Humor Icon

తెలుగు కథానిక (ఒక మచ్చుతునక)
కథనం: నండూరి పార్థసారథి
బ్రాక్టెట్లో వ్యాఖ్యానం: ఆరుద్ర

ప్రశాంత ప్రభాతం. (పొద్దున్నే కథ మొదలెట్టాలి). బాలభానుడు తన అరుణారుణ కిరణాలతో ప్రకృతి కాంతను గిలిగింతలు పెడుతున్నాడు. పక్షుల కిలకిలా రవములు వీనుల విందుగా వున్నాయి. పరంధామయ్యగారు వీధి అరుగు మీద కూర్చుని చుట్ట కాల్చుకుంటున్నాడు. (ఆయనకు సిగరెట్లు అసయ్యం. అతగాడికి అమ్మా నాన్నా ఏ పేరు పెట్టినా తెలుగు కథకుడు మాత్రం ఈ పేరే పెడతాడు). పరంధామయ్య గారు ఆ వూరిలో పేరు మోసిన పెద్ద ఆసామి. గౌరవ ప్రతిష్ఠలు గల ఉత్తమ కుటుంబీకుడు. ఆయన భార్య జానకమ్మగారు. (అందుబాటులో వున్న పేరు యిదే. అందుకే పెట్టాను). ఆమె భర్తకు తగిన ఉత్తమ ఇల్లాలు. వారి ఏకైక సంతానమే శేఖరు. అతడు ప్రతిభ, సంస్కారము, అందము గల నవీన యువకుడు, ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు. నొక్కుల నొక్కుల జుట్టుగలవాడు, బి.ఏ. ఫస్టు క్లాసులో ప్యాసై అప్పుడే రైలుదిగివచ్చాడు. (తెలుగు సినిమా హీరో ఫస్టుక్లాసులోనే ప్యాసవుతాడు.)

పరంధామయ్య గారు సంతోషంతో "ఏమేవ్ అబ్బాయి వచ్చాడేవ్" అంటూ భార్యను కేకపెట్టాడు. పప్పు రుబ్బుతున్న జానకమ్మ గారు బయట వరండాలోకి వచ్చి కొడుకుని చూసి "ఏమిట్రా మరీ అలా చిక్కిపోయావు" అంది. (సినిమా డైలాగు-కాపీ రైటు). "నీ కంటికి వాడెప్పుడూ చిక్కినట్లే వుంటాడులెద్దూ. వాడికేం బాగానే వున్నాడు" అన్నారు పరంధామయ్య గారు వేళాకోళంగా. (కాపీ చేయురైటు-డిటో). "పోదురూ మీరు మరీనూ బడాయి. చిక్కలేదంటారేమిటీ. వాడి మొహం అలా డోక్కు పోయి వుంటేనూ. తినేది హోటలు భోజనమా మరోటీనా" అంది జానకమ్మ గారు భర్తను కసురుకుంటూ. పరంధామయ్య గారు నవ్వుతూ "సరేలే ఈ కబుర్లకేం వచ్చె. అమ్మా రాధా మీ బావ వచ్చాడమ్మా. కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళూ తీసుకురా" అని పిలిచాడు. రాధ కొత్త పెళ్ళి కూతురు లా సిగ్గుపడుతూ చెంబుతో నీళ్ళు తీసుకువచ్చి గుమ్మం దగ్గరే ఆగిపోయింది. (కథలో హీరో హీరోయిన్ల తొలిసమావేశం ఈ కథకుడు కళ్ళకు కట్టినట్లు వర్ణించకలేకపోతే ఏ సినిమా ఘట్టమైనా జ్ఞప్తికి తెచ్చుకోండి). "అబ్బో అదంతా సిగ్గే. ఇప్పుడే యింత సిగ్గయితే రేపు ఆ మూడు ముళ్ళు పడింతరవాతో" అన్నాడు పరంధామయ్య గారు. రాధ రుసరుసలాడుతూ "ఫో మావయ్యా. నువ్వు యెప్పుడూ యింతే" అంటూ నీళ్ళ చెంబు బావకాళ్ల దగ్గర పెట్టి లోపలికి తుర్రుమంది. శేఖర్ మరదలి వంక ఓరగా చూసి "అమ్మాయిగారి పని పట్టించాలి" అనుకున్నాడు. ఇంతలో రాధ తల్లి దుర్గమ్మగారు వచ్చి "ఏం బాబూ ఇదేనా రావటం. కులాసాగా వున్నావా" అని ప్రశ్నించింది. "కులాసాగానే వున్నా అత్తయ్యా" అన్నాడు శేఖర్. దుర్గమ్మ గారు భర్త దివంగతుడైనప్పటి నుంచి అన్నగారి వద్దనే వుంటున్నది. ఆమెకు రాధ ఒక్కగాను ఒక్క కూతురు. (ఆమెకు ఇతర సంతానముంటే ఆమె పోషించగలదో లేదో గాని ఈ కథకుడు మాత్రం పాత్రపోషణ చేయలేడు. అందాల భరిణ, సుగుణాల ప్రోవు. రాధా, శేఖర్ చిన్నప్పటి నుంచి ఒక్కటిగా పెరిగారు. ఒకరి నొకరు గాఢంగా ప్రేమించుకున్నారు.

