Title Picture

(9)

సుబ్బణ్ణగారు తొరెయపురంలో పదమూడు సంవత్సరాలున్నారు. చివరి రోజుల్లో ఆయన ఆందోళన, అశాంతి పూర్తిగా సమసిపోయాయి. నిజమైన తత్త్వజ్ఞానిగా ఆయన పరిణతి చెందారు. ఎవరినీ పల్లెత్తి ఒక్క పరుషమైన మాట అనే వారు కారు. జీవితంలో ఇది తనకు లేదని కాని, దీని వల్ల తనకు వ్యథ కలుగుతున్నదని గాని ఆయన అనుకునేవారు కారు. ఎప్పుడూ దైవచింతనలో శాంతంగా ఉండేవారు. అటువంటి వ్యక్తిని తత్త్వజ్ఞాని అనక ఇంకేమంటాము? అయితే చూడడానికి ఆయన తత్త్వజ్ఞాని లాగా కనిపించేవారు కారు. చివరిదాకా ఆయన ఫిడేలు వాయిస్తూనే ఉండేవారు. శిష్యులకు సంగీతం నేర్పుతూనే ఉండేవారు. నాకు ఆయనతో పరిచయం కావడానికి చాలా ముందు నుంచే ఆయన ఇళ్ళలో పడుకోవడం మానివేశారు. ఎవరి ఇంటి అరుగు మీదనో పడుకొనేవారు. లేకపోతే దేవాలయ ప్రాంగణంలో పడుకొనేవారు. వీధికి ఒకవైపు ఇంటి అరుగుమీద పడుకున్నప్పుడు వర్షపు జల్లుపడితే రెండో వైపు ఇంటి అరుగుమీద పడుకొనేవారు. అలా పదమూడేళ్ళు కేవలం సన్యాసిలాగా జీవించారు. ఆయనంటే ఊరి వారందరికీ ఎంతో గౌరవం, అభిమానం. అందరూ ఆయనకు తమదైన సహాయం అందించాలని అనుకొనేవారు. కాని ఆయనకు ఎవరి సహాయం అవసరమయ్యేదికాదు. ఎవరైనా ఏదైనా ఇస్తే అది వారి ఆత్మ తృప్తికోసమే తప్ప, నిజంగా ఆయనకు అవసరమై ఇవ్వడం కాదు. చివరి రోజుల్లో సుబ్బణ్ణగారు అలా యోగిలాగా జీవించి, భగవంతుని పాదారవిందాలను చేరుకున్నారు. నేను కళ్ళారా చూసిన ఆయన చరమ జీవితం గురించి కొంత చెప్పి ఈ కథ ముగిస్తాను.

తొరెయపురం నదీతీరాన ఉన్న ఒక తాలూకా కేంద్రం. చాలామంది బ్రాహ్మణులున్న మంచి అగ్రహారం. పట్టణంలో ప్రసిద్ధమైన ప్రాచీన దేవాలయం ఒకటుంది. తపస్సు చేసుకోవడానికి అనువైన అతి ప్రశాంత ప్రదేశం అది. తొరెయపురం చేరిన నాటి రాత్రి సుబ్బణ్ణగారు ఆ దేవాలయ ప్రాంగణంలోనే పడుకున్నారు. వ్యాకులమైన మనస్సుతో ఆయనకు సరిగా నిద్రపట్టలేదు. తాను దిక్కులేని వాడిననే భావం ఆయన మనస్సును కలచివేసింది. కాసేపు కునుకుపట్టినా అంతలోనే అనాథబాలుడు భయంతో ఉలిక్కిపడి లేచినట్లుగా లేచేవారు. అలా లేచినప్పుడల్లా తనను తానే సమాధానపరచుకొనేవారు. “భయందేనికి? దిక్కులేని వారికి దేవుడే దిక్కు. నీకు కావలసిందేముంది? దైవధ్యానంలో నిశ్చింతగా కాలం గడుపు. నువ్వు ఇతరులలాగా జీవించడం లేదనా నీచింత? ఒకప్పుడు నువ్వూ అలాగే జీవించావు కదా. పెళ్ళాం బిడ్డలతో జీవితం ఎలా ఉంటుందో నువ్వూ చూశావుకదా. ఇప్పుడు నువ్వు ఆదశను దాటి వచ్చావు. వారింకా ఆదశలోనే ఉన్నారు. ఇప్పుడు వారి జీవితం అది. నీ జీవితం ఇది. ఇదంతా దైవేచ్ఛ. దీన్ని గురించి చింతపడకు” అని తనకు తానే చెప్పుకున్నారు.

