లండన్ సింఫనీ ఆర్కెస్ట్రాతో కలిసి రవిశంకర్ యిచ్చిన కాంచెర్టో ఫర్ సితార్ అండ్ ఆర్కెస్ట్రా రికార్డు (ASD2752) రెండు సంవత్సరాల క్రితం విడుదల అయింది. ఈ రికార్డులో రవిశంకర్ సృజనాత్మక ప్రతిభ పరాకాష్ఠనందుకున్నది. హిందూస్థానీ సంగీతంలో ఆర్కెస్ట్రేషన్ (వాద్య సమ్మేళనం) విషయమై దాదాపు ఇరవై సంవత్సరాలు ఆయన చేసిన కృషి, పాశ్చాత్య వాద్య బృందంపై హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని పలికించాలని ఆయన కన్న కలలు ఈ రికార్డుతో ఫలించాయి.

ఈ రికార్డులోని సంగీతాన్ని మరి దేనితోనూ పోల్చడానికి వీల్లేదు. దీనికిదే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. మూడొంతులు భారతీయ సంగీతాన్ని, ఒక వంతు పాశ్చాత్య సంప్రదాయాన్ని రంగరించి, 'సింఫనీ' పద్ధతిలో ఈ సంగీతాన్ని ఆయన రచించారు. నిజానికి మన శాస్త్రీయ సంగీతంలో 'హార్మొనీ'కి అవకాశం లేకపోయినా రాగ సౌందర్యం చెడకుండానే పరిమితంగా ఆయన 'హార్మొనీ'ని ప్రవేశపెట్టారు. ఈ రికార్డులో ఒకవైపు 'ఖమాస్', 'భైరవి' రాగాలు, రెండో వైపు 'అడానా', 'మాంజ్ ఖమాస్' రాగాలు ఉన్నాయి. రాగాల స్వరూప స్వభావాలను వాద్య సమ్మేళనం కోసం ఆయనేమీ మార్చలేదు. ఇందులో ఒక్క సితార్ తప్ప మిగిలినవన్నీ పాశ్చాత్య వాద్యాలే; వాటిపై సాధ్యమైనంత వరకు హిందూస్థానీ సంగీతపు గమకాలు కూడా పలికించడానికి ప్రయత్నించారు.

ఇందులో సితార్ ఒక్కటీ ఒకటిగా, మిగిలిన వాద్యాలన్నీ ఒకటిగా కనిపిస్తాయి. స్వరమేళనాల రచన ఆ విధంగా జరిగింది. ఇందులో తబలా కూడా లేదు. దానికి బదులు ప్రధాన లయ వాద్యంగా 'బంగోస్'ను ఉపయోగించారు. ఇంకా టాంటాం, టింపనీ, గ్లాకెన్ స్పీల్, మరింబా, బాస్ డ్రమ్, గ్జైలోఫోన్, ట్రయాంగిల్ వంటి వాటిని లయవాద్యాలుగా ఉపయోగించారు. శ్రుతి కోసం తంబురకు బదులు రెండు హార్ప్ లను ఉపయోగించారు. హిందూస్థానీ సంగీతపు లాలిత్యానికి తగవనే ఉద్దేశంతో ట్రంపెట్ ను, ట్రాంబోన్ ను ఉపయోగించలేదు. రవిశంకర్ రెండున్నర నెలలు కష్టపడి ఈ సితార్-ఆర్కెస్ట్రా కాంచెర్టో సంగీతాన్ని రచించారు. అతి సూక్ష్మమైన 'గ్రేస్ నోట్స్' (గమకాలు)తో సహా కాగితం మీదికి ఎక్కించి లండన్ సింఫనీ ఆర్కెస్ట్రా వారికి ఇచ్చారు. 1971 జనవరి 23వ తేదీన ఆయన ఆర్కెస్ట్రాతో కలిసి లండన్ లోని రాయల్ ఫెస్టివల్ హాలులో కచేరీ చేసి, ప్రాచ్య పాశ్చాత్య సంగీత రసజ్ఞులను సమ్మోహితులను చేశారు. లండన్ సింఫనీ ఆర్కెస్ట్రా కండక్టర్లలో ముఖ్యుడైన ఆండ్రే ప్రేవిన్ ఆర్కెస్ట్రాను కండక్ట్ చేశారు. టెరెన్స్ ఎమెరీ 'బంగోస్' వాయించారు. తర్వాత కొద్ది నెలలకు లండన్ లోని ఇ.ఎం.ఐ. రికార్డింగ్ కంపెనీ వారు ఈ కాంచెర్టో ను రికార్డు చేశారు.

