Title Picture

ఆధునిక ధర్మ ప్రచండ వాయుధాటికి సనాతన ధర్మ మహావృక్షం కూకటి వ్రేళ్ళతో ప్రెల్లగిలి కూలకమానదు. క్షణక్షణం పరిణతి చెందడం ప్రకృతి ధర్మం. రాజ్యాలూ, మతాలూ, ధర్మాలూ, సంప్రదాయాలూ అన్నీ కాలప్రవాహపు వడిలో కొట్టుకొనిపోయే గడ్డిపరకలు. నిత్యనూతన స్వభావం ఒకటే సుస్ధిర సత్యం. ఈ సత్యానికి తలవంచక ధిక్కరించాలనుకోవటం భగవంతునితో కుస్తీ పట్టాలనుకోవటమే అవుతుంది. లొంగకపోతే మెడపట్టి లొంగదీస్తుంది కాల ధర్మం. ఇదే 'నిత్యకళ్యాణం పచ్చతోరణం'లోని మూలవస్తువు.

దీనిని కేవలం ప్రచారపు నినాదంగా కాకుండా, సమజంసం, సహజం అని పండితులనూ, సనాతనులనూ కూడా ఒప్పించగల విధంగా రచించి, తెరమీద చిత్రించారు పినిశెట్టి శ్రీ రామమూర్తి.

మంచికథ కోసం అలమటించే తెలుగు ప్రేక్షకులకు ఇదొక అమూల్యమైన కానుక. ప్రయోజనాత్మకమైన చిత్రాలన్నీ వట్టి నినాదాలనీ, బోరింగ్ గా, జావకారిపోతున్నట్లుంటాయనీ, ప్రభుత్వానికి డబ్బాడోలు వాయించేవి అనీ, అతిశయోక్తులు పలికే వారికి యిదొక చురకైన చెంపదెబ్బ. బాక్సాఫీసు సూత్రాలతో బిగించి కథను చిత్రవధ చేస్తే గానీ, శిఖరాగ్ర తారాగణాన్ని ప్రవేశపెట్టితేగానీ, ప్రేక్షకులు మెచ్చరు, పెట్టుబడి గూటికి చేరదని భావించేవారికి ఇదొక పశ్చాత్తాప హేతువు.

తొలి ప్రయత్నంతోనే ఉభయ తారకమంత్ర సిద్ధుడనిపించుకున్నారు పినిశెట్టి.

శేషాద్రి అనే సనాతన శాస్త్రీ, ప్రకాశం అనే అధునాతన మూర్తీ బావ బావమరదులు. మొదటి ఆయన అగ్రహారాధిపతి, రెండవ ఆయన డాక్టరు. మొదటి ఆయన ముసలివాడు, ఛాందసుడు, కోపిష్టి. రెండవ ఆయన యువకుడు, సంస్కర్త, శాంతమూర్తి. శేషాద్రి భార్య శాంతమ్మ, అన్న ప్రకాశం భావాలతో ఏకీభవిస్తుంది కానీ భర్తకు జడుస్తుంది. ప్రకాశం భార్య సుశీల కూడా డాక్టరు వృత్తినే తీసుకుంది. శంకరం అనే బ్రాహ్మణునికీ, లత అనే అన్యకులీనకూ, ప్రకాశం 'నిత్యకళ్యాణం పచ్చతోరణం' అనే మందిరంలో వివాహం చేస్తాడు. శేషాద్రి వారిని అగ్రహారం నుంచి వెలివేస్తాడు.

Picture

బావాబావమరదులకు భావాలు సరిపడక ఎన్నడో సంబంధాలు తెగిపోయినాయి. అయినా చెల్లెలు గర్భవతి అని తెలిసి ప్రకాశం వారింటికి వెళ్తే శాంతమ్మ అన్నను ఆదరించినందుకు ఇల్లు మైలపడిపోయిందని, అన్నా చెల్లెళ్ళను ఇద్దరినీ వెళ్ళగొట్టేస్తాడు శేషాద్రి. అన్నయింటిలో పురుడు పోసుకుంటుంది. మగబిడ్డ కలుగుతాడు. అదే సమయానికి మరో హరిజనునికి మగబిడ్డ కలుగుతాడు. కాని తల్లి మరణిస్తుంది. పిల్లవాణ్ణి పెంచలేక భార్యావియోగం భరించలేక ఆ హరిజనుడు, పిల్లవాణ్ణి ప్రకాశం ఇంటిముందు వదిలి వెళ్ళిపోతాడు ఎక్కడికో. ఆ కానుపుకు వైద్యం చేసింది ప్రకాశమే కావటం వల్ల బిడ్డణ్ణి పోల్చుకుంటాడు, పెంచుకుంటాడు. శాంతమ్మ ఆ పిల్లవాడిపై జాలికొద్దీ తన బిడ్డతో పాటు పాలిచ్చి పెంచుతుంది. శేషాద్రి తనకు పిల్లవాడు పుట్టాడని తెలిసి మమకారం చంపుకోలేక, ఆచారాన్నీ, శాస్త్రాన్నీ కొంచెం అతిక్రమించి, పిల్లవాడిని మాత్రం తెచ్చుకోవాలనుకుంటాడు. బావమరిది ఇంటికి వచ్చి చూసేసరికి శాంతమ్మ హరిజన బాలునికి పాలిస్తూ ఉంటుంది. అసలు పిల్లవాడు మరో గదిలో ఉంటాడు. భర్తను చూసి భయపడి, వాడు తన బిడ్డేనని అబద్ధమాడుతుంది. ఆ పిల్లవాణ్ణి స్వగ్రామం తీసుకువస్తాడు శేషాద్రి. కాని తల్లి లేక పిల్లవాడు బతకడని, శాస్త్రాన్ని ఇంకాస్త అతిక్రమించి భార్యను తెచ్చుకుంటాడు. అసలు బిడ్డడిని ఎవరో అనాధ శిశువని ఆమె చెప్పవలసి వస్తుంది. ఆ బిడ్డడిని తనతో తీసుకురావటానికి అంగీకరించకపోతే రానంటుంది. అందుకూ ఒప్పుకుంటాడు గత్యంతరం లేక. అసలు కొడుకుని నీచంగా చూస్తూ, హరిజన బాలుని తన బిడ్డడని అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. ఈలోగా ప్రకాశానికి ఒక ఆడపిల్ల పుట్టుతుంది. పిల్ల పేరు శీల. ప్రేమ వివాహం చేసుకున్న లత, శంకరంలకు ఆడపిల్ల పుట్టుతుంది. లత చనిపోతుంది. శంకరానికి పిచ్చెక్కి పిల్లను విడిచి వెళ్ళిపోతాడు. పిల్లను దాదా అనే ముస్లిం పెంచుతాడు. చాంద్ అని పేరు పెట్టుకుంటాడు. హరిజన బాలుని పేరు రామూ. అసలు బిడ్డడి పేరు రంగడు. అంతా పెరిగి పెద్దవారవుతారు. రామూ శీలలు కాలేజీలో చదువుతూ పరస్పరం ప్రేమించుకుంటారు. రంగడు నిరక్షరాస్యుడిగానూ, చాంద్ నర్తకి గానూ తయారై ప్రేమించుకుంటారు. చివరికి అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డడు హరిజనుడనీ, నీచంగా చూడబడుతున్న వాడు తన పుత్రుడనీ, తెలిసి శేషాద్రి హృదయం తల్లడిలిపోతుంది. అసలు బిడ్డపై జాలి, ప్రేమ, కలుగుతాయి. ఇరవై సంవత్సరాలు పెంచుకున్న రామూపైన మమతతో, తన ఆత్మపై పేరుకున్న శతాబ్దాలనాటి సంప్రదాయపు బూజు, అజ్ఞానాంధకారం, పటాపంచలైపోతాయి.