తెల్లవారిన తరువాత కూడా ఆయనకు దిగులువదల్లేదు. కాసేపు అలాగేకూర్చుని మళ్ళీ మళ్ళీ అవే ఆలోచనలతో గడిపారు. తరువాత లేచి నదికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ గుడికి తిరిగివచ్చారు. చిన్న బట్టలమూట, ఫిడేలు పట్టుకున్న ఈ ముసలాయన్ని చూసి నదికి వచ్చిన వారు “అయ్యో పాపం... ఎవరో ఈయన?” అని జాలిపడ్డారు. సుబ్బణ్ణగారు వారిని గమనించలేదు. కొంతపొద్దెక్కాక ఒక కుర్రవాడు ఆయన దగ్గరకు వచ్చాడు. అతడు ఒక వేశ్య కుమారుడు. కొద్దిగా సంగీతం నేర్చుకున్నాడు. ఫిడేలు వాయిస్తాడు. సుబ్బణ్ణగారి ఫిడేలు చూసి గబగబ వచ్చి “ఏ ఊరండి మీది?” అని అడిగాడు. ఆ కుర్రవాడు ప్రత్యేకమైన వినయ విధేయత లేవీ చూపకుండా మామూలుగా అడిగాడు. సుబ్బణ్ణ గారు సమాధానమివ్వలేదు. ఎవరితో పడితే వారితో మాట్లాడేటంత సహనం ఆయనకు ఆ సమయంలో లేకపోయింది. “ఆ కుర్రవాడు మళ్ళీ అయ్యా మీది ఏ ఊరు?” అని అడిగాడు. సుబ్బణ్ణగారు విసుగ్గా “ఏదో ఒక ఊరు” అని సమాధానమిచ్చాడు. అయినా ఆ కుర్రవాడు వదిలిపెట్టలేదు. దగ్గరకు వచ్చి కూర్చుని ఫిడేలు తీసుకుని పరిశీలించాడు. చాలా మంచి ఫిడేలు అని అనుకుని దాన్ని యథాస్థానంలో ఉంచాడు. “అయ్యా... మీ ఫిడేలు చాలా మంచిది. కొద్దిగా వాయించి వినిపించరూ” అని అడిగాడు. సుబ్బణ్ణగారు జవాబివ్వలేదు. కుర్రవాడు కొంచెం ఆగి “ఏమండీ ఈ ఫిడేలు నాకు అమ్మేస్తారా? పది హేను రూపాయలిస్తాను” అని అడిగాడు. “ఈ ముసలాయన వాలకం చూస్తే ఫిడేలు వాయించగల వాడిలా లేడు. ఏం చేసుకుంటాడు దాన్ని. ఎక్కణ్ణించో దొంగతనంగా తీసుకొచ్చి ఉంటాడు. ఈయన దగ్గర్నుంచి చవగ్గా సంపాదించవచ్చు దీన్ని” అనుకున్నాడు ఆ కుర్రవాడు. సుబ్బణ్ణగారు జవాబివ్వలేదు.

“ఏమండీ అమ్ముతారా?” అని మళ్ళీ అడిగాడు ఆ అబ్బాయి.

“నేను ఫిడేలు వాయించను. అమ్మను. నీ దారిని నువ్వుపో” అని చిరాకుగా జవాబిచ్చాడు సుబ్బణ్ణగారు.

