Title Picture

సహస్రాబ్దాల చరిత్రను గర్భంలో ఉంచుకుని, గంభీరంగా, నిండుగా, భావగర్భితంగా ప్రవహిస్తుంది గంగాభవాని. ఏ స్వర్గంలోనో విహరించే తాను, ఏ మహాపురుషుని తపఃఫలితంగానో పతితులను పావనం చేసేందుకు, ఈ లోకానికి దిగివచ్చింది. ఆమె స్పృశించిన ప్రతి స్థలం దివ్యక్షేత్రమై వెలసింది. ఎన్నెన్నో ఇతిహాసాలు, కథలు, గాథలు ఆమె తిలకించింది. పరిణతి చెందుతూ వచ్చిన అనేక మతాలు, సంప్రదాయాలు, జీవన విధానాలు ఆమె పరిశీలించింది. కాలగర్భంలో ఎన్నెన్నో రాజ్యాలు, ఇతిహాసాలు, యుగాలు, చరిత్రలు గడ్డి పరకల్లా కొట్టుకుని పోవటం ఆమె కళ్ళారా చూసింది. ఈ మర్త్య లోకంలో అమరమై నిలిచింది తాను. వాల్మీకి, వ్యాసాది మహర్షుల కావ్య గానాలనూ, నారద తుంబురుల దివ్య గానాలనూ విన్నది..... భారత చరిత్రకు సాక్షీ భూతం గంగాభవాని.

ఉన్నత శిఖరాల నుంచి గభీలున ఉరికే గంగా జలాల హెూరులో, గంభీరంగా మాతృమూర్తి అంత గర్వంతో ఒడ్డులనొరసికొంటూ ప్రవహించే సవ్వడులలో, విలయ తాండవం చేస్తూ పొంగి పొరలి వచ్చే వరదల ఉరవడిలో, పరవడిలో నిరాడంబరంగా, అమాయికంగా, పరధ్యాసతో చిన్న చిన్న సుడులు తిరుగుతూ, సాగిపోయే నిశ్శబ్దంలో, చిటిలిచిటిలి తుటిలితుటిలి కేరింత లేస్తూ పరుగెత్తే సెలయేళ్ళ తుంపరల్లో, గంగామాత గత స్మృతులను స్మరించుకుంటున్న సవ్వడులే వినిపించాయి కేదార్ శర్మకు. గంగా లహరులతో తాదాత్మ్యత చెంది తానూ కొంతసేపు గత స్మృతుల మాధుర్యాన్ని నెమరు వేసుకున్నాడు. శకుంతలాదుష్యంతుల ప్రేమసరాగం, సీతారామలక్ష్మణులను గుహుడు గంగానదిని దాటించిన ఘట్టం, బుద్దుని జీవితం, గురుదేవుడు రవీంద్రుని రూపం, ఆయన మనఃఫలకంపై మెదిలాయి. నేటి భారత రాజకీయ రంగస్థల సూత్రధారి నెహ్రూతో ముగిశాయి కేదార్ శర్మ స్మృతులు.

ఈ మధుర స్మృతులను అతి మధురంగా ఆయన వెండితెర మీద రచించాడు. ఆయన స్మృతులను గీతాలుగా ఆలాపించింది కుమారి కమలాసిస్ట. చిత్రం నిడివి సుమారు వెయ్యి అడుగులు మాత్రమే. సంభాషణలుండవు. నేపథ్యగానం మినహా ఏ శబ్దమూ ఉండదు. గీతాలు రచించింది కూడా కేదార్ శర్మే. ఆయన రచనకు ఆలంబనంగా, తంబుర శ్రుతి అంతహాయిగా సంగీతాన్ని మేళవించాడు స్నేహల్ భట్కర్.

ఈ చిత్రాన్ని భారత ప్రభుత్వపు బాలల చిత్ర సంఘం నిర్మించింది. తమిళంలోనికి ఈ మధ్యనే డబ్ చేయబడింది. సంభాషణలు ఏమీ లేవు కనుక ఈ చిత్రాన్ని భారతీయ భాషలన్నింటిలోనికీ అనువదించితే బాలలకు ఎంతో మేలు చేసినట్లౌతుంది.

ఈ చిత్రాన్ని విజయవాడ విజయాటాకీస్ వారు క్రిందటి ఆదివారం ఉదయం 9 గంటలకు బాలలకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. పిల్లలతో పాటు పత్రికల వారికి కూడా చూపారు.

వీనుల విందుగా, కనుల పండువుగా పిల్లలు కేరింతలేస్తూ, గంతులు వేస్తూ, అమితోత్సాహం ప్రకటించారు. హాలు అంతా పిల్లలతో క్రిక్కిరిసిపోయింది. కుస్తీ పట్టే వాళ్ళు, పిల్లి మొగ్గలు వేసేవారు, ఈలలు వేసేవారు, ఐస్ ఫ్రూట్ చప్పరించే రెండు జడల పిల్లలు, వారిని తీసుకొచ్చిన స్త్రీలూ, ఇతర ఊళ్ళ నుంచి వినోద యాత్రకు వచ్చిన పిల్లల దండులు, ఉపాధ్యాయుల అదలింపులు.... విజయాటాకీసులో ఆపూట పండుగ అయిపోయింది. చిన్న పిల్లల చిత్రం కాబట్టి టిక్కెట్లు కూడా చిన్నగానే ఏర్పాటు చేశారు. రేట్లు బేడా, పావలా.

'గంగాకీ లహరే' తర్వాత 'స్కౌట్ కాంప్' అనే మరో హిందీ చిత్రాన్ని కూడా చూపారు. దీన్ని కూడా బాలల చిత్ర సంఘం వారే నిర్మించారు. దీనికి కూడా దర్శకుడు, రచయిత కేదార్ శర్మ. వినోదం, సాహసం, నీతి ప్రధానంగా గల చిత్రం ఇది. ఈ రెండు చిత్రాలలోనూ, భాష అర్థం కాకపోయినా పిల్లలు ఎంతో వినోదించారు. ఏ భాషలకు చెందినవారికైనా అర్థమయ్యే విధంగా, సరళమైన శైలిలో ఈ చిత్రాలను రచించారు. వీటిని అన్ని భాషలలోనికీ అనువదించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

బాలల చిత్రాల పట్ల తెలుగు నిర్మాతలలో ఒక్కరైనా సుముఖత ప్రకటించేవారు లేకపోవటం ఎంతో విచారకరం. బాలల చిత్రాల కోసం పిల్లలు ఎంత ఎదురు చూస్తున్నారో క్రితం ఆదివారం వెల్లడయింది. సినిమా వ్యాపారులు పూనుకోకపోయినా ప్రభుత్వమైనా బాలల చిత్రాలకు ప్రత్యేక సంఘం ఏర్పాటు చేయటం హర్షించతగింది. ఈ సంఘం వారు అన్ని భాషలలోనూ విరివిగా చిత్రాలను అందించగలరని ఆశించుదాం.

నండూరి పార్థసారథి
(1960 ఫిబ్రవరిలో ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post