కథను యెంత కట్టు దిట్టంగా, బిగువుగా అల్లాడో, అంత బిగువుగానూ, నిరాడంబరంగానూ ప్రతి సన్నివేశాన్నీ తీర్చిదిద్దాడు దర్శక రచయిత. తెలుగు సినిమాలలో చాలా తరుచుగా కనిపించే ఆత్మవంచన యిందులో ఎక్కడా కనుపించదు. అంతేకాదు. తెలుగు సినిమాలలో దాదాపు మృగ్యమైన దర్శకుని వ్యక్తిత్వం, ఇందులో అడుగడుగునా స్ఫురిస్తుంది.

కేవలం వినోదమే చాలుననుకునే అల్పసంతోషులకు ఈ చిత్రం నిరుత్సాహపరచదు. మితితప్పని వినోదం, గతితప్పని నడకతో పండిత పామర జనరంజకంగా రూపొందింది ఈ చిత్రం. యధాశక్తిన అంతో ఇంతో ప్రతిసారీ కొత్తదనం రుచి చూపించటానికి ప్రయత్నించటం పెండ్యాల గారికి అలవాటే. ఆయన ప్రయత్నాలు ఇందులో ఫలించాయి. ప్రతి పాటా జనాదరణ పొందగల ధోరణిలో ఉన్నాయి. ఆరుద్ర పాటల రచనా అదే ధోరణిలో ఉంది. 'నామనసెంతో నాజూకు అది నజరానా నీకు' అనే నృత్యగీతం రచన, స్వర రచన, చిత్రీకరణ చక్కగా ఉన్నాయి. అరేబియా ఎడారి వాతావరణానికి సరిపోయే బాణిలో, అందుకు తగిన వాద్యాలతో చక్కగా సంగీతం కూర్చారు పెండ్యాల.

సనాతన శాస్త్రిగా సి.యస్.ఆర్. అధునాతన మూర్తిగా గుమ్మడి సమవుజ్జీలుగా అద్భుతంగా నటించారు. పతాక సన్నివేశంలో నిజం తెలుసుకున్నప్పుడు శేషాద్రిలో కలిగే విభ్రాంతి, వేదనా, పశ్చాత్తాపం, జాలి, ఇంకా ఎన్నెన్నో అనిర్వచనీయమైన భావపరంపర సి.యస్.ఆర్ ముఖంపై తెరలు తెరలుగా నీడలు నీడలుగా అపూర్వంగా, ప్రదర్శితమయినాయి. కనుచూపు మేర తెలుగు సినీమా రంగంలో ఇంత గొప్ప నటన మనకు కనుపించదు. చలం, కృష్ణకుమారి చక్కగా నటించారు. రమణారెడ్డి నటన బాగుంది. అంతకంటే నల్లరామ్మూర్తి నటనను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిత్రమంతటా హాస్యం లలితంగా పుష్కలంగా ఉంది. శాంతమ్మగా హేమలత, సుశీలగా సంధ్య వారికి అలవాటయిన విధంగా హాయిగా నటించారు. కొత్త నటీనటులు రాజశ్రీ, రామకృష్ణల నటన క్రొత్త రకంగా గానీ, చెప్పుకోతగినట్లుగా గానీ లేకపోయినా బెరుకుతనం కొత్తతనం వారిలో కనిపించలేదు.

ఈ చిత్రం చూస్తున్నంత సేపు హాయిగా ఉంటుంది. చూసిం తర్వాత కొంత కాలం జ్ఞాపకం ఉంటుంది.

నండూరి పార్థసారధి
(1960 మార్చి 20వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post