సుబ్బులక్ష్మి తాజా రికార్డు

శ్రీమతి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గానం చేసిన 'శ్రీ కామాక్షీ సుప్రభాతం' ఎల్.పి. రికార్డు (ECSD 3254) సెప్టెంబరు 8వ తేదీన ఢిల్లీ, కలకత్తా, బొంబాయి, మద్రాసు, బెంగుళూరు నగరాలలో ప్రత్యేకంగా ఆవిష్కరించబడింది! ఈ తాజా రికార్డులో శ్రీమతి సుబ్బులక్ష్మి 'శ్రీ కామాక్షీ సుప్రభాతం'తో పాటు, కంచి కామాక్షికి సంబంధించిన మరి నాలుగు కృతులను గానం చేసింది.

కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకరాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి ప్రేరణతో శ్రీ లక్ష్మీకాంతశర్మ సంస్కృతంలో ఈ సుప్రభాతాన్ని రచించారు. ఇతర సుప్రభాతాలకు, దీనికి ఒక ముఖ్యమైన తేడా ఉంది. మిగిలిన వాటిలో ప్రతి శ్లోకానికి చివర 'తవసుప్రభాతం' అని ఉంటుంది. అంటే భక్తుడు భగవంతుని మేల్కొలుపుతూ 'ఇది నీకు సుప్రభాతమగుగాక' అని ఆకాంక్ష వ్యక్తం చేస్తాడు. ఈ కామాక్షీ సుప్రభాతంలో ప్రతి శ్లోకానికి చివర 'కురు సుప్రభాతం' అని ఉంటుంది. అంటే - భక్తుడు జగన్మాతను మేల్కొలుపుతూ 'మాకు సుప్రభాతమయ్యేటట్లు అనుగ్రహించు' అని ప్రార్థిస్తాడు.

మేలుకొలుపు పాటలకు సాధారణంగా ఉపయోగించే 'భూపాలం' రాగంలో శ్రీమతి సుబ్బులక్ష్మి ఈ 'సుప్రభాతం' గానం చేసింది. దీని తర్వాత 'కమలా మనోహరి' రాగంలో 'కంజదళాయతాక్షీ' అనే ముత్తుస్వామి దీక్షితర్ కృతిని గానం చేసింది.

రికార్డు రెండో వైపు 'మూక పంచశతి' లోని శ్లోకంతో ప్రారంభించి, 'సావేరి' రాగంలో 'శ్రీ కామకోటి పీఠస్థితే' అనే మైసూరు సదాశివరావు కృతిని, 'పున్నాగవరాళి'లో శ్యామాశాస్త్రి కృతిని, గానం చేసింది. తర్వాత 'సౌందర్యలహరి'లోని ఒక శ్లోకాన్ని, చివరికి 'మధ్యమావతి'లో 'వినాయకునివలెను బ్రోవవే' అనే త్యాగరాజకృతిని గానం చేసింది.

ఈ రికార్డులో శ్రీమతి సుబ్బులక్ష్మి గానం గొప్పగా ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆమె ప్రతి రికార్డులోనూ ప్రతి కచేరీలోనూ గొప్పగా పాడుతుంది.

ఆమె రికార్డులలో ఒకదానికంటే మరొకటి బాగుందని గాని, బాగా లేదని గాని చెప్పడం సాధ్యం కాదు. అన్నింటిలోనూ ఒకే విధమైన ఉన్నత ప్రమాణం కనిపిస్తుంది. ఆమె గాన మాధుర్యానికి, పాండితీ వైభవానికి మచ్చుతునకగా ఏ రికార్డునైనా తీసుకోవచ్చు. కర్ణాటక సంగీతంలో మరి ఎవ్వరిని గురించి ఇలా చెప్పలేము. భక్తులు మాత్రమే కాక, కర్ణాటక సంగీత ప్రియులందరూ కొనుక్కోదగిన మంచి రికార్డు 'శ్రీ కామాక్షీ సుప్రభాతం'. శ్రీమతి సుబ్బులక్ష్మి ఈ రికార్డుపై రాయల్టీని కంచికామాక్షి ఆలయానికి ఇచ్చివేశారు.

కర్ణాటక సంగీతంలో సుబ్బులక్ష్మి ఇచ్చినన్ని రికార్డులు మరి ఎవ్వరూ ఇవ్వలేదు! 'కామాక్షీ సుప్రభాతం'తో కలిపి ఆమెరికార్డులు 14 ఎల్.పి.లు, రెండు ఇ.పి.లు. వచ్చాయి. ఇవికాక ఇది వరకు 78 ఆర్.పి. ఎం. రికార్డులు చాలా వచ్చాయి. ఎల్.పి.లలో రెండు ఆమె నటించిన 'మీరా', 'శకుంతలై' తమిళం సినిమాల రికార్డులు. 'మీరా' ఎల్.పి. (3 AEX 8004)లో పది తమిళం పాటలు, రెండు హిందీ భజన్ లు ఉన్నాయి. అన్నీ ఆమె పాడినవే. 'శకుంతలై' ఎల్.పి. (3AEX 8001)లో ఆమెతో పాటు సంగీత కళానిధి స్వర్గీయ జి.ఎన్. బాలసుబ్రహ్మణ్యం పాటలు కూడా ఉన్నాయి. శ్రీమతి సుబ్బులక్ష్మి 'మీరా' సినిమాలో పాడినవి కాక, ప్రత్యేకంగా వేరే పది మీరా భజనలను మరొక ఎల్.పి. (EALP 1297)లో పాడింది.

PMAE 501 ఎల్.పి.లో ఒకవైపు సుబ్బులక్ష్మి 'సరోజ దళనేత్రి' కృతి (శంకరాభరణం) పాడింది. రెండో వైపు శ్రీ కె.ఎస్. నారాయణస్వామి వీణ వాయించారు. ECLP 2293 ఎల్.పి.లో ఒకవైపు శ్రీ వేంకటేశ సుప్రభాతం, రెండో వైపు స్వాతి తిరునాళ్ కృతి 'భావయామి', దీక్షితర్ కృతి 'శ్రీ రంగపురవిహార' పాడింది. SIMOAE 5011 రికార్డులో ఆదిశంకరుల 'భజగోవిందం' 'విష్ణుసహస్రనామం' గానం చేసింది. ఈ రికార్డులో స్వర్గీయ రాజాజీ ఉపోద్ఘాతం కూడా ఉంది. సుబ్బులక్ష్మి ఇదివరకు 78 ఆర్.పి.ఎం. రికార్డులలో పాడిన తమిళ కృతులు కొన్ని ఇప్పుడు ఒక ఎల్.పి. (EALP 1374)లో వచ్చాయి.

1966లో సుబ్బులక్ష్మి ఐక్యరాజ్య సమితిలో చేసిన కచేరీ మూడు ఎల్.పి. రికార్డుల సెట్టు (MOAE 5001, 5002, 5003) గా విడుదలయింది. ఆ కచేరీలో 'రామ నన్ను బ్రోవరా', 'సారాసాక్ష', 'సరోజదళనేత్రి', 'శ్రీరంగపురవిహార', 'శివశివశివభో', 'జగదోద్ధరణ', కృతులు, 'హరితుమ హరో' అనే మీరా భజన్, 'శిలప్పదికారం' తమిళ కావ్యంలోని ఒక గీతం, రాజాజీ రచించిన ఒక ఇంగ్లీషు పాట, చివరికి కంచి కామకోటి పీఠాధిపతి రచించిన సంస్కృత ప్రార్థన శ్లోకం గానం చేసింది. వీటిలో పాశ్చాత్య సంగీత పద్ధతిలో పాడిన ఇంగ్లీషు పాట (మేది లార్డ్ ఫర్ గివ్ అవర్ సిన్స్) ప్రత్యేకంగా చెప్పుకోదగింది. ఎటువంటి సంగీతమైనా సుబ్బులక్ష్మి గొంతులో ఎంత చక్కగా ఒదుగుతుందో ఆ పాట వింటే తెలుస్తుంది. మద్రాసు ఆకాశవాణి పాశ్చాత్య సంగీత విభాగానికి చెందిన శ్రీ హాండెల్ మాన్యుయేల్ ఆ పాటకు ట్యూన్ కట్టారు.

శ్రీమతి సుబ్బులక్ష్మి చేసిన మరొక కచేరి మరి మూడు ఎల్.పి.ల సెట్టుగా వచ్చింది. ఈ రికార్డుల (SIMOAE 5012, 5013, 5014)లో 'విరిబోణి' వర్ణం, 'విదులకు' (మాయా మాళవ గౌళ) 'సొగసుగా' (శ్రీరంజని), 'మీనాక్షీ మేముదం' (పూర్వ కళ్యాణి), 'వేణుగాన' (కేదార గౌళ) 'తెరతీయగ రాదా' (గౌళిపంతు), 'భోగీంద్ర శాయినం' (వాచస్పతి), 'హరి హర పుత్రం' (వసంత), 'అఖిలాండేశ్వరి' (ద్విజావంతి) 'పాలించు కామాక్షి' (మధ్యమావతి), 'వరనారద' (విజయశ్రీ), 'ఏ నాటి నోము ఫలమో' (భైరవి), 'అన్నపూర్ణాష్టకం' (రాగమాలిక), 'జగదీశా', 'నాదనామక్రియ' కృతులు, ఒక తిల్లానా ఉన్నాయి.

ఈ రికార్డులన్నీ కర్ణాటక సంగీత ప్రియులు అపురూపంగా భద్రపరచుకోవలసినవి. శ్రీమతి సుబ్బులక్ష్మి మాతృభాష తమిళమైనా, ఆమె తెలుగు కృతులను తెలుగు వారికంటే తేటగా, తీయగా పాడుతుంది. కచేరీలలోను రికార్డులలోనూ కాడా ఆమె తెలుగు కృతులే ఎక్కువగా పాడుతుంది. ఒక్క తెలుగే కాదు, సంస్కృతంలో పాడినా, కన్నడంలో పాడినా హిందీలో, ఆఖరికి ఇంగ్లీషులో పాడినా కూడా ఆమె ఉచ్ఛారణ స్పష్టంగా, సహజంగా ఉంటుంది. కృతులను అర్థస్ఫూర్తితో భావస్ఫూర్తితో పాడడం ఎలాగో తెలుగు గాయకులు ఆమె నుంచి నేర్చుకోవాలి. శ్రీమతి సుబ్బులక్ష్మి పరిపూర్ణ సంగీత విద్వాంసురాలు.

నండూరి పార్థసారథి
(1974 నవంబర్ 8వ తేదీన ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమైనది)

Previous Post Next Post