారపత్రికకు యజమాని, సంపాదకుడు. అతను యువకుడు, ధనికుడు, నిజాయితీపరుడు, దేశాభిమాని. అతని భార్య చారులత కళాహృదయంగలది, సున్నిత మనస్తత్వంగలది. అతను రాత్రింబవళ్లు పత్రికధ్యాసలో ఉంటూ భార్యను అంతగా పట్టించుకోడు. ఇంట్లో ఉన్నంతసేపూ రాజకీయ గ్రంథాలు చదవటమే కాని, ఎన్నడూ ఆమెతో నవ్వుతూ మాట్లాడి ఎరగడు. లంకంత ఇంట్లో-అన్ని సంపదలూ ఉండి కూడా ఆమె ఒంటరితనంతో బాధపడుతూ ఉంటుంది. కుట్టుపని, నవలా పఠనం, వీధిలో పోయేవాళ్లను బైనాక్యులర్స్ తో చూడటం ఆమెకు కాలక్షేపాలు. ఆమె ఒంటరి తనాన్ని గుర్తించి భూపతి తన బావమరిదిని సతీసమేతంగా రమ్మని లేఖ వ్రాస్తాడు. బావమరిది ఉమాపాదుడు, అతని భార్య మందాకిని వచ్చి తిష్ఠవేస్తారు. ఉమాపాదుడు చారులత అన్న. వక్రస్వభావంగలవాడు. అతను వస్తూనే బావగారి పత్రిక తాలూకు వ్యాపార వ్యవహారాలు చేపట్టాడు. అతన్ని నమ్మి భూపతి ఇనప్పెట్టె తాళం చెవులు కూడా అప్పగిస్తాడు. మందాకిని బోళాబోళీ మనిషి. ఆమెతో చారులతకు బాగా కాలక్షేపం అవుతుంది.
ఇలా ఉండగా భూపతి దగ్గరి బంధువు-అమల్ అనే అతను-కొంతకాలం వారి ఇంట్లో సరదాగా గడిపి వెళ్దామని వస్తాడు. అతను వరసకు భూపతికి తమ్ముడవుతాడు. అతనంటే భూపతికి ఎంతో ఆపేక్ష. అన్న అంటే అమల్ కూ ప్రేమ, గౌరవం ఉన్నాయి. అమల్ కు, చారులతకు అభిప్రాయాలు, అభిరుచులు కలుస్తాయి. ఇద్దరి మనస్తత్వాలు ఒకేరకమైనవి కావటంతో ఇద్దరికీ స్నేహం కలుస్తుంది. సాహిత్యాన్ని గురించి, సంగీతాన్ని గురించి చర్చించుకుంటూ ఉంటారు. అతను ఆమెకు తను వ్రాసిన కవిత్వం చదివి వినిపిస్తూంటాడు, పాటలు పాడి వినిపిస్తాడు, ఆమెలోని సాహిత్యాభిలాషను పెంపొందించుతాడు, ఆమె చేత కవిత్వం వ్రాయించుతాడు. భర్తలో తాను చూడలేకపోయిన లక్షణాలు, భర్తలో తను కోరే లక్షణాలు అమల్ లో ఆమెకు కనిపించాయి. క్రమంగా ఆమె అతనివైపు ఆకర్షితురాలవుతుంది. ఆమె నిగ్రహాన్నికోల్పోయి తన ప్రేమను ప్రకటితం చేసినప్పుడు అమల్ నిర్ఘాంతపోతాడు. అన్నగారికి ద్రోహం చేయలేక, ఒక జాబు వ్రాసిపెట్టి రాత్రికి రాత్రే ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు.
ఉమాపాదుడు నమ్మకద్రోహం చేసి డబ్బంతా దొంగిలించి, భార్యతో సహా వెళ్లిపోతాడు. భూపతి చాలా బాధపడతాడు. తర్వాత అతనికి చారులత అమల్ ను ప్రేమించిన సంగతి కూడా తెలుస్తుంది. విరక్తితో ఇల్లు విడిచి వెళ్లిపోతాడు. కాని మళ్లీ తనలో తానే ఆలోచించుకుని, భార్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయటం తనదే తప్పని తెలుసుకుని ఇంటికి తిరిగి వస్తాడు. భార్యాభర్తలు పరస్పర సానుభూతితో రాజీపడతారు. చేయి చేయి కలుపుతారు.
ఈ కథలో భూపతిగా శైలేన్ ముఖర్జీ, చారులతగా మాధవీముఖర్జీ, అమల్ గా సౌమిత్రా ఛటర్జీ జీవించారు. చిత్రానికి రాయ్ స్వయంగా సంగీతం సమకూర్చారు. ఛాయాగ్రహణం సుబ్రత మిత్రా.
నండూరి పార్థసారథి
(1965 జూలై 7వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)
Copyright © 2021 nanduri.com | All Rights Reserved | Site designed and maintained by CodeRhythm Works