“అదేమిటండీ అలా అంటారు? చేతనైతే వాయించండి. చేతకాకపోతే చేతనైన వారికి అమ్మండి. మీకు పనికి రాని వస్తువు మీ దగ్గరదేనికి?” అంటూ ఆ కుర్రవాడు ఫిడేలు తీసుకుని “పోనీ నేనెలా వాయిస్తానో చూడండి” అన్నాడు. అతను భైరవి రాగం వాయించడం మొదలుపెట్టాడు. అది వింటూనే సుబ్బణ్ణగారిలో కళాకారుడు మేలుకొన్నాడు. కుర్రవాడు ముగించగానే ఆయన ఫిడేలు అందుకొని అదే రాగం తన ప్రత్యేక శైలిలో వాయించాడు. సుబ్బణ్ణగారు వాయించేది దాక్షిణాత్య సంగీతమే అయినా ఆయన వాదనంలో హిందూస్తానీ సంగీత ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. దాని వల్ల రాగానికి ఒక విచిత్రమైన అందం వస్తుంది. ఆయన వాయించేది ఒక్క నిమిషం వినగానే కుర్రవాడికి ఆయన గొప్పతనం అర్థమయింది. “ఆహా... ఎంత గొప్పగా వాయిస్తున్నారు” అని మెచ్చుకుని శ్రద్ధగా, వినయంగా కూర్చుని విన్నాడు. ఇంకా కొంత మంది జనం కూడా అక్కడ చేరి ఆయన సంగీతం వింటూ నిలబడ్డారు. అలా గుంపు పోగవడం ఇష్టం లేక సుబ్బణ్ణగారు రాగాన్ని త్వరగా ముగించి, ఫిడేలు, మూట తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

సుబ్బణ్ణగారికి తనపై తనకే చిరాకు కలిగింది. “అన్నీ వదిలేశాను. కాని అహంకారాన్ని వదలలేకపోయాను” అనుకున్నారు. ఎవడో కుర్రాడు తనని చులకనగా చూస్తే సహించలేక పోయాడు. తన గొప్పతనం ఆ కుర్రవాడికి తెలియజెప్పాలని ఫిడేలుపై తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. ఎంత అవివేకం! వెనకటి జీవిత వైభవం అంతా పోయింది. భార్య పోయింది. పిల్లలు పోయారు. తల్లి, తండ్రి, అక్కలు - అందరూ పోయారు. ఈ ఫిడేలు మీద తనకి ఎందుకింత మమకారం? అన్నీ పోయినా ఇది మిగిలింది. ఇది ఉన్నంత వరకు తనకు విద్యామదం ఉంటుంది. ఇది పోవాలి. దీనితో పాటు ఆ మదం పోవాలి. ఇలా ఆలోచించి ఆయన ఫిడేలును అవతల పారేయాలని నిశ్చయించుకున్నారు. ఫిడేలు పట్టుకుని నదీ తీరానికి వెళ్ళారు. అక్కడ జనం ఎక్కువ మంది లేరు. ఉన్న ఇద్దరు ముగ్గురూ వెళ్ళిపోయేదాకా ఆగారు. చుట్టూ చూసి, అక్కడ ఎవరూ లేరని నిర్థారించుకొని, ఫిడేలును ఒక బండకేసి కొట్టాలని పైకెత్తాడు. కాని కొట్టలేకపోయాడు. చెయ్యి బిగుసుకుపోయినట్లయింది. అక్కడే కూర్చుని రెండు నిమిషాలు ఆలోచించాడు. తరువాత నీళ్ళ దగ్గరికి వెళ్ళాడు. “భగవంతుడా, అన్నీ వదిలేశాను. దీన్ని కూడా వదిలేస్తున్నాను. ఇప్పుడైనా నాకు శాంతిని ప్రసాదించు” అని ప్రార్థిస్తూ ఆయన ఫిడేలును నదీ ప్రవాహంలోకి వదిలేశాడు. గట్టుమీదకు వచ్చి “ఇంక నాకు ప్రపంచంతో అన్ని బంధనాలూ తెగిపోయాయి” అనుకున్నాడు. కాని ఎంత ప్రయత్నించినా ఉద్వేగాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చాడు. కొన్ని సంవత్సరాల తరువాత సుబ్బణ్ణ గారు ఆ సంఘటన గురించి నాకు చెబుతూ “నా భార్య, పిల్లలు పోయినప్పుడు కూడా నేను అంతగా ఏడవలేదు. ఫిడేలు నీళ్ళలో కొట్టుకుపోతుంటే గుండె పగిలేట్టు ఏడ్చాను. నా బొందిలోని ప్రాణాన్నే పెకలించి తీసి విసిరేసినట్లుగా అనిపించింది” అని అన్నాడు.