శేఖర్ స్నానం చేసి బట్టలు వేసుకుని గదిలోకి వెళ్ళేసరికి రాధ అక్కడ ఒంటరిగా కనిపించింది. "అమ్మాయిగారు చాలా పెద్ద దయిందే. అప్పుడే పెద్దా పేరక్కాలాగ చీరకట్టింది" అన్నాడు. "మహా నువ్వు మాత్రం ఇంకా చిన్న పాపాయిలాగా వున్నావా? సూటూ బూటూ వెయ్యలా దొరగారిలాగా" అంది గడుసుగా. "అబ్బో మరదలు పిల్ల మాటలు నేర్చిందే" అంటూ జడపట్టుకు లాగి కౌగిలించుకున్నాడు. రాధ తప్పించుకుంటూ "అబ్బ పో బావా నువ్వు ఎప్పుడూ ఇంతే. ఎన్నేళ్ళు వచ్చినా కొంటె చేష్టలు మానలేదు. ఎవరైనా చూస్తే" అంది. "ఏం చూస్తే. ఎప్పటికైనా నువ్వు నాదానివేగా" అన్నాడు శేఖర్. "అబ్బాయిగారికి అప్పుడే అంత తొందర పనికిరాదు" అంటూ లేడిపిల్లలా పారిపోయింది రాధ (ఈ రసవత్తరమైన సంభాషణలో అడ్డురావటం ఇష్టం లేక మా వ్యాఖ్యానం ఆపాం. కథానాయికతో పాటు మా వ్యాఖ్యానం కూడా పారిపోయింది)

"చదువైనట్లేగా, మరి పెళ్ళి మాటేం చెపుతావ్. అత్తయ్య తొందరపెడుతోంది" అంది జానకమ్మ గారు కొడుక్కి మరికాస్త వంకాయ కూర వడ్డిస్తూ. "ఇప్పుడే పెళ్ళికేం తొందరమ్మా" అన్నాడు శేఖర్ పచ్చడి కలుపుకుంటూ. "తొందరకాకేవిట్రా, నీకూ ఏళ్ళు వచ్చాయా మరి. పెళ్ళి కెదిగిన పిల్లను ఇంట్లో పెట్టుకోవటం ఏవంత విధాయకంగనుక" అన్నాడు పరంధామయ్య గారు పులుసుపోసుకుంటూ. "అవును బాబూ, నేనూ పెద్దదాన్నయ్యాను. పైగా ఈ మధ్య నా ఆరోగ్యమూ అంతంత మాత్రంగానే వుంది. ఏదో దానికి ఆ మూడు ముళ్ళూ పడితే నిశ్చంతగా కన్నుమూస్తాను" అంది దుర్గమ్మ గారు. ('నెయ్యిగిన్నె పట్టుకుని' అనే యాక్షను రాయడం మరిచిపోయామనుకుంటున్నారా. ఈ వంటకాల గురించి వ్రాస్తూ మీకు నోరూరుతోంది. వెధవహోటలు భోజనం! గమనించారా లోగడ ఫలానా పంక్తిలో ఒకానొక పాత్రచేత హోటలు భోజనాన్ని తిట్టించాం.) "నువ్వేం బెంగపడకు వదినా. రాధను చేసుకోవాలని వాడికి మాత్రం తొందరగా లేదా ఏమిటి పైకి అలా అంటాడు గానీ" అంది జానకమ్మ గారు నవ్వుతూ. "ఏమిటోయ్ చెప్పుమరి ఒప్పుకున్నట్లేనా" అని రెట్టించాడు తండ్రి. శేఖర్ తలవంచుకుని "సరే నాన్నగారూ మీ యిష్ట ప్రకారమే కానివ్వండి. నేను కాదంటానా" అన్నాడు మజ్జిగ కలుపుకుంటూ. ('మజ్జిగ జుర్రుతూ' అని రాద్దామనుకున్నాం. రేపు ఈ మా కథను సినిమా కెక్కిస్తే ఏ హీరో అలా చెయ్యడు. ఈ యాక్షన్ వుంది కనుక కథ పనికిరాదు. 'యాంటీ సెంటిమెంటు' అనవచ్చు. అందుకే అలా రాయలేదు.) తలుపు చాటున వుండి బావను ఓరగంట చూస్తూ ఈ సంభాషణలు వింటున్న రాధమ్మ చెక్కిళ్ళలో మందారాలు మొగ్గలు తొడిగాయి.

వివాహం వైభవంగా జరిగింది. బంధుమిత్రులతో పెళ్ళిపందిరి క్రిక్కిరిసిపోయింది. అందరూ వధూవరులను ఆశీర్వదించారు. "ఆయనేవుంటే యెంత సంతోషించేవారో" అని కళ్ళు ఒత్తుకుంది దుర్గమ్మ గారు.

ఆనాటి రాత్రి శోభనం గదిలో (అత్యంత రసవత్తరం) రాధా శేఖరుల హృదయాలు ఆనంద తరంగాలతో సయ్యాటలాడాయి. నును సిగ్గు ముంచుకువస్తుండగా వయ్యారంగా వచ్చి రాధ తన ప్రియుని హృదయంపై వాలిపోయింది.

"బా... వా... నే నెంత అదృష్టవంతురాల్ని" అంది రాధ గద్గదస్వరంతో. (గమనిక : మూడు చుక్కలూ, మూడు డేషులూ) "నేను... మాత్రం?" అంటూ శేఖరు ఆమెను తనివితీర బిగియార కౌగిలించుకుని లేత పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు.

"రా... ధా...."

"బా.... వా..."

ఒండొరుల కౌగిలిలో ఈ విశాల విశ్వమునే మరచిన ఆ ప్రేమజీవులను చూసి చందమామ సిగ్గుతో మబ్బులు మాటుకు పెళ్ళిపోయాడు.

(ఈ కథ కంచికి కాక, సినిమా ప్రొడ్యూసర్లుండే కోడంబాక్కం పోతే ఎంత బాగుండును!)

నండూరి పార్థసారథి
(1963లో 'జ్యోతి' మాసపత్రికలో ప్రచురితమైనది)

Previous Post Next Post