సంగీత ప్రియులు ఆమెను 'గాన కోకిల' అన్నారు. 'నైటింగేల్ ఆఫ్ ఏషియా' అన్నారు. ఆమె స్వరాన్ని 'వాయిస్ ఆఫ్ ది సెంచరీ' అన్నారు. స్వర్గీయ నెహ్రూ ఆమెను 'క్వీన్ ఆఫ్ సాంగ్' (సంగీత సామ్రాజ్ఞి) అని ప్రస్తుతించారు. మహాత్మాగాంధి, సరోజనీ నాయుడు, కంచి కామకోటి పీఠాధిపతి ఆమె గానానికి ముగ్ధులైనారు. హిందూస్థానీ సంగీతంలో గురువులకు గురువైన స్వర్గీయ ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ ఆమె 'పంతువరాళి' విని తన్మయుడైనాడు. కడచిన నాలుగు దశాబ్దాలలో ఆమె యావద్భారతంలోనే కాక, అమెరికా, బ్రిటన్, ఈజిప్టు, నేపాల్, బర్మా, మలేసియా, తాయ్ లాండ్, ఫిలిప్పీన్స్, జపాన్, హాంకాంగ్, శ్రీలంక, ఫిజీ, మారిషస్ వంటి పెక్కు విదేశాలలో వందలాది కచేరీలు చేసి కోట్లాది ప్రజలను తన సంగీతంతో ఆనందపరవశులను చేసింది. సంగీత శాస్త్రంలో కాకలు తీరిన పండితులు, సంగీత శాస్త్ర జ్ఞానం బొత్తిగా లేని సామాన్య శ్రోతలు కూడా ఆమెకు జోహారులర్పించారు. భారతీయ సంగీత విద్వాంసులలో ఆమెకు ఉన్నంత పాపులారిటీ రవిశంకర్ కు, బిస్మిల్లా ఖాన్ కు కూడా లేదు.

ఆమెకు 1954లోనే 'పద్మభూషణ్' అవార్డు లభించింది. 1956లో రాష్ట్రపతి అవార్డు లభించింది. 1963లో ఎడింబరో అంతర్జాతీయ సంగీతోత్సవంలో కచేరీ చేసింది. 1966లో ఐక్యరాజ్య సమితి (న్యూయార్క్)లో కచేరీ చేసింది. ఆ తర్వాత మద్రాసు మ్యూజిక్ అకాడమీ మహాసభకు అధ్యక్షత వహించి, 'సంగీత కళానిధి' బిరుదును స్వీకరించింది. కొన్ని విశ్వవిద్యాలయాలు ఆమెకు డాక్టరేట్ ఇచ్చాయి. సంగీతం ద్వారా ఆమె చేసిన మానవసేవకు గానూ ఫిలిప్పిన్స్ ప్రభుత్వం ఆమెకు 1974 సంవత్సరపు రేమన్ మాగ్ సేసే అవార్డును ప్రదానం చేసింది. (ఏషియన్ నోబెల్ ప్రైజ్ అనదగిన ఈ అవార్డు ఇది వరకు భారతీయులలో ఆచార్య వినోబాభావేకు, శ్రీ జయప్రకాశ్ నారాయణ్ కు మాత్రం లభించింది).

ఇదంతా శ్రీమతి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి కీర్తి శిఖరారోహణ చరిత్ర. ఆమె ఇంకా అందుకోవలసిన శిఖరాలు ఏవైనా ఉన్నాయా? దేశ పరిథిలో ఒక్క 'పద్మ విభూషణ్' మాత్రం మిగిలివుంది. ఆ బిరుదు ఇంతకు ముందు కళారంగంలో ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ కు, శ్రీ ఉదయశంకర్ కు మాత్రం లభించింది. బహుశా మూడవ వ్యక్తి శ్రీమతి సుబ్బులక్ష్మి కావచ్చు.

శ్రీమతి సుబ్బులక్ష్మి వయస్సు 58 సంవత్సరాలు. సంగీత కచేరీలలో ఇప్పటికే ఆమెకు దాదాపు అర్ధశతాబ్ది అనుభవం ఉన్నది. పదేళ్ళలోపు వయస్సులోనే ఆమె తల్లితో కలిసి కచేరీలు చేస్తూ ఉండేది. ఆమె తల్లి 'వీణ'షణ్ముఖవడివు గొప్ప సంగీత విద్వాంసురాలు. తల్లీ కూతుళ్ళ గాత్ర సమ్మేళనం అద్భుతంగా ఉండేదట. 'బేబీ'సుబ్బులక్ష్మి పదేళ్ళ వయస్సులోనే తన మొదటి గ్రామఫోన్ రికార్డు ఇచ్చింది. 17 ఏళ్ళలోపు వయస్సులోనే మద్రాసు మ్యూజిక్ అకాడమీ వంటి పెద్ద సంగీత సభలలో సోలో కచేరీలు చేసి పండితుల ప్రశంసలందుకున్నది. 1940లో ఆమె శ్రీ టి. సదాశివంను వివాహమాడింది. (సదాశివం 'కల్కి' తమిళ పత్రికకు సంపాదకుడు).