తన అహంకారానికి ప్రతీక అయిన ఫిడేలును విసర్జించిన తరువాత సుబ్బణ్ణగారు ఊళ్ళోకి వెళ్ళి ఏదో పండు కొనుక్కుని దేవాలయానికి తిరిగి వచ్చాడు. ఆ పండును దేవునికి నైవేద్యమిచ్చి, ప్రసాదంగా స్వీకరించి తిన్నాడు. అక్కడ ఒక స్తంభాన్ని ఆనుకొని దిగులుగా కూర్చున్నాడు. తన చివరి నేస్తం ఫిడేలు కూడా పోయింది. ఇంక మిగిలినదల్లా బట్టలే. ఆ రాత్రికలలో ఫిడేలు ఆయనను వెన్నాడింది. అర్ధరాత్రి మెలకువ రాగా ఆయన తాను చేసిన పని గురించి ఆలోచించచడం మొదలుపెట్టాడు. “ఫిడేలును పారవేయడం అవివేకం. అది ఉంటే దైవసన్నిధిలో ఏదైనా కీర్తన వాయించుకునేవాణ్ణి-దైవ ప్రీతి కోసం ఏదైనా రాగం ఆలాపన చేసేవాణ్ణి. ఇప్పుడు దేవుడిని ఆ విధంగా సేవించుకొనే అవకాశం లేదు” అనుకున్నాడు. తను బెంగాల్ కు వెళ్ళిన కొత్తలో ఆ ఫిడేలుకొన్నాడు. దానితో ఎంతో మంది శ్రోతలను రంజింపజేశాడు. తాను బాగా బతికిన కాలంలో అది తనకు తోడుగా ఉంది. అందుకే తాను దాన్ని అంతగా ప్రేమించాడు. ఈ ఆలోచనలతో ఆలస్యంగా నిద్రపట్టడంతో ఆయన ఉదయం ఆలస్యంగా లేచాడు.

నిద్రలేవగానే ఆయన ఎదుట ఫిడేలు సాక్షాత్కరించింది. కలేమోనని కళ్ళు బాగా తుడుచుకొని చూశాడు. అది సాక్షాత్తూ తన ఫిడేలే. “ఎంత మాయగా ఉంది!” అనుకున్నాడు. కాసేపు తనకళ్ళను తాను నమ్మలేకపోయాడు. ఆశ్చర్యం నుంచి తేరుకున్న తరువాత పట్టరాని సంతోషంతో దాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. కిందటి రోజు పరిచయమైన కుర్రవాడు ఒక స్తంభం చాటునుంచి పక్కకు వచ్చి ఆయన ఎదుటనుంచున్నాడు. సుబ్బణ్ణగారు తలఎత్తిచూడగానే ఆ కుర్రవాడు ఆయన పాదాలపై పడ్డాడు. “మీరేనా గురువు. నిన్న మీతో ఆవిధంగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. మీరు ఇంత గొప్ప విద్వాంసులని తెలుసుకోలేకపోయాను” అన్నాడు కుర్రవాడు.

“నువ్వేమీ తప్పుగా మాట్లాడలేదు నాయనా. అలా బాధ పడకు” అన్నాడు సుబ్బణ్ణగారు.

“గురువుగారూ... మీకు ఎవరూ తోడులేనట్టుంది. మీరు అనుమతిస్తే మీకు సేవచేస్తాను”.

“నాకు ఎవరూ సేవ చేయనక్కర్లేదు నాయనా. నేనే సేవకుణ్ణి. నాకు ఇంకొక సేవకుడు దేనికి?”

సుబ్బణ్ణగారి మాటల్లో అది వరకటి కటుత్వం లేదు. కారణం-నదీప్రవాహం నుంచి ఫిడేలును కాపాడి తెచ్చి తనకు ఇచ్చిన కుర్రవాడి పట్ల కృతజ్ఞతా భావం. కుర్రవాడు తనకెంతో మేలు చేశాడు. దాని వల్ల అతడిపై కొంత అభిమానం ఏర్పడింది. ఆయన కాసేపు మౌనంగా ఉండిపోయాడు. కుర్రవాడు వినయంగా చేతులు కట్టుకుని కాస్తదూరంలో కూర్చున్నాడు. తన పక్కన ఎవరూ ఉండకూడదని అనిపించినా సుబ్బణ్ణగారు ఆ కుర్రవాణ్ణి పొమ్మని అనలేకపోయాడు.

“అయ్యా... నా పేరు వెంకటరమణ. మేము బోగం వాళ్ళం. మీకు అభ్యంతరం లేకపోతే మళ్ళీ వచ్చి తమ దర్శనం చేసుకుంటాను. ఈలోగానే తమకేదైనా అవసరమైతే ఎప్పుడైనా సరే మా ఇంటికి దయచేయవచ్చు. లేదా ఎవరిచేతనైనా కబురు చేస్తే వస్తాను” అన్నాడు కుర్రవాడు. అతను లేచి వెడుతుంటే కాసేపు ఉండమనాలని సుబ్బన్నగారికి అనిపించింది. కాని, అంతలో మనస్సు మార్చుకున్నాడు. “ఇక్కడకూడా మళ్ళీ కొత్త పరిచయాలు సంబంధాలు దేనికి? అతణ్ణి పోనీ. నాకు ఎవరూ అక్కర్లేదు” అనుకున్నాడు. ఈ ఆలోచనలతో ఆయన మౌనంగా ఉండిపోయాడు.

వెంకటరమణ మళ్ళీ మధ్యాహ్నం వచ్చాడు. అప్పటికి సుబ్బణ్ణగారు స్నానాదికాలు ముగించుకొని గుడి ముందు కూర్చున్నాడు. వెంకటరమణ పొద్దున వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం తిరిగి వచ్చేవరకు సుబ్బణ్ణగారు ఆలోచిస్తూనే ఉన్నాడు. “నా జీవితం ఇలా నిరర్థకంగా గడచిపోతుందా? ఎవరికీ ఏ ఉపకారం చేయకుండా ఎందుకొచ్చిన జీవితం ఇది? ఉపకారం మాట అటుంచి కనీసం ప్రత్యుపకారమైనా చేయాలి కదా. ఈ కుర్రవాడు నా ఫిడేలు నాకు తెచ్చిఇచ్చాడు. నాకీ ఉపకారం ఎందుకు చేయవలసివచ్చింది? సరే చేశాడు. చేసినందుకు ప్రత్యుపకారంగా అతడికి పది పన్నెండు పాఠాలైనా చెప్పవద్దా” అనుకున్నాడు ఆయన.

వెంకటరమణ వచ్చి నమస్కారం చేసి, అల్లంత దూరంలో చేతులు కట్టుకుని నుంచున్నాడు. సుబ్బణ్ణగారు అతడిని కూర్చోమని సంజ్ఞచేశాడు. వెంకటరమణపై ఆయనకు ఈ మాత్రం అభిమానం కలగడానికి కొంత కారణం నీలసాని జ్ఞాపకాలు. నీలసాని కూడా బోగం కులానిదే. స్నేహం, అభిమానం ఇటువంటి విచిత్రమైన కారణాల వల్ల కూడా ఏర్పడతాయి.

సుబ్బణ్ణగారు తనంతట తనే కుర్రవాణ్ణి మెచ్చుకుంటూ “నువ్వు ఫిడేలు బాగా వాయిస్తావు” అన్నారు.

“తమ వంటి పెద్దల ఆశీర్వాదం వల్ల ఏదో కొద్దిగా నేర్చుకున్నాను. కాని తమ విద్వత్తు ముందు మా యోగ్యత ఎంత? మీ అంత గొప్పగా ఫిడేలు వాయించగలవారు ఈ ప్రాంతంలో ఎవరూ లేరని చెప్పగలను”.

“నీకు వీలైనప్పుడు నీ ఫిడేలు తీసుకొచ్చి వాయించు. వింటాను”.

“తమ దయ. మీరు సంగీతం నేర్పితే మీ అనుగ్రహంతో ఇక్కడి వాళ్ళందరినీ మించి పోగలను”.

కుర్రవాడి ఉత్సాహం చూస్తే సుబ్బణ్ణగారికి తన చిన్నతనం జ్ఞాపకం వచ్చింది. ఎక్కడో దూరతీరాల నుంచి లీలగా ఉరుముల శబ్దం వినిపించినట్లు తన చిన్ననాటి ఉత్సాహం, పట్టుదల... అన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఆయన మౌనంగా ఉండిపోయాడు.

వెంకటరమణ మళ్ళీ అన్నాడు. “అయ్యా... తమ భోజనానికి కావలసిన ఏర్పాట్లు చేశాను.. తమరు స్మార్తులని నాకు తెలుసు. అందుచేత తమకు స్మార్తుల ఇంటిలోనే భోజనం ఏర్పాటు చేశాను. దీక్షితులు గారంటే చాలా పేరు ప్రతిష్ఠలు గల వారు. మంచి ఆచార పరులు కూడా”.

సుబ్బణ్ణగారికి కొంచెం భయం వేసింది. ఋణభారం పెరిగిపోతోందని అనిపించింది. “ఎందుకయ్యా ఇదంతా? నీకు బుద్ధిపుట్టినప్పుడు ఫిడేలు తీసుకొచ్చి ఓ పావుగంట వాయించు. వింటాను. అంతకుమించి నువ్వు నా కోసం ఏమీ చెయ్యవద్దు” అన్నాడు ఆయన.

సుబ్బణ్ణగారి మనస్సు ఇంకా కుదుటపడలేదని గ్రహించాడు వెంకటరమణ. లేచి నమస్కరించి వెళ్ళిపోయాడు.