ఆండ్రే ప్రేవిన్

ఈ రికార్డులోని రాగాల స్వరమేళనాలను వింటుంటే అవి కేవలం ఏదో ఒక నూతన ప్రయోగం చేశాననిపించుకోవడం కోసం ప్రయాసపడి చేసిన రచనల్లాగా కాక-రసకల్లోలితమైన కళా హృదయం నుంచి పెల్లుబికిన లలిత మధుర గంభీర భావనా తరంగాలవలె కనిపిస్తాయి. శ్రవణ సుభగత్వంలో, శబ్ద సౌందర్యంలో, సుందర ఊహా దృశ్య చిత్రణంలో, రచనా శిల్పంలో వీటికి ఇవే సాటి. మనస్సులో ఒక గొప్ప దృశ్యాన్ని భావన చేస్తూ, దానిని ఆత్మాశ్రయభావ కవితా శైలిలో సితార్ పై వర్ణిస్తూ, రసజ్ఞుల మనో నేత్రాల ఎదుట ఆ దృశ్యాన్ని ఆవిష్కరించడం ఉస్తాద్ విలాయత్ ఖాన్ ప్రత్యేకత. ఈ లక్షణం సాధారణంగా రవిశంకర్ సంగీతంలో కనిపించదు. కాని, ఈ రికార్డులో మాత్రం ఆయన దృశ్య చిత్రణశైలిని అనుసరించారు.

ఈ రికార్డులో 'అడానా' తప్ప, మిగిలిన మూడు రాగాలు-'ఖమాస్', 'భైరవి', 'మాంజ్ ఖమాస్'-శృంగార రస ప్రధాన రాగాలు. కళ్ళు మూసుకుని, ఏకాగ్ర చిత్తంతో వాటిని వింటే భావుకులైన వారికి రసవత్తరమైన దృశ్యాలు కనిపించగలవు. ఈ మూడు రాగాల్లోనూ సితార్ అతిలోక సౌందర్యవతియైన నాయికగా కనిపిస్తుంది, కొన్ని వాద్యాలు ఆమెకు ఇష్ట సఖులవలె కనిపిస్తాయి. మరికొన్ని వాద్యాలు ప్రకృతి దృశ్య వర్ణనకై ఉపయోగించారు.

వాద్య బృందం 'ఖమాస్' ఆలాప్ ప్రారంభించగానే-వసంత సంధ్యా సమయంలో ఒక సుందరోద్యానవనం కనిపిస్తుంది. ఆ వనంలో అందమైన పొదరిండ్లు... పక్షుల కోలాహలంతో వనమంతా సందడిగా ఉంది. చిలకలు, గోరింకలు, పావురాలు పూలతీగలపై ఉయ్యాలలూగుతూ సంబరపడుతున్నాయి; నెమళ్ళు ఒక పొదరింటి మీది నుంచి ఇంకొక పొదరింటి మీదకి ఎగురుతున్నాయి; లేళ్ళు, కుందేళ్లు చెంగు చెంగున గంతులేస్తున్నాయి; తుమ్మెదలు మకరందా స్వాదనంలో హడావిడిగా ఉన్నాయి; అందమైన అమ్మాయిలు పూల మొక్కలకు నీళ్ళు పోస్తున్నారు; కొందరు పూలతీవలను సవరిస్తున్నారు. ఆలాప్ లో సితార్ ప్రవేశించగానే మిరుమిట్లు గొలిపే సౌందర్యంతో నాయిక సాక్షాత్కరిస్తుంది. ఆమె లావణ్యమంతా సితార్ మధుర స్వనంలో కనిపిస్తుంది. ఆమె ఒక పొదరింటి వద్ద శిలా వేదికపై దిగులుగా కూర్చుని ఉంది. ప్రకృతి, వాతావరణం ఇంత అందంగా, ఆహ్లాదకరంగా ఉన్నా ఆమె కేమీ ఉత్సాహంగా లేదు. ప్రియుని రాకకై ఆమె ఎదురు చూస్తున్నది; అతను రాలేదు. ఆమె మనస్సంతా మధురమైన అతని తలపులతో నిండిపోయింది. ఆమె మధుర వేదనను గమనించి, ఒక సఖి దగ్గరకు వస్తుంది. సితార్ 'ఆలాప్' నుంచి 'జోడ్' లోనికి వస్తుంది. నాయిక దీనంగా తన వేదనను వివరిస్తుంది. అతడు తప్పక వస్తాడని సఖి ధైర్యం చెబుతుంది; ఉత్సాహపరుస్తుంది. సితార్ తో సంభాషిస్తున్నట్లుగా మరొక వాద్యం సఖిపాత్ర వహిస్తుంది. నాయికకు, సఖికి మధ్య సంభాషణగా కొంతసేపు 'జోడ్' నడచిన తర్వాత 'బంగోన్' లయ విన్యాసంతో 'గత్' ప్రారంభమవుతుంది. నాయకుడు వస్తున్నాడన్న వర్తమానం చేరినట్లుగా నాయిక వేదన అంతా పటాపంచలైపోతుంది. ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోతూ ఉంటుంది. సితార్ ఉత్సాహంగా, ఉల్లాసంగా స్వరాలు పలికిస్తుంది. నాయికకు అంతలో సిగ్గు ముంచుకొస్తుంది. తను తలయెత్తి అతని కేసి చూడగలదా? అతనికి ఎలా స్వాగతమివ్వడం? ఇంత వరకూ అతను రాలేదని దిగులుతో కూర్చుంది. ఇప్పుడు తీరా వచ్చేస్తుంటే స్వాగతానికి ఏర్పాట్లే జరగలేదు. ఆమెకు తత్తరపాటు ఎక్కువవుతుంది. చెలికత్తెలని తొందర పెడుతుంది. చెలికత్తెలు హడావుడిగా స్వాగత సన్నాహాలు చేస్తూ ఉంటారు. ఆ దశలో 'ఖమాస్' అంకం సమాప్తమై, తెరవాలిపోతుంది.