1944లో బొంబాయిలో జరిగిన అఖిలభారత సంగీత మహాసభలో శ్రీమతి సుబ్బులక్ష్మి కచేరీ చేసింది. దేశంలో ఉన్న మహామహా పండితులందరూ ఆ మహాసభలో పాల్గొన్నారు. శ్రీమతి సుబ్బులక్ష్మి వారందరి ప్రశంసలు, ఆశీస్సులు పొందగలిగింది. ఆ సంవత్సరంలోనే ఆమె కథా నాయికగా నటించిన 'మీరా' సినిమా విడుదలయింది. ఆ చిత్రం దేశమంతటా లక్షలాది ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఆమె పాపులారిటీ విపరీతంగా పెరిగింది. ఆమె పాడిన మీరా గీతాలు దేశమంతటా వాడవాడలా మారుమ్రోగాయి. ముఖ్యంగా 'గిరిధర గోపాలా', 'మోరెతొ గిరిధర' పాటలు సంగీత ప్రియులను మంత్ర ముగ్ధులను చేశాయి. ఆమె నటించిన చిత్రాలలో సంగీత ప్రియులను విశేషంగా ఆకర్షించిన మరొక చిత్రం 'శకుంతలై'. ఆ చిత్రంలో ఆమె శకుంతలగానూ, సంగీత కళానిధి స్వర్గీయ జి.యన్. బాలసుబ్రహ్మణ్యం దుష్యంతుడుగానూ నటించారు. ఆ చిత్రంలో వారిద్దరూ పాడిన పాటల రికార్డులు ఆ రోజుల్లో బ్రహ్మాండంగా 'హిట్' అయ్యాయి.

శ్రీమతి సుబ్బలక్ష్మి 'మీరా' రికార్డులు విని మహాత్మాగాంధి ఎంతో ఆనందించారు కాని, వాటిల్లో ఆయనకు ఇష్టమైన 'హరి తుమ హరో' పాటలేదు. 1947 అక్టోబరు 2వ తేదీన తన పుట్టిన రోజున ఆమె చేత ఆ పాట పాడించుకోవాలనుకుని, ఆమెకు కబురు పంపారు. ఆ పాట తనకు రాదనీ, మరెవరి చేతనైనా పాడించుకోవలసిందనీ ఆమె వర్తమానం పంపింది. ఆ పాట సుబ్బులక్ష్మి పాడితేనే వినాలనీ, దానికి రాగం సిద్ధంగా లేకపోతే ఆమె చదివి వినిపించినా చాలుననీ గాంధీజీ పట్టుపట్టారు. ఆ కబురు అక్టోబరు 1వ తేదీ సాయంత్రం మద్రాసులో ఉన్న సుబ్బులక్ష్మికి చేరింది. ఆమె ఆ రాత్రి రెండు గంటల వరకు మేలుకొని రాగం కూర్చి, పక్క వాద్యాలను పెట్టుకుని పాడింది. 'ఆకాశవాణి' వారు రికార్డుచేసి విమానంలో ఢిల్లీకి పంపారు. రెండవ తేదీ ఉదయం గాంధీజీ ఆ పాట విని తన్మయత్వం పొందారు. ఆ పాటను ఆయన పదే పదే విన్నారు. తర్వాత సుబ్బులక్ష్మి ఆ పాటను గ్రామఫోన్ రికార్డుగా ఇచ్చింది. ఆ రికార్డు రెండో వైపు గాంధీజీకి ఇష్టమైన మరొక భజన్ 'వైష్ణవజనతో' పాడింది.

1944 నుంచి శ్రీమతి సుబ్బులక్ష్మి ఎన్నో సంస్థల సహాయార్థం కచేరీలు చేసింది. కస్తూర్బా స్మారక నిధికి, గాంధీ స్మారక నిధికి, కమలానెహ్రూ స్మారక నిధికి, నెహ్రూ స్మారక నిధికి, రామకృష్ణ మఠానికి, మద్రాసు మ్యూజిక్ అకాడమీ భవన నిర్మాణ నిధికి, ఇంకా ఎన్నో ఆస్పత్రులకు, పాఠశాలలకు, అనాధ శరణాలయాలకు కచేరీల ద్వారా విరాళాలు సేకరించి ఇచ్చింది. తన ఎల్.పి. రికార్డులపై రాయల్టీలను కూడా చాలావరకు విరాళాలుగానే ఇచ్చివేసింది. ఈ విధంగా ఆమె ఇంతవరకు ఇచ్చిన విరాళాల మొత్తం కోటి రూపాయలు దాటినట్లు అంచనా. మాగ్ సేసే అవార్డు ద్వారా లభించిన 10 వేల డాలర్ల ధనాన్ని కూడా మన దేశంలోని వివిధ సేవా సంస్థలకు విరాళంగా ఇవ్వబోతున్నట్లు ఆమె ప్రకటించింది. సంగీతం ద్వారా మానవ సేవ చేయడంలో ఈమెతో పోల్చదగిన వ్యక్తి ప్రపంచంలో ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఆయన సుప్రసిద్ధ వైలిన్ విద్వాంసుడు యెహూదీ మెనూహిన్. (అంతర్జాతీయ అవగాహనకు చేసిన కృషికి గాను ఆయనకు 1968 సంవత్సరపు జవహర్లాల్ నెహ్రూ అవార్డు లభించింది).

శ్రీమతి సుబ్బులక్ష్మి ఆగస్టు 31వ తేదీన మనిలాలో మాగ్ సేసే అవార్డు స్వీకరించింది, అక్కడ కచేరీ చేసింది. అక్కడ నుంచి స్వదేశానికి తిరిగి వస్తూ జపాన్, హాంకాంగ్, తాయ్ లాండ్ లలో కచేరీలు చేసింది.

నండూరి పార్థసారథి
(1974 అక్టోబర్ 18వ తేదీన ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమైనది)

Previous Post Next Post