దిల్రుబా

అసాధారణ సృజనాత్మక ప్రతిభ గల కళాకారుడు ఎప్పుడూ సంప్రదాయపు చట్రంలో పూర్తిగా ఇమడలేడు. సంప్రదాయం పట్ల ఎంత గౌరవం ఉన్నప్పటికీ, పూర్తిగా దానికి కట్టుబడడానికి అతడి వ్యక్తిత్వం అంగీకరించదు. తన కళపై తన వ్యక్తిత్వపు ముద్ర, తన ప్రతిభా ముద్ర ప్రస్ఫుటంగా కనిపించాలని అతను కోరుకుంటాడు.

ఇటువంటి వారిలో కొందరు పూర్తిగా సంప్రదాయానికి విడాకులిచ్చి, స్వయంగా కొన్ని ప్రక్రియలను సృష్టిస్తారు. మరి కొందరు సంప్రదాయపు ప్రాతిపదికపైనే కొత్తశైలులను, రీతులను సృష్టిస్తారు. ఈ విధంగా 'కొత్త'ను సృష్టించేవారి వల్లనే కళలు విస్తృతములైనాయి, సంపన్నములైనాయి. ఏ కొత్త రీతి అయినా విశేషంగా ప్రచారంలోకి వస్తే, కొంత కాలానికి అదీ ఒక సంప్రదాయంగా మారిపోతుంది.

సంగీతంలో కూడా ఇలాగే కొత్త రీతులు సృష్టించబడుతున్నాయి. కొత్త వాద్యాలు నిర్మించబడుతున్నాయి. కొందరు పూర్తిగా సరికొత్త వాద్యాలను రూపొందిస్తున్నారు. మరికొందరు పాత వాద్యాలకే కొత్త హంగులు చేకూర్చుతున్నారు. ఇంకా కొందరు రెండు మూడు రకాల వాద్యాల లక్షణాలను ఒకే వాద్యంలో ఇముడ్చుతున్నారు. కొందరు పాత వాద్యాలనే ఏమీ మార్చకుండా కొత్త పద్ధతిలో వాయిస్తున్నారు.

కొత్త వాద్యాల నిర్మాణం ఉత్తరహిందూస్థానంలో జరుగుతున్నంత ఎక్కువగా దక్షిణాదిని జరగడం లేదు. పాశ్చాత్య దేశాలలో ఇంకా ఎక్కువగా జరుగుతున్నది. కర్ణాటక సంగీతంలోని వీణ, గోటువాద్యం, నాదస్వరం. మృదంగం వంటి వాద్యాలతో పోల్చితే హిందూస్థానీ సంగీతంలోని సితార్, సుర్ బహార్, సరోద్, తబలా వంటి వాద్యాలు చాలా కొత్తవి. భారతీయ సంగీతం రెండు భిన్న సంప్రదాయాలుగా విడిపోవడం ప్రారంభించిన తర్వాతనే హిందూస్థానీ సంప్రదాయానికి ప్రత్యేకమైన వాద్యాలుగా సితార్, తబలా, సరోద్ వంటి వాద్యాలు సృష్టింపబడినాయి. వీణలో కొన్ని మార్పులు చేయగా సితార్ తయారయింది. తిరిగి సితార్ లో కొన్ని మార్పులు చేయగా సుర్ బహార్ తయారయింది. పర్షియన్ వాద్యమైన రబాబ్ లో కొన్ని మార్పులు చేయగా సరోద్ తయారయింది (హిందూస్థానీ సంగీతంపై పర్షియన్ ప్రభావానికి ప్రత్యక్ష నిదర్శనం సరోద్). సితార్, సారంగి వాద్యాల రెండింటి లక్షణాలు కలిపి నిర్మించబడినది దిల్రుబా. రూపంలో కొంచెం ఇంచుమించు దిల్రుబా లాగానే ఉండి, నాదంలో మాత్రం శహనాయి, వైలిన్, సారంగి వాద్యాల మిశ్రమంగా ధ్వనించేది తార్ శహనాయ్. మృదంగంలోని కుడి, ఎడమ భాగాలను విడివిడిగా నిర్మిస్తే తబలా తయారయింది. హిందూస్థానీ సంగీతంలో కూడా వీణ ఉన్నది కాని దాని నాదం, రూపం దక్షిణాది వీణకు భిన్నంగా ఉంటుంది. దానిని వారు 'బీన్' అంటారు. అలాగే హిందూస్థానీ సంగీతంలో ఇప్పుడు ప్రచారంలో ఉన్న వేణువు భిన్నంగా ఉంటుంది. దక్షిణాది వేణువు సుమారు 12 అంగుళాల పొడవు ఉంటే, హిందూస్థానీ వేణువు సుమారు 32 అంగుళాల పొడవు ఉంటుంది. దానిని స్వర్గీయ పన్నాలాల్ ఘోష్ సృష్టించారు. అదివరకు కేవలం జానపద వాద్యంగా ఉండే వేణువుకు ఆయన కొత్త రూపం యిచ్చి, ఇంకో కన్నం ఎక్కువ పెట్టి, మూడు స్థాయిలు పలికే కచేరీ వాద్యంగా మార్చారు.

తార్ శహనాయ్ ఆట్టే ప్రచారంలోలేని అరుదైన వాద్యం. సారంగి, దిల్రుబా, శహనాయి, వైలిన్ వాద్యాలపై పలికే గమకాలన్నీ దీనిపై పలుకుతాయి. ఈ వాద్య వాదనంలో గొప్ప విద్వాంసుడనదగినవారు పండిత్ వినాయక్ వోరా ఒక్కరే. సారంగి వలె ఎక్కువగా పక్క వాద్యంగా ఉపయోగిస్తున్నప్పటికీ, సోలో కచేరీ వాద్యంగా కూడా ఆయన దానిని అద్భుతంగా వాయించగలరు. ఆయన సోలో లాంగ్ ప్లే రికార్డు ఒకటి పాలిడార్ కంపెనీవారు విడుదల చేశారు. అందులో ఆయన ఒకవైపు 'దేశ్' రాగం, రెండో వైపు 'పహాడీ', 'భైరవి' రాగాలు వాయించారు.

మహా విద్వాంసుడు, యోగి అయిన స్వామీ దత్తాత్రేయ పార్వతీకర్ 'దత్తాత్రేయ వీణ' అనే కొత్త వాద్యాన్ని సృష్టించారు. అందులో ఆయన సితార్, గోటువాద్యం, స్వరమండల్ వాద్యాల లక్షణాలను ఇమిడ్చారు. దాని రూపం సితార్ లాగానే ఉంటుంది. సితార్ లాగానే దానికీ రెండు బుర్రలు ఉంటాయి. సితార్ మెట్ల లాగానే దాని మెట్లను కూడా అటూ ఇటూ జరుపుకోవచ్చు. సితార్ లాగానే దానికీ అనురణన తంత్రులు (సింపతటిక్ స్ట్రింగ్స్) ఉంటాయి. సితార్ లాగానే దానినీ ఏటవాలుగా పట్టుకునే వాయిస్తారు. కాని, ఎడమ చేతి వ్రేళ్ళతో మెట్ల మీద వాయించడం కాక, గోటువాద్యం మాదిరిగా ఒక చిన్న కొయ్యముక్కను మెట్ల మీదుగా జరుపుతూ వాయిస్తారు. కుడి చేతితో తీగలు మీటే పద్ధతి కూడా సితార్ మాదిరిగాకాక, గోటు వాద్యం మాదిరిగా ఉంటుంది. అందుచేత వినడానికి అది గోటు వాద్యంలాగానే ఉంటుంది. పెద్ద బుర్రచట్రం మీద, దిగువ సగభాగంలో స్వరమండల్ మాదిరిగా తంత్రులను బిగించారు. వాయించే రాగానికి అనుగుణంగా అనురణన తంత్రులను శ్రుతి చేసినట్లుగానే, ఈ స్వరమండల్ తంత్రులను కూడా శ్రుతి చేస్తారు. వీణను వాయిస్తూ మధ్య మధ్య ఆయన ఎడమచేతి చిటికెన వ్రేలి గోటితో అనుకరణన తంత్రులను మీటుతూ ఉంటారు. కుడిచేతితో పెద్ద బుర్రమీద స్వరమండల్ తంత్రులను మీటుతూ ఉంటారు. దాని వల్ల ఆ వాద్యం ఒకేసారి గోటు వాద్యంలాగా, సితార్ లాగా, స్వరమండల్ లాగా ధ్వనిస్తుంది.

స్వామి పార్వతీకర్ 'దత్తాత్రేయ వీణ'పై వాయిస్తూ ఒక్కొక్కప్పుడు మంద్ర మధ్య తారస్థాయి తంత్రులను మూడింటినీ ఒకేసారి కుడిచేతి వ్రేళ్ళతో మీటుతూ, ఎడమచేతితో కొయ్య ముక్కను ఒకే సారి మూడు తీగలకు ఆనిస్తూ వాయిస్తారు. అప్పుడు వీణపై మూడు స్థాయిలు ఒకేసారి పలుకుతాయి. మూడు వాద్యాలు ఒకేసారి మూడు స్థాయిలలో వాయిస్తున్నట్లుగా వినిపిస్తుంది. అలా ఒకేసారి మూడు స్థాయిలలో వాయించే వారు బహుశా ఆయన ఒక్కరే. వీణ వాయించేటప్పుడు పెద్ద బుర్రమీద కుడిచేయి ఆనించి పట్టుకోవలసిన అవసరం లేకుండా ఆయన అల్యూమినియం బద్దీలతో చేసిన ఒక స్టాండు మీద దానిని ఏటవాలుగా నిలబెడతారు.

వీణ మీద బిగించిన స్వరమండల్ కాక, విడిగా కూడా స్వరమండల్ అద్భుతంగా వాయిస్తాడు ఆయన. ఒక చేతి వ్రేళ్ళతో తంత్రులు మీటుతూ, రెండవ చేతిలో ఒక సన్నని లోహపు కడ్డీతో తంత్రుల మీద సుతారంగా కొడుతూ ఉంటారు. అలా కొడుతున్నప్పుడు నిశ్చల సరోవరతలంపై పిల్లగాలికి పులకింతగా లేచే జలతరంగాల మాదిరిగా, అతి మధురమైన స్వరతరంగాలు ధ్వనిస్తాయి. స్వరమండల్ ను ఆయన తప్ప మరెవ్వరూ ఆ విధంగా వాయించరు. బదరీనాథ్ లో స్థిరపడిన కాషాయాంబర ధారి యైన ఆయన కచేరీ చేసే పద్ధతి అతి నవీనంగా ఉంటుంది. ఆయన కచేరీకి శ్రుతి కోసం తంబుర, ప్రక్క వాద్యంగా తబలా అక్కర్లేదు. తంబుర, తబలా కూడా ఆయన దగ్గర కేసెట్ టేప్ లలో సిద్ధంగా ఉంటాయి. కచేరీ మొదలు పెట్టే ముందు కాసేపు టేప్ రికార్డర్ మీట నొక్కుతారు. ఆలాప్, జోడ్. ఝాలా వాయించినంత సేపు తంబుర శ్రుతి మాత్రమే టేప్ రికార్డు చేసిన టేప్ ప్లే చేస్తారు. విలంబిత్ గత్ మొదలుపెట్టగానే తంబుర, తబలా రెండూ రికార్డు చేసిన టేప్ ప్లే చేస్తారు. ఏ తాళంలో కావాలంటే ఆ తాళంలో తబలా వాయించిన టేప్ లు ఆయన దగ్గర సిద్ధంగా ఉంటాయి. కాషాయ వస్త్రంతో కుట్టిన జోలెలో టేప్ రికార్డర్, టేపులు. ఒక సౌండ్ బాక్స్, అల్యూమినియం స్టాండ్ వగైరా సాధనాలన్నీ వేసుకుని, ఆ జోలె బుజాన తగిలించుకుని వెడుతూ ఉంటారు ఆయన.

స్వామీ పార్వతీకర్ కు శిష్యులెవరూ ఉన్నట్లు లేదు. అందుకని 'దత్తాత్రేయ వీణ' వాయించేవారు ఆయన తప్ప ఇంకెవరూ లేరు. గ్రామఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా వారు హెచ్.ఎం.వి. లేబుల్ పై ఆయన రికార్డులు రెండు విడుదల చేశారు. ఒకటి లాంగ్ ప్లే రికార్డు (ECLP 2301) మరొకటి ఎక్ స్టెండెడ్ ప్లే రికార్డు (7EPE1110). ఎల్.పి. రికార్డులో ఆయన ఒక వైపు పూర్తిగా దత్తాత్రేయ వీణపై-''భైరవ్'' రాగం, రెండవ వైపు ''పీలూపహాడీ'' రాగం, స్వరమండల్ పై ''భూపాలీ'' రాగం వాయించారు. ఇ.పి. రికార్డులో ఒకవైపు దత్తాత్రేయ వీణపై 'కనకలత' రాగం, రెండో వైపు స్వరమండల్ పై 'ధీమధుర్' రాగం వాయించారు.

సితార్, సరోద్, బాంజో లక్షణాలను పొందుపరుస్తూ 'మధువీణ' అనే ఒక కొత్త వాద్యాన్ని జలంధర్ కు చెందిన సర్దార్ అచ్చన్ సింగ్ తయారు చేశారు. దాని పెద్ద బుర్ర బాంజో (పాశ్చాత్య వాదం) మాదిరిగా ఉంటుంది. మిగతా రూపమంతా సితార్ లాగానే ఉంటుంది.

బ్రిజ్ భూషణ్ కబ్రా అనే యువ సంగీత విద్వాంసుడు హవాయ్ గిటార్ ను హిందూస్థానీ సంగీతానికి అనుగుణంగా మార్చారు. సరోద్ మీద పలికే గమకాలన్నింటినీ ఆయన తన గిటార్ పై అద్భుతంగా పలికిస్తారు. సుప్రసిద్ధ సరోద్ విద్వాంసుడైన ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ వద్ద శిష్యరికం చేసి, ముప్ఫయ్యేళ్ళకే అగ్రశ్రేణి విద్వాంసుల జాబితాలో చేరిపోయాడు.

వాద్య సమ్మేళనానికి అనుగుణంగా భారతీయ వాద్యాలలో మార్పులు తీసుకు రావడానికి పండిత్ రవిశంకర్ కూడా కొంత కృషి చేశారు.

నండూరి పార్థసారథి
(1974 మే 3వ తేదీన ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమయింది)

Previous Post Next Post