రెండవది 'సింధుభైరవి' వాద్య బృందం టుమ్రీశైలి 'ఆలాప్'తో దృశ్యవర్ణన చేస్తుంది. రాత్రి వెన్నెలలో సౌధోపరితలంపై ఒక చంద్రశిలా వేదికపై పడుకుని చంద్రునికేసి శూన్యంగా దిగులుగా చూస్తున్నది నాయిక. మధుర స్మృతులు మనస్సును వేధిస్తున్నాయి. కన్నీటితో చెక్కిళ్ళు తడిసిపోయాయి. ప్రియుడు ఎక్కడో దూరదేశంలో ఉన్నాడు. ఇప్పట్లో అతడిని చూసే ఆశ లేదు. తనకు మిగిలిందల్లా అతడి జ్ఞాపకాలే. ఆమె మనస్సు రెక్కలు విప్పి, స్వేచ్ఛగా ఊహా విహాయసంలోకి ఎగిరిపోయింది. ప్రియుడు వెనకగా వచ్చి మెల్లగా కళ్ళు మూశాడు. సితార్ అనురణన తంత్రులను మీటినట్లుగా ఆమె నిలువెల్ల పులకించిపోయింది. సంతోషం పరవళ్ళు తొక్కింది.

రికార్డు రెండో వైపు మొదటి అంశం 'అడానా'. ఇది సహజంగా వీరరస ప్రధాన రాగం; ఉత్సాహ భరితంగా ఉంటుంది; ఈ రాగంలో ఖయాల్ లు గానీ, గత్ లు గానీ సాధారణంగా ధ్రుత్ లయలోనే ఉంటాయి. ఈ రికార్డులో ఈ రాగం వింటుంటే వర్షఋతు దృశ్యం మనస్సులో మెదులుతుంది; ఆకాశం మేఘావృతమై ఉంది; చల్లటి గాలికి చెట్లు పూగుతున్నాయి; క్రమంగా గాలి వేగం ఎక్కువవుతుంది; మెరుపులు మెరుస్తాయి; నెమలి ఆనందంతో పురివిప్పి ఆడుతుంది; గాలి ఉద్ధృతమవుతుంది; చినుకులు పడడం ప్రారంభిస్తాయి.

చివరి 'మాంజ్ ఖమాస్' రచన మొదటి 'ఖమాస్'కు తరువాయి భాగంగా కనిపిస్తుంది. ఇందులో దృశ్యం ఉద్యానవనం నుంచి రజసౌధానికి మారుతుంది. రాకుమారి ప్రియునికి స్వాగతమివ్వడానికై త్వరత్వరగా అలంకరించుకొంటూ ఉంటుంది. చెలికత్తెలందరూ సౌధాన్ని అలంకరిస్తూ ఉంటారు.

రికార్డు వెనక కవర్ - ఆండ్రే ప్రేవిన్

ఇందులో సితార్ కంటే పాశ్చాత్యవాద్యాలు ఎక్కువగా ఉపయోగించబడినాయి. ఒక గొప్ప 'ఆపెరా' (ప్రాశ్చాత్య శాస్త్రీయ సంగీత నృత్య రూపకం) చూస్తున్నట్లుగా అనిపిస్తుంది.

రవిశంకర్ ఈ సంగీత రచనలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇవే దృశ్యాలను ఊహించుకుని ఉండకపోవచ్చు. శ్రోతలకు కూడా ఈ దృశ్యాలే స్ఫురించకపోవచ్చు. ఊహలను ఎవరూ నిర్దేశించలేరు. భావావేశాన్ని బట్టి, ఊహాశక్తిని బట్టి ఒక్కొక్కరికీ ఒక్కొక్క విధంగా దృశ్యాలు కనిపించవచ్చు. కొందరికి అసలు ఏ దృశ్యమూ స్ఫురించకపోవచ్చు కూడా. ఏమైనా సంగీతాభిరుచి ఉన్న ప్రతివారికి ఈ రికార్డు నచ్చుతుంది.

నండూరి పార్థసారథి
(1974 జూన్ 14వ తేదీన ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమయింది)

Previous Post Next Post