ఆ కిందటి రోజు తాను విసిగించడం వల్లనే గురువు గారు ఫిడేలును నదిలో పారవేశాడనీ, అందుచేత ఇంకెప్పుడూ ఆయనను విసిగించకూడదనీ అనుకున్నాడు వెంకటరమణ. కిందటి రోజు సుబ్బణ్ణగారు ఫిడేలు పుచ్చుకుని నది వద్దకు వెళ్ళినప్పుడు ఆ కుర్రవాడు ఆయనకు కనిపించకుండా కొంతదూరంలో ఉండి ఆయనను అనుసరించాడు. సుబ్బణ్ణగారు ఫిడేలును రాతికేసి కొట్టడానికి ప్రయత్నించడం, ఆ పని చేయలేక దానిని నదిలో వదిలేయడం, తరువాత గట్టుమీద కూర్చుని ఏడవడం అంతా అతను చూశాడు. అతడిది చాలా మెత్తటి మనస్సు. ఆ ముసలాయన దుఃఖం చూసి అతడి మనస్సు కరిగిపోయింది. “ఎంత గొప్ప ఫిడేలు అది! ఏ కళాకారుడైనా దాని కోసం ప్రాణం పెడతాడు. ముసలాయన అంత గొప్పకళాకారుడై ఉండి దాన్ని నదిలో వదిలేశాడంటే ఆయన ఎంత విసిగివేసారిపోయి ఉండాలి? ఆయనను అలా విసిగించిన పాపం నాదే. ఈ తప్పును నేనే దిద్దుకోవాలి” అనుకొని అతను నదిలోకి దూకి ఫిడేలును పట్టుకున్నాడు. రోజంతా అతను సుబ్బణ్ణగారికి కనిపించకుండా దూరంగా ఉండి ఆయన అవస్థను గమనించాడు. ఆయన ప్రసన్నంగా ఉన్న సమయం చూసి ఆయనకు ఫిడేలును అప్పగించాలని ఎదురు చూశాడు. కాని ఆ రోజంతా అటువంటి అవకాశం దొరకలేదు. అందుచేత ఆయన నిద్రపోతున్నప్పుడు దాన్ని ఆయన ఎదుటపెట్టి, నిద్రలేవగానే ఆయన దాన్ని చూసి ఏం చేస్తాడో చాటు నుంచి గమనించాలనుకున్నాడు. దాన్ని చూసి ఆయన సంతోషిస్తే ఆయనతో మాట్లాడాలనీ, లేకపోతే మెల్లగా అక్కణ్ణించి తప్పుకుని, ఆ తరువాత ఎప్పుడైనా మంచి సమయం చూసి ఆయనను కలుసుకోవాలనీ అనుకున్నాడు. అలాగే చేశాడు. ఫలితం అతడికి అనుకూలమయింది. అతడు ముసలాయన అనుగ్రహానికి పాత్రుడైనాడు. అతడికి సంగీతం నేర్పడానికి ఆయన అంగీకరించాడు. భూదేవి వైకుంఠనాథుని ధర్మపత్ని. ఆమె మన తల్లి. బిడ్డలమైన మనం కోపంతో, మంకుతనంతో దూరంగా పోవాలనుకున్నా ఆమె లాలించి మళ్ళీ మనల్ని దగ్గరకు తీసుకుంటుంది. సుబ్బణ్ణగారికి, తొరెయపురానికి మధ్య ఆ రోజు ఆ విధంగా ప్రారంభమైన సంబంధం దిన దిన ప్రవర్థమానమయింది. సుబ్బణ్ణగారు ఎప్పుడూ ఎవరినీ ఏమీ అడిగేవారు కారు. ఏమీ ఆశించేవారు కారు. తన మానాన తాను ఒంటరిగానే బతికేవారు. అయినా ఆ ఊరి ప్రజలు ఆయనను ఎంతో గౌరవించేవారు, అభిమానించేవారు. ఆయన దగ్గర ఎందరో ఫిడేలు నేర్చుకునేవారు.

“ఈ ఫిడేలును నేను పారవేసినా దేవుడు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. నేను వాయిస్తే వినాలని దేవుడికి కోరిక కాబోలు” అనుకున్నాడు సుబ్బణ్ణగారు. ఆ భావనతోనే ఆయన అప్పుడప్పుడూ గుళ్ళో దేవుని ఎదుట ఫిడేలు వాయించేవాడు. కష్టపడినా, సుఖపడినా అసలు జీవితమంటేనే దేవుని సేవ అనే అభిప్రాయానికి వచ్చాడు ఆయన. జీవితంలో ప్రతి విషయం దేవుని ఇచ్ఛగా గుర్తించి, స్వీకరించడం నేర్చుకున్నాడు. నిశ్చల భక్తితో, సేవాభావంతో ఆయన శేష జీవితాన్ని గడిపాడు.

నండూరి పార్థసారథి
(1987లో అనువదించబడినది)

Previous Post